నాపై సీబీఐ కేసును కొట్టివేయండి: శ్రీలక్ష్మి
హైకోర్టులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి పిటిషన్
సాక్షి, హైదరాబాద్: ఓబులాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) కేసులో సీబీఐ అధికారులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ దర్యాప్తును అన్యాయం, ఏకపక్షం, అక్రమంగా ప్రకటించాలని, ఇదే సమయంలో తన జీవితాన్ని, స్వేచ్ఛను కోల్పోయినందుకు తగిన పరిహారం అందచేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆమె గురువారం పిటిషన్ దాఖలు చేశారు.
తనపై నమోదైన కేసుతో సంబంధం లేకుండా తనకు రావాల్సిన అన్ని సర్వీసు ప్రయోజనాలను ఇచ్చేలా కూడా ఆదేశాలివ్వాలని విన్నవించారు. సీబీఐ కోర్టులో జరుగుతున్న కేసులో తన అరెస్ట్, హాజరుతోసహా తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేయాలని హైకోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, గనులశాఖ కార్యదర్శి, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, సీబీఐ ఎస్పీ, ఇరు రాష్ట్రాల సీఎస్‌లను ప్రతివాదులుగా ఆమె పేర్కొన్నారు.