దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకపక్షాలను ఏకం చేసే లక్ష్యం దిశగా మరో అడుగు ముందుకు వేసేందుకు టీఆర్‌ఎస్ సిద్ధమైంది. నేరుగా యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని, ఓవైపు బీజేపీని నిలువరించే ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు దేశవ్యాప్తంగా వివిధ రాజకీయపక్షాల దృష్టిని ఆకర్షించాలని నిర్ణయించింది.
టీఆర్‌ఎస్ ఇంతకుముందు.. 2009లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో శిబుసోరేన్ నేతృత్వంలోని జేఎంఎం పార్టీకి మద్దతుగా ప్రచారం చేసింది. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌కు ఓటు వేయాలని పిలుపునిచ్చింది.
సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రజాస్వామిక, లౌకిక శక్తుల ఏకీకరణ కోసం ప్రయత్నిస్తున్న టీఆర్‌ఎస్.. త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించింది. ఈ దిశగా టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే సంకేతాలు ఇవ్వగా.. రెండు రోజుల క్రితం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు కూడా ధ్రువీకరించారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల పొత్తులు, అభ్యర్థుల ఖరారు వంటి అంశాల్లో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్ తలమునకలై ఉన్నారు.
ఆయన ఈ నెలాఖరులోగా సీఎం కేసీఆర్‌తోగానీ, టీఆర్‌ఎస్ ప్రతినిధి బృందంతో గానీ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. సమాజ్‌వాదీ పార్టీ నేతృత్వంలోని కూటమికి మద్దతుగా టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ఆ భేటీలో ఖరారు కానుంది. యూపీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రచార బృందానికి మంత్రి కేటీఆర్ నేతృత్వం వహిస్తారు. సమాజ్‌వాదీ పార్టీ నిర్వహించే బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొని ప్రసంగిస్తారు. కేటీఆర్‌తో వెళ్లే ప్రచార బృందంలో భాషా సమస్య లేని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు ఉంటారని సమాచారం.
తెలంగాణ ఉద్యమ సమయంలో 2009 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో నాటి టీఆర్‌ఎస్ సీనియర్ నేతలు నాయిని నర్సింహారెడ్డి, విజయరామారావు, కళ్లెం యాదగిరిరెడ్డి, కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)కు అనుకూలంగా ప్రచారం చేశారు. 2018లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని సీఎం కేసీఆర్ ప్రకటించినా సాధ్యం కాలేదు. కానీ కర్ణాటకలోని తెలుగు ప్రజలంతా దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్ (ఎస్)కు ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు.
బీజేపీ వైఫల్యాలే ప్రచార అస్త్రాలు
దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయగలవని భావిస్తున్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. సుమారు నాలుగేళ్ల నుంచి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. బలమైన ప్రాంతీయ పార్టీల నేతలు మమతా బెనర్జీ (టీఎంసీ), అఖిలేశ్‌యాదవ్ (సమాజ్‌వాదీ), నవీన్ పట్నాయక్ (బిజూ జనతాదళ్), దేవెగౌడ, కుమారస్వామి (జనతాదళ్–ఎస్), కరుణానిధి, స్టాలిన్ (డీఎంకే)లతో గతంలో వరుస సమావేశాలు జరిపారు. ఇటీవల మరోసారి నేతలతో భేటీలు మొదలుపెట్టారు. స్టాలిన్ (డీఎంకే), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ)తోపాటు సీపీఎం, సీపీఐల జాతీయ నాయకత్వంతోనూ కేసీఆర్ సమావేశమయ్యారు.
ప్రజాస్వామిక, లౌకిక శక్తుల నడుమ ఐక్యత అవసరాన్ని నొక్కిచెప్తూనే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను అడ్డుకుంటామని స్పష్టం చేస్తున్నారు. రైతు వ్యతిరేక చట్టాలు, వరి ధాన్యం కొనుగోలు, పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు, ఎరువుల ధరల పెంపు వంటి అంశాల్లో కేంద్రం తీరును నిరసిస్తున్న కేసీఆర్.. యూపీ ఎన్నికల్లో వీటినే ప్రచార అస్త్రాలుగా ఎంచుకోవాలని భావిస్తున్నారు. గత ఏడున్నరేండ్లలో బీజేపీ వివిధ రంగాల్లో విఫలమైన తీరును ఓటర్లకు వివరించాలని నిర్ణయించారు. యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ద్వారా.. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తుల విశ్వాసాన్ని మరింతగా చూరగొనాలని భావిస్తున్నట్టు సమాచారం.
హైదరాబాద్ వేదికగా జాతీయ సదస్సు!
వివిధ ప్రాంతీయ పార్టీలు, భావసారూప్య శక్తులతో మంతనాలు జరుపుతున్న కేసీఆర్.. జాతీయస్థాయిలో ప్రజాస్వామిక, లౌకిక శక్తుల ఐక్యత అవసరాన్ని నొక్కి చెప్పేందుకు హైదరాబాద్ వేదికగా సదస్సు లేదా సమావేశాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే దీనిని ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత నిర్వహించాలా, ముందే నిర్వహించాలా అన్నదానిపై తర్జనభర్జన పడుతున్నట్టు తెలిసింది. మార్చిలో జరుగనున్న యాదాద్రి ఆలయ పునఃప్రారంభోత్సవానికి అన్ని ప్రాంతీయ పార్టీల నేతలను ఆహ్వానించే అవకాశముంది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు, పరిస్థితిని బట్టి సదస్సు నిర్వహణ తేదీలను ఖరారు చేయనున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment