ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు
ప్రత్తిపాడు: విధి ఆ కుటుంబంపై విషం చిమ్మింది. అన్యోన్య దాంపత్యంపై మృత్యు సంతకం చేసింది. నూరేళ్ల బంధాన్ని చిదిమేసింది. పండుగ ప్రయాణాన్ని.. విషాదంగా మార్చింది. భార్యభర్తలిద్దరినీ మృత్యువు కబళించింది. విదేశాల నుంచి వచ్చిన అమ్మానాన్నల మురిపెం తీరకుండానే.. ఒక చిన్నారిని అనాథను చేసింది. ఈ హృదయ విదారక