
కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వ ఘనతలను వివరిస్తూ రూపొందించిన 71 కిలోల కేక్‌ను కట్ చేస్తున్న కేటీఆర్, హరీశ్, మధుసూదనాచారి. చిత్రంలో సత్యవతి రాథోడ్, తలసాని, శ్రీనివాస్‌గౌడ్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆయన కొడుకుగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం... గుండెబలం, జనబలంతో తెలంగాణను సాకారం చేశారు
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని జనం కోరుకుంటున్నారు హ్యాపీ బర్త్‌డే డాడీ: ఎమ్మెల్సీ కవిత
నాకు ఎనలేని మమకారం పంచిన మేనమామ : హరీశ్‌రావు
తెలంగాణభవన్‌లో ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ జాతిపిత కేసీఆర్. నా ఒక్కడికే కాదు అందరికీ ఆయన బాపు. తెలంగాణ జాతికి, నాలుగు కోట్ల ప్రజలకు హీరో. సమైక్య పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించిన మహానుభావుడు. కారణ జన్ముడు ఆయన. కేసీఆర్ కొడుకుగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు 71వ జన్మదినం సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్‌లో జరిగిన వేడుకల్లో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ధన, కుల, మీడియా బలం లేకున్నా.. 25 ఏళ్ల క్రితం జనబలం, గుండె బలంతో పార్టీని ఏర్పాటు చేసి అవమానాలు, ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని తెలంగాణ కలను సాకారం చేశారు’అని అన్నారు. తెలంగాణలోని ఏ మూలకు వెళ్లి పలకరించినా అన్ని వర్గాలు.. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాయని పేర్కొన్నారు. ‘తెలంగాణ అనే పసిగుడ్డును తిరిగి ఆయన చేతిలో పెట్టడమే కేసీఆర్‌కు మనం ఇచ్చే బహుమానం. కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా 60 లక్షల మంది గులాబీ సైనికులు పనిచేయాలి’అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం: హరీశ్‌రావు
‘కేసీఆర్ ఒక వ్యక్తి కాదు. నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం. ఆయనకు తెలంగాణతో ఉన్న బంధం, తల్లీబిడ్డల పేగుబంధం లాంటిది. గతంలో తెలుగుదేశంలో పనిచేసినా కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రశ్నించారు. కేసీఆర్ మొండి పట్టుదల వల్లే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది. తెచి్చన తెలంగాణను కన్నబిడ్డలా చూసుకుని, పదేళ్లలో అన్ని రంగాల్లో తీర్చిదిద్ది దేశానికే రోల్‌మోడల్‌గా చేశారు. కేసీఆర్ తెచ్చిన తెలంగాణలో సీఎం రేవంత్ 20–20 మ్యాచ్‌లు అంటూ.. డబ్బుల కోసం తొండి మ్యాచ్ ఆడుతున్నారు.
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని రేవంత్ తాపత్రయపడుతున్నారు. అన్ని వర్గాలూ.. రేవంత్ పాలన బాగోలేదంటూ, కేసీఆర్‌ను మళ్లీ సీఎంగా కోరుకుంటున్నాయి. భవిష్యత్తులో మరో మూడు టర్ములు బీఆర్‌ఎస్ గెలుపొందడానికి కృషి జరుగుతోంది’అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ‘రేవంత్ ఒక పిల్ల కాకి. కేసీఆర్ కళ్లు తెరిస్తే ఆయన పని ఖతమవుతుంది’అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు.
తెలంగాణభవన్‌లో ఘనంగా వేడుకలు
తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర ముఖ్య నేతలు కలసి కేసీఆర్ 71వ పుట్టిన రోజు సందర్భంగా 71 కిలోల భారీ కేక్‌ను కట్ చేశారు. కేసీఆర్ రాజకీయ నేపథ్యం, తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసేలా రూపొందించిన ఫొటోలు, వీడియోను ప్రదర్శించారు.
పార్టీ నేతలు కవిత, బండ ప్రకాశ్, మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, రవిచంద్ర, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, కాలేరు వెంకటేశ్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్, హరీశ్‌రావు సహా పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు వందల సంఖ్యలో కేసీఆర్‌ను కలసి శుభాకాంక్షలు చెప్పేందుకు ఎర్రవల్లికి బయలుదేరి వెళ్లారు. కార్యకర్తలు, అభిమానులతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. కేసీఆర్‌కు సీఎం రేవంత్ శుభాకాంక్షలు మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
జీవితానికి సరిపడే స్ఫూర్తిని ఇచ్చారు
‘ప్రతీ కొడుకు నాన్నే తనకు హీరో అని చెప్తాడు. కానీ మా నాన్న నాకే కాదు తెలంగాణకే హీరో. మీ పోరాటంతో సాధించిన ఈ రాష్ట్ర పురోభివృద్ధిలో మీ వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రతీక్షణం పనిచేస్తానని హామీ ఇస్తున్నా. జీవితకాలానికి సరిపడా మీరు అందించిన స్ఫూర్తికి కృతజ్ఞతలు. నాన్నా.. పుట్టిన రోజు శుభాకాంక్షలు’. –‘ఎక్స్’లో కేటీఆర్
హ్యాపీ బర్త్‌డే డాడీ: కవిత
హ్యాపీ బర్త్‌డే డాడీ.. అంటూ కేసీఆర్ నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటోను ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
కేసీఆర్ అంటేనే ఒక ఉద్వేగం, యుద్ధ నినాదం
‘మీరు నా తలనిమిరే తల్లిప్రేమ. నాకు ఎనలేని మమకారం పంచిన మేనమామ. నాకు రాజకీయ చైతన్యాన్ని నేరి్పంచి, నాలో ప్రజాసేవా సంస్కారాన్ని రంగరించి ఉద్యమ కార్యాచరణలో నడిపించారు. కేసీఆర్ అంటేనే ఒక ఉద్వేగం, ఉద్రేకం, స్వాభిమానం, యుద్ధ నినాదం, ప్రజాగళం, ఆత్మగౌరవ రణం, తెలంగాణ జనం గుండెల్లో నిత్య సూర్యోదయం’. –‘ఎక్స్’లో హరీశ్‌రావు
Comments
Please login to add a commentAdd a comment