సాక్షి, హైదరాబాద్: సంస్థాగత నిర్మాణంలో మార్పులు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానం భావిస్తోంది. రెండేళ్ల క్రితం రద్దు చేసిన జిల్లా కమిటీల వ్యవస్థను మళ్లీ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దేశంలోనే తిరుగులేని రాజకీయ శక్తిగా పార్టీని తీర్చిదిద్దే లక్ష్యంతో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ప్రణాళిక రచించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ పని చేసేలా కొత్త వ్యవస్థను తీర్చిదిద్దాలని నిర్ణయించారు. టీఆర్‌ఎస్ సంస్థాగత నిర్మాణం ఎలా ఉండాలనే అంశంపై ఇప్పటికే పలుసార్లు పార్టీ ప్రధాన కార్యదర్శులతో చర్చించారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలతో పార్టీ నిర్మాణం ఉండాలని ఎక్కువ మంది సూచించారు. దీంతో టీఆర్‌ఎస్ జిల్లా కమిటీల వ్యవస్థను మళ్లీ ఏర్పాటు చేసే దిశగా పార్టీ అధినేత కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలిసింది. టీఆర్‌ఎస్ జిల్లా కమిటీల ఏర్పాటుకు అంతర్గతంగా ఆమోదం లభించినట్లు తెలిసింది. ఈ కారణంగానే అన్ని జిల్లాల్లో టీఆర్‌ఎస్ కార్యాలయాల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని కేటీఆర్ నిర్ణయించారు. స్థల సేకరణ, భవన నిర్మాణాల నమూనా, నిర్మాణ పనులపై పలుసార్లు సమీక్షలు నిర్వహించారు. టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయాలను వేగంగా పూర్తి చేసి ఆధునిక సమాచార, సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోనున్నారు. కార్యాలయాలు కేంద్రంగా జిల్లా కమిటీల ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
జిల్లాల పునర్విభజన నేపథ్యంలో...
టీఆర్‌ఎస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ రెండేళ్లకో సారి జరుగుతుంది. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీలతో వ్యవస్థ ఉండేది. 2015లో నిర్వహించిన సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లా కమిటీలను కుదించారు. కేవలం అధ్యక్షుడినే ఎన్నుకున్నారు. 2017లో జరిగిన సంస్థాగత ప్రక్రియలో భాగంగా జిల్లా కమిటీల వ్యవస్థను రద్దు చేశారు. నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జీల ఆధ్వర్యంలోనే వ్యవస్థ పని చేసేలా మార్పులు చేశారు. తాజాగా జిల్లాల పునర్విభజనతో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం మూడు జిల్లాలకు విస్తరించింది. ఎన్నికల పరంగా సమన్వయం విషయంలో కొన్నిసార్లు ఇబ్బందులు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కమిటీల పునరుద్ధరణపై టీఆర్‌ఎస్‌లో చర్చ జరుగుతోంది. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించాక జిల్లా కమిటీల పునరుద్ధరణపై సానుకూల నిర్ణయం తీసుకునే దిశగా చర్చ మొదలైంది. 2019లో టీఆర్‌ఎస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. వరుస ఎన్నికల కారణంగా దీన్ని వాయిదా వేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదును పూర్తి చేసి గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీలను కొత్తగా ఎన్నుకునే ప్రక్రియ మొదలు కానుంది. జూన్ మొదటి వారంలో దీన్ని నిర్వహించే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియపై కేటీఆర్ త్వరలోనే ప్రకటన చేయనున్నట్లు తెలిసింది.
నేడు టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం..
టీఆర్‌ఎస్ 18వ ఆవిర్భావ దినోత్సవం శనివారం జరగనుంది. రాష్ట్రంలో ఎన్నికల నియ మావళి అమలులో ఉన్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర కార్యాలయంలో శనివారం ఉదయం 9 గం.కు పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, రాష్ట్ర నాయకులు పాల్గొంటారు.
మళ్లీ జిల్లా కమిటీలు
Published Sat, Apr 27 2019 1:06 AM | Last Updated on Sat, Apr 27 2019 5:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment