తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తున్న టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు. చిత్రంలో ఎంపీ సంతోష్‌కుమార్, మంత్రి మహమూద్ అలీ తదితరులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవం సోమవారం పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో ఘనంగా జరిగింది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఉదయం 9.30కి కార్యాలయ ఆవరణలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. లాక్‌డౌన్ నిబంధనల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో పార్టీ నేతలను తెలంగాణ భవన్‌లోకి అనుమతించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, మంత్రులు మహమూద్ అలీ, ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బాల్క సుమన్, ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డి, అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఎగురవేస్తున్న కేసీఆర్. చిత్రంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేకే తదితరులు
రక్తదాన శిబిరం ఏర్పాటు
ఆవిర్భావ దినం సందర్భంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పలువురు నేతలు రక్తదానం చేశారు. లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ వారం పాటు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని కార్యకర్తలకు పార్టీ నేతలు పిలుపునిచ్చారు.
జై కొడితే జంగు సైరనయ్యింది
కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సామాజిక మా«ధ్యమ వేదిక ట్విట్టర్ ద్వారా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమకాలంలో తాను పాల్గొన్న కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని ఫొటోలను పోస్ట్ చేశారు. ‘ఒక్క పిడికిలి బిగిస్తే బిగుసుకున్నయ్ కోట్ల పిడికిల్లు. ఒక్క గొంతు జైకొడితే జంగు సైరనయ్యింది. స్ఫూర్తిప్రదాతా వందనం. ఉద్యమ సూర్యుడా వందనం. 20 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఉద్యమ బిడ్డలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment