TRS Foundation Day
-
టీఆర్ఎస్ ప్లీనరీ వేడుకలు.. లైవ్ అప్డేట్స్
ప్లీనరీ అప్డేట్స్: 👉కేసీఆర్ విజన్ ఉన్ననేత అని మంత్రి కేటీఆర్ కొనియాడారు. ఎన్టీఆర్, కేసీఆర్ మాత్రమే తెలుగు ప్రజల గుండెలో చెరగని ముద్ర వేశారని అన్నారు. ఈ రోజు తెలంగాణలో ఆచరిస్తున్నది.. దేశ వ్యాప్తంగా ఆచరించే పరిస్థితులు వస్తున్నాయని తెలిపారు. 👉రైతుబంధు పథకం కేంద్రానికి ప్రేరణ అయ్యిందన్నారు. తెలంగాణ పథకాలను పేరుమార్చి కేంద్రం కాపీకొడుతోందన్నారు. టీఎస్ ఐపాస్లాగా కేంద్ర సింగిల్ విండో తీసుకొచ్చిందన్నారు. దేశంలో ఒక్క తెలంగాణలోనే రైతులకు 24 గంటల కరెంట్ అందుతోందన్నారు. 👉బీజేపీ నేతలు ఆత్మనిర్భర్ భారత్ అంటారనీ.. కానీ బతుకు దుర్భర్ భారత్ అయ్యిందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆకలి సూచీల్లో మనం ఎక్కడో ఉన్నామనీ.. పాక్, బంగ్లాదేశ్ మనకన్నా ముందన్నాయనీ.. ఇది బీజేపీ పాలనా తీరని ధ్వజమెత్తారు. 👉బుధవారం టీఆర్ఎస్ ప్లీనరీలో కేంద్ర ప్రభుత్వం సెస్‌ల రూపంలో వసూలు చేసే మొత్తాన్ని డివిజనల్ పూల్‌లోకి తేవాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానే రాదన్న తెలంగాణ సాధించి, దేశంలో ఆదర్శ రాష్ట్రంగా సీఎం కేసీఆర్ నిలపారన్నారు. ► టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలకు భోజన విరామం. లంచ్ అనంతరం తిరిగి ప్రారంభం కానున్న సమావేశం. ► హరీశ్ రావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని.. చెవెళ్ల పార్లమెంట్ సభ్యులు మన్య రంజిత్ రెడ్డి తీర్మానాన్ని బలపరిచారు. ► కేంద్రంలో ఉంది సంకుచిత ప్రభుత్వం. బీజేపీ అధికారంలోకి వచ్చాక పన్నులు పెరిగాయి. అప్పుల విషయంలోనూ కేంద్రానికో నీతి, రాష్ట్రానికో నీతి ఉంటుందా? ఆంక్షలు ఎందుకు? బీజేపీకి రాజకీయమే తప్ప ప్రజాసంక్షేమం పట్టదు. ఈ అంశాలపై పోరాడాల్సిన అవసరం ఉందని హరీష్ రావు పేర్కొన్నారు. ► కేంద్రం బాగుపడాలి.. రాష్ట్రాలు నష్టపోవాలి అన్నట్లుంది కేంద్రం తీరు: టీఆర్ఎస్ నేత హరీష్ రావు ► రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్‌ల రూపేణా వసూలు చేయడం మానుకోవాలని, డివిజబుల్ పూల్‌లోనే పన్నులు వసూలు చేయాలని మంత్రి హరీశ్ రావు తీర్మానం ప్రవేశపెట్టారు. ► ధాన్యం కొనుగోలు తీర్మానాన్ని బలపర్చిన మంత్రి గంగుల కమలాకర్. ► యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన తీర్మానాన్ని వ్యసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రతిపాదించారు. ప్లీనరీలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రసంగం ► దేశ పరిస్థితిని గాడిన పెట్టే శక్తులు తప్పకుండా వస్తాయి. తెలంగాణ కోసం టీఆర్ఎస్ పుట్టుకురాలేదా? అలాగే దేశానికి అవసరమైనప్పుడు.. దుర్మార్గాన్ని తరిమేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఇందుకోసం టీఆర్ఎస్ కూడా కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు సీఎం కేసీఆర్. ► పుల్వామా, సర్జికల్ స్ట్రయిక్స్, కశ్మీర్ ఫైల్స్ అంటూ.. మానిన గాయాలను మళ్లీ రేపుతున్నారు. ► దేశ రాజధాని దేవుడి పేరుతో మారణాయుధాలతో ఉరేగింపా? .. ఈ దౌర్భాగ్య పరిస్థితి దేశానికి మంచిది కాదు. దేశానికి మంచి మార్గం చూపించొద్దా? ► దేశం ఉజ్వలమైన భవిష్యత్ కోసం మన పాత్ర పోషించాలి. ► జాతిపితగా పేరు తెచ్చుకున్న వ్యక్తినే దుర్భాషలాడుతారా? ఆయన్ని చంపిన హంతకులను పూజిస్తారా? ఏ దేశమైన ఇలా చేస్తుందా? ఇదేం పెడ ధోరణి? ఇదేం సంస్కృతి. ► ప్రజలకు అనుకూలమైన ఫ్రంట్ రావాలి. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి చేసి దేశం కోసం ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నారు. దేశ స్థితిని, గతిని మార్చేలా హైదరాబాద్ వేదికగా కొత్త ఎజెండా రూపొందితే.. అది మనకే గర్వకారణం. ► ప్రధాని సొంత రాష్ట్రం సహా దేశంలో కరెంట్‌కోతలు కొనసాగుతుంటే.. తెలంగాణ మాత్రం వెలుగు జిలుగులని గర్వంగా చెప్తున్నా. తాగునీరు, కరెంట్ అందలేని పరిస్థితులు. వాళ్ల ఉపన్యాసాలు వింటే మైకులు పగిలిపోతాయని అన్నారు. ► వాగ్దానాలు ఎక్కువ.. పని తక్కువ. ఇంత దుస్థితి ఎందుకు? ఎవరి అసమర్థత? వనరులు లేవంటే వేరు.. కానీ, ఉండి కూడా అందించలేని పరిస్థితి అని తెలిపారు. ► తెలంగాణ రాష్ట్రం పని చేసిన పద్ధతిలో దేశం పని చేసి ఉంటే.. ఫలితం మరోలా ఉండేది. కరెంట్ దగ్గరి నుంచి ప్రతీదాంట్లోనూ పురోగతి ఉండేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ మాట కాగ్, ఆర్థిక నిపుణులు సహా పలు నివేదికలు చెప్తున్న మాట. ► ఒకప్పుడు తెలంగాణ కరువు కాటకాలకు నెలవు. ఇప్పుడు జలధారకు నెలవు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. ► అన్నింట్లోనూ తెలంగాణ నెంబర్ వన్‌గా ఉంది. ► ఏ రంగం తీసుకున్నా అద్భుతమైన ఫలితాలు సాధించాం. ► తెలంగాణలో అవినీతి మంత్రులు లేరు. ► డబ్బాలు కొట్టుకోవడం, అతిగా పొగుడుకోవాల్సిన అవసరం తెలంగాణకు లేదు. దేశంలో పది ఉత్తమమైన గ్రామాలు తెలంగాణావే. కేంద్రం ఇచ్చిన ఈ సర్టిఫికెట్టే అందుకు నిదర్శనం. ► దేశానికి తెలంగాణ పాలన రోల్ మోడల్. సాధించుకున్న రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దుకుంటున్నాం. ► తెలంగాణకు టీఆర్ఎస్ కంచుకోట.. ఎవరూ బద్దలు కొట్టలేని రక్షణ కవచం. టీఆర్ఎస్ పార్టీ ప్రజల ఆస్తి. ► అనుకున్న లక్ష్యాలను ముద్దాడి, రాష్ట్ర కాంక్షను సాధించుకున్న పార్టీ తెలంగాణ రాష్ట్రసమితి. ► 60 లక్షల మంది పార్టీ సభ్యులతో.. వెయ్యి కోట్ల ఆస్తులున్న పార్టీ టీఆర్ఎస్. ► ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుని 21వ ఏట అడుగుపెడుతోంది టీఆర్ఎస్ పార్టీ. ► టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ప్రసంగం ప్రారంభం. ► టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు గౌరవ స్వాగతోపన్యాసంతో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం. ► హెచ్ఐసీసీకి చేరిన సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ.. వేదికపైకి చేరిక. ► ప్రగతి భవన్ నుంచి ప్లీనరీ ప్రాంగణానికి బయలుదేరిన టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ► టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలతో పార్టీ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లో జరిగే ప్లీనరీ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 వేల మంది TRS ప్రతినిధులు హాజరుకానున్నారు. ► ఒకప్పుడు బెంగాల్లో ఏది జరిగితే.. దేశమంతా అదే జరిగేదని చెప్పేవాళ్లు. ఇప్పుడు తెలంగాణలో ఏది జరిగితే.. దేశమంతా అదే జరుగుతోంది. తెలంగాణలో ఒకప్పుడు కరువు, వలసలు ఉండేవి. ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచింది: మంత్రి హరీష్‌రావు ► టీఆర్ఎస్లో జాతీయ రాజకీయ వ్యవహారాల కమిటీ ఏర్పాటు. కమిటీ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత నియామకం. ► తెలంగాణ భవన్లో ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు. జెండా ఆవిష్కరించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు. ప్లీనరీ సమావేశంలో జాతీయ రాజకీయాలపై తీర్మానం ప్రవేశపెట్టనున్న కేటీఆర్. ► హైదరాబాద్ మాదాపూర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ) వేదికగా బుధవారం జరగనున్న వేడుకల్లో.. పలు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. ► తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తామంటూ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో.. జాతీయ రాజకీయాలే ప్రధాన ఎజెండాగా ప్లీనరీ కొనసాగనుంది. -
గులాబీ@ 21
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) 21 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నెల 27న పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. గతేడాది తరహాలోనే మాదాపూర్‌లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించనున్నారు. సుమారు 6 వేల మంది ప్రతినిధులను ఆహ్వానించనున్నారు. కార్యక్రమం ఏర్పాట్లకు సంబంధించి సీఎం కేసీఆర్ శనివారం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లాల్సిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన షెడ్యూల్‌ను రద్దు చేసుకుని భేటీకి హాజరయ్యారు. పార్టీ సెక్రటరీ జనరల్ కె. కేశవరావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్, ఎమ్మెల్సీ నవీన్‌రావు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో ముఖ్య కూడళ్లు, నగర ప్రవేశ మార్గాలు, సభా ప్రాంగణం అలంకరణ, భోజన వసతి, హాజరయ్యే ప్రతినిధుల జాబితా, వాహనాల పార్కింగ్ వంటి అనేక అంశాలపై కేసీఆర్ సూచనలు చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. తీర్మానాలపై సుదీర్ఘ చర్చ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న ఉదయం పార్టీ అధినేత కేసీఆర్ స్వాగతోపన్యాసం తర్వాత కీలక తీర్మానాలను ప్రతిపాదిస్తారు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 7 తీర్మానాలపై ప్లీనరీ చర్చించి ఆమోదించింది. టీఆర్ఎస్ విజయాలు, సంక్షేమ పథకాలు, పాలన సంస్కరణలు, దళితబంధు, విద్య, వైద్య రంగాల అభివృద్ధి, బీసీ కులగణన వంటి అంశాలపై గత ప్లీనరీలో ఆమోదించారు. ఈ ఏడాది కూడా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలు, జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్ర తదితర 11 అంశాలపై తీర్మానాలు చేస్తారు. తీర్మాన అంశాలు, తీర్మానాల వారీగా ప్రసంగించాల్సిన వక్తల ఎంపికకు సంబంధించి కేసీఆర్ పలు సూచనలు చేశారు. ఒకే దేశం, ఒకే పంటల కొనుగోలు విధానంపై తీర్మానం ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈసారి రైతు నాయకులు, ఇతర పార్టీల నేతలకు ఆహ్వానం? గతేడాది ప్లీనరీకి పార్టీ నేతలు, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులే హాజరయ్యారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తానని ప్రకటించిన కేసీఆర్.. వ్యవస్థాపక దినోత్సవానికి రైతు ఉద్యమ నేత రాకేశ్ తికాయత్‌తో పాటు దేశంలోని పలు రైతు సంఘాల ప్రతినిధులను ఆహ్వానించే యోచనలో ఉన్నారు. వీరితో పాటు దేశంలోని పలు ప్రాంతీయ పార్టీల నేతలను ఆహ్వానించాల ని నిర్ణయించారు. వ్యవస్థాపక దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు త్వరలో కేసీఆర్ లేదా కేటీఆర్.. మంత్రులు, జిల్లాల వారీగా ముఖ్య నేతలతో తెలంగాణ భవన్ లో సమావేశం నిర్వహించే అవకాశముంది. ఎవరెవరు హాజరవుతారంటే..? రాష్ట్ర మంత్రి వర్గం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎంస్ అధ్యక్షులు, జిల్లా గ్రంథాలయాల సంస్థ, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు, మహిళా కో ఆర్డినేటర్లు, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, పార్టీ పట్టణ, మండల కమిటీల అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లను ఆహ్వానిస్తారు. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారు. ప్లీనరీ షెడ్యూలు ఇదీ.. ♦ఉదయం 10–11 వరకు ప్రతినిధుల నమోదు ♦11.05కు కేసీఆర్ పార్టీ పతాకావిష్కరణ, స్వాగతోపన్యాసం, అధ్యక్షుడి తొలి పలుకులు ♦11 రాష్ట్ర, జాతీయ అంశాల తీర్మానాలపై చర్చ, ఆమోదం ♦సాయంత్రం 5 గంటలకు ప్లీనరీ ముగింపు -
TRS Foundation Day: ఉద్యమ పార్టీగా ప్రస్థానం..
సాక్షి, హైదరాబాద్: దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వరాష్ట్ర సాధన లక్ష్యంగా ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి నేటితో ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుంది. ‘నిధులు, నీళ్లు, నియామకాలు’నినాదంతో 2001 ఏప్రిల్ 27న జలదృశ్యం వేదికగా ప్రస్థానం ప్రారంభించిన టీఆర్ఎస్ 14 ఏళ్ల పాటు ఉద్యమ బాటలో నడిచింది. పార్టీ సారథి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో స్వరాష్ట్ర సాధనకు సర్వశక్తులూ ఒడ్డిన టీఆర్ఎస్ 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా అధికారం చేపట్టింది. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలతోపాటు ఎజెండాలో లేని ఇతర పథకాలను కూడా అమలు చేస్తూ 2018లో వరుసగా రెండో పర్యాయం కూడా టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఉద్యమ పార్టీగా, రాష్ట్ర సాధన తర్వాత అధికార పార్టీగా రెండు దశాబ్దాలుగా టీఆర్ఎస్ ప్రస్థానం కొనసాగుతోంది. జల దృశ్యం నుంచి మొదలైన ప్రస్థానం తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న హైదరాబాద్ జలదృశ్యం వేదికగా తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేస్తున్నట్లు కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. తాను నిర్వహిస్తున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవితో పాటు, సిద్దిపేట శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఇదే వేదిక మీద ప్రకటన చేశారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన సిద్దిపేట అసెంబ్లీ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుపొందిన కేసీఆర్ తర్వాతి కాలంలో ఉద్యమ సాధనలో పదవులకు రాజీనామా చేయడాన్ని వ్యూహంగా మలుచుకున్నారు. 2004 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుని 26 అసెంబ్లీ స్థానాలు, ఐదు లోక్‌సభ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. కేంద్రంలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని మంత్రివర్గంలో కేసీఆర్‌తో పాటు ఆలె నరేంద్ర చేరగా, రాష్ట్రంలోనూ ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి పదవులు చేపట్టారు. అయితే ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ తెలంగాణ అంశాన్ని తేల్చకపోవడంతో రాష్ట్ర మంత్రివర్గం నుంచి టీఆర్ఎస్ మంత్రులు వైదొలిగారు. వరంగల్, పోలవరంతోపాటు పలుచోట్ల భారీ బహిరంగ సభల ద్వారా తెలంగాణ వాదాన్ని ప్రజల్లోకి కేసీఆర్ మరింత బలంగా తీసుకెళ్లారు. రాజీనామాలే అస్త్రాలుగా ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వ నాన్చివేత ధోరణిని నిరసిస్తూ కేసీఆర్, నరేంద్ర మంత్రి పదవుల నుంచి వైదొలిగారు. 2006లో తన కరీంనగర్ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కేసీఆర్ అదే ఏడాది డిసెంబర్లో జరిగిన ఉప ఎన్నికలో మరోమారు భారీ మెజారిటీతో గెలుపొందారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని మహా కూటమితో పొత్తు కుదుర్చుకున్న టీఆర్ఎస్ రెండు లోక్‌సభ స్థానాలతో పాటు, పది అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. 2009 సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణంతో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని రాష్ట్ర సాధనకు ఎత్తుగడగా మలచగలిగారు. 2009 అక్టోబర్ 21న సిద్దిపేటలో జరిగిన ఉద్యోగ గర్జన ద్వారా మరోమారు తెలంగాణ ఉద్యమ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. 2009 నవంబర్ 29న సిద్దిపేటలో కేసీఆర్ నిర్వహించ తలపెట్టిన ఆమరణ దీక్ష ఉద్యమాన్ని కొత్త మలుపు తిప్పింది. ఈ సందర్భంగా కేసీఆర్‌ను అరెస్టు చేసి తొలుత ఖమ్మం జైలుకు, ఆ తర్వాత హైదరాబాద్ నిమ్స్‌కు తరలించడం ఉద్యమ ఘట్టంలో అత్యంత కీలకంగా మారింది. తెలంగాణ ఏర్పాటుపై చేసిన ప్రకటనను కేంద్రం వెనక్కి తీసుకోవడంతో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటులో కేసీఆర్ క్రియాశీలంగా వ్యవహరించారు. 2010 డిసెంబర్లో వరంగల్‌లో 30 లక్షల మందితో టీఆర్ఎస్ మహాగర్జన నిర్వహించగా, శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత 2011 జనవరి నుంచి టీఆర్ఎస్ నిర్విరామంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. ఉద్యమ ఫలితంగా తెలంగాణ ఆవిర్భావం సుదీర్ఘకాలంపాటు సాగిన ఉద్యమం ఫలితంగా 2013 అక్టోబర్‌లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ పార్లమెంటు బిల్లును ఆమోదించింది. 2014 జూన్ 2 నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మనుగడలోకి వచ్చింది. అంతకు ముందే 2014 ఏప్రిల్‌లో జరిగిన సాధారణ ఎన్నికల ఫలితాలు అదే ఏడాది మే 16న వెలువడ్డాయి. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ 119 అసెంబ్లీ స్థానాలకు గాను 63 చోట్ల విజయం సాధించింది. 