మహేష్ మృతదేహం, విలపిస్తున్న మృతుడి తల్లి, బంధువులు
ప్రత్తిపాడు: ‘నేను జాబ్ చేసి నిన్ను బాగా చూసుకుందాం అనుకున్నా. నన్ను క్షమించు. ఐ మిస్ యూ అమ్మా’ అంటూ తల్లికి లేఖ రాసి ఓ విద్యార్థి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం గోగులమూడిలో విషాదం నింపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోగులమూడికి చెందిన చౌటూరి శైలజ టైలరింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కుటుంబ విభేదాల నేపథ్యంలో ఆమె భర్త హైదరాబాద్‌లో విడిగా ఉంటున్నాడు.
వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు చౌటూరి మహేష్ (17) స్థానిక అబ్బినేనిగుంటపాలెంలోని సెయింట్ ఇగ్నేషియస్ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో 9వ తరగతి చదువుతూ.. అక్కడే హాస్టల్‌లో ఉంటున్నాడు. గురువారం రాత్రి ఏదో పని ఉందని బయటికి వెళ్లాడు. ఏబీ పాలెం అడ్డరోడ్డు నుంచి పెదగొట్టిపాడుకు వెళ్లే దారిలో ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు పంచాయతీ పరిధిలోని కావూరి చెరువులో చెట్టుకు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.
ఆత్మహత్య కాదు.. హత్యే..
విద్యార్థి తల్లి చౌటూరి శైలజ మాత్రం తన కొడుకుది ఆత్మహత్య కాదని, హత్యేనని పోలీసుల ఎదుట అనుమానం వ్యక్తం చేసింది. స్కూల్ యాజమాన్యంపైనా అనుమానం ఉందని పేర్కొంది. విద్యార్థి మహేష్‌ది హత్యేనని ఆరోపిస్తూ.. అతడి కుటుంబ సభ్యులు, బంధువులు, యానాది సంఘ నాయకులు రావిపాడు అడ్డరోడ్డు వద్ద శుక్రవారం రాస్తారోకో చేశారు. మహేష్ రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్ వాస్తవం కాదని, అందులో సంతకం బదులు వేలిముద్ర ఎందుకు ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
విద్యార్థి జేబులో సూసైడ్ నోట్..
మృతుడు మహేష్ వద్ద సూసైడ్ నోట్ లభించింది. ‘అమ్మ, తాత, మామయ్యా.. నేను తప్పు చేయలేదు. స్కూల్లో నేను తప్పు చేసినట్లు మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయికి నా వల్ల చెడ్డ పేరు వచ్చింది. నేను తనను ప్రేమించాను. నలుగురైదుగురు పిల్లలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా వెళ్లి హిందీ టీచర్‌కు చెప్పారు. ఆ టీచర్ మా ఇద్దరినీ అడగకుండా వెళ్లి మా క్లాస్ టీచర్‌కి చెప్పారు. మా క్లాస్ టీచర్ ఏ విషయం తెలుసుకోకుండా నన్ను కొట్టారు. నేను చనిపోయినట్లుగా అమ్మకి, నేను ప్రేమించిన ఆ అమ్మాయికి తెలియనివ్వద్దు. ఇదే నా ఆఖరి కోరిక అని అందులో రాసి ఉంది. ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment