ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీల ఫీజులు తగ్గిస్తాం | Ys jagan praja sankalpa yatra in east godavari district | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీల ఫీజులు తగ్గిస్తాం

Published Mon, Aug 6 2018 2:31 AM | Last Updated on Mon, Aug 6 2018 3:45 PM

Ys jagan praja sankalpa yatra in east godavari district - Sakshi

తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో జరిగిన బహిరంగ సభకు భారీ ఎత్తున హాజరైన జనసందోహంలో ఓ భాగం. ప్రసంగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

చంద్రబాబు అన్యాయం చేసినా, అబద్ధాలు ఆడినా, మోసం చేసినా వీళ్లెవ్వరికీ (ఎల్లో మీడియాకు) కనిపించదు. చంద్రబాబును భుజాన మోస్తున్న ఎల్లో మీడియా ఏమంటుందో తెలుసా? ఆహా ఆయన ఇంద్రుడు, చంద్రుడు.. చంద్రబాబు చేస్తోంది దేశమంతా చూస్తోంది.. రైతులు సంతోషంగా కేరింతలు కొడుతున్నారు.. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు ఆనందంతో ఊర్రూతలూగుతున్నారు.. అనే మాటలు వినిపిస్తుంటాయి ఆ టీవీల్లో, ప్రకటనల్లో, పేపర్లలో. పిల్లలకు ఉద్యోగాలు వచ్చి, జీతాలు ఎక్కువై వాటిని ఎలా ఖర్చు పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారంటూ వార్తలు రాస్తారు, టీవీల్లో చూపిస్తారు. ఇవాళ ఈ రాష్ట్రంలో వ్యవసాయం లేదు. సాగు నీరు లేదు. విత్తనాలు దొరకవు. కరవుతో ప్రజలు అల్లాడుతున్నా కూడా ఏమి చేయాలన్నదానిపై క్యాబినెట్‌ కనీసం చర్చించదు. ఇంత దారుణంగా పాలన సాగుతోంది.            – వైఎస్‌ జగన్‌

ప్రజాసంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో ప్రైవేట్‌ విద్యా సంస్థలు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేయకుండా కట్టడి చేస్తానని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. చంద్రబాబు బినామీ సంస్థలైన నారాయణ, చైతన్య విద్యా సంస్థల్లో దోపిడీ పర్వం సాగుతోందని, మధ్యతరగతి వర్గాల వారు ఆస్తులమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. మనందరి ప్రభుత్వం రాగానే ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజులు నియంత్రిస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ స్కూళ్లను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆదివారం 229వ రోజు తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడిలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఇచ్చిన హామీలకు కూడా దిక్కులేకుండా పోయిందని విమర్శించారు. కౌలు రైతులు చల్లగా ఉండేలా రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా కౌల్దారీ చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..

ఇష్టమొచ్చినట్లు ఫీజుల వసూలు..
ఇవాళ పిల్లలను ఓ మాదిరి బడికి పంపించాలటే ఏడాదికి రూ.40 వేలు ఖర్చవుతోంది. ఈ ఫీజుకు అదనంగా ఏటా ఈ స్కూళ్లు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు పెంచుకునేందుకు ఈ పెద్దమనిషి (చంద్రబాబు) దగ్గరుండి వెసులుబాటు కల్పిస్తున్నాడు. ఇంటర్మీడియట్‌కు ఏడాదికి రూ.65 వేలు వసూలు చేస్తున్నారు. చంద్రబాబు బినామీ స్కూళ్లు, కాలేజీలైన.. నారాయణ, చైతన్యలకు మేలు చేయడానికి పడరాని పాట్లు పడుతున్నారు. నారాయణ కాలేజీల్లో ఏడాది ఫీజు అక్షరాలా రూ.1.60 లక్షలు. హాస్టల్‌ ఫీజులతో కలిపి సంవత్సరానికి రూ.3 లక్షలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లను నడపాల్సిన పెద్దమనిషి దగ్గరుండి రేషనలైజేషన్‌ పేరుతో స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లను మూసేయిస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ స్కూళ్లకు వెళుతున్న పిల్లలకు ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన పుస్తకాలు ఆగస్టు వచ్చినా ఇవ్వలేదు.

పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు. పుస్తకాలు, యూనిఫాం సమయానికి ఇవ్వరు. ఖాళీగా ఉన్న 20 వేల టీచర్‌ ఉద్యోగాలను భర్తీ చేయరు. దగ్గరుండి ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు స్కూళ్లకు వెళ్లేలా ఈ పెద్దమనిషి చేస్తున్నాడు. తల్లిదండ్రులకు నేను ఒక్కటే చెబుతున్నా. ప్రభుత్వ స్కూళ్లకు పూర్వ వైభవం తీసుకొస్తాం. మూత పడిన స్కూళ్లను తెరిపిస్తాం. అక్కడ అవసరమైన టీచర్లను నియమిస్తాం. ఇంగ్లిష్‌ మీడియం ఏర్పాటు చేస్తాం. ఒక వైపున ప్రభుత్వ స్కూళ్లను ప్రక్షాళన చేస్తూ మరో వైపున ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు ఇష్టమొచ్చినట్లు వసూలు చేసే ఫీజులను నియంత్రిస్తాం.  

రైతుల పరిస్థితి దారుణం
చంద్రబాబు నాలుగేళ్ల పాలన ఎలా ఉందో ఒకసారి చూడండి. మరో 6 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే వాటి నుంచి పక్కదోవ పట్టించేలా రోజూ ‘ఈనాడు’ పేపర్‌లో ఐటమ్స్‌ కనిపిస్తాయి. చంద్రబాబు చేసే ప్రకటనలు, ఎల్లో మీడియా ఆరాటం అంతా సమస్యల నుంచి ప్రజలను పక్కదోవపట్టించడమే. ప్రజలను సాక్షాత్తు ముఖ్యమంత్రే దగ్గరుండి మోసం చేసిన తర్వాత.. ఎన్నికలు ఆరు నెలల్లో ఉన్నాయనగా.. ఎదుటి వాడి మీద నేరాన్ని నెట్టివేసి నేరం చేసిన వాడే మోసగాడు, మోసగాడు అని అరిచినట్టుగా ఉంది చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలుకుతున్న మీడియా తీరు. ఖరీఫ్‌ ప్రారంభమైన జూన్‌ ఒకటి నుంచి ఆగస్టు ఒకటి వరకు చూస్తే రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పదింట లోటు వర్షపాతం కనిపిస్తోంది. ఆ పది జిల్లాలలో కరవు ఛాయలు కనిపిస్తాయి. మూడు జిల్లాలు తప్ప మిగతా జిల్లాల్లో వేసిన పంటలు ఎండిపోతున్నాయి.

కృష్ణా డెల్టాలో 13 వేల క్యూసెక్కుల నీరు ఇవ్వాల్సి ఉంటే 6 వేల క్యూసెక్కులు ఇస్తున్నారు. అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోదు. క్యాబినెట్‌ చర్చించదు. ఇంతటి అధ్వానపు పాలన చూస్తున్నాం. నివాళ రైతులకు వడ్డీ లేని రుణాలు కరవయ్యాయి. పండిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. నిన్ననే చూశాం మనమంతా.. అరటి, నిమ్మ రైతులు పడుతున్న అగచాట్లను పేపర్లలో చూశాం. టన్ను అరటి రూ.16 వేలు ఉండాల్సి ఉంటే రూ.2 వేలు కూడా రాని దుస్థితి. దీంతో రైతులు అరటి గెలలు చెట్ల మీదనే కుళ్లిపోతున్నా అలాగే వదిలేస్తున్నారు. నిమ్మకాయలు కిలో రూ.70కి కొనాల్సి ఉంటే రూ.4కు కూడా కొనే దిక్కులేక రోడ్ల మీద పారబోయాల్సిన పరిస్థితి. రుణ మాఫీ లేదు, పావలా వడ్డీ లేదు, వడ్డీ లేని రుణాలు లేవు. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయం.

ఇదే జిల్లాలోని గొల్లప్రోలు ప్రాంతంలో ఏడుగురు కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకున్న పాపాన పోలేదు. వీరిలో ముగ్గురు రైతు కుటుంబాల సభ్యులు నన్ను కలిశారు. వారిలో ఒక అక్క నాతో.. అన్నా, అకాల వర్షాలకు పంట దెబ్బతిని కౌలు తీర్చలేక నా భర్త ఆత్మహత్య చేసుకుంటే ఈ ప్రభుత్వం వారు కనీసం పలకరించలేదన్నా అని చెప్పింది. నిజంగా ఇంతకన్నా దారుణమైన పాలన ఎక్కడైనా ఉంటుందా? అందుకే నేను ప్రతి కౌలు రైతుకూ హామీ ఇస్తున్నా.. ఇవాళ రైతు చల్లగా ఉండాలి అంటే కౌలు రైతు కూడా క్షేమంగా ఉండాలి. అందుకే రేపు మనందరి ప్రభుత్వం రాగానే పూర్తిగా కౌల్దారి చట్టాన్ని ప్రక్షాళన చేస్తా. రైతులకు నష్టం జరక్కుండా కౌల్దార్లకు గొప్ప మేలు జరిగేలా చట్టాన్ని తీసుకువస్తాం. గుర్తింపు కార్డులు ఇస్తాం. కౌలు రైతులకు బ్యాంకుల్లో వడ్డీ లేకుండా రుణాలు వచ్చేలా చేస్తాం. అన్ని రకాలుగా తోడుగా ఉండేలా చూస్తాం.
   
పోలవరం ఎప్పటికి పూర్తవుతుందంటే సమాధానం చెప్పలేరు..
పోలవరం ప్రాజెక్టును అవినీతి మయం చేసిన ఘనత చంద్రబాబుది. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి వరం లాంటింది. యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును లంచాల ప్రాజెక్టుగా మార్చారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. రేట్లు పెంచి నామినేషన్‌ పద్ధతిన సబ్‌ కాంట్రాక్టర్లను నియమించుకుంటున్నారన్నా అని రైతులు చెబుతున్నారు. ఇలా సబ్‌ కాంట్రాక్టర్‌గా ఉన్న వారిలో ఈ జిల్లాకే చెందిన మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడు కూడా ఉన్నారన్నా అని ఇక్కడి వారు చెబుతున్నారు. ఇలాగైతే ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందని ఇక్కడి ప్రజలు అడుగుతుంటే జవాబు చెప్పలేని స్థితిలో చంద్రబాబు ఉన్నాడు.

ఏలేశ్వరం తిమ్మరాజు చెరువు కింద 6 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేదు. శంఖవరంలో బాపన్నచెరువుదీ ఇదే పరిస్థితన్నా.. ఎవ్వరూ పట్టించుకునే నాధుడు లేడన్నా అని రైతులు చెబుతున్నారు. చంద్రబాబు తాను బతికుండగానే కట్టుచింతల ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టుకున్నాడన్నా.. ఈ ప్రాజెక్టు కింద 5 వేల ఎకరాల ఆయకట్టు ఉందన్నా, అయినా ఈవాళ్టికీ ఈ చెరువు కింద కాల్వలు పూర్తి కాలేదన్నా అని రైతులు వాపోతున్నారు. ఇక్కడి ఏలేరు నీరు విశాఖలోని పారిశ్రామిక అవసరాలకు వెళుతోందన్నా.. అదే పోలవరం ప్రాజెక్టు పూర్తయితే విశాఖపట్నానికి ఆ ప్రాజెక్టు నీళ్లుపోయి ఉండేవి.. మేము ఏలేరు నీళ్లను వినియోగించుకుని ఉండేవాళ్లమన్నా అని రైతులు చెబుతున్నారు. ఏలేరు ప్రాజెక్టు కింద 67 వేల ఎకరాల ఆయకట్టు ఉంటే నేటికీ 50 వేల ఎకరాలకు నీరు అందని దుస్థితిలో ఉంటే చంద్రబాబు పాలన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నా అంటున్నారు.  

చంద్రబాబును నిలదీయండి  
ఎన్నికలకు ముందు.. పొదుపు సంఘాల రుణాలు మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. ఎన్నికలకు ముందు పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు రూ.14,200 కోట్లు ఉన్నాయి. ఇవాళ వాటిపై వడ్డీ మీద వడ్డీ పడి రూ.20,600 కొట్లకు చేరడంతో దిక్కుతోచని స్థితిలో అక్కచెల్లెమ్మలు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రత్యేక హోదా లేదు. పిల్లలకు ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ భృతి అంతకన్నా లేదు. ఆ రోజు ఈ పెద్దమనిషి ప్రతి ఇంటికి ఉపాధి లేదా ఉద్యోగం ఇస్తానన్నాడు. ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి నెల నెలా ఇస్తానన్నాడు. ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయని మళ్లీ ప్రజలు గుర్తుకు వస్తారు.

రాష్ట్రంలో కోటి డెబ్బైయి లక్షల ఇళ్లుంటే ప్రతి ఇంటికి రూ.రెండు వేలు భృతి ఇవ్వాల్సి ఉండగా కేవలం పది లక్షల మందికే ఇస్తారట. అది కూడా కేవలం రూ.వెయ్యేనట. అదీ నాలుగు నెలలేనట. ఎప్పుడైనా ఈ పెద్దమనిషి కనిపిస్తే  ఇంటికి రూ.2 వేలు చొప్పున 50 నెలలకు రూ.లక్ష బాకీ పడ్డావని నిలదీయండి. నాలుగేళ్లుగా ఇసుక, మట్టి, బొగ్గు, కరెంటు కొనుగోళ్లు, మద్యం, రాజధాని భూములు, విశాఖపట్నం భూములు, చివరకు గుడి ఆస్తులు కూడా వదలకుండా దోచేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. తాగేందుకు గ్రామాల్లో మంచినీరు దొరకదు కానీ వీధి వీధినా మందుషాపులు కనిపిస్తున్నాయి. కరెంటు చార్జీలు, పెట్రోలు, డీజిల్‌ రేట్లు, ఆర్టీసీ చార్జీలు, ఇంటి పన్నులు, స్కూలు, కాలేజీ ఫీజులు బాదుడే బాదు డు. యానాంలో ఒక లీటర్‌ పెట్రోల్, డీజిల్‌ కొట్టిస్తే అక్షరాలా రూ.7 నుంచి 8 తేడా కనిపిస్తుంది.

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ బతికే ఉందా?  
నిన్న చేబ్రోలు గ్రామంలో 20 మందికిపైగా నా వద్దకు వచ్చారు. ఆరోగ్యశ్రీ పనిచేయకపోవడంతో అవస్థలు పడుతున్నామని చెప్పారు. మెదడులో గడ్డ ఉందని, హైదరాబాద్‌ వెళ్లాలని డాక్టర్లు చెప్పారంటూ సాయి శ్రీనివాస్‌ చెప్పాడు. బోన్‌ క్యాన్సర్‌ చికిత్సకు చెన్నై వెళ్లాలని చెబితే ఆరోగ్యశ్రీ వర్తించడంలేదని పున్నారావు చెప్పుకొచ్చాడు. తొడలో ఎముకకు ఆపరేషన్‌ చేయించుకునేందుకు ఆరోగ్యశ్రీ వర్తించడం లేదని చంద్రం అనే మహిళ చెప్పింది. పక్షవాతం వచ్చింది, నెల నెలా మందులు కావాలంటూ డబ్బుల్లేని పరిస్థితిలో మరో వ్యక్తి నా వద్దకు వచ్చి ఆరోగ్యశ్రీ గురించి చెప్పాడు.

అసలు ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ బతికే ఉందా.. అని ఈ పెద్దమనిషిని అడుగుతున్నాను. పేద వాడికి ఉచితంగా ఆపరేషన్లు చేయించి చిరునవ్వుతో ఇంటికి పంపించాల్సిన 108 అంబులెన్స్‌లకు ఫోన్‌ చేస్తే వస్తుందన్న నమ్మకం లేదు. ఇవాళ రేషన్‌షాపుకు పోతే బియ్యం తప్ప మరేమీ ఇవ్వడంలేదు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వరు. పింఛన్, రేషన్‌కార్డు, మరుగుదొడ్లు.. ఏది కావాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి చూస్తున్నాం. గ్రామాల్లో జన్మభూమి కమిటీల మాఫియా కనిపిస్తోంది’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.   


పత్రికల్లోనే డీఎస్సీ..
ఈ పెద్దమనిషి పాలనలో టీచర్‌ ఉద్యోగాల భర్తీ జరగదు. కానీ అదిగో డీఎస్సీ, ఇదిగో డీఎస్సీ అంటూ రోజూ పేపర్లలో చూస్తున్నాం. అదిగో పరీక్ష అంటారు. కానీ పరీక్షలు జరగవు. డీఎస్సీ కోచింగ్‌ కోసం మన పిల్లలు రూ.14 వేలు కడుతున్నారు. ఓ పక్క కోచింగ్‌ సెంటర్లకు డబ్బులిస్తున్నాం. మరోవైపు డీఎస్సీ జరగదు. దాని కోసం పిల్లలు చదువుతూ...నే ఉంటారు. పేద వాడు పేదరికం నుంచి బయటకు రావాలంటే ఆ ఇంట్లో నుంచి ఒక్కరైనా ఇంజినీరింగ్, డాక్టర్, కలెక్టర్‌ వంటి చదువులు చదవాలని అప్పట్లో   నాన్నగారు ఎవ్వరూ చేయని విధంగా దగ్గరుండి చదివించిన పాలన చూశాం.

ఇప్పుడు కాలేజీ ఫీజులు దగ్గరుండి ఈ పెద్దమనిషే పెంచే కార్యక్రమం చేశారు. ఇంజినీరింగ్‌ ఫీజు ఏటా లక్ష రూపాయలకు ఏగబాకింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా పిల్లలకు ముష్టేసినట్లు రూ.30 వేలు, రూ.35 వేలు ఇస్తున్నారు. ఏడాదికి రూ.70 వేల చొప్పున ఇంజినీరింగ్‌ నాలుగేళ్లకు ఆ పిల్లాడి తల్లిదండ్రులు దాదాపు రూ.3 లక్షలు అప్పులు చేయడమో, ఆస్తులు, బంగారం అమ్మడమో చేయాల్సిన పరిస్థితి.  


లాట్‌రైట్‌ పేరు చెప్పి బాక్సైట్‌ అమ్మకాలు
ఈ ప్రాంతంలో చంద్రబాబు ప్రభుత్వ అవినీతి గురించి కథలు, కథలుగా చెప్పుకుంటున్నారన్నా అంటూ.. మా పక్కనే అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం ఉందన్నా.. ఇందులో పారిశుద్ధ్య పనుల కాంట్రాక్ట్‌ను భాస్కర నాయుడు అనే వ్యక్తికి ఇచ్చారన్నా.. ఆయన సాక్షాత్తు చంద్రబాబు బంధువన్నా.. అని ఇక్కడి ప్రజలు చెప్పారు. గతంలో రూ.7 లక్షలుండే కాంట్రాక్ట్‌ను రూ.32 లక్షలకు పెంచి కట్టబెట్టారన్నా అని చెప్పారు. ఇదొక్కటే కాదు రాష్ట్రంలోని చాలా దేవాలయాల్లో కూడా ఇలానే నాలుగైదు రెట్లు ధరలు పెంచి ఇదే కాంట్రాక్టర్‌కు కట్టబెట్టారన్నా అని చెబుతున్నారు. దేవుడి దగ్గర కూడా దోచుకోవాలనే ఆలోచన చేస్తున్న ఈ వ్యక్తిని ఏమనాలి? ఇదే నియోజకవర్గంలో లాటరైట్‌ మైనింగ్‌ జరుగుతోంది. అటవీ భూములు 50 ఎకరాలను ఆక్రమించి, లాటరైట్‌ పేరు చెప్పి బాక్సైట్‌ అమ్ముతున్నారు.

జిల్లాలో తెలుగుదేశం నాయకుల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల మొదలు చినబాబు, పెద్దబాబు వరకు లంచాలు పోతున్నాయి. ఈ నియోజకవర్గంలో మరుగుదొడ్లను కూడా వదిలి పెట్టడం లేదని ప్రజలు అంటున్నారు. రౌతులపూడిలో మరుగుదొడ్ల పేరుతో కోటి రూపాయలకు పైగా ఇక్కడి నాయకుడు దోచుకున్నారని స్థానికులు చెప్పారు. నీరు–చెట్టు కింద రామభద్రాపురం చెరువులో మట్టిని తవ్వేసి కోట్ల రూపాయలు దోచుకున్నారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. గతంలో వైఎస్సార్‌ హయాంలో ఈ నియోజకవర్గంలో 10 వేల ఇళ్లు కట్టిస్తే, చంద్రబాబు హయాంలో ఊరికి 10 ఇళ్లు కూడా కట్టించ లేదన్నా ఈ దిక్కుమాలిన ప్రభుత్వం అని స్థానికులు చెబుతుంటే ఆశ్చర్యం వేస్తోంది. ఇదే ప్రత్తిపాడులో జూనియర్‌ కాలేజీ ఏర్పాటు చేస్తానంటూ ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చిన హామీకీ దిక్కులేకుండా పోయింది.

అప్పట్లో ఆ దివంగత నేత శంఖవరంలో రెసిడెన్షియల్‌ పాఠశాలను పెట్టి ఆ తర్వాత దాన్ని జూనియర్‌ కళాశాలగా మార్చారు. నాన్నగారి హయాంలోనే ఏలేశ్వరంలో డిగ్రీ కాలేజీని మంజూరు చేస్తే, నేటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి. కత్తిపూడిలో కొంతమంది అక్కాచెల్లెమ్మలు కలిసి మురికినీళ్లు తాగుతున్నామంటూ ఓ నీళ్ల బాటిల్‌ను నాచేతికి ఇచ్చారు. మేము తాగే నీళ్లు ఇవన్నా... ఈ దుస్థితిని మీరు చంద్రబాబుకు అర్థమయ్యేలా చెప్పండన్నా అని కోరారు. అయ్యా చంద్రబాబు గారూ.. ఈసీసాలో ఉన్నది (మురికి నీటి బాటిల్‌ చూపుతూ) చెరకు రసం కాదు.. తాగే నీళ్లు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేని మీరు ముఖ్యమంత్రిగా ఉండడం ఎందుకయ్యా.. అని ఇక్కడి ప్రజలు అడుగుతున్నారు.

డబ్బా నీళ్లను రూ.12 పెట్టి కొనుక్కోలేక అవస్థలు పడుతున్నామని ఇక్కడి అక్కచెల్లెమ్మలు చెబుతున్నారు. ఇదే పత్తిపాడు నియోజకవర్గంలో పక్కనే 30 పడకల కమ్యూనిటీ ఆస్పత్రి కనిపిస్తోంది. ఆరుగురు డాక్టర్లు ఉండాల్సి ఉంటే నలుగురే ఉన్నారు. అతి ముఖ్యమైన చిన్నపిల్లల డాక్టర్‌ లేరు. అంటే డాక్టర్లను లేకుండా చేసి ప్రైవేట్‌ ఆస్పత్రుల వైపు ప్రజలు వెళ్లేలా చేస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిది.  ఇక్కడ నాలుగు మండలాలకు కలిపి రెండే రెండు 108 అంబులెన్సులు ఉంటే వాటిల్లో ఒకటి రిపేర్లో ఉందట.


ఇలాంటి నాయకుడు అవసరమా?
ఇన్ని మోసాలు, అన్యాయాలు చేసిన ఇలాంటి నాయకుడిని మీరు నమ్ముతారా? మీరు నమ్మరని.. ఇంటింటికీ కేజీ బంగారం, బోనస్‌గా బెంజ్‌ కారు ఇస్తానంటారు. ఇవీ నమ్మరని ప్రతి ఇంటికి మహిళా సాధికారమిత్రలను పంపించి ఒక్కొక్కరి చేతిలో రూ.3 వేలు పెడతారు. వద్దనకండి. రూ.5 వేలు కావాలని గుంజండి. అది మన డబ్బే. మన జేబుల్లోంచి దోచేసుకున్నదే. కానీ మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయండి. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత తీసుకురావడమన్నది జగన్‌ ఒక్కడి వల్లా కాదు. మీ అందరి మద్దతు, ఆశీర్వాదం కావాలి. అబద్ధాలు చెప్పే, అన్యాయం చేసే వారిని బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి తీసుకురావాలి.

రేపు మనందరి ప్రభుత్వం రాగానే ఏపీలోని పేదలు వైద్యం కోసం దేశంలోని ఏ నగరానికి వెళ్లినా, ఏ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నా అందుకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. కిడ్నీ సంబంధిత, తలసేమియా.. లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి నెలనెలా రూ.10 వేలు పింఛన్‌ ఇస్తాం. మహానేత కాలంలో జరిగినట్లే.. మూగ, చెవిటి పిల్లలు అందరికీ ఉచితంగా కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్లు చేయిస్తాం. క్యాన్సర్‌ చికిత్సకు కనీసం ఏడెనిమిది సార్లు కీమోథెరపీ చేయాలి.

ఇవాళ ఈ ప్రభుత్వం కేవలం రెండుసార్లకు మాత్రమే డబ్బులిస్తోంది. దీంతో ఆరు నెలల తర్వాత వారికి క్యాన్సర్‌ వ్యాధి తిరగబెడుతోంది. రోగులు చనిపోవాల్సిన దుస్థితి నెలకొంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్‌ సరిగా జరగడం లేదు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్పు చేస్తాం. ఆపరేషన్‌ పూర్తయ్యాక వైద్యులు సూచించే విశ్రాంతి కాలంలో పనులు చేసుకోలేరు కాబట్టి ఆర్థిక సాయం అందిస్తాం. మీ అందరి ఆశీస్సులతో ఆరోగ్యశ్రీలో ఈ విప్లవాత్మక మార్పులు గొప్పగా జరుగుతాయని ఆశిస్తున్నాను. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ విధానం రద్దు చేస్తాం.

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి బాబూ?
ఎన్నికలప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలను ఆయన ఎలాగూ అమలు చేయలేదు. ముఖ్యమంత్రి అయ్యాక తూర్పుగోదావరి జిల్లాకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలకూ దిక్కులేకుండా పోయింది. అసెంబ్లీ వేదికగా ప్రతి జిల్లాకు చంద్రబాబు హామీలు గుప్పించారు. తూర్పు గోదావరి జిల్లాలో పెట్రోలియం యూనివర్సిటీ, పెట్రోలియం కారిడార్, ఎల్‌ఎన్‌జీ టెర్మినల్, తునిలో నౌకా నిర్మాణ కేంద్రం, ఇదే జిల్లాలో ఇంకో పోర్టు, ఎలక్ట్రానిక్‌ హార్డ్‌ వేర్‌ పార్క్, విశాఖ నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్‌ కారిడార్, తెలుగు విశ్వవిద్యాలయం నిర్మాణం, కొబ్బరి ఆధారిత పరిశ్రమ, ఆక్వా కల్చర్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఉపరితల జల రవాణా మార్గాలను నిర్మిస్తామంటూ హామీలు ఇచ్చినా అవి ఎక్కడున్నాయో కనిపించడం లేదని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.

ఇదే జిల్లాలో 19 నియోజకవర్గాలకు 14 నియోజకవర్గాలలో టీడీపీ గెలిచింది. వాటితో సంతృప్తి చెందని చంద్రబాబు.. తాను అడ్డగోలుగా సంపాయించిన అవినీతి సొమ్ముతో వైఎస్సార్‌సీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేశాడు. తన సీట్ల సంఖ్యను 17కు పెంచుకున్నా చంద్రబాబు ఈ జిల్లాకు చేసిందేమిటి? అని ఇక్కడి ప్రజలు అడుగుతున్నారు. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పుష్కర ఎత్తిపోతల పథకం కట్టి 13 లిఫ్టులతో లక్షన్నర ఎకరాలకు సాగునీరు ఇచ్చినా, వాటిల్లో కొడవలి లిఫ్ట్‌ను నిర్వహించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నా అంటున్నారు.

ఈ ప్రభుత్వం నాలుగున్నర ఏళ్ల పాలనలో కొత్తగా 14వ లిఫ్టును కట్టాలని కోరినా పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. ఇంతకంటే దారుణమైన పాలన ఉంటుందా.. అని మీ అందరి తరఫున ప్రశ్నిస్తున్నా. నాన్నగారి హయాంలో ఏలేరు ప్రాజెక్టును ఆధునీకరించాలని రైతులు కోరితే ఆ రోజుల్లోనే ఆ మహానేత రూ.138 కోట్లు కేటాయించి పనులు ప్రారంభిస్తే నేటికీ 40 శాతం పనులు కూడా పూర్తి కాలేదన్నా అని రైతులు చెబుతుంటే బాధనిపిస్తోంది. వైఎస్‌ హయాంలోనే పోలవరం ప్రాజెక్టులో ఎడమ కాలువ పనులతో పాటు అనుబంధంగా మరో 25 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థ కూడా ఏర్పాటైంది. కానీ, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో తమ ప్రాంతానికి నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నా అని రైతన్నలు వాపోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement