prattipadu
-
వైఎస్సార్సీపీ ప్రత్తిపాడు అభ్యర్థికి త్రుటిలో తప్పిన ప్రమాదం
పిఠాపురం/ఏలేశ్వరం: కాకినాడ జిల్లా పిఠాపురం రాపర్తి సెంటర్ వద్ద 216 జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. బెండపూడి నుంచి వస్తున్న ఒక కారు రాపర్తి సెంటర్ వద్దకు వచ్చేసరికి గేదెలు అడ్డంగా వచ్చాయి. దీంతో ఆ కారు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న వరుపుల సుబ్బారావు కారు ముందున్న కారును బలంగా ఢీకొంది. రెండు కార్లూ దెబ్బతిన్నాయి. ఘటన జరిగిన వెంటనే వరుపుల సుబ్బారావు ఉన్న కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నాయి. దీంతో ఆయన సురక్షితంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు. అనంతరం సుబ్బారావు మరో కారులో కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి నుంచి స్వగ్రామమైన ఏలేశ్వరం మండలం, లింగంపర్తి చేరుకున్నారు. కాగా, ఈ ప్రమాదంలో ముందున్న కారులో ఉన్న వారికి కూడా ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు చెప్పారు. -
సామాజిక న్యాయానికి ఛాంపియన్ జగనన్న
సాక్షి, కాకినాడ: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సాధించిన సామాజిక సాధికారత ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రజ్వరిల్లింది. సామాజిక సాధికార బస్సు యాత్రలో వేలాది మంది జనం కదలివచ్చారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో వచ్చి జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. జగనన్న అందించిన చేయూతతో తాము సాధించిన సాధికారతను బహిరంగ సభలో బడుగు వర్గాలకు చెందిన నేతలు తెలియచేస్తుంటే ప్రజలు హర్షధ్వానాలు పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పినిపె విశ్వరూప్, మేరుగ నాగార్జున, ఎంపీలు వంగా గీత, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, కురసాల కన్నబాబు, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, పెండెం దొరబాబు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కర్రి పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. మంత్రి పినిపె విశ్వరూప్ మాట్లాడుతూ..... – 14 సంవత్సరాల చంద్రబాబు పాలనకు, నాలుగున్నరేళ్ల జగనన్న పాలనకు తేడా గమనించాలి. – ప్రతి అవ్వాతాత రూ.2,750 పింఛను తీసుకుంటున్నారు. వికలాంగులు రూ.3,500 అందుకుంటున్నారు. దానికి ప్రధాన కారణం గతంలో వైయస్సార్, నేడు జగనన్న. – చంద్రబాబు సీఎంగా పని చేసినప్పుడు 70 రూపాయలున్న పింఛన్ కనీసం 10 రూపాయలైనా పెంచాడా? – చంద్రబాబు 30 లక్షల మందికి వెయ్యి రూపాయల పింఛన్ ఇస్తే, ఈరోజు రూ.2,750 చొప్పున 64 లక్షల మందికి ఇస్తున్న జగనన్న. – ఫీజు రీయింబర్స్మెంట్ అంటే గుర్తుకొచ్చేది వైయస్సార్. – ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు తూట్లు పొడిచిన చంద్రబాబు. 30 శాతం స్లాబ్ విధించి 70 శాతం తల్లిదండ్రులు కట్టుకోవాలని విద్యార్థులను గాలికొదిలేశాడు. – మళ్లీ జగనన్న రాగానే వైయస్సార్ హయాంలో మాదిరిగా పూర్తి ఫీజు ఇస్తున్నారు. – జగనన్న అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లకే సచివాలయ వ్యవస్థ ద్వారా 1.40 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చారు. దేశానికే దిక్సూచిగా నిలిచిన జగనన్న. – రాజశేఖరరెడ్డి సంక్షేమంలో రెండడుగులు వేస్తే, జగనన్న నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నారు. – రాజ్యసభకు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలను 14 సంవత్సరాల్లో ఒక్కరినీ పంపని బాబు. – నలుగురు బీసీలను రాజ్యసభకు పంపిన జగన్మోహన్రెడ్డి. సామాజిక న్యాయానికి ఛాంపియన్ జగనన్న. – ఐదుగురు ఎస్సీలకు మంత్రి పదవులిచ్చిన జగనన్న. బాబు కేవలం ముగ్గురికే ఇచ్చి ఏడాదికోసారి మార్చేశారు. నలుగురు ఎస్సీ మంత్రుల్నీ కొనసాగిస్తున్న సీఎం జగన్. – ఎస్టీలు లేని మంత్రివర్గం చంద్రబాబుది, ఎస్టీని ఉపముఖ్యమంత్రి చేసిన జగన్. – మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వని చంద్రబాబు. మైనార్టీ వర్గానికి డిప్యూటీ సీఎం ఇచ్చిన జగనన్న. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.... – అంబేద్కర్ దగ్గర నుంచి జ్యోతిరావు పూలే, సాహూ మహరాజ్, పెరియార్ రామస్వామి నాయకర్, జగ్జీవన్‌రామ్ లాంటి వారు సామాజిక సాధికారత కోసం విప్లవాలు చేశారు. – ఏపీలోగానీ, భారతదేశంలోగానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలు వారి స్థితిగతుల కోసం ఆలోచించిన నాయకులు కరువయ్యారు. – ఏపీలో జగనన్న సీఎం అయిన తర్వాత ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు భరోసా, ధైర్యం వచ్చాయి. సమాజంలో అసమానతలు తొలిగాయి. – రాజ్యాధికారం వచ్చేలా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు, డబ్బులు అందించి గుండెమీద చెయ్యి వేసుకొని పేదవారు బతకడానికి అవకాశాలు వచ్చాయి. – మన పిల్లలు ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ చదువుతున్నారు. – 31 లక్షల పట్టాలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అందుతున్నాయి. – రూ.2.40 లక్షల కోట్లు డైరెక్ట్‌గా పేదవారికి అందిస్తే అగ్రతాంబూలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కింది. – ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్నాడు చంద్రబాబు. బీసీ కులాల తోకలు కత్తిరిస్తాన్నాడు. బీసీలు జడ్జిలుగా పనికిరారన్నాడు. – మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వని బాబు. ఎస్టీ కమిషన్ ఇవ్వలేదు. దళితులపై దాడులు, అఘాయిత్యాలు చేయించాడు. – 2014లో మూడు పార్టీలు వచ్చాయి. 648 వాగ్దానాలిచ్చాయి. ఒక్కటీ నెరవేర్చలేదు. – చంద్రబాబు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేయలేదు. – పేదల కోసం, భావితరలాల భవిష్యత్ కోసం ఆలోచించే ముఖ్యమంత్రి జగనన్న. – 11.5 శాతం ఉండే పేదరికం 6 శాతానికి తగ్గిందంటే జగనన్న పేదల కోసం ఎంతగా పని చేస్తున్నారో అర్థమవుతోంది. – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగనన్న సీఎం కావడం అవసరం. 2024 ఎన్నికల్లో మనం తప్పు చేస్తే మన గొయ్యి మనమే తవ్వుకుంటాం. ఎంపీ నందిగం సురేష్, మాట్లాడుతూ.... – జగనన్న తన పాదయాత్రలో మన కష్టాలు దగ్గర నుంచి చూశాడు. – నాలుగున్నరేళ్లలో జగనన్న ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. – జగనన్నకు పేదవాడి గుండె తెలుసు. వ్యవసాయ కూలీల చమటవాసన తెలుసు. – మన జీవితాల్లో చీకటి నింపిన వ్యక్తి చంద్రబాబు. రెండెకరాల నుంచి ఆరు లక్షల కోట్లు దోచుకున్నాడు. ఆ సంపద మనదే. – నాడు–నేడు కింద స్కూళ్లు గొప్పగా ఉన్నాయంటే, అవ్వాతాతలు పింఛన్ తీసుకుంటున్నారంటే, వ్యవసాయ రైతులు బాగున్నారంటే జగనన్న కారణం. – వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత మన ఇంటికి వచ్చి సమస్యలున్నాయా అని అడుగుతున్నారు. దేశం మొత్తం మీద ఎక్కడా ఇలాంటి వ్యవస్థ లేదు. – మన జీవితాలకు వెలుగునిచ్చే వ్యక్తి జగనన్న. 20–25 ఏళ్లు సీఎంగా ఉంచుకోగలిగితే మన పిల్లలు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లుగా అవుతారు. – చంద్రబాబు పేరు చెబితే ఏ పథకమూ గుర్తుకురాదు. వెన్నుపోటు ఒక్కటే గుర్తుకొస్తుంది. – 2014లో మద్దతు పలికి 2019లో బాబును తిట్టిన పవన్ 2024లో మళ్లీ బాబు మంచోడంటున్నాడు. – పేదవాళ్లు గొప్పవాళ్లు అవ్వాలని అసైన్డ్ భూములకు పట్టాలిచ్చిన జగనన్న. – అమరావతిలో అసైన్డ్ భూములు దోచుకుతిన్న చంద్రబాబు. – ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు నేనున్నానంటూ జగనన్న భరోసా ఇస్తున్నారు. – సామాన్యుడు పార్లమెంటులో కూర్చున్నాడంటే కారణం జగనన్న. ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి మాట్లాడుతూ.... – 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు కేబినెట్లో ఉన్నారు. – నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన జగనన్న. – డైరెక్టర్ పదవులు వెతికి వెతికి బీసీలకు, ఎస్సీలకు ఇచ్చారు. అలాంటి ఆలోచన చేసే ప్రభుత్వం ఎక్కడైనా ఉందా. – నాలుగేళ్లలో రూ.7 లక్షల కోట్లు రాష్ట్రానికి బడ్జెట్ ఉంటే రూ.4.15 లక్షల కోట్లు ఈ వర్గాలకే ఇచ్చారు. – లాంతరు పెట్టి వెతికినా గతంలో బడుగు వర్గాల్లో ఇంజనీరు, డాక్టరు కనిపించేవారు కాదు. ఈరోజు ప్రతి ఇంట్లో ఇంజనీరు,డాక్టర్ ఉన్నారంటే కారణం వైయస్సార్. – ఫీజు రీయింబర్స్మెంట్ తెచ్చి చదువుకొనే అవకాశం కల్పించారు. – ఇంటి స్థలాలు ఇస్తుంటే ప్రతిపక్షాలు ఎద్దేవా చేశారు. రాజధానిలో సోషల్ డెమోగ్రఫీ చెడిపోతుందన్నారు. – 30 లక్షల పట్టాలిచ్చి ఇళ్లు కట్టించేందుకు లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్న జగనన్న. – మహిళలంటే పొలాల్లో కోతలకే, వంటింటికే పరిమితమయ్యేవారు. ఇప్పుడు ప్రతి పథకాన్నీ మహిళ పేరు మీద పట్టా, విద్యాదీవెన, వసతి దీవెన సొమ్ము తల్లి పేరుమీద ఖాతాలో వేస్తున్నారు. – గతంలో పార్టీ, కులం చూసేవారు. మనకు ఓటు వేస్తారా అని చూసేవారు. మన కులాలను బానిసలుగా భావించేవారు. – ఈరోజు ఎవరి దగ్గరకూ వెళ్లాల్సిన పని లేదు. అర్హతే ఆధారంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ... – జనం గుండెచప్పుడు జగనన్న. కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి పేద కుటుంబం గుండెల్లో జగనన్న ఉన్నారు. – వెనుకబడిన కులాలకు ఆత్మగౌరవాన్ని ఇచ్చిన జగనన్న. – దేశం మొత్తం ఆయనవైపు తిరిగి చూస్తోంది. రోల్‌మోడల్‌గా సామాజిక న్యాయాన్ని, సంస్కరణలను అమలు చేస్తున్నారు. – 2014–19 మధ్య ఏ విధమైన సామాజిక న్యాయం చంద్రబాబు చేశారు? ఈరోజు ఏ విధమైన సామాజిక న్యాయం జరుగుతోందో చర్చకు సిద్ధం. – రూ.2.40 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లలో వేసి సామాజిక న్యాయానికి, సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా జగనన్న ఉన్నారు. – ఏ ఎన్నికల్లో, ఏ పార్టీ మేనిఫెస్టోలో చూసినా జగనన్న పథకాలు కనిపిస్తాయి. – వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, పెన్షన్ల విధానం ఇస్తామని రాష్ట్రాలు చెబుతున్నాయి. – బాబుకే గ్యారెంటీ లేదు. ఆయన ఇంకేం గ్యారెంటీ ఇస్తాడు. బాబు గ్యారెంటీల్లోనూ జగనన్న స్పూర్తి ఉంది. -
నలుగురు స్నేహితుల దుర్మరణం
ప్రత్తిపాడు: రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని.. వేగంగా వెళుతున్న కారు వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో నలుగురు స్నేహితులు మృత్యువాత పడిన ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా విజయవాడ వన్‌టౌన్ ఫిష్ మార్కెట్ బురదవారి వీధికి చెందిన చుక్కా గౌతమ్‌రెడ్డి (26), కాకినాడ నగరంలోని జగన్నాథపురం కాలనీకి చెందిన వాడపల్లి అనంత పద్మనాభ చైతన్య పవన్ (25), విశాఖ జిల్లా పెందుర్తి మండలం దేశపాత్రునిపాలెంకు చెందిన పిరిధి సౌమిక (25) విశాఖలోని వరాహ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ కళాశాలలో 2014–19 బ్యాచ్ ఆర్కిటెక్చర్ చదివారు. వీరు ముగ్గురూ విశాఖకు చెందిన తమ స్నేహితురాలు పావనితో కలిసి సోమవారం మధ్యాహ్నం విజయవాడ నుంచి అరుణాచలంకు కారులో బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు సాయంత్రం 5 గంటల సమయంలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం సమీపంలో టైరు పంక్చర్ కావడంతో జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న గౌతమ్‌రెడ్డి, అనంత పద్మనాభ చైతన్య పవన్, సౌమిక అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలై కొనఊపిరితో ఉన్న పావనిని 108లో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. వీరిలో చైతన్య పవన్, సౌమిక వైజాగ్‌లో ఉద్యోగం చేస్తున్నారని, గౌతమ్‌రెడ్డి ఇంటినుంచే ప్రాజెక్టులు చేస్తూ ఉంటారని స్నేహితులు చెబుతున్నారు. పావని వివరాలు తెలియాల్సి ఉంది. -
మహిళపై లైంగికదాడి.. రూ.50 వేలు దోపిడీ
ప్రత్తిపాడు : ఓ ఆటో డ్రైవర్ మహిళపై రెండు సార్లు లైంగికదాడికి పాల్పడి ఆపై ఆమె వద్ద ఉన్న నగదును దోచుకెళ్లిన ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో జరిగింది. ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు రూరల్ మండలం పొత్తూరుకు చెందిన ముక్కల విజయలక్ష్మి శనివారం పొత్తూరు నుంచి చిలకలూరిపేటకు వెళ్లేందుకు ఆటో ఎక్కింది. అప్పటికే ఆటోలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు దిగిపోవడంతో ఆటో డ్రైవర్ గొర్రెముచ్చు శివరామయ్య.. ఆటోలో ఒంటరిగా ఉన్న మహిళతో మాటమాటా కలిపాడు. ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలోకి ఆటోను తీసుకువెళ్లి మహిళపై రెండు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె వద్ద ఉన్న రూ.50 వేలు దోచుకెళ్లాడు. బాధిత మహిళ 100కు డయల్ చేయడంతో ప్రత్తిపాడు పోలీసులు అప్రమత్తమై డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
వక్రించిన విధి
ప్రత్తిపాడు: విధి ఆ కుటుంబంపై విషం చిమ్మింది. అన్యోన్య దాంపత్యంపై మృత్యు సంతకం చేసింది. నూరేళ్ల బంధాన్ని చిదిమేసింది. పండుగ ప్రయాణాన్ని.. విషాదంగా మార్చింది. భార్యభర్తలిద్దరినీ మృత్యువు కబళించింది. విదేశాల నుంచి వచ్చిన అమ్మానాన్నల మురిపెం తీరకుండానే.. ఒక చిన్నారిని అనాథను చేసింది. ఈ హృదయ విదారక ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడు సమీపంలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామానికి చెందిన జొన్నలగడ్డ రమేష్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. వృత్తిరీత్యా భార్య నీలిమతో కలిసి సింగపూర్‌లో ఉంటున్నాడు. కుమార్తె అశ్విత (15) చెన్నైలో హాస్టల్లో ఉంటూ పదోతరగతి చదువుకుంటోంది. రమేష్‌కు చెన్నై బదిలీ అవడంతో ఎనిమిది రోజుల కిందట భార్యాభర్తలిద్దరూ చెన్నైలోని సొంతింటికి చేరుకున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో రమేష్, నీలిమ దంపతులు కుమార్తె అశ్వితతో సహా బుధవారం కారులో చెన్నై నుంచి కొవ్వూరుకు బయలుదేరారు. మార్గంమధ్యలో 16వ నంబరు జాతీయ రహదారిపై చినకోండ్రుపాడు సమీపాన వీరి వాహనం ముందు వెళుతున్న గుర్తుతెలియని వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమేష్ అక్కడిక్కడే మృతిచెందాడు. నుజ్జునుజ్జయిన కారులోంచి అతికష్టం మీద నీలిమ, అశ్వితలను స్థానికులు, పోలీసులు బయటకుతీసి 108 అంబులెన్సులో సమీపంలోని కాటూరి వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నీలిమ మృతిచెందింది. అశ్విత అపస్మారకస్థితిలోకి వెళ్లిందని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ప్రమాదస్థలాన్ని ఎస్సై అశోక్ పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఐ మిస్ యూ అమ్మా
ప్రత్తిపాడు: ‘నేను జాబ్ చేసి నిన్ను బాగా చూసుకుందాం అనుకున్నా. నన్ను క్షమించు. ఐ మిస్ యూ అమ్మా’ అంటూ తల్లికి లేఖ రాసి ఓ విద్యార్థి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం గోగులమూడిలో విషాదం నింపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోగులమూడికి చెందిన చౌటూరి శైలజ టైలరింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కుటుంబ విభేదాల నేపథ్యంలో ఆమె భర్త హైదరాబాద్‌లో విడిగా ఉంటున్నాడు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు చౌటూరి మహేష్ (17) స్థానిక అబ్బినేనిగుంటపాలెంలోని సెయింట్ ఇగ్నేషియస్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో 9వ తరగతి చదువుతూ.. అక్కడే హాస్టల్లో ఉంటున్నాడు. గురువారం రాత్రి ఏదో పని ఉందని బయటికి వెళ్లాడు. ఏబీ పాలెం అడ్డరోడ్డు నుంచి పెదగొట్టిపాడుకు వెళ్లే దారిలో ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు పంచాయతీ పరిధిలోని కావూరి చెరువులో చెట్టుకు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఆత్మహత్య కాదు.. హత్యే.. విద్యార్థి తల్లి చౌటూరి శైలజ మాత్రం తన కొడుకుది ఆత్మహత్య కాదని, హత్యేనని పోలీసుల ఎదుట అనుమానం వ్యక్తం చేసింది. స్కూల్ యాజమాన్యంపైనా అనుమానం ఉందని పేర్కొంది. విద్యార్థి మహేష్‌ది హత్యేనని ఆరోపిస్తూ.. అతడి కుటుంబ సభ్యులు, బంధువులు, యానాది సంఘ నాయకులు రావిపాడు అడ్డరోడ్డు వద్ద శుక్రవారం రాస్తారోకో చేశారు. మహేష్ రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్ వాస్తవం కాదని, అందులో సంతకం బదులు వేలిముద్ర ఎందుకు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. విద్యార్థి జేబులో సూసైడ్ నోట్.. మృతుడు మహేష్ వద్ద సూసైడ్ నోట్ లభించింది. ‘అమ్మ, తాత, మామయ్యా.. నేను తప్పు చేయలేదు. స్కూల్లో నేను తప్పు చేసినట్లు మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయికి నా వల్ల చెడ్డ పేరు వచ్చింది. నేను తనను ప్రేమించాను. నలుగురైదుగురు పిల్లలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా వెళ్లి హిందీ టీచర్‌కు చెప్పారు. ఆ టీచర్ మా ఇద్దరినీ అడగకుండా వెళ్లి మా క్లాస్ టీచర్‌కి చెప్పారు. మా క్లాస్ టీచర్ ఏ విషయం తెలుసుకోకుండా నన్ను కొట్టారు. నేను చనిపోయినట్లుగా అమ్మకి, నేను ప్రేమించిన ఆ అమ్మాయికి తెలియనివ్వద్దు. ఇదే నా ఆఖరి కోరిక అని అందులో రాసి ఉంది. ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
జనసేన కార్యాలయం ఖాళీ..
సాక్షి, ప్రత్తిపాడు: గుంటూరు నగర శివారులోని గోరంట్ల ఇన్నర్ రింగ్ రోడ్డులో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయం ఖాళీ అయింది. పార్టీ లోగోలు, పార్టీ అధినేత చిత్రాలను తొలగించకుండానే యజమానికి కార్యాలయ భవనాన్ని తిరిగి అప్పగించారు. భవన యజమాని టూలెట్ బోర్డు ఏర్పాటు చేశాడు. బార్ అండ్ రెస్టారెంట్‌కు అద్దెకు ఇస్తానని అందులో పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది మార్చిలో ఈ కార్యాలయాన్ని జనసేన పార్టీ నేతలు ప్రారంభించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ముందు రావెల కిషోర్‌బాబు టీడీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. అయితే ఎన్నికల్లో జనసేన పరాజయంతో రావెల కిషోర్ బాబు పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన సంగతి విదితమే. దీంతో పార్టీ కార్యాలయం కూడా ఖాళీ అయింది. అలాగే ఏపీలో పలు నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ కార్యాలయాలకు టూలెట్ బోర్డులు దర్శనం ఇచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం పలువురు జనసేన నాయకులు పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలు మూతపడ్డాయి. -
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్
సాక్షి, తూర్పుగోదావరి(ప్రత్తిపాడు) : అన్నవరం దేవస్థానంలో పనిచేసే ఉద్యోగి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. ఏసీబీ రాజమండ్రి డీఎస్పీ రామచంద్రరావు కథనం ప్రకారం.. ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి గ్రామానికి చెందిన సివిల్ కాంట్రాక్టర్ గాది వరప్రసాద్ 2016లో రూ.9.5 లక్షల వ్యయంతో అన్నవరం రైల్వేస్టేషన్‌కు ఎదురుగా గల దేవస్థానం పొలంలో రేకుల షెడ్డు నిర్మాణ కాంట్రాక్ట్‌ను టెండర్ ద్వారా పొందాడు. పని పూర్తయ్యాక అతడికి కాంట్రాక్ట్ తాలుకు బిల్లులు చెల్లించారు. నిబంధనల ప్రకారం ఈఎండీ మొత్తం రూ.40,646 దేవస్థానం వద్ద డిపాజిట్లో ఉంచారు. ఈ మొత్తాన్ని కాంట్రాక్ట్ పూర్తయిన రెండేళ్ల తరువాత తిరిగి చెల్లించాల్సి ఉంది. దీంతో కాంట్రాక్టర్ గాది వరప్రసాద్ నాలుగు నెలలుగా ఈఎండీ మొత్తాన్ని ఇవ్వమని ఇంజినీరింగ్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈనెల 19న ఇదే పనిపై ఇంజినీరింగ్ విభాగంలోని సీనియర్ అసిస్టెంట్ చిక్కాల సాయిబాబాను కలిశాడు. రూ.ఐదు వేలు ఇస్తే తప్ప డిపాజిట్ రిఫండ్ ఇవ్వడం కుదరదని సాయిబాబా చెప్పడంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. లంచం అడిగినట్టుగా సాయిబాబా వాయిస్ రికార్డు కూడా కాంట్రాక్టర్ సమర్పించడంతో దానిని పరిశీలించి సాయిబాబాపై నిఘా ఉంచామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. గురువారం ఉదయం కాంట్రాక్టర్ వరప్రసాద్ సాయిబాబాకు కెమికల్ పూసిన రూ.500 నోట్లు ఇవ్వగా, తాము దాడి చేసి పట్టుకున్నామన్నారు. లంచం స్వీకరించిన నిందితుడు సాయిబాబాను అరెస్ట్ చేసి రాజమండ్రి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం ఇవ్వమని డిమాండ్ చేస్తే సెల్:9440446160కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. ఏసీబీ సర్కిల్ ఇన్స్పెక్టర్లు తిలక్, మోహన్‌రావు, పుల్లారావు, ఎస్సై నరేష్, కానిస్టేబుళ్లు ఈ దాడి లో పాల్గొన్నారు. విసిగి ఫిర్యాదు చేశా: కాంట్రాక్టర్ గాదె వరప్రసాద్ నిరుద్యోగంతో వేగలేక చిన్నచిన్న కాంట్రాక్టులు చేసుకుని జీవిస్తున్న తనను అన్నవరం దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులు ఈఎండీ ఇవ్వకుండా వేధించారని కాంట్రాక్టర్ గాదె వరప్రసాద్ విలేకర్లకు తెలిపారు. తాను ఈఎండీ సొమ్ము ఇవ్వమని ఇంజినీరింగ్ ఆఫీసు చుట్టూ ఆరు నెలలుగా తిరుగుతున్నానని తెలిపారు. ఇంతకు ముందు గుమస్తా కూడా ఈఎండీ ఇవ్వాలంటే కొంచం ఖర్చువుద్ది అని చెప్పాడని తెలిపారు. దాంతో మూడు నెలలు ఆగి మరలా వస్తే ఇప్పుడున్న గుమస్తా చిక్కాల సాయిబాబా కూడా రూ.ఐదు వేలు లంచం ఇవ్వనిదే పని జరగదని చెప్పాడని తెలిపారు. దాంతో ఏసీబీ ని ఆశ్రయించినట్టు తెలిపారు. దేవస్థానంలో కాంట్రాక్ట్ చేసినట్టుగా ‘ఎక్స్పీరియన్స్’ సర్టిఫికెట్ ఇవ్వమని 2018లో ఇంజినీరింగ్ అధికారులను, అప్పటి ఈఓను అడిగినా ఇవ్వలేదని తెలిపారు. అదే విధంగా ఇంజినీరింగ్ కార్యాలయం సమీపంలో నిలిపి ఉంచిన తన మోటార్ సైకిల్ చోరీ జరిగిందని దీనిపై దేవస్థానం అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని కాంట్రాక్టర్ వరప్రసాద్ వాపోయారు. దీంతో విసిగి వేసారి సిబ్బందిలో కొంతైనా మార్పు వస్తుందనే ఇలా చేశానని తెలిపారు. -
తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు!
సాక్షి, గుంటూరు/ కాకినాడ : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో పలుచోట్ల వర్షం కురుస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, తుని, ప్రత్తిపాడు, పెద్దాపురం, పిఠాపురంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, గుంటూరు జిల్లాలోని వేమూరు, పొన్నూరులో భారీ వర్షం కురవడంతో రోడ్లు జలమయం అయ్యాయి. -
బాబు మోసపూరిత హామీలను నమ్మొద్దు: విజయమ్మ
సాక్షి, ప్రత్తిపాడు (తూర్పు గోదావరి) : ఈ ఎన్నికలు న్యాయానికి, అన్యాయానికి, ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధమని, ఈసారి తప్పకుండా విలువలకు, విశ్వసనీయతకు పట్టం కట్టాలని, మాట మీద నిలబడే వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రజలను కోరారు. మీ భవిష్యత్తు.. నాదేనని చంద్రబాబు ఎన్నికల సమయంలో అంటున్నారని, మోసపూరిత హామీలు ఇస్తున్న చంద్రబాబును నమ్మొద్దు అని ప్రజలను అభ్యర్థించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో వైఎస్ విజయమ్మ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి.. ప్రత్తిపాడు వైఎస్సార్సీపీ అభ్యర్థి పర్వత పూర్ణచంద్రరావును భారీ మెజారిటీతో గెలిపించాలని, వైఎస్సార్ సంక్షేమ పాలన మళ్లీ కావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరముందని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో జరిగిన మోసాలు, దారుణాలు వివరించారు. పసుపు-కుంకుమ పేరిట పోస్టు డేటెడ్ చెక్కులు ఇచ్చి చంద్రబాబు మహిళలను మోసం చేస్తున్నారని, ఆయనను నమ్మవద్దని మహిళలను కోరారు. చంద్రబాబు డ్వాక్రా మహిళలను అప్పులపాలు చేశారని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి.. కనీసం ఐదేళ్లుగా మహిళల రుణాలకు సంబంధించిన వడ్డీలు కూడా కట్టలేదని, దీంతో మహిళలు మరింత అప్పులపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు మీ భవిష్యత్.. నా భద్రత అంటున్నారని, ఎన్నికల సమయంలో అన్న అంటూ ముందుకొస్తున్న ఆయనను నమ్మాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో రైతులను నిండాముంచారని, రుణమాఫీ చేస్తానని నమ్మించి మోసం చేశారని, దీంతో ఇప్పుడు రైతులకు బ్యాంకులు రుణాలిచ్చే పరిస్థితి లేదని అన్నారు. రాష్ట్రంలో సాగునీరు, తాగునీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. నదులల్లో ఇసుకను కూడా టీడీపీ నేతలు అమ్ముకుంటున్నారన్నారని తెలిపారు. ప్రతి పల్లెలో మద్యం ఏరులై పారుతోందన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిగా నీరుగార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ హయాంలో పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు వంటి ఉన్నత చదవులు చదివారని, కానీ, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం సక్రమంగా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని అన్నారు. నిరుద్యోగు భృతి ఇస్తానని నిరుద్యోగులను సైతం చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. వైఎస్సార్ కలలు కన్న పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఇప్పటికీ పూర్తి చేయలేదని, రాజశేఖర్‌రెడ్డి ఉంటే ఎప్పుడో పోలవరం పూర్తయి ఉండేదని అన్నారు. కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టు అంచనాలను అమాంతం పెంచి.. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. వ్యవసాయాన్ని వైఎస్సార్ పండుగ చేశారు విజయమ్మ మాట్లాడుతూ.. దివంగత మహానేత, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనను గుర్తుచేసుకోవాలని ప్రజలను కోరారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా వైఎస్సార్ పరిపాలించారని, ఆయన హయాంలో వ్యవసాయాన్ని పండుగ చేశారని గుర్తుచేశారు. లక్ష ఎకరాలకు వైఎస్సార్ సాగునీరు అందించారని తెలిపారు. ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని వైఎస్సార్ అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. అర్హులైన వారందరికీ వైఎస్సార్ పింఛన్ అందజేశారని, ఆరోగ్య శ్రీతో చిన్నపిల్లల గుండెలకు భరోసానిచ్చారని తెలిపారు. కులాలు, మతాలకు అతీతంగా వైఎస్సార్ సంక్షేమ ఫలాలను ప్రజలందరికీ అందజేశారని, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాలని తపనపడిన నేత ఆయన అని అన్నారు. ఇచ్చిన మాట కోసం.. వైఎస్సార్ మరణం తర్వాత ఇచ్చిన మాట కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పు యాత్ర చేపట్టారని, కానీ ఆయన చేపట్టిన ఓదార్పు యాత్ర కాంగ్రెస్ వాళ్లకు నచ్చలేదని అన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు రావడంతో వైఎస్ జగన్‌పై కేసులు పెట్టి బెదిరించారని, వేధించారని గుర్తు చేశారు. ప్రజలే తన కుటుంబంగా వైఎస్ జగన్ భావించారని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని ఆయన ప్రతిస్పందించారని, గత 9 ఏళ్లుగా ఆయన ప్రజల మధ్యలోనే ఉన్నారని అన్నారు. సుదీర్ఘమైన పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు వైఎస్ జగన్ తెలుసుకున్నారని తెలిపారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే.. పేదవాడి చదువుకు అయ్యే ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. పూర్తి ఫీజురీయింబర్స్మెంటుతోపాటు వసతి, భోజనం కోసం విద్యార్థులకు ఏటా రూ. 20 వేలు ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. ప్రతి గ్రామంలో గ్రామసచివాలయం ద్వారా పదిమందికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. డ్వాక్రా మహిళల రుణాలను నాలుగు విడతలుగా తీరుస్తామని, మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్య శ్రీ ఖర్చు ఎంతైనా ప్రభుత్వమే భరిస్తుందని, రూ. వేయి దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తామని తెలిపారు. వైఎస్సార్ చేయూత కింద రూ. 75 వేలు అందిస్తామన్నారు. -
ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల ఫీజులు తగ్గిస్తాం
చంద్రబాబు అన్యాయం చేసినా, అబద్ధాలు ఆడినా, మోసం చేసినా వీళ్లెవ్వరికీ (ఎల్లో మీడియాకు) కనిపించదు. చంద్రబాబును భుజాన మోస్తున్న ఎల్లో మీడియా ఏమంటుందో తెలుసా? ఆహా ఆయన ఇంద్రుడు, చంద్రుడు.. చంద్రబాబు చేస్తోంది దేశమంతా చూస్తోంది.. రైతులు సంతోషంగా కేరింతలు కొడుతున్నారు.. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు ఆనందంతో ఊర్రూతలూగుతున్నారు.. అనే మాటలు వినిపిస్తుంటాయి ఆ టీవీల్లో, ప్రకటనల్లో, పేపర్లలో. పిల్లలకు ఉద్యోగాలు వచ్చి, జీతాలు ఎక్కువై వాటిని ఎలా ఖర్చు పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారంటూ వార్తలు రాస్తారు, టీవీల్లో చూపిస్తారు. ఇవాళ ఈ రాష్ట్రంలో వ్యవసాయం లేదు. సాగు నీరు లేదు. విత్తనాలు దొరకవు. కరవుతో ప్రజలు అల్లాడుతున్నా కూడా ఏమి చేయాలన్నదానిపై క్యాబినెట్ కనీసం చర్చించదు. ఇంత దారుణంగా పాలన సాగుతోంది. – వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేయకుండా కట్టడి చేస్తానని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. చంద్రబాబు బినామీ సంస్థలైన నారాయణ, చైతన్య విద్యా సంస్థల్లో దోపిడీ పర్వం సాగుతోందని, మధ్యతరగతి వర్గాల వారు ఆస్తులమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. మనందరి ప్రభుత్వం రాగానే ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజులు నియంత్రిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ స్కూళ్లను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆదివారం 229వ రోజు తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడిలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఇచ్చిన హామీలకు కూడా దిక్కులేకుండా పోయిందని విమర్శించారు. కౌలు రైతులు చల్లగా ఉండేలా రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా కౌల్దారీ చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సభలో జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. ఇష్టమొచ్చినట్లు ఫీజుల వసూలు.. ఇవాళ పిల్లలను ఓ మాదిరి బడికి పంపించాలటే ఏడాదికి రూ.40 వేలు ఖర్చవుతోంది. ఈ ఫీజుకు అదనంగా ఏటా ఈ స్కూళ్లు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు పెంచుకునేందుకు ఈ పెద్దమనిషి (చంద్రబాబు) దగ్గరుండి వెసులుబాటు కల్పిస్తున్నాడు. ఇంటర్మీడియట్‌కు ఏడాదికి రూ.65 వేలు వసూలు చేస్తున్నారు. చంద్రబాబు బినామీ స్కూళ్లు, కాలేజీలైన.. నారాయణ, చైతన్యలకు మేలు చేయడానికి పడరాని పాట్లు పడుతున్నారు. నారాయణ కాలేజీల్లో ఏడాది ఫీజు అక్షరాలా రూ.1.60 లక్షలు. హాస్టల్ ఫీజులతో కలిపి సంవత్సరానికి రూ.3 లక్షలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లను నడపాల్సిన పెద్దమనిషి దగ్గరుండి రేషనలైజేషన్ పేరుతో స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లను మూసేయిస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ స్కూళ్లకు వెళుతున్న పిల్లలకు ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన పుస్తకాలు ఆగస్టు వచ్చినా ఇవ్వలేదు. పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు. పుస్తకాలు, యూనిఫాం సమయానికి ఇవ్వరు. ఖాళీగా ఉన్న 20 వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయరు. దగ్గరుండి ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు స్కూళ్లకు వెళ్లేలా ఈ పెద్దమనిషి చేస్తున్నాడు. తల్లిదండ్రులకు నేను ఒక్కటే చెబుతున్నా. ప్రభుత్వ స్కూళ్లకు పూర్వ వైభవం తీసుకొస్తాం. మూత పడిన స్కూళ్లను తెరిపిస్తాం. అక్కడ అవసరమైన టీచర్లను నియమిస్తాం. ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు చేస్తాం. ఒక వైపున ప్రభుత్వ స్కూళ్లను ప్రక్షాళన చేస్తూ మరో వైపున ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు ఇష్టమొచ్చినట్లు వసూలు చేసే ఫీజులను నియంత్రిస్తాం. రైతుల పరిస్థితి దారుణం చంద్రబాబు నాలుగేళ్ల పాలన ఎలా ఉందో ఒకసారి చూడండి. మరో 6 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే వాటి నుంచి పక్కదోవ పట్టించేలా రోజూ ‘ఈనాడు’ పేపర్లో ఐటమ్స్ కనిపిస్తాయి. చంద్రబాబు చేసే ప్రకటనలు, ఎల్లో మీడియా ఆరాటం అంతా సమస్యల నుంచి ప్రజలను పక్కదోవపట్టించడమే. ప్రజలను సాక్షాత్తు ముఖ్యమంత్రే దగ్గరుండి మోసం చేసిన తర్వాత.. ఎన్నికలు ఆరు నెలల్లో ఉన్నాయనగా.. ఎదుటి వాడి మీద నేరాన్ని నెట్టివేసి నేరం చేసిన వాడే మోసగాడు, మోసగాడు అని అరిచినట్టుగా ఉంది చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలుకుతున్న మీడియా తీరు. ఖరీఫ్ ప్రారంభమైన జూన్ ఒకటి నుంచి ఆగస్టు ఒకటి వరకు చూస్తే రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పదింట లోటు వర్షపాతం కనిపిస్తోంది. ఆ పది జిల్లాలలో కరవు ఛాయలు కనిపిస్తాయి. మూడు జిల్లాలు తప్ప మిగతా జిల్లాల్లో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. కృష్ణా డెల్టాలో 13 వేల క్యూసెక్కుల నీరు ఇవ్వాల్సి ఉంటే 6 వేల క్యూసెక్కులు ఇస్తున్నారు. అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోదు. క్యాబినెట్ చర్చించదు. ఇంతటి అధ్వానపు పాలన చూస్తున్నాం. నివాళ రైతులకు వడ్డీ లేని రుణాలు కరవయ్యాయి. పండిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. నిన్ననే చూశాం మనమంతా.. అరటి, నిమ్మ రైతులు పడుతున్న అగచాట్లను పేపర్లలో చూశాం. టన్ను అరటి రూ.16 వేలు ఉండాల్సి ఉంటే రూ.2 వేలు కూడా రాని దుస్థితి. దీంతో రైతులు అరటి గెలలు చెట్ల మీదనే కుళ్లిపోతున్నా అలాగే వదిలేస్తున్నారు. నిమ్మకాయలు కిలో రూ.70కి కొనాల్సి ఉంటే రూ.4కు కూడా కొనే దిక్కులేక రోడ్ల మీద పారబోయాల్సిన పరిస్థితి. రుణ మాఫీ లేదు, పావలా వడ్డీ లేదు, వడ్డీ లేని రుణాలు లేవు. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయం. ఇదే జిల్లాలోని గొల్లప్రోలు ప్రాంతంలో ఏడుగురు కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకున్న పాపాన పోలేదు. వీరిలో ముగ్గురు రైతు కుటుంబాల సభ్యులు నన్ను కలిశారు. వారిలో ఒక అక్క నాతో.. అన్నా, అకాల వర్షాలకు పంట దెబ్బతిని కౌలు తీర్చలేక నా భర్త ఆత్మహత్య చేసుకుంటే ఈ ప్రభుత్వం వారు కనీసం పలకరించలేదన్నా అని చెప్పింది. నిజంగా ఇంతకన్నా దారుణమైన పాలన ఎక్కడైనా ఉంటుందా? అందుకే నేను ప్రతి కౌలు రైతుకూ హామీ ఇస్తున్నా.. ఇవాళ రైతు చల్లగా ఉండాలి అంటే కౌలు రైతు కూడా క్షేమంగా ఉండాలి. అందుకే రేపు మనందరి ప్రభుత్వం రాగానే పూర్తిగా కౌల్దారి చట్టాన్ని ప్రక్షాళన చేస్తా. రైతులకు నష్టం జరక్కుండా కౌల్దార్లకు గొప్ప మేలు జరిగేలా చట్టాన్ని తీసుకువస్తాం. గుర్తింపు కార్డులు ఇస్తాం. కౌలు రైతులకు బ్యాంకుల్లో వడ్డీ లేకుండా రుణాలు వచ్చేలా చేస్తాం. అన్ని రకాలుగా తోడుగా ఉండేలా చూస్తాం. పోలవరం ఎప్పటికి పూర్తవుతుందంటే సమాధానం చెప్పలేరు.. పోలవరం ప్రాజెక్టును అవినీతి మయం చేసిన ఘనత చంద్రబాబుది. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి వరం లాంటింది. యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును లంచాల ప్రాజెక్టుగా మార్చారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. రేట్లు పెంచి నామినేషన్ పద్ధతిన సబ్ కాంట్రాక్టర్లను నియమించుకుంటున్నారన్నా అని రైతులు చెబుతున్నారు. ఇలా సబ్ కాంట్రాక్టర్‌గా ఉన్న వారిలో ఈ జిల్లాకే చెందిన మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడు కూడా ఉన్నారన్నా అని ఇక్కడి వారు చెబుతున్నారు. ఇలాగైతే ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందని ఇక్కడి ప్రజలు అడుగుతుంటే జవాబు చెప్పలేని స్థితిలో చంద్రబాబు ఉన్నాడు. ఏలేశ్వరం తిమ్మరాజు చెరువు కింద 6 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేదు. శంఖవరంలో బాపన్నచెరువుదీ ఇదే పరిస్థితన్నా.. ఎవ్వరూ పట్టించుకునే నాధుడు లేడన్నా అని రైతులు చెబుతున్నారు. చంద్రబాబు తాను బతికుండగానే కట్టుచింతల ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టుకున్నాడన్నా.. ఈ ప్రాజెక్టు కింద 5 వేల ఎకరాల ఆయకట్టు ఉందన్నా, అయినా ఈవాళ్టికీ ఈ చెరువు కింద కాల్వలు పూర్తి కాలేదన్నా అని రైతులు వాపోతున్నారు. ఇక్కడి ఏలేరు నీరు విశాఖలోని పారిశ్రామిక అవసరాలకు వెళుతోందన్నా.. అదే పోలవరం ప్రాజెక్టు పూర్తయితే విశాఖపట్నానికి ఆ ప్రాజెక్టు నీళ్లుపోయి ఉండేవి.. మేము ఏలేరు నీళ్లను వినియోగించుకుని ఉండేవాళ్లమన్నా అని రైతులు చెబుతున్నారు. ఏలేరు ప్రాజెక్టు కింద 67 వేల ఎకరాల ఆయకట్టు ఉంటే నేటికీ 50 వేల ఎకరాలకు నీరు అందని దుస్థితిలో ఉంటే చంద్రబాబు పాలన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నా అంటున్నారు. చంద్రబాబును నిలదీయండి ఎన్నికలకు ముందు.. పొదుపు సంఘాల రుణాలు మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. ఎన్నికలకు ముందు పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు రూ.14,200 కోట్లు ఉన్నాయి. ఇవాళ వాటిపై వడ్డీ మీద వడ్డీ పడి రూ.20,600 కొట్లకు చేరడంతో దిక్కుతోచని స్థితిలో అక్కచెల్లెమ్మలు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రత్యేక హోదా లేదు. పిల్లలకు ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ భృతి అంతకన్నా లేదు. ఆ రోజు ఈ పెద్దమనిషి ప్రతి ఇంటికి ఉపాధి లేదా ఉద్యోగం ఇస్తానన్నాడు. ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి నెల నెలా ఇస్తానన్నాడు. ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయని మళ్లీ ప్రజలు గుర్తుకు వస్తారు. రాష్ట్రంలో కోటి డెబ్బైయి లక్షల ఇళ్లుంటే ప్రతి ఇంటికి రూ.రెండు వేలు భృతి ఇవ్వాల్సి ఉండగా కేవలం పది లక్షల మందికే ఇస్తారట. అది కూడా కేవలం రూ.వెయ్యేనట. అదీ నాలుగు నెలలేనట. ఎప్పుడైనా ఈ పెద్దమనిషి కనిపిస్తే ఇంటికి రూ.2 వేలు చొప్పున 50 నెలలకు రూ.లక్ష బాకీ పడ్డావని నిలదీయండి. నాలుగేళ్లుగా ఇసుక, మట్టి, బొగ్గు, కరెంటు కొనుగోళ్లు, మద్యం, రాజధాని భూములు, విశాఖపట్నం భూములు, చివరకు గుడి ఆస్తులు కూడా వదలకుండా దోచేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. తాగేందుకు గ్రామాల్లో మంచినీరు దొరకదు కానీ వీధి వీధినా మందుషాపులు కనిపిస్తున్నాయి. కరెంటు చార్జీలు, పెట్రోలు, డీజిల్ రేట్లు, ఆర్టీసీ చార్జీలు, ఇంటి పన్నులు, స్కూలు, కాలేజీ ఫీజులు బాదుడే బాదు డు. యానాంలో ఒక లీటర్ పెట్రోల్, డీజిల్ కొట్టిస్తే అక్షరాలా రూ.7 నుంచి 8 తేడా కనిపిస్తుంది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ బతికే ఉందా? నిన్న చేబ్రోలు గ్రామంలో 20 మందికిపైగా నా వద్దకు వచ్చారు. ఆరోగ్యశ్రీ పనిచేయకపోవడంతో అవస్థలు పడుతున్నామని చెప్పారు. మెదడులో గడ్డ ఉందని, హైదరాబాద్ వెళ్లాలని డాక్టర్లు చెప్పారంటూ సాయి శ్రీనివాస్ చెప్పాడు. బోన్ క్యాన్సర్ చికిత్సకు చెన్నై వెళ్లాలని చెబితే ఆరోగ్యశ్రీ వర్తించడంలేదని పున్నారావు చెప్పుకొచ్చాడు. తొడలో ఎముకకు ఆపరేషన్ చేయించుకునేందుకు ఆరోగ్యశ్రీ వర్తించడం లేదని చంద్రం అనే మహిళ చెప్పింది. పక్షవాతం వచ్చింది, నెల నెలా మందులు కావాలంటూ డబ్బుల్లేని పరిస్థితిలో మరో వ్యక్తి నా వద్దకు వచ్చి ఆరోగ్యశ్రీ గురించి చెప్పాడు. అసలు ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ బతికే ఉందా.. అని ఈ పెద్దమనిషిని అడుగుతున్నాను. పేద వాడికి ఉచితంగా ఆపరేషన్లు చేయించి చిరునవ్వుతో ఇంటికి పంపించాల్సిన 108 అంబులెన్స్‌లకు ఫోన్ చేస్తే వస్తుందన్న నమ్మకం లేదు. ఇవాళ రేషన్‌షాపుకు పోతే బియ్యం తప్ప మరేమీ ఇవ్వడంలేదు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వరు. పింఛన్, రేషన్‌కార్డు, మరుగుదొడ్లు.. ఏది కావాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి చూస్తున్నాం. గ్రామాల్లో జన్మభూమి కమిటీల మాఫియా కనిపిస్తోంది’’ అని వైఎస్ జగన్ అన్నారు. పత్రికల్లోనే డీఎస్సీ.. ఈ పెద్దమనిషి పాలనలో టీచర్ ఉద్యోగాల భర్తీ జరగదు. కానీ అదిగో డీఎస్సీ, ఇదిగో డీఎస్సీ అంటూ రోజూ పేపర్లలో చూస్తున్నాం. అదిగో పరీక్ష అంటారు. కానీ పరీక్షలు జరగవు. డీఎస్సీ కోచింగ్ కోసం మన పిల్లలు రూ.14 వేలు కడుతున్నారు. ఓ పక్క కోచింగ్ సెంటర్లకు డబ్బులిస్తున్నాం. మరోవైపు డీఎస్సీ జరగదు. దాని కోసం పిల్లలు చదువుతూ...నే ఉంటారు. పేద వాడు పేదరికం నుంచి బయటకు రావాలంటే ఆ ఇంట్లో నుంచి ఒక్కరైనా ఇంజినీరింగ్, డాక్టర్, కలెక్టర్ వంటి చదువులు చదవాలని అప్పట్లో నాన్నగారు ఎవ్వరూ చేయని విధంగా దగ్గరుండి చదివించిన పాలన చూశాం. ఇప్పుడు కాలేజీ ఫీజులు దగ్గరుండి ఈ పెద్దమనిషే పెంచే కార్యక్రమం చేశారు. ఇంజినీరింగ్ ఫీజు ఏటా లక్ష రూపాయలకు ఏగబాకింది. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పిల్లలకు ముష్టేసినట్లు రూ.30 వేలు, రూ.35 వేలు ఇస్తున్నారు. ఏడాదికి రూ.70 వేల చొప్పున ఇంజినీరింగ్ నాలుగేళ్లకు ఆ పిల్లాడి తల్లిదండ్రులు దాదాపు రూ.3 లక్షలు అప్పులు చేయడమో, ఆస్తులు, బంగారం అమ్మడమో చేయాల్సిన పరిస్థితి. లాట్రైట్ పేరు చెప్పి బాక్సైట్ అమ్మకాలు ఈ ప్రాంతంలో చంద్రబాబు ప్రభుత్వ అవినీతి గురించి కథలు, కథలుగా చెప్పుకుంటున్నారన్నా అంటూ.. మా పక్కనే అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం ఉందన్నా.. ఇందులో పారిశుద్ధ్య పనుల కాంట్రాక్ట్‌ను భాస్కర నాయుడు అనే వ్యక్తికి ఇచ్చారన్నా.. ఆయన సాక్షాత్తు చంద్రబాబు బంధువన్నా.. అని ఇక్కడి ప్రజలు చెప్పారు. గతంలో రూ.7 లక్షలుండే కాంట్రాక్ట్‌ను రూ.32 లక్షలకు పెంచి కట్టబెట్టారన్నా అని చెప్పారు. ఇదొక్కటే కాదు రాష్ట్రంలోని చాలా దేవాలయాల్లో కూడా ఇలానే నాలుగైదు రెట్లు ధరలు పెంచి ఇదే కాంట్రాక్టర్‌కు కట్టబెట్టారన్నా అని చెబుతున్నారు. దేవుడి దగ్గర కూడా దోచుకోవాలనే ఆలోచన చేస్తున్న ఈ వ్యక్తిని ఏమనాలి? ఇదే నియోజకవర్గంలో లాటరైట్ మైనింగ్ జరుగుతోంది. అటవీ భూములు 50 ఎకరాలను ఆక్రమించి, లాటరైట్ పేరు చెప్పి బాక్సైట్ అమ్ముతున్నారు. జిల్లాలో తెలుగుదేశం నాయకుల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల మొదలు చినబాబు, పెద్దబాబు వరకు లంచాలు పోతున్నాయి. ఈ నియోజకవర్గంలో మరుగుదొడ్లను కూడా వదిలి పెట్టడం లేదని ప్రజలు అంటున్నారు. రౌతులపూడిలో మరుగుదొడ్ల పేరుతో కోటి రూపాయలకు పైగా ఇక్కడి నాయకుడు దోచుకున్నారని స్థానికులు చెప్పారు. నీరు–చెట్టు కింద రామభద్రాపురం చెరువులో మట్టిని తవ్వేసి కోట్ల రూపాయలు దోచుకున్నారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. గతంలో వైఎస్సార్ హయాంలో ఈ నియోజకవర్గంలో 10 వేల ఇళ్లు కట్టిస్తే, చంద్రబాబు హయాంలో ఊరికి 10 ఇళ్లు కూడా కట్టించ లేదన్నా ఈ దిక్కుమాలిన ప్రభుత్వం అని స్థానికులు చెబుతుంటే ఆశ్చర్యం వేస్తోంది. ఇదే ప్రత్తిపాడులో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తానంటూ ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చిన హామీకీ దిక్కులేకుండా పోయింది. అప్పట్లో ఆ దివంగత నేత శంఖవరంలో రెసిడెన్షియల్ పాఠశాలను పెట్టి ఆ తర్వాత దాన్ని జూనియర్ కళాశాలగా మార్చారు. నాన్నగారి హయాంలోనే ఏలేశ్వరంలో డిగ్రీ కాలేజీని మంజూరు చేస్తే, నేటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి. కత్తిపూడిలో కొంతమంది అక్కాచెల్లెమ్మలు కలిసి మురికినీళ్లు తాగుతున్నామంటూ ఓ నీళ్ల బాటిల్‌ను నాచేతికి ఇచ్చారు. మేము తాగే నీళ్లు ఇవన్నా... ఈ దుస్థితిని మీరు చంద్రబాబుకు అర్థమయ్యేలా చెప్పండన్నా అని కోరారు. అయ్యా చంద్రబాబు గారూ.. ఈసీసాలో ఉన్నది (మురికి నీటి బాటిల్ చూపుతూ) చెరకు రసం కాదు.. తాగే నీళ్లు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేని మీరు ముఖ్యమంత్రిగా ఉండడం ఎందుకయ్యా.. అని ఇక్కడి ప్రజలు అడుగుతున్నారు. డబ్బా నీళ్లను రూ.12 పెట్టి కొనుక్కోలేక అవస్థలు పడుతున్నామని ఇక్కడి అక్కచెల్లెమ్మలు చెబుతున్నారు. ఇదే పత్తిపాడు నియోజకవర్గంలో పక్కనే 30 పడకల కమ్యూనిటీ ఆస్పత్రి కనిపిస్తోంది. ఆరుగురు డాక్టర్లు ఉండాల్సి ఉంటే నలుగురే ఉన్నారు. అతి ముఖ్యమైన చిన్నపిల్లల డాక్టర్ లేరు. అంటే డాక్టర్లను లేకుండా చేసి ప్రైవేట్ ఆస్పత్రుల వైపు ప్రజలు వెళ్లేలా చేస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిది. ఇక్కడ నాలుగు మండలాలకు కలిపి రెండే రెండు 108 అంబులెన్సులు ఉంటే వాటిల్లో ఒకటి రిపేర్‌లో ఉందట. ఇలాంటి నాయకుడు అవసరమా? ఇన్ని మోసాలు, అన్యాయాలు చేసిన ఇలాంటి నాయకుడిని మీరు నమ్ముతారా? మీరు నమ్మరని.. ఇంటింటికీ కేజీ బంగారం, బోనస్‌గా బెంజ్ కారు ఇస్తానంటారు. ఇవీ నమ్మరని ప్రతి ఇంటికి మహిళా సాధికారమిత్రలను పంపించి ఒక్కొక్కరి చేతిలో రూ.3 వేలు పెడతారు. వద్దనకండి. రూ.5 వేలు కావాలని గుంజండి. అది మన డబ్బే. మన జేబుల్లోంచి దోచేసుకున్నదే. కానీ మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయండి. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత తీసుకురావడమన్నది జగన్ ఒక్కడి వల్లా కాదు. మీ అందరి మద్దతు, ఆశీర్వాదం కావాలి. అబద్ధాలు చెప్పే, అన్యాయం చేసే వారిని బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి తీసుకురావాలి. రేపు మనందరి ప్రభుత్వం రాగానే ఏపీలోని పేదలు వైద్యం కోసం దేశంలోని ఏ నగరానికి వెళ్లినా, ఏ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నా అందుకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. కిడ్నీ సంబంధిత, తలసేమియా.. లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి నెలనెలా రూ.10 వేలు పింఛన్ ఇస్తాం. మహానేత కాలంలో జరిగినట్లే.. మూగ, చెవిటి పిల్లలు అందరికీ ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయిస్తాం. క్యాన్సర్ చికిత్సకు కనీసం ఏడెనిమిది సార్లు కీమోథెరపీ చేయాలి. ఇవాళ ఈ ప్రభుత్వం కేవలం రెండుసార్లకు మాత్రమే డబ్బులిస్తోంది. దీంతో ఆరు నెలల తర్వాత వారికి క్యాన్సర్ వ్యాధి తిరగబెడుతోంది. రోగులు చనిపోవాల్సిన దుస్థితి నెలకొంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సరిగా జరగడం లేదు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్పు చేస్తాం. ఆపరేషన్ పూర్తయ్యాక వైద్యులు సూచించే విశ్రాంతి కాలంలో పనులు చేసుకోలేరు కాబట్టి ఆర్థిక సాయం అందిస్తాం. మీ అందరి ఆశీస్సులతో ఆరోగ్యశ్రీలో ఈ విప్లవాత్మక మార్పులు గొప్పగా జరుగుతాయని ఆశిస్తున్నాను. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ విధానం రద్దు చేస్తాం. ఇచ్చిన హామీలు ఏమయ్యాయి బాబూ? ఎన్నికలప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలను ఆయన ఎలాగూ అమలు చేయలేదు. ముఖ్యమంత్రి అయ్యాక తూర్పుగోదావరి జిల్లాకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలకూ దిక్కులేకుండా పోయింది. అసెంబ్లీ వేదికగా ప్రతి జిల్లాకు చంద్రబాబు హామీలు గుప్పించారు. తూర్పు గోదావరి జిల్లాలో పెట్రోలియం యూనివర్సిటీ, పెట్రోలియం కారిడార్, ఎల్ఎన్జీ టెర్మినల్, తునిలో నౌకా నిర్మాణ కేంద్రం, ఇదే జిల్లాలో ఇంకో పోర్టు, ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ పార్క్, విశాఖ నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్, తెలుగు విశ్వవిద్యాలయం నిర్మాణం, కొబ్బరి ఆధారిత పరిశ్రమ, ఆక్వా కల్చర్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఉపరితల జల రవాణా మార్గాలను నిర్మిస్తామంటూ హామీలు ఇచ్చినా అవి ఎక్కడున్నాయో కనిపించడం లేదని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఇదే జిల్లాలో 19 నియోజకవర్గాలకు 14 నియోజకవర్గాలలో టీడీపీ గెలిచింది. వాటితో సంతృప్తి చెందని చంద్రబాబు.. తాను అడ్డగోలుగా సంపాయించిన అవినీతి సొమ్ముతో వైఎస్సార్సీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేశాడు. తన సీట్ల సంఖ్యను 17కు పెంచుకున్నా చంద్రబాబు ఈ జిల్లాకు చేసిందేమిటి? అని ఇక్కడి ప్రజలు అడుగుతున్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పుష్కర ఎత్తిపోతల పథకం కట్టి 13 లిఫ్టులతో లక్షన్నర ఎకరాలకు సాగునీరు ఇచ్చినా, వాటిల్లో కొడవలి లిఫ్ట్‌ను నిర్వహించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నా అంటున్నారు. ఈ ప్రభుత్వం నాలుగున్నర ఏళ్ల పాలనలో కొత్తగా 14వ లిఫ్టును కట్టాలని కోరినా పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. ఇంతకంటే దారుణమైన పాలన ఉంటుందా.. అని మీ అందరి తరఫున ప్రశ్నిస్తున్నా. నాన్నగారి హయాంలో ఏలేరు ప్రాజెక్టును ఆధునీకరించాలని రైతులు కోరితే ఆ రోజుల్లోనే ఆ మహానేత రూ.138 కోట్లు కేటాయించి పనులు ప్రారంభిస్తే నేటికీ 40 శాతం పనులు కూడా పూర్తి కాలేదన్నా అని రైతులు చెబుతుంటే బాధనిపిస్తోంది. వైఎస్ హయాంలోనే పోలవరం ప్రాజెక్టులో ఎడమ కాలువ పనులతో పాటు అనుబంధంగా మరో 25 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థ కూడా ఏర్పాటైంది. కానీ, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో తమ ప్రాంతానికి నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నా అని రైతన్నలు వాపోతున్నారు. -
ఎర్రటి ఎండలో వెల్లువెత్తిన జనాభిమానం
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : నడి నెత్తిన సూర్యుడు సుర్రుమనిపిస్తున్నా ఏమాత్రం లెక్క చేయకుండా అశేష ప్రజానీకం జననేత జగన్ అడుగులో అడుగులేసింది. పసి పిల్లలను చంకనెత్తుకుని వచ్చిన మహిళలు.. ‘అన్నొస్తున్నాడు..’ అంటూ పొలాల్లోంచి పరుగెత్తుకొచ్చారు. రాజన్న బిడ్డను చూద్దామని అవ్వాతాతలు రోడ్డుపక్కన గంటల తరబడి వేచి చూశారు. తమ బాధలు వినే నాయకుడు వచ్చారంటూ ప్రజలు ఊరూరా స్వాగతం పలికారు..తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో మోసపోయిన బాధితులు.. కష్టాలు అనుభవించే బడుగు, బలహీనులు అనేక మంది జగన్ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 116వ రోజు మంగళవారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కొనసాగింది. పెదనందిపాడు శివారు మొదలు అన్నారం క్రాస్‌రోడ్డు, పాలపర్రు, రాజుపాలెం క్రాస్ మీదుగా ఉప్పలపాడు వరకూ సాగింది. కష్టమొచ్చిందన్నా... : కర్నూలు నుంచి వచ్చిన వలస కూలీలు.. కళ్లల్లో పుట్టెడు దుఃఖం దాచుకుంటూనే తమ గోడు చెప్పుకున్నారు. ‘పనులు దొరకడం లేదు.. బతకలేకపోతున్నాం.. కూలీ కూడా సరిగా వచ్చేట్టు లేదు.. మంచి రోజులు వస్తాయనే గంపెడాశతో బతుకీడుస్తున్నాం’ అని మల్లేష్ అనే వ్యక్తి అన్నాడు. యాదమ్మ, ఈశ్వరి, ప్రభావతి... ఇలా దాదాపు 15 మంది కూలీలు పొలాల్లోంచి పరుగెత్తుకొచ్చారు. రెక్కలు ముక్కలు చేసుకున్నా పిల్లలను చదివించలేకపోతున్నాం.. చూడయ్యా మట్టి పనికి పంపుతున్నాం.. అంటూ బొబ్బలెక్కిన తమ చిన్నారుల చేతులు చూపించారు. ఆనంద్‌పేట, అల్లీనగర్ తదితర ప్రాంతాల్లో అతిసారతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులు జగన్‌ను కలిశారు. చనిపోయిన వాళ్లకు నిజాయితీగా పరిహారం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. ప్రజల ప్రాణాలు పోతున్నా దిద్దుబాటు చర్యలు చేపట్టని మొద్దు నిద్రలో ఈ ప్రభుత్వం ఉందని దుమ్మెత్తిపోశారు. అందరి సమస్యలనూ జగన్ శ్రద్ధగా విన్నారు. మనందరి ప్రభుత్వం రాగానే అన్ని వర్గాల వారినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. -
గల్లంతైన ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం
ప్రత్తిపాడు(గుంటూరు జిల్లా): గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెం గ్రామ శివారులోని వాగులో శనివారం రాత్రి గల్లంతైన ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు ఆదివారం ఉదయం లభ్యమయ్యాయి. మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రత్తిపాడు మండలం చినకోండ్రపాడు గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కూలిపనికి వెళ్లి వస్తూ వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తూ నీటి ప్రవాహం ఉధృతమై ముగ్గురూ గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. -
లేటరైట్ దోచేస్తుంటే మీరేం చేస్తున్నారు?
కాకినాడ క్రైం/ప్రత్తిపాడు : ‘ఓ కంపెనీ లక్షల టన్నుల లేటరైట్ దోచుకుపోతుంటే మీరేం చేస్తున్నారు? ఇలాగైతే ఎలా? అక్రమ మైనింగ్‌ను అడ్డుకోలేరా? సామాన్యులు ట్రాక్టర్ ఇసుక తీసుకెళ్తుంటే సవాలక్ష నిబంధనలు విధించి అడ్డుకుంటారే! మరి దేశ సంపదను దోచుకుపోతుంటే అనుమతులు ఎలా ఇచ్చారు? గనులవద్ద చెక్‌పోస్టు, వేయింగ్ మిషన్ ఎక్కడ ఉన్నాయి?’ అంటూ రాష్ట్ర శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ భూమా నాగిరెడ్డి రెవెన్యూ, అటవీ, మైనింగ్ శాఖల అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రత్తిపాడు మండలం వంతాడ, చింతలూరు గ్రామాల్లో మహేశ్వరి మినరల్స్ చేపట్టిన మైనింగ్ కార్యకలాపాల్లో అనేక అక్రమాలు బయటపడ్డాయి. పలుమార్లు తనిఖీలు, సర్వేలు జరిగాయి. ఈ నేపథ్యంలో చైర్మన్ భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలోని కమిటీ సభ్యులైన ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు (రామచంద్రపురం), బొండా ఉమా మహేశ్వరరావు (విజయవాడ సెంట్రల్), ఎ.సురేష్ కుమార్ (సంతనూతలపాడు) ఆయా మైనింగ్ ప్రదేశాల్లో మంగళవారం విచారణ చేపట్టారు. ఆయా ప్రాంతాలను స్వయంగా పరిశీలించి, స్థానికుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మాస్టర్ ప్లాన్, మైనింగ్ ప్లాన్, ట్రాన్స్‌పోర్టు ప్లాన్ కూడా లేకపోవడాన్ని భూమా గుర్తించారు. డంపింగ్ యార్డును కూడా ప్లాన్‌లో చూపించాలని చెప్పారు. ఎటువంటి ప్లాన్లూ లేకుండా కనీసం లీజుకిచ్చిన మైనింగ్ ప్రాంతం బౌండరీలను కూడా గుర్తించకుండా అనుమతులు ఎలా ఇచ్చారని మైన్స ఏడీ సీహెచ్ సూర్యచంద్రరావును నిలదీశారు. ‘సంవత్సరానికి ఎన్ని టన్నుల మెటీరియల్ ఎగుమతి అవుతుంది? ఎంత ట్యాక్స్ కడుతున్నారు’ అని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడమేమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధనం వృథా కావడానికి ప్రభుత్వాధికారులే తలుపులు బార్లా తెరిచారనడానికి ఇది నిదర్శనమన్నారు. లీజుదారు ఇచ్చిన సమాచారాన్నే మైనింగ్ అధికారులు తమకు ఇస్తున్నారని, వారివద్ద సమాచారం లేకపోవడం ప్రతిచోటా జరుగుతోందని అన్నారు. చింతలూరులో మూడుసార్లు సర్వే చేసిన అధికారులు 500 ఎకరాలు మాత్రమే చూపించారని, తాజాగా జాయింట్ కలెక్టర్ నిర్వహించిన సర్వేలో 739 ఎకరాల్లో గనులు తవ్వుతున్నట్లు వెల్లడైందని భూమా అన్నారు. అధికారులంతా కంపెనీకి అమ్ముడు పోయారని విమర్శించారు. రెవెన్యూ, అటవీ, మైనింగ్ శాఖల జాయింట్ ఇన్స్పెక్షన్ జరగకుండానే గనులు లీజుకివ్వడాన్ని తప్పుబట్టారు. ‘గనుల తవ్వకం ప్రారంభమయ్యాక ఒక్కో పత్రం, అనుమతి పత్రం తయారు చేయడం మొదలుపెట్టారా?’ అని ప్రశ్నించారు. వంతాడలో అటవీ అనుమతులు లేకుండా రహదారి ఏర్పాటు చేసినట్టు వచ్చిన ఫిర్యాదుపై సంబంధిత అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండుకట్టెలు పట్టుకువెళ్లేవారిపై కేసులు పెట్టి వేధించడం మాత్రం తెలుసంటూ ఎద్దేవా చేశారు. అవకతవకల నేపథ్యంలో వంతాడ క్వారినీ గతంలో టీడీపీ, కాంగ్రెస్, ప్రజారాజ్యం, సీపీఐ, సీపీఎం తదితర పార్టీల నేతలు సందర్శించారని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తెలిపారు. మైనింగ్‌వల్ల రహదారులు ధ్వంసమవుతున్నాయని, ధ్వని, వాతావరణ కాలుష్యం ఏర్పడుతోందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగిలిదేవి సత్తిరాజు, గున్నాబత్తుల రాజబాబు కమిటీకి ఫిర్యాదు చేశారు. వంతాడలో 11 ఎకరాల్లో అక్రమ మైనింగ్ జరిగిందని లింగపల్లి సత్యనారాయణ తదితరులు కమిటీకి వివరించారు. చింతలూరు క్వారీలో ముగ్గురు 200 ఎకరాల లీజులు పొందారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కర్రి మురళి, మైలపల్లి సత్యనారాయణ చెప్పారు. లీజులో లేని 30 ఎకరాల్లో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. ఒక్కో ఎమ్మార్వో ఒక్కో రకంగా ఇచ్చిన ఎన్ఓసీలను కూడా కమిటీ తప్పు పట్టింది. వీటన్నిటిపై సమగ్ర సమాచారంతో కాకినాడలో బుధవారం కమిటీ ముందు హాజరు కావాలని మైన్స్, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులను భూమా ఆదేశించారు. అక్రమ తవ్వకాలవల్ల దుర్వినియోగమైన ప్రజాధనం రికవరీపై ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు, తుని ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, దాడిశెట్టి రాజా, జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, డీఎఫ్ఓ టీవీ సుబ్బారెడ్డి, సబ్ డివిజన్ ఫారెస్టు ఆఫీసర్ వీవీ సుభద్రాదేవి, మైన్స్ జేడీ కేవీఎల్ నరసింహరెడ్డి, డీడీ పి.కోటేశ్వరరాజు, మైన్స్ విజిలెన్స ఎ.డి. కె.సుబ్బారావు, పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు, తహశీల్దార్ గిడుతూరి సత్య వరప్రసాద్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గొల్లపల్లి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ గ్రామ బాట
ప్రత్తిపాడు : దీర్ఘకాలంగా పేరుకుపోయిన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ యంత్రాంగం గ్రామబాట పట్టనుంది. జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ రూపుదిద్దిన ఈ కార్యక్రమం కొత్త ఏడాది జనవరి మొదటి వారం నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానుంది. వారంలో మూడు రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు రెవెన్యూ అధికారులు గ్రామాల్లోనే ఉండి సమస్యల భరతం పట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎవరెవరు వెళతారు... మండల స్థాయిలో తహశీల్దార్ నేతృత్వంలో సివిల్‌సప్లయిస్ డిప్యూటీ తహశీల్దార్, ఆర్ఐ, సర్వేయర్, వీఆర్వో, మీ-సేవ కేంద్రం ఆపరేటర్ కలసి ఒక బృందంగా ఏర్పడి ఒక్కో గ్రామానికి వెళతారు. మంగళ, గురు, శనివారం మూడు రోజుల పాటు గ్రామంలోనే ఉంటారు. ఏడాది మొత్తానికి ప్రణాళిక.. రెవెన్యూ బృందాల పర్యటనకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను ఏడాది మొత్తానికి ఒకేసారి రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొత్త ఏడాది జనవరి నుంచి డిసెంబరు వరకు ఏ ఏ గ్రామాల్లో ఎప్పుడెప్పుడు పర్యటించాలనే దానిపై ప్రణాళిక రూపొందించి ఉన్నతాధికారులకు అందజేయనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు .. గ్రామానికి చేరుకున్న రెవెన్యూ బృందం పనితీరు ఇలా ఉంటుంది. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు వీఆర్వో కార్యాలయాన్ని సందర్శించడం. వీఆర్వోల పనితీరు ఎలా ఉంది. అందుబాటులో ఉంటున్నారా. రెవెన్యూ సమస్యలకు పరిష్కారం లభించక ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా. గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ ఎలా ఉంది. ప్రభుత్వ భూములు, శ్మశాన వాటికలు ఏమైనా ఆక్రమణలకు గురవుతున్నాయా. ప్రజలకు వీఆర్వోలకు మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి. వీఆర్వోలు తొమ్మిది రకాల రికార్డులు సక్రమంగా నిర్వహిస్తున్నారా. రైతులందరి పేర్లు అడంగల్‌లో ఉన్నాయా. ఇలా ప్రతి అంశాన్ని తహశీల్దార్ పరిశీలిస్తారు. మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం వరకు గ్రామ సభలు ఏర్పాటు చేసి, ప్రజలు, రైతులు, స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుంటారు. వీలైనంత వరకు ఆ సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గాలను చూపుతారు. -
కార్యకర్తలకు అండగా ఉంటాం
ప్రత్తిపాడు నియోజక వర్గ వైఎస్సార్ సీపీ సమావేశంలో ప్రసంగిస్తున్న బోస్ ప్రత్తిపాడు : కార్యకర్తలందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, గ్రామ స్థాయి నుంచీ పార్టీని పటిష్ట పరచాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సభ్యు డు, మాజీ మంత్రి పిల్లి సుబాష్‌చంద్రబోస్ పిలుపునిచ్చారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలోని రవివర్మ మామిడి తోటలో సోమవారం జరిగిన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ప్రజా వ్యతిరేక చంద్రబాబు పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ఇప్పుడు డ్రామా లు ఆడుతున్నారని విమర్శించారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ టీడీపీ నాయకులు వేధింపులకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్ పోస్టు ఇవ్వడానికీ టీడీపీ నాయకులు సిగ్గులేకుండా లంచాలు అడుగుతున్నారని ఆరోపించారు. మాజీ జెడ్పీచైర్మన్ చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ బిడ్డ గర్బంలో పడిన నాటి నుంచీ వారి సంక్షేమం కోసం పాటుపడడం మనస్సున్న మారాజు రాజశేఖరునికే సాధ్యపడిందన్నారు. పార్టీ వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, దొంగ రామసత్యనారాయణ, అలమండ చలమయ్య తదితరులు ప్రసంగించారు. పార్టీ ప్రచార కన్వీనర్ రావూరి వెంకటేశ్వరరావు ప్రసంగం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. తొలుత పార్టీ నాయకులకు బుద్దరాజు గోపీరాజు స్వాగతం పలికారు. కార్యక్రమంలో రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొమ్మిశెట్టి బాలకృష్ణ, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామి నాయుడు, జిల్లా యువజన విభాగం కన్వీనర్ అనంత ఉదయ్‌భాస్కర్, పార్టీ నాయకులు వాసిరెడ్డి జమీలు, మాకినీడు గాంధీ, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రౌతులపూడి జడ్పీటీసీ సభ్యులులు ముదునూరి లోవలక్ష్మి, జ్యోతుల పెదబాబు, చెన్నాడ సత్తిబాబు, సర్పంచ్‌లు ముచ్చర్ల నాగలక్ష్మి, యాళ్ల విశ్వేశ్వరరావు, సొసై టీ అధ్యక్షుడు జువ్వల చినబాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలకు సన్మానం అనంతరం ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరిలను కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. ఫొటోరైటప్ :29జెపిటి61-27020002: ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమీక్షా సమావేశంలో ప్రసంగిస్తున్న పిల్లి సుబాష్ చంద్రబోస్. 29జెపిటి62-27020002: ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు వరుపుల, దాడిశెట్టి, వంతల రాజేశ్వరిలను సత్కరిస్తున్న దృశ్యం. -
కృష్ణాలో రోడ్డు ప్రమాదం, పశ్చిమ వాసులు మృతి
కృష్ణ జిల్లా బాపులపాడు మండలం వీరపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని -డీసీఎం వాహనం ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లో ఓ కంపెనీలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న 15 మంది, డీసీఎం వాహనంలో పశ్చిమగోదావరి జిల్లా అనంతపల్లికి బయలుదేరారు. శనివారం ఉదయం ఐదు గంటల సమయంలో హనుమాన్ జంక్షన్ సమీపంలోని వీరపల్లి వద్ద ఆగిఉన్న లారీని, డీసీఎం వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో డీసీఎం వాహనంలో ఉన్న కెమికల్స్ లీక్ కావడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు .మరో మహిళ ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలింది. మరో బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనలో గాయపడిన వారందరినీ ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించిన వారిని.. మెరుగైన వైద్య సేవల నిమిత్తం విజయవాడకు తరలించారు . -
ప్రత్తిపాడులో వైసీపీ విజయం
-
మాకినేని పెదరత్తయ్య హల్చల్
గుంటూరు : గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో నామినేషన్ల సందర్భంగా టీడీపీ నేత మాకినేని పెదరత్తయ్య హల్చల్ చేశారు. ఇతరులను నామినేషన్ కేంద్రంలోకి అనుమతించనందుకు సీఐ శ్రీనివాసరావుపై ఆయన దౌర్జన్యం చేశారు. ఈ సందర్బంగా ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దాంతో సీఐ ...పెదరత్తయ్యను బయటకు లాక్కొచ్చారు. ఈ చర్యను నిరసిస్తూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట రత్తయ్య ఆందోళనకు దిగారు.