2014 జూన్ 2న కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో తొలి ప్రభుత్వం ఏర్పాటైంది. తర్వాతి కాలంలో 12 మంది టీడీపీ సభ్యులు టీఆర్ఎస్లో చేరడంతో ఆ పార్టీ శాసన సభా పక్షం టీఆర్ఎస్లో విలీనమైంది. రెండోసారి టీఆర్ఎస్కు అధికార పగ్గాలు శాసనసభ ఐదేళ్ల కాల వ్యవధి పూర్తికాకమునుపే 2018 సెప్టెంబర్ 6న శాసనసభను రద్దు చేయడంతో అదే ఏడాది నవంబర్‌లో ముందస్తు ఎన్నికలు జరిగాయి. 119 స్థానాలను గాను 89 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరుసగా రెండో పర్యాయం 2018 డిసెంబర్ 13న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్, టీడీపీ శాసన సభ్యులు టీఆర్ఎస్లో చేరడంతో రెండు పార్టీల శాసన సభా పక్షాలు అధికార పార్టీలో విలీనం అయ్యాయి. 2019 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 9 స్థానాల్లో గెలిచి మిశ్రమ ఫలితాన్ని చవిచూసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నూరు శాతం విజయాన్ని సాధించిన టీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లోనూ హవా కొనసాగించింది. 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో స్వల్ప ఓట్ల తేడాతో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోగా, బీజేపీ విజయం సాధించింది. గత డిసెంబర్లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ మిశ్రమ ఫలితాన్ని చవిచూసిన టీఆర్ఎస్ రాజకీయంగా ఒడిదుడుకులకు లోనైంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ గెలుపొందిన టీఆర్ఎస్ తిరిగి ఆత్మ విశ్వాసంతో ప్రస్థానం సాగిస్తోంది. -
ఖైదీ నంబర్ 3077 : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలంగాణ ఉద్యమకాలం నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. వరంగల్ జైలులో తాను గడిపిన రోజులకు సంబంధించిన ఓ ‘ఖైదీ గుర్తింపు కార్డు’ను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘దీక్షా దివస్ రోజున కేసీఆర్, ప్రొ. జయశంకర్ అరెస్టయ్యారు. ఆ సందర్భంలో నన్ను అరెస్టు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు.’అని కేటీఆర్ ట్వీట్లో రాసుకొచ్చారు. గుర్తింపు కార్డులో ఉన్న వివరాల ప్రకారం.. 2009 నవంబర్ 29న హన్మకొండ పోలీసులు 447/2009 కేసులో కేటీఆర్‌ను అరెస్టు చేయగా వరంగల్ ఆరో అదనపు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ రిమాండు విధించారు. వరంగల్ సెంట్రల్ జైలులో కేటీఆర్‌కు 3077 నంబరును కేటాయించారు. -
ఇది శుభసూచకం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతుండడం శుభసూచకమని, రాబోయే కొద్ది రోజుల్లోనే కరోనా పాజిటివ్ కేసులు లేని రాష్ట్రంగా తెలంగాణ మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. మంగళవారం నాటికి రాష్ట్రంలోని 21 జిల్లాలు ఒక్క కరోనా యాక్టివ్ కేసు కూడా లేని జిల్లాలుగా మారుతున్నాయని ప్రకటించారు. కరోనా వైరస్ సోకిన వారిలో కూడా 97 శాతానికి పైగా మంది కోలుకుని, డిశ్చార్జి అవుతుండడం మంచి పరిణామమని పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి, ప్రభావం బాగా తగ్గుతున్నందున రాష్ట్రంలో కంటైన్మెంట్ల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతున్నట్లు తెలిపారు. మర్కజ్ వెళ్లి వచ్చినవారి ద్వారా వైరస్ సోకుతున్న వారి లింక్ మొత్తం గుర్తించి, అందరికీ పరీక్షలు నిర్వహించే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి చాలా వరకు తగ్గిందన్నారు. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో మళ్లీ పాజిటివ్ కేసులు వచ్చినా, వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవడానికి వైద్య ఆరోగ్య శాఖ అన్ని విధాలా సంసిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా కరోనా వైరస్ వ్యాప్తి, రోగులకు అందుతున్న చికిత్స, సహాయ కార్యక్రమాలు, లాక్డౌన్ అమలు తదితర అంశాలను సీఎం సుదీర్ఘంగా సమీక్షించారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కరోనా వైరస్ సోకుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్లు వైద్యశాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సోమవారం 159 మందికి పరీక్షలు నిర్వహించగా, కేవలం ఇద్దరికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయడం వల్ల వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టగలుగుతున్నట్లు చెప్పారు. సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే... సోమవారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ జిల్లాల్లో తక్కువ సంఖ్యలో పాజిటివ్‌లు.. రాష్ట్రంలో వైరస్ పాజిటివ్ వచ్చిన వారు సోమవారం నాటికి 1003 మంది కాగా, అందులో 332 మంది ఇప్పటికే కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 646 పాజిటివ్ కేసులున్నాయి. మొత్తం పది జిల్లాల్లో (ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, వరంగల్ రూరల్, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మంచిర్యాల) ప్రస్తుతం ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు. మరో 11 జిల్లాలు(జగిత్యాల, జనగామ, పెద్దపల్లి, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నల్లగొండ) మంగళవారం (ఏప్రిల్ 28) నాటికి ఒక్క పాజిటివ్ కేసు కూడా లేని జిల్లాలుగా మారనున్నాయి. హైదరాబాద్, సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ వంటి ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో చాలా తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులున్నాయి. కొద్ది రోజులుగా పరిస్థితిని గమనిస్తుంటే రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి బాగా తగ్గుముఖం పట్టింది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక్క పాజిటివ్ కూడా రాని పరిస్థితి వస్తుందనే నమ్మకం ఏర్పడుతోంది. ఆ తర్వాత అక్కడో ఇక్కడో కొద్దో గొప్పో కేసులు వచ్చినా వెంటనే గుర్తించి, తగు చర్యలు తీసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మర్కజ్ వెళ్లి వచ్చిన వారందరినీ గుర్తించి పరీక్షలు రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా పనిచేస్తోంది. వైరస్ సోకినవారిని గుర్తించడానికి వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ ఎంతగానో శ్రమిస్తోంది. మొదట విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా మాత్రమే వైరస్ సోకుతున్నట్లు తేలింది. తర్వాత మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారి ద్వారా వైరస్ వచ్చినట్లు గ్రహించాం. విదేశాల నుంచి వచ్చిన వారినీ, మర్కజ్ వెళ్లి వచ్చిన వారందరినీ గుర్తించి పరీక్షలు నిర్వహించాం. వారిలో పాజిటివ్ వచ్చిన వారిని గుర్తించి, ఆసుపత్రిలో పెట్టి చికిత్స చేశాం. పాజిటివ్ వచ్చిన వారు ఎవరెవరిని కలిశారో గుర్తించి, వారికీ పరీక్షలు నిర్వహించాం. మళ్లీ వారిలో ఎవరికి పాజిటివ్ వచ్చిందో గుర్తించి, వారు ఎవరెవరిని కలిశారో గుర్తించి, పరీక్షలు నిర్వహిస్తూ పోతున్నాం. సోమవారం జరిపిన పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. వారిద్దరినీ ఆసుపత్రిలో పెట్టి చికిత్స చేయడంతో పాటు, వారు ఎవరెవరిని కలిశారనే లింక్ పట్టుకుని వారికీ పరీక్షలు నిర్వహిస్తాం. వారిలో ఎవరికైనా పాజిటివ్ వస్తే, వారి ద్వారా లింకు గుర్తించి అందరికీ పరీక్షలు చేసుకుంటూ పోతాం. లింకులో చివరి వ్యక్తి వరకు అందరినీ గుర్తించి, పరీక్షలు నిర్వహించే ప్రక్రియ కొనసాగుతుంది. మర్కజ్ లింకు లేకున్నా రోజుకు దాదాపు వంద మంది వరకు వైరస్ లక్షణాలు కనిపించిన వారిని కూడా పరీక్షిస్తున్నాం. చదవండి: నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే బాస్.. ప్రతీక్షణం అప్రమత్తంగానే ఉంటాం.. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినంత మాత్రాన ప్రభుత్వం ఏమాత్రం ఉదాసీనంగా ఉండదు. ప్రతీక్షణం అప్రమత్తంగానే ఉంటాం. మళ్లీ ఏదైనా అనుకోని ఉపద్రవం వచ్చి, కేసుల సంఖ్య పెరిగినా సరే, సమర్థంగా ఎదుర్కోవడానికి అన్ని విధాలా వైద్య ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉంది. టెస్టింగ్ కిట్స్, పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు, ఇతర మాత్రలు, పరికరాలు, బెడ్సు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఎన్ని కేసులొచ్చినా ఏమాత్రం ఇబ్బంది లేకుండా చికిత్స చేయడానికి సర్వసన్నద్ధమై ఉన్నాం. రాష్ట్రంలో ముందు ప్రకటించినట్లు మే 7 వరకు లాక్డౌన్ కొనసాగుతుంది. ప్రజలు నిబంధనలు పాటించి సహకరించాలి. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు. అన్ని మతాల వారు తమ ప్రార్థనా కార్యక్రమాలను, పండుగలను ఇళ్లలోనే చేసుకోవాలి. పాజిటివ్ కేసులు తగ్గుతున్న కొద్దీ, యాక్టివ్ కేసులు లేని ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య కూడా తగ్గిస్తాం. కానీ కంటైన్మెంట్ కొనసాగుతున్న ప్రాంతాల్లో మాత్రం ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి’అని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, హోంమంత్రి మహమూద్ అలీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, శాంత కుమారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్లో కొన్ని సర్కిళ్లలోనే వైరస్.. జీహెచ్ఎంసీ పరిధిలో 30 సర్కిళ్లు ఉంటే, చాలా సర్కిళ్లలో పాజిటివ్ కేసులు లేవు. కొన్సి సర్కిళ్లు యాక్టివ్ కేసులు లేని సర్కిళ్లుగా మారాయి. కొన్ని సర్కిళ్లకే వైరస్ పరిమితమైంది. దీంతో చాలా కంటైన్మెంట్లు ఫ్రీ అవుతున్నాయి. యాక్టివ్ కేసులు తగ్గుతున్న కొద్దీ కంటైన్మెంట్ల సంఖ్యను కూడా ప్రభుత్వం తగ్గిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వైరస్ సోకిన వారిలో అత్యధిక శాతం మంది క్వారంటైన్ పీరియడ్ మే 8 నాటికి ముగుస్తుంది. చదవండి: రాష్ట్రంలో డిగ్రీ విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలు -
నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే బాస్..
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్: ‘నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సుపీరియర్, బాస్. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరైనా సరే ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా నియోజకవర్గంలో పర్యటించొద్దు..’అని జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ టీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం పార్టీ ఆవిర్భావ వేడుకల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్ ఎవరైనా సరే ఎమ్మెల్యే ఆహ్వానం మేరకే నియోజకవర్గంలోకి రావాలన్నారు. అలాకాకుండా వస్తే గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించినట్లవుతుందని, ఎవరైనా పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని తెలిపారు. వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. నియోజకవర్గంలో ఏ ప్రపోజలయినా అధికారులు ఎమ్మెల్యే ద్వారానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారన్నారు. 119 నియోజకవర్గాల్లో ఏవిధంగా జరుగుతుందో ఘన్‌పూర్‌లో కూడా అలాగే జరుగుతుందని.. జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించేవారు ఎంతటివారైనా సహించేది లేదని తెలిపారు. చదవండి: ‘కొండపోచమ్మ’కు డెడ్‌లైన్ మే 15.. -
ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ సంబురం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవం సోమవారం పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్లో ఘనంగా జరిగింది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఉదయం 9.30కి కార్యాలయ ఆవరణలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. లాక్డౌన్ నిబంధనల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో పార్టీ నేతలను తెలంగాణ భవన్‌లోకి అనుమతించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, మంత్రులు మహమూద్ అలీ, ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బాల్క సుమన్, ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డి, అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేస్తున్న కేసీఆర్. చిత్రంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేకే తదితరులు రక్తదాన శిబిరం ఏర్పాటు ఆవిర్భావ దినం సందర్భంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పలువురు నేతలు రక్తదానం చేశారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ వారం పాటు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని కార్యకర్తలకు పార్టీ నేతలు పిలుపునిచ్చారు. జై కొడితే జంగు సైరనయ్యింది కేటీఆర్ ట్వీట్ సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సామాజిక మా«ధ్యమ వేదిక ట్విట్టర్ ద్వారా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమకాలంలో తాను పాల్గొన్న కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని ఫొటోలను పోస్ట్ చేశారు. ‘ఒక్క పిడికిలి బిగిస్తే బిగుసుకున్నయ్ కోట్ల పిడికిల్లు. ఒక్క గొంతు జైకొడితే జంగు సైరనయ్యింది. స్ఫూర్తిప్రదాతా వందనం. ఉద్యమ సూర్యుడా వందనం. 20 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఉద్యమ బిడ్డలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. -
‘ప్రభుత్వం చేతకానితనం వల్లే ఈ కష్టాలు’
సాక్షి, హైదరాబాద్ : అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకవైపు తెలంగాణలో అకాల వర్షాల కారణంగా రైతులు కష్టాలపాలవుతుంటే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ఉత్సవాలు చేసుకోవాటం సిగ్గుచేటుని అన్నారు. సోమవారం ఎంపీ మాట్లాడుతూ.. ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లలో ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తూ 6 నెలల పంటను నీటిపాలు చేశారని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వర్షంతో తడిసి ధాన్యాన్ని చూస్తే గుండె తరుక్కుపోతుందని, వర్షాల కారణంగా చేతికి వచ్చిన ధాన్యం నీళ్ల పాలు అవుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. (‘లూడో’లొ ఓడించిందని భార్యను.. ) 15 రోజులుగా ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లలో రైతులు పడిగాపులు కాస్తున్న పట్టించుకునే నాధుడే లేడని, ప్రభుత్వం చేతకానితనం వల్లే రైతులకు ఈ కష్టాలు వచ్చాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రైతులకు నష్టం వచ్చినందుకు ప్రభుత్వం భాద్యత వహిస్తూ వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చండూరు, నాంపల్లి, పోచంపల్లి, చింతపల్లి, పలు మండలాల్లో ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడిసిపోయిందని, రైతులను ఇబ్బంది పెట్టకుండా తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కాన్వాయిలతో ప్రచారం చేయటం తప్ప రైతులకు చేసిన మేలు ఏమి లేదని విమర్శించారు. (లాక్డౌన్ సడలింపా.. అదేం లేదు: సీఎం ) టీఆర్ఎస్ పార్టీకి ప్రచారం తప్ప సేవ చేసే తత్వం లేదని, ప్రజల కష్టాలను గాలికి వదిలేసి సంబరాలు జరుపుకోవడం విడ్డురంగా ఉందన్నారు. జెండాలు ఎగురవేసి సంబరాలు జరుపుకునే సమయం ఇది కాదని, ప్రజలు కష్టాల్లో ఉన్నారని గుర్తు చేశారు. వారం రోజుల్లో రైతులకు న్యాయం జరగకపోతే ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల వద్ద ధర్నా చేస్తామని స్పష్టం చేశారు. బత్తాయి కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వం ఒక్క రైతు దగ్గర కూడా బత్తాయిలను కొనుగోలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బత్తాయి, నిమ్మ, మామిడి పండ్లను ప్రభుత్వమే కొనుగోలు చేసి పేదవాళ్లకు పంచాలని సూచించారు. లాక్డౌన్ కారణంగా అంతరాష్ట్రాల ఎగుమతులు నిలిచిపోయిన కారణంగా పండ్లను కొనుగోలు చేయటానికి ఎవరు ముందుకు రావడం లేదని, కేవలం ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 400 కోట్ల మామిడి,నిమ్మ,బత్తాయి పంట ఉంటుందన్నారు. ప్రభుత్వం ఈ పంటను కొనుగోలు చేసి రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు అందించాలని, మే 7 లాక్ డౌన్ తరువాత రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ తరుపున పెద్ద ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. (సామాజిక దూరం.. స్టంట్ అదిరింది గురూ! ) -
తెలంగాణ భవన్లో జెండా ఆవిష్కరించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు సోమవారం తెలంగాణ భవన్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలే వేసి, అనంతరం ప్రొ. జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీఆర్ఎస్ నేటితో రెండు దశబ్దాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటు మహమూద్ అలీ, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఎంపీ కే కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు తమ ఇళ్లపైనే పార్టీ జెండా ఎగరవేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. (టీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ శుభాకాంక్షలు) -
టీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్ : రేపటితో(ఏప్రిల్ 27) టీఆర్ఎస్ రెండు దశాబ్ధాలను పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు, పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు తెలంగాణ భవన్లో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సాధించడంతోపాటు అన్ని రంగాల్లో గొప్ప విజయాలను పార్టీ సాధించిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఆరేళ్లలో అనేక అద్భుతాలు సాధించిందని చెప్పారు. ప్రజలు దశాబ్ధాల తరబడి ఎదుర్కొంటున్న సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. ‘టిఆర్ఎస్ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు గడిచిన సందర్భంగా గొప్పగా జరుపుకోవాల్సిన వేడుకులను కరోనా వైరస్ నేపథ్యంలో నిరాడంబరంగా జరుపుకోవాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. మరో సందర్భంలో పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం. ఈ సారికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఎవరికి వారు తమ ప్రాంతాల్లో అత్యంత నిరాడంబరంగా ఎక్కడికక్కడే పతాకావిష్కరణ చేయాలి’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇళ్లపై టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలి : కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు తమ ఇళ్లపైనే పార్టీ జెండా ఎగరవేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన స్వయంగా రక్తదానం చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు సామాజిక దూరాన్ని పాటిస్తూ రక్తదాన కార్యక్రమాన్ని వారం రోజులపాటు నిర్వహించాలని కోరారు. ఈ కష్టకాలంలో చుట్టుపక్కల అవసరం ఉన్నవారికి ఆదుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు చేసే ప్రతి సామాజిక కార్యక్రమాన్ని భౌతిక దూరం పాటిస్తూ చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. -
నాడు ఒక వ్యక్తిగా..నేడు శక్తిగా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: 2001 ఏప్రిల్ 27న ప్రారంభమైన ఒక వ్యక్తి సాహసోపేత ప్రయాణం నేడు తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ 18వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. -
మలేసియాలో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెరాస మలేసియా ఎన్నారై విభాగం అధ్యక్షుడు చిరుత చిట్టిబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఉద్యమ సమయం లో పోరాట స్ఫూర్తితో ఆవిర్భవించి 18 వసంతాలు పూర్తిచేసుకున్న టీఆర్ఎస్.. పరిపాలనలో తనదైన శైలిలో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. కీలక నిర్ణయాలు తీసుకోవడం, అభివృద్ధి పథకాలు అమ లు పరచడంలో, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తూ దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మారుతి కుర్మ, గుండా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
గల్లీ నుంచి ఢిల్లీ దాకా గులాబీ జెండానే
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని.. త్వరలో జరిగే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లోనూ గెలుపు బావుటా ఎగరేస్తామని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే ఏ ఎన్నికల్లోనైనా ఎగిరేది గులాబీ జెండాయేనన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. శనివారం తెలంగాణ భవన్లో ఘనంగా వేడుకలు జరిగాయి. మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ సీనియర్ల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. తాను ఎంచుకున్న లక్ష్యాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన రూపంలో చూసుకున్నారని, రెండుసార్లు ముఖ్యమంత్రిగా అయిన ఘనత కూడా ఆయనకే చెల్లుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ సాహసోపేత పోరాటం కారణంగానే తెలంగాణ సిద్ధించిందన్నారు. నాడు ఎన్టీఆర్.. నేడు కేసీఆర్ తెలుగు ప్రజల కోసం పార్టీలు పెట్టి విజయం సాధించిన వారు ఇద్దరేనన్నారు. అందులో ఒకరు నందమూరి తారక రామారావైతే.. మరొకరు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అని అన్నారు. ఎన్టీఆర్ విజయం సాధించడానికి నాడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ శూన్యత, ఆయనకున్న సినీగ్లామర్ కారణమైందన్నారు. కేసీఆర్‌కు బలమైన సామాజిక నేపథ్యం ఉందని, ఆర్థిక వనరులు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ.. పరిస్థితులకు ఎదురొడ్డి ఘన విజయం సాధించారని ప్రశంసించారు. కేసీఆర్ పదవుల కోసం ఏనాడూ పనిచేయలేదని, వాటికోసం పాకులాడలేదని కేటీఆర్ గుర్తుచేశారు. త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందనే దృఢసంకల్పంతోనే.. ఆనాడు కేసీఆర్ మూడు పదవులకు రాజీనామా చేసి ఉద్య మంలో దిగిన విషయాన్ని పునరుద్ఘాటించారు. డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసనసభ సభ్యత్యానికి, తెదేపా సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ పురుడు పోశారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఏకైక ఆకాంక్షతో టీఆర్ఎస్ పార్టీని స్థాపించారన్నారు. పార్టీ స్థాపన తర్వాత ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ మొక్కవోని ధైర్యంతో కేసీఆర్ ముందుకెళ్లారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని వదిలిపెడితే రాళ్లతో కొట్టి చంపాలని పార్టీ ఆవిర్భావం నాడే ధైర్యంగా చెప్పిన మహనీయుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. ప్రణబ్ ప్రశంసించారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నిబద్ధతను కీర్తించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి కేసీఆర్ ఎన్నో ఎత్తుపల్లాలు చూశారన్నారు. విజయాలు సాధించినప్పుడు పొంగిపోలేదని, అపజయాలు వచ్చినప్పుడు కుంగిపోలేదన్నారు. కేసీఆర్ వెంట నడిచినవారు మొదట్లో వేలల్లో ఉంటే ఇప్పుడు వారి సంఖ్య లక్షల్లో చేరిందన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. ప్రతి కార్యకర్త సంయమనంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విబేధాలు తలెత్తితే 4గోడల మధ్యే ఉండాలని, రచ్చకెక్కి గోలచేయొద్దన్నారు. ఏ సమస్య వచ్చినా పరిష్కరించే చాణక్యనీతి కేసీఆర్ దగ్గర ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకు వెళ్లడాన్ని కొందరు ఓర్వడం లేదని, బద్నాం చేసేందుకు గుంటనక్కల్లా వేచి చూస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత పార్టీ ఆవిర్భావ వేడుకలు ఆడంబరంగా చేసుకుందామని అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రమంతటా ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న వారందరికీ కేటీఆర్ అభినందనలు తెలిపారు. పార్టీ స్థాపించి 18ఏళ్లు పూర్తి చేసుకుందని, ఇప్పుడు టీఆర్ఎస్ రాష్ట్రంలో తిరుగులేని రాజకీయశక్తిగా ఎదిగిందన్నారు. కేసీఆర్ వెంట ఇన్నేళ్లు నడిచిన, నడుస్తున్న గులాబీ సైనికులకు కేటీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. -
టీఆర్ఎస్లో సంస్థాగత మార్పులు
సాక్షి, హైదరాబాద్: సంస్థాగత నిర్మాణంలో మార్పులు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానం భావిస్తోంది. రెండేళ్ల క్రితం రద్దు చేసిన జిల్లా కమిటీల వ్యవస్థను మళ్లీ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దేశంలోనే తిరుగులేని రాజకీయ శక్తిగా పార్టీని తీర్చిదిద్దే లక్ష్యంతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ప్రణాళిక రచించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ పని చేసేలా కొత్త వ్యవస్థను తీర్చిదిద్దాలని నిర్ణయించారు. టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణం ఎలా ఉండాలనే అంశంపై ఇప్పటికే పలుసార్లు పార్టీ ప్రధాన కార్యదర్శులతో చర్చించారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలతో పార్టీ నిర్మాణం ఉండాలని ఎక్కువ మంది సూచించారు. దీంతో టీఆర్ఎస్ జిల్లా కమిటీల వ్యవస్థను మళ్లీ ఏర్పాటు చేసే దిశగా పార్టీ అధినేత కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలిసింది. టీఆర్ఎస్ జిల్లా కమిటీల ఏర్పాటుకు అంతర్గతంగా ఆమోదం లభించినట్లు తెలిసింది. ఈ కారణంగానే అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని కేటీఆర్ నిర్ణయించారు. స్థల సేకరణ, భవన నిర్మాణాల నమూనా, నిర్మాణ పనులపై పలుసార్లు సమీక్షలు నిర్వహించారు. టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలను వేగంగా పూర్తి చేసి ఆధునిక సమాచార, సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోనున్నారు. కార్యాలయాలు కేంద్రంగా జిల్లా కమిటీల ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో... టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ రెండేళ్లకో సారి జరుగుతుంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీలతో వ్యవస్థ ఉండేది. 2015లో నిర్వహించిన సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లా కమిటీలను కుదించారు. కేవలం అధ్యక్షుడినే ఎన్నుకున్నారు. 2017లో జరిగిన సంస్థాగత ప్రక్రియలో భాగంగా జిల్లా కమిటీల వ్యవస్థను రద్దు చేశారు. నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జీల ఆధ్వర్యంలోనే వ్యవస్థ పని చేసేలా మార్పులు చేశారు. తాజాగా జిల్లాల పునర్విభజనతో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం మూడు జిల్లాలకు విస్తరించింది. ఎన్నికల పరంగా సమన్వయం విషయంలో కొన్నిసార్లు ఇబ్బందులు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కమిటీల పునరుద్ధరణపై టీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించాక జిల్లా కమిటీల పునరుద్ధరణపై సానుకూల నిర్ణయం తీసుకునే దిశగా చర్చ మొదలైంది. 2019లో టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. వరుస ఎన్నికల కారణంగా దీన్ని వాయిదా వేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం టీఆర్ఎస్ సభ్యత్వ నమోదును పూర్తి చేసి గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీలను కొత్తగా ఎన్నుకునే ప్రక్రియ మొదలు కానుంది. జూన్ మొదటి వారంలో దీన్ని నిర్వహించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియపై కేటీఆర్ త్వరలోనే ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. నేడు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. టీఆర్ఎస్ 18వ ఆవిర్భావ దినోత్సవం శనివారం జరగనుంది. రాష్ట్రంలో ఎన్నికల నియ మావళి అమలులో ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర కార్యాలయంలో శనివారం ఉదయం 9 గం.కు పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, రాష్ట్ర నాయకులు పాల్గొంటారు. -
గులాబీ దళానికి 18 ఏళ్లు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఈసారి ఎలాంటి హడావుడి లేకుండా జరగనుంది. లోక్‌సభ ఎన్నికల నియమావళి.. పరిషత్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర తెలిపారు. 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఏటా వార్షికోత్సవాన్ని నిర్వహిస్తోంది. భారీ బహిరంగసభతో పాటు, పార్టీ ప్రతినిధులతో ప్లీనరీ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 27న జరగనున్న టీఆర్ఎస్ 18వ ఆవిర్బావ దినోత్సవాన్ని సాదాసీదాగా నిర్వహించాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేవలం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలోని పార్టీ బాధ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. తెలంగాణ భవన్లో జరగనున్న పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొంటారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొననున్నారు. కీలక మైలురాయి: కేటీఆర్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మొదటి పంపు వెట్‌రన్ విజయవంతం కావడంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఖరీఫ్‌లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంలో ఈ ప్రక్రియ కీలకమైందని పేర్కొన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించే భారీ ప్రణాళికలో ఇదో కీలక మైలురాయిగా కేటీఆర్ అభివర్ణించారు. లక్షల మంది రైతుల సుదీర్ఘ ఎదురుచూపులకు తెరపడనుందని గురువారం ట్విట్టర్లో పేర్కొన్నారు. -
బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన హరీష్
-
బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన హరీష్
హన్మకొండ: టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనెల 27న హన్మకొండలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరిలు శనివారం పరిశీలించారు. సుమారు 190 ఎకరాల్లో నిర్వహిస్తున్న ఈ సభ కోసం భారీగా పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాలు గతంలో కంటే ఎంతో బాగా జరుగుతున్నాయన్నారు. కొన్ని గ్రామాల ప్రజలు ఏకగ్రీవంగా సభ్యత్వం తీసుకునేందుకు ముందుకొస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు సభ్యత్వం నమోదు చేసుకున్న వారి సంఖ్య 70లక్షలు దాటిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు పూర్తి మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. మూడేళ్ల తమ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని సంపాదించిందన్నారు. 27న నిర్వహించనున్న సభకు చేస్తున్న ఏర్పాట్లను చూసిన హరీశ్‌రావు వారిని అభినందించారు. సభకు వచ్చిన వారు ఏమాత్రం అసౌకర్యానికి గురికాకుండా తాగునీరు, రవాణ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
లండన్‌లో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
రాయకల్: ఎన్నారై టీఆర్ఎస్ సెల్-యూకే ఆధ్వర్యంలో లండన్‌లో సోమవారం టీఆర్ఎస్ పార్టీ 15 వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్నారై టీఆర్ఎస్ సెల్ లండన్ ఇన్చార్జి రత్నాకర్ అధ్యక్షత వహించారు. యూకే నలుమూలల నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ప్రధాన కార్యదర్శి అశోక్ దుసరి, కారదర్శి వెంకట్‌రెడ్డి దొంతుల, ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తదితరులు పాల్గొన్నారు.