సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 16 స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని.. త్వరలో జరిగే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లోనూ గెలుపు బావుటా ఎగరేస్తామని టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే ఏ ఎన్నికల్లోనైనా ఎగిరేది గులాబీ జెండాయేనన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. శనివారం తెలంగాణ భవన్‌లో ఘనంగా వేడుకలు జరిగాయి. మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ సీనియర్ల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. తాను ఎంచుకున్న లక్ష్యాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన రూపంలో చూసుకున్నారని, రెండుసార్లు ముఖ్యమంత్రిగా అయిన ఘనత కూడా ఆయనకే చెల్లుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ సాహసోపేత పోరాటం కారణంగానే తెలంగాణ సిద్ధించిందన్నారు.
నాడు ఎన్టీఆర్.. నేడు కేసీఆర్
తెలుగు ప్రజల కోసం పార్టీలు పెట్టి విజయం సాధించిన వారు ఇద్దరేనన్నారు. అందులో ఒకరు నందమూరి తారక రామారావైతే.. మరొకరు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అని అన్నారు. ఎన్టీఆర్ విజయం సాధించడానికి నాడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ శూన్యత, ఆయనకున్న సినీగ్లామర్ కారణమైందన్నారు. కేసీఆర్‌కు బలమైన సామాజిక నేపథ్యం ఉందని, ఆర్థిక వనరులు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ.. పరిస్థితులకు ఎదురొడ్డి ఘన విజయం సాధించారని ప్రశంసించారు. కేసీఆర్ పదవుల కోసం ఏనాడూ పనిచేయలేదని, వాటికోసం పాకులాడలేదని కేటీఆర్ గుర్తుచేశారు. త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందనే దృఢసంకల్పంతోనే.. ఆనాడు కేసీఆర్ మూడు పదవులకు రాజీనామా చేసి ఉద్య మంలో దిగిన విషయాన్ని పునరుద్ఘాటించారు. డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసనసభ సభ్యత్యానికి, తెదేపా సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ పురుడు పోశారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఏకైక ఆకాంక్షతో టీఆర్‌ఎస్ పార్టీని స్థాపించారన్నారు. పార్టీ స్థాపన తర్వాత ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ మొక్కవోని ధైర్యంతో కేసీఆర్ ముందుకెళ్లారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని వదిలిపెడితే రాళ్లతో కొట్టి చంపాలని పార్టీ ఆవిర్భావం నాడే ధైర్యంగా చెప్పిన మహనీయుడు కేసీఆర్ అని పేర్కొన్నారు.
ప్రణబ్ ప్రశంసించారు
మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నిబద్ధతను కీర్తించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి కేసీఆర్ ఎన్నో ఎత్తుపల్లాలు చూశారన్నారు. విజయాలు సాధించినప్పుడు పొంగిపోలేదని, అపజయాలు వచ్చినప్పుడు కుంగిపోలేదన్నారు. కేసీఆర్ వెంట నడిచినవారు మొదట్లో వేలల్లో ఉంటే ఇప్పుడు వారి సంఖ్య లక్షల్లో చేరిందన్నారు. ఇప్పుడు టీఆర్‌ఎస్ పార్టీలో కార్యకర్తల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. ప్రతి కార్యకర్త సంయమనంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విబేధాలు తలెత్తితే 4గోడల మధ్యే ఉండాలని, రచ్చకెక్కి గోలచేయొద్దన్నారు. ఏ సమస్య వచ్చినా పరిష్కరించే చాణక్యనీతి కేసీఆర్ దగ్గర ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకు వెళ్లడాన్ని కొందరు ఓర్వడం లేదని, బద్నాం చేసేందుకు గుంటనక్కల్లా వేచి చూస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత పార్టీ ఆవిర్భావ వేడుకలు ఆడంబరంగా చేసుకుందామని అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రమంతటా ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న వారందరికీ కేటీఆర్ అభినందనలు తెలిపారు. పార్టీ స్థాపించి 18ఏళ్లు పూర్తి చేసుకుందని, ఇప్పుడు టీఆర్‌ఎస్ రాష్ట్రంలో తిరుగులేని రాజకీయశక్తిగా ఎదిగిందన్నారు. కేసీఆర్ వెంట ఇన్నేళ్లు నడిచిన, నడుస్తున్న గులాబీ సైనికులకు కేటీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment