ఇది శుభసూచకం | CM KCR Review On Corona Control | Sakshi
Sakshi News home page

ఇది శుభసూచకం

Published Tue, Apr 28 2020 2:18 AM | Last Updated on Tue, Apr 28 2020 8:23 AM

CM KCR Review On Corona Control - Sakshi

టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్‌లో జెండా ఎగురవేసి జై తెలంగాణ అని నినదిస్తున్న సీఎం కేసీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుతుండడం శుభసూచకమని, రాబోయే కొద్ది రోజుల్లోనే కరోనా పాజిటివ్‌ కేసులు లేని రాష్ట్రంగా తెలంగాణ మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. మంగళవారం నాటికి రాష్ట్రంలోని 21 జిల్లాలు ఒక్క కరోనా యాక్టివ్‌ కేసు కూడా లేని జిల్లాలుగా మారుతున్నాయని ప్రకటించారు. కరోనా వైరస్‌ సోకిన వారిలో కూడా 97 శాతానికి పైగా మంది కోలుకుని, డిశ్చార్జి అవుతుండడం మంచి పరిణామమని పేర్కొన్నారు. వైరస్‌ వ్యాప్తి, ప్రభావం బాగా తగ్గుతున్నందున రాష్ట్రంలో కంటైన్మెంట్ల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతున్నట్లు తెలిపారు. మర్కజ్‌ వెళ్లి వచ్చినవారి ద్వారా వైరస్‌ సోకుతున్న వారి లింక్‌ మొత్తం గుర్తించి, అందరికీ పరీక్షలు నిర్వహించే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి చాలా వరకు తగ్గిందన్నారు.

ఏదైనా అనుకోని పరిస్థితుల్లో మళ్లీ పాజిటివ్‌ కేసులు వచ్చినా, వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవడానికి వైద్య ఆరోగ్య శాఖ అన్ని విధాలా సంసిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా కరోనా వైరస్‌ వ్యాప్తి, రోగులకు అందుతున్న చికిత్స, సహాయ కార్యక్రమాలు, లాక్‌డౌన్‌ అమలు తదితర అంశాలను సీఎం సుదీర్ఘంగా సమీక్షించారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్లు వైద్యశాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సోమవారం 159 మందికి పరీక్షలు నిర్వహించగా, కేవలం ఇద్దరికి మాత్రమే పాజిటివ్‌ వచ్చిందని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిబంధనలు కచ్చితంగా అమలు చేయడం వల్ల వైరస్‌ వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టగలుగుతున్నట్లు చెప్పారు. సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే...

సోమవారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌

జిల్లాల్లో తక్కువ సంఖ్యలో పాజిటివ్‌లు..
రాష్ట్రంలో వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన వారు సోమవారం నాటికి 1003 మంది కాగా, అందులో 332 మంది ఇప్పటికే కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 646 పాజిటివ్‌ కేసులున్నాయి. మొత్తం పది జిల్లాల్లో (ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, వరంగల్‌ రూరల్, వనపర్తి, నాగర్‌ కర్నూల్, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మంచిర్యాల) ప్రస్తుతం ఒక్క పాజిటివ్‌ కేసు కూడా లేదు. మరో 11 జిల్లాలు(జగిత్యాల, జనగామ, పెద్దపల్లి, సంగారెడ్డి, జయశంకర్‌ భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నల్లగొండ) మంగళవారం (ఏప్రిల్‌ 28) నాటికి ఒక్క పాజిటివ్‌ కేసు కూడా లేని జిల్లాలుగా మారనున్నాయి. హైదరాబాద్, సూర్యాపేట, గద్వాల, వికారాబాద్‌ వంటి ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో చాలా తక్కువ సంఖ్యలో పాజిటివ్‌ కేసులున్నాయి.  కొద్ది రోజులుగా పరిస్థితిని గమనిస్తుంటే రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి బాగా తగ్గుముఖం పట్టింది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక్క పాజిటివ్‌ కూడా రాని పరిస్థితి వస్తుందనే నమ్మకం ఏర్పడుతోంది. ఆ తర్వాత అక్కడో ఇక్కడో కొద్దో గొప్పో కేసులు వచ్చినా వెంటనే గుర్తించి, తగు చర్యలు తీసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. 

మర్కజ్‌ వెళ్లి వచ్చిన వారందరినీ గుర్తించి పరీక్షలు 
రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా పనిచేస్తోంది. వైరస్‌ సోకినవారిని గుర్తించడానికి వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ ఎంతగానో శ్రమిస్తోంది. మొదట విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా మాత్రమే వైరస్‌ సోకుతున్నట్లు తేలింది. తర్వాత మర్కజ్‌ ప్రార్థనల్లో పాల్గొన్న వారి ద్వారా వైరస్‌ వచ్చినట్లు గ్రహించాం. విదేశాల నుంచి వచ్చిన వారినీ, మర్కజ్‌ వెళ్లి వచ్చిన వారందరినీ గుర్తించి పరీక్షలు నిర్వహించాం. వారిలో పాజిటివ్‌ వచ్చిన వారిని గుర్తించి, ఆసుపత్రిలో పెట్టి చికిత్స చేశాం. పాజిటివ్‌ వచ్చిన వారు ఎవరెవరిని కలిశారో గుర్తించి, వారికీ పరీక్షలు నిర్వహించాం.

మళ్లీ వారిలో ఎవరికి పాజిటివ్‌ వచ్చిందో గుర్తించి, వారు ఎవరెవరిని కలిశారో గుర్తించి, పరీక్షలు నిర్వహిస్తూ పోతున్నాం. సోమవారం జరిపిన పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. వారిద్దరినీ ఆసుపత్రిలో పెట్టి చికిత్స చేయడంతో పాటు, వారు ఎవరెవరిని కలిశారనే లింక్‌ పట్టుకుని వారికీ పరీక్షలు నిర్వహిస్తాం. వారిలో ఎవరికైనా పాజిటివ్‌ వస్తే, వారి ద్వారా లింకు గుర్తించి అందరికీ పరీక్షలు చేసుకుంటూ పోతాం. లింకులో చివరి వ్యక్తి వరకు అందరినీ గుర్తించి, పరీక్షలు నిర్వహించే ప్రక్రియ కొనసాగుతుంది. మర్కజ్‌ లింకు లేకున్నా రోజుకు దాదాపు వంద మంది వరకు వైరస్‌ లక్షణాలు కనిపించిన వారిని కూడా పరీక్షిస్తున్నాం. చదవండి: నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే బాస్‌.. 

ప్రతీక్షణం అప్రమత్తంగానే ఉంటాం..
పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టినంత మాత్రాన ప్రభుత్వం ఏమాత్రం ఉదాసీనంగా ఉండదు. ప్రతీక్షణం అప్రమత్తంగానే ఉంటాం. మళ్లీ ఏదైనా అనుకోని ఉపద్రవం వచ్చి, కేసుల సంఖ్య పెరిగినా సరే, సమర్థంగా ఎదుర్కోవడానికి అన్ని విధాలా వైద్య ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉంది. టెస్టింగ్‌ కిట్స్, పీపీఈ కిట్లు, ఎన్‌ 95 మాస్కులు, ఇతర మాత్రలు, పరికరాలు, బెడ్సు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఎన్ని కేసులొచ్చినా ఏమాత్రం ఇబ్బంది లేకుండా చికిత్స చేయడానికి సర్వసన్నద్ధమై ఉన్నాం. రాష్ట్రంలో ముందు ప్రకటించినట్లు మే 7 వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. ప్రజలు నిబంధనలు పాటించి సహకరించాలి.

అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు. అన్ని మతాల వారు తమ ప్రార్థనా కార్యక్రమాలను, పండుగలను ఇళ్లలోనే చేసుకోవాలి. పాజిటివ్‌ కేసులు తగ్గుతున్న కొద్దీ, యాక్టివ్‌ కేసులు లేని ప్రాంతాల్లో కంటైన్మెంట్‌ జోన్ల సంఖ్య కూడా తగ్గిస్తాం. కానీ కంటైన్మెంట్‌ కొనసాగుతున్న ప్రాంతాల్లో మాత్రం ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి’అని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, హోంమంత్రి మహమూద్‌ అలీ, టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, సీఎస్‌ సోమేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, శాంత కుమారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. 

గ్రేటర్‌లో కొన్ని సర్కిళ్లలోనే వైరస్‌..
జీహెచ్‌ఎంసీ పరిధిలో 30 సర్కిళ్లు ఉంటే, చాలా సర్కిళ్లలో పాజిటివ్‌ కేసులు లేవు. కొన్సి సర్కిళ్లు యాక్టివ్‌ కేసులు లేని సర్కిళ్లుగా మారాయి. కొన్ని సర్కిళ్లకే వైరస్‌ పరిమితమైంది. దీంతో చాలా కంటైన్మెంట్లు ఫ్రీ అవుతున్నాయి. యాక్టివ్‌ కేసులు తగ్గుతున్న కొద్దీ కంటైన్మెంట్ల సంఖ్యను కూడా ప్రభుత్వం తగ్గిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వైరస్‌ సోకిన వారిలో అత్యధిక శాతం మంది క్వారంటైన్‌ పీరియడ్‌ మే 8 నాటికి ముగుస్తుంది. చదవండి: రాష్ట్రంలో డిగ్రీ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement