Obulapuram Mining Company
-
గాలి జనార్దనరెడ్డికి ఐటీ నోటీసులు
-
గాలి జనార్దనరెడ్డికి ఐటీ నోటీసులు
రికార్డుల పరిశీలన బెంగళూరు/సాక్షి, బళ్లారి: కోట్లు ఖర్చు పెట్టి కూతురి పెళ్లిని వైభవంగా నిర్వహించిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోమవారం నోటీసులు జారీ చేశారు. అలాగే జనార్దన రెడ్డికి సంబంధించిన కార్యాలయాలపైనా ఐటీ అధికారులు దాడులు చేశారు. బెంగళూరు, హుబ్బళ్లి నుంచి బళ్లారికి వచ్చిన అధికారులు ముందుగా ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ), అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ (ఏఎంసీ) కార్యాలయాల్లో రికార్డులు పరిశీలించారు. అనంతరం గాలి జనార్దనరెడ్డి నివాసానికి వెళ్లి నోటీసులిచ్చారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఏం కొన్నారు? ఎవరి దగ్గర కొన్నారు? అనే ప్రశ్నావళిని జనార్దన రెడ్డికి ఇచ్చారు. ఈ నెల 25 లోపు సమాధానాలు చెప్పాలని ఆదేశించారు. అలాగే పెళ్లిలో అలంకరణ, వంటకాలు, వీడియో ఫొటోగ్రఫీ పనులు చూసుకున్న 10 ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థల కార్యాలయాల్లోనూ సోదాలు చేశారు. వీటిలో 7 బెంగళూరులో ఉండగా, 3 హైదరాబాద్‌కు చెందినవి. దాడుల విషయం తెలుసుకుని మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బళ్లారికి చేరుకున్న జనార్దనరెడ్డి ఇక్కడ ఉండేందుకు కోర్టు గడువు ముగియడంతో పెళ్లి కార్యక్రమాలు ముగించుకుని రాత్రి బెంగళూరుకు వెళ్లారు. -
గాలి జనార్ధన్ కంపెనీలపై సోదాలు
-
నాపై సీబీఐ కేసును కొట్టివేయండి: శ్రీలక్ష్మి
హైకోర్టులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి పిటిషన్ సాక్షి, హైదరాబాద్: ఓబులాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) కేసులో సీబీఐ అధికారులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ దర్యాప్తును అన్యాయం, ఏకపక్షం, అక్రమంగా ప్రకటించాలని, ఇదే సమయంలో తన జీవితాన్ని, స్వేచ్ఛను కోల్పోయినందుకు తగిన పరిహారం అందచేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆమె గురువారం పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసుతో సంబంధం లేకుండా తనకు రావాల్సిన అన్ని సర్వీసు ప్రయోజనాలను ఇచ్చేలా కూడా ఆదేశాలివ్వాలని విన్నవించారు. సీబీఐ కోర్టులో జరుగుతున్న కేసులో తన అరెస్ట్, హాజరుతోసహా తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేయాలని హైకోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, గనులశాఖ కార్యదర్శి, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, సీబీఐ ఎస్పీ, ఇరు రాష్ట్రాల సీఎస్‌లను ప్రతివాదులుగా ఆమె పేర్కొన్నారు. -
గాలి విడుదలకు ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) కేసులో బెయిల్ లభించిన గాలి జనార్దన్‌రెడ్డి విడుదలకు సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రూ.10 లక్షల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లను ఆయన తరఫు న్యాయవాదులు ప్రత్యేక కోర్టుకు సమర్పించారు. బెయిల్ ఉత్తర్వులను సీబీఐ కోర్టు సిబ్బంది గురువారం సాయంత్రం చంచల్‌గూడ జైలు అధికారులకు అందజేశారు. వాటిని ఫ్యాక్స్ ద్వారా కర్ణాటక జైలు అధికారులకు పంపినట్లు చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ బి. సైదయ్య తెలిపారు. కర్ణాటక జై ల్లో గాలి రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. -
ఓఎంసీ కేసులో అనుబంధ చార్జిషీట్
నిందితులుగా సబిత, రిటైర్డ్ ఐఏఎస్ కృపానందం ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ)కి ముడి ఇనుప గనుల కేటాయింపు కేసులో రాష్ట్ర మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృపానందంలను సీబీఐ నిందితులుగా చేర్చింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టులో బుధవారం అనుబంధ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి సెలవులో ఉండడంతో మొదటి అదనపు జడ్జి రమేష్ ఎదుట ఈ అనుబంధ చార్జిషీట్ సీబీఐ అధికారులు దాఖలు చేశారు. కృపానందాన్ని ఎనిమిది, సబితా ఇంద్రారెడ్డిని తొమ్మిదో నిందితులుగా పేర్కొన్నారు. సబితా ఇంద్రారెడ్డిని ఇప్పటికే దాఖలు చేసిన చార్జిషీట్లో సాక్షిగా పేర్కొన్నామని, అయితే ఈ కుట్రలో ఆమె పాత్ర ఉన్నట్లు తేలడంతో ఆమెను నిందితురాలిగా చేర్చామని నివేదించారు. ఈ మేరకు ఆమెను నిందితురాలిగా మార్చేందుకు అనుమతించాలని కోర్టును కోరుతూ సీబీఐ మరో మెమోను దాఖలు చేసింది. దీనిపై విచారణను కోర్టు ఈనెల 25కు వాయిదా వేసింది. అక్రమాలకు పాల్పడ్డారు: ఓఎంసీకి గనుల లీజుల మంజూరులో అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, గనుల శాఖ కార్యదర్శి కృపానందం అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ తన అనుబంధ చార్జిషీట్లో ఆరోపించింది. క్యాప్టివ్ (సొంత పరిశ్రమ అవసరాలకు మాత్రమే) అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగానే తొలగించి ఓఎంసీకి అనుకూలంగా వ్యవహరించారని పేర్కొంది. ఈ పదాన్ని తొలగించడంతోనే ఓఎంసీ ముడి ఇనుమును ఎగుమతి చేసుకోగలిగిందని తెలిపింది. ఐపీసీ 120(బి) రెడ్‌విత్ 409, అవినీతి నిరోధక చట్టంలోని 13(2) రెడ్‌విత్ 13(1)(డి) సెక్షన్ల కింద వీరిపై అభియోగాలను మోపింది. అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం మినహా లీజుల కేటాయింపులో అక్రమాలు తదితర అంశాలపై దర్యాప్తు పూర్తయ్యిందని కోర్టుకు నివేదించింది. 65 పేజీల అనుబంధ చార్జిషీట్‌తోపాటు 104 అనుబంధ పత్రాలు, 36 మందిని సాక్షులుగా పేర్కొంది. ఈ కేసులో 2011 డిసెంబర్లో సీబీఐ దాఖలు చేసిన ప్రధాన చార్జిషీట్లో సబితను 53వ సాక్షిగా, మొదటి, రెండవ అనుబంధ చార్జిషీట్లలో 8వ సాక్షిగా చేర్చింది. అయితే ప్రధాన చార్జిషీట్ దాఖలు చేసిన దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత ఆమెను నిందితురాలిగా చేర్చుతూ సీబీఐ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయడం గమనార్హం. ఈ కేసులో మిగతా నిందితులు: ఓఎంసీ కంపెనీ డెరైక్టర్ గాలి జనార్దన్‌రెడ్డి, ఎండీ బీవీ శ్రీనివాసరెడ్డి, గనులశాఖ మాజీ డెరైక్టర్ వి.డి.రాజ్‌గోపాల్, సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, గాలి జనార్దన్‌రెడ్డి సహాయకుడు అలీఖాన్, గనులశాఖ అధికారి లింగారెడ్డి (చనిపోయారు)లతో పాటు ఓఎంసీ కంపెనీని ఈ కేసులో నిందితుల జాబితాలో సీబీఐ చేర్చింది. -
‘ఓఎంసీ’లో నిందితులుగా సబిత, కృపానందం
నేడు సీబీఐ ప్రత్యేక కోర్టులో అనుబంధ చార్జిషీట్ దాఖలు సాక్షి, హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో గనుల శాఖ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆ శాఖ మాజీ కార్యదర్శి కృపానందంలను నిందితులుగా సీబీఐ చేర్చనుంది. వీరిద్దర్నీ నిందితులుగా చేర్చనున్నట్లు సీబీఐ సోమవారం కోర్టుకు మెమో రూపంలో సమాచారం ఇచ్చింది. ఈ మేరకు బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయనుంది. ఈ కేసులో ఇప్పటికే కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, గనుల శాఖ మాజీ డెరైక్టర్ రాజగోపాల్ సహా పలువురు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇటీవలే దర్యాప్తు పూర్తయినట్లు పేర్కొంటూ సీబీఐ సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో సబిత, కృపానందం పేర్లను పేర్కొన్నట్లు తెలిసింది.