‘ఓఎంసీ’లో నిందితులుగా సబిత, కృపానందం
నేడు సీబీఐ ప్రత్యేక కోర్టులో అనుబంధ చార్జిషీట్ దాఖలు
సాక్షి, హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో గనుల శాఖ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆ శాఖ మాజీ కార్యదర్శి కృపానందంలను నిందితులుగా సీబీఐ చేర్చనుంది. వీరిద్దర్నీ నిందితులుగా చేర్చనున్నట్లు సీబీఐ సోమవారం కోర్టుకు మెమో రూపంలో సమాచారం ఇచ్చింది. ఈ మేరకు బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయనుంది. ఈ కేసులో ఇప్పటికే కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, గనుల శాఖ మాజీ డెరైక్టర్ రాజగోపాల్ సహా పలువురు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇటీవలే దర్యాప్తు పూర్తయినట్లు పేర్కొంటూ సీబీఐ సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్‌లో నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో సబిత, కృపానందం పేర్లను పేర్కొన్నట్లు తెలిసింది.