
71 కిలోల భారీ కేక్ సిద్ధం.. తెలంగాణ భవన్‌లో ప్రత్యేక డాక్యుమెంటరీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు 71వ జన్మదిన వేడుకలు సోమవారం తెలంగాణ భవన్‌లో నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో భాగంగా 71 కిలోల భారీ కేక్‌ను కట్ చేస్తారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని వివరించేలా రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీ ప్రదర్శిస్తారు. డప్పు కళాకారులు, గిరిజన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తెలంగాణ భవన్‌లో జరిగే కేసీఆర్ జన్మదిన వేడుకల ఏర్పాట్లను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరవుతారు. రాష్ట్రవ్యాప్తంగా పండ్ల పంపిణీ, అన్నదానం, ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు, దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తారని తలసాని వెల్లడించారు.
మాజీ మంత్రి మహమూద్ అలీ, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఉన్నారు. కాగా, కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ‘వృక్షార్చన’లో భాగంగా పంజగుట్టలోని జలగం వెంగళరావు పార్కులో 40 మంది మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినిపల్లి సంతోష్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.