లేటరైట్ దోచేస్తుంటే మీరేం చేస్తున్నారు? | To not prevent illegal mining? | Sakshi
Sakshi News home page

లేటరైట్ దోచేస్తుంటే మీరేం చేస్తున్నారు?

Published Wed, Aug 5 2015 2:39 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM

To not prevent illegal mining?

కాకినాడ క్రైం/ప్రత్తిపాడు : ‘ఓ కంపెనీ లక్షల టన్నుల లేటరైట్ దోచుకుపోతుంటే మీరేం చేస్తున్నారు? ఇలాగైతే ఎలా? అక్రమ మైనింగ్‌ను అడ్డుకోలేరా? సామాన్యులు ట్రాక్టర్ ఇసుక తీసుకెళ్తుంటే సవాలక్ష నిబంధనలు విధించి అడ్డుకుంటారే! మరి దేశ సంపదను దోచుకుపోతుంటే అనుమతులు ఎలా ఇచ్చారు? గనులవద్ద చెక్‌పోస్టు, వేయింగ్ మిషన్ ఎక్కడ ఉన్నాయి?’ అంటూ రాష్ట్ర శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ భూమా నాగిరెడ్డి రెవెన్యూ, అటవీ, మైనింగ్ శాఖల అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు.
 
 ప్రత్తిపాడు మండలం వంతాడ, చింతలూరు గ్రామాల్లో మహేశ్వరి మినరల్స్ చేపట్టిన మైనింగ్ కార్యకలాపాల్లో అనేక అక్రమాలు బయటపడ్డాయి. పలుమార్లు తనిఖీలు, సర్వేలు జరిగాయి. ఈ నేపథ్యంలో చైర్మన్ భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలోని కమిటీ సభ్యులైన ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు (రామచంద్రపురం), బొండా ఉమా మహేశ్వరరావు (విజయవాడ సెంట్రల్), ఎ.సురేష్ కుమార్ (సంతనూతలపాడు) ఆయా మైనింగ్ ప్రదేశాల్లో మంగళవారం విచారణ చేపట్టారు. ఆయా ప్రాంతాలను స్వయంగా పరిశీలించి, స్థానికుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మాస్టర్ ప్లాన్, మైనింగ్ ప్లాన్, ట్రాన్స్‌పోర్టు ప్లాన్ కూడా లేకపోవడాన్ని భూమా గుర్తించారు.
 
  డంపింగ్ యార్డును కూడా ప్లాన్‌లో చూపించాలని చెప్పారు. ఎటువంటి ప్లాన్‌లూ లేకుండా కనీసం లీజుకిచ్చిన మైనింగ్ ప్రాంతం బౌండరీలను కూడా గుర్తించకుండా అనుమతులు ఎలా ఇచ్చారని మైన్‌‌స ఏడీ సీహెచ్ సూర్యచంద్రరావును నిలదీశారు. ‘సంవత్సరానికి ఎన్ని టన్నుల మెటీరియల్ ఎగుమతి అవుతుంది? ఎంత ట్యాక్స్ కడుతున్నారు’ అని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడమేమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధనం వృథా కావడానికి ప్రభుత్వాధికారులే తలుపులు బార్లా తెరిచారనడానికి ఇది నిదర్శనమన్నారు. లీజుదారు ఇచ్చిన సమాచారాన్నే మైనింగ్ అధికారులు తమకు ఇస్తున్నారని, వారివద్ద సమాచారం లేకపోవడం ప్రతిచోటా జరుగుతోందని అన్నారు.
 
 చింతలూరులో మూడుసార్లు సర్వే చేసిన అధికారులు 500 ఎకరాలు మాత్రమే చూపించారని, తాజాగా జాయింట్ కలెక్టర్ నిర్వహించిన సర్వేలో 739 ఎకరాల్లో గనులు తవ్వుతున్నట్లు వెల్లడైందని భూమా అన్నారు. అధికారులంతా కంపెనీకి అమ్ముడు పోయారని విమర్శించారు. రెవెన్యూ, అటవీ, మైనింగ్ శాఖల జాయింట్ ఇన్‌స్పెక్షన్ జరగకుండానే గనులు లీజుకివ్వడాన్ని తప్పుబట్టారు. ‘గనుల తవ్వకం ప్రారంభమయ్యాక ఒక్కో పత్రం, అనుమతి పత్రం తయారు చేయడం మొదలుపెట్టారా?’ అని ప్రశ్నించారు. వంతాడలో అటవీ అనుమతులు లేకుండా రహదారి ఏర్పాటు చేసినట్టు వచ్చిన ఫిర్యాదుపై సంబంధిత అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 ఎండుకట్టెలు పట్టుకువెళ్లేవారిపై కేసులు పెట్టి వేధించడం మాత్రం తెలుసంటూ ఎద్దేవా చేశారు. అవకతవకల నేపథ్యంలో వంతాడ క్వారినీ గతంలో టీడీపీ, కాంగ్రెస్, ప్రజారాజ్యం, సీపీఐ, సీపీఎం తదితర పార్టీల నేతలు సందర్శించారని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తెలిపారు. మైనింగ్‌వల్ల రహదారులు ధ్వంసమవుతున్నాయని, ధ్వని, వాతావరణ కాలుష్యం ఏర్పడుతోందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగిలిదేవి సత్తిరాజు, గున్నాబత్తుల రాజబాబు కమిటీకి ఫిర్యాదు చేశారు. వంతాడలో 11 ఎకరాల్లో అక్రమ మైనింగ్ జరిగిందని లింగపల్లి సత్యనారాయణ తదితరులు కమిటీకి వివరించారు. చింతలూరు క్వారీలో ముగ్గురు 200 ఎకరాల లీజులు పొందారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కర్రి మురళి, మైలపల్లి సత్యనారాయణ చెప్పారు. లీజులో లేని 30 ఎకరాల్లో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. ఒక్కో ఎమ్మార్వో ఒక్కో రకంగా ఇచ్చిన ఎన్‌ఓసీలను కూడా కమిటీ తప్పు పట్టింది. వీటన్నిటిపై సమగ్ర సమాచారంతో కాకినాడలో బుధవారం కమిటీ ముందు హాజరు కావాలని మైన్స్, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులను భూమా ఆదేశించారు.
 
 అక్రమ తవ్వకాలవల్ల దుర్వినియోగమైన ప్రజాధనం రికవరీపై ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు, తుని ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, దాడిశెట్టి రాజా, జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, డీఎఫ్‌ఓ టీవీ సుబ్బారెడ్డి, సబ్ డివిజన్ ఫారెస్టు ఆఫీసర్ వీవీ సుభద్రాదేవి, మైన్స్ జేడీ కేవీఎల్ నరసింహరెడ్డి, డీడీ పి.కోటేశ్వరరాజు, మైన్స్ విజిలెన్‌‌స ఎ.డి. కె.సుబ్బారావు, పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు, తహశీల్దార్ గిడుతూరి సత్య వరప్రసాద్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గొల్లపల్లి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement