సాక్షి, హైదరాబాద్ : రేపటితో(ఏప్రిల్ 27) టీఆర్ఎస్ రెండు దశాబ్ధాలను పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు, పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు తెలంగాణ భవన్‌లో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సాధించడంతోపాటు అన్ని రంగాల్లో గొప్ప విజయాలను పార్టీ సాధించిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఆరేళ్లలో అనేక అద్భుతాలు సాధించిందని చెప్పారు. ప్రజలు దశాబ్ధాల తరబడి ఎదుర్కొంటున్న సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించిందన్నారు.
‘టిఆర్ఎస్ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు గడిచిన సందర్భంగా గొప్పగా జరుపుకోవాల్సిన వేడుకులను కరోనా వైరస్ నేపథ్యంలో నిరాడంబరంగా జరుపుకోవాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. మరో సందర్భంలో పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం. ఈ సారికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఎవరికి వారు తమ ప్రాంతాల్లో అత్యంత నిరాడంబరంగా ఎక్కడికక్కడే పతాకావిష్కరణ చేయాలి’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
ఇళ్లపై టీఆర్‌ఎస్ జెండా ఎగురవేయాలి : కేటీఆర్
టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు తమ ఇళ్లపైనే పార్టీ జెండా ఎగరవేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన స్వయంగా రక్తదానం చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు సామాజిక దూరాన్ని పాటిస్తూ రక్తదాన కార్యక్రమాన్ని వారం రోజులపాటు నిర్వహించాలని కోరారు. ఈ కష్టకాలంలో చుట్టుపక్కల అవసరం ఉన్నవారికి ఆదుకోవాలని సూచించారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు చేసే ప్రతి సామాజిక కార్యక్రమాన్ని భౌతిక దూరం పాటిస్తూ చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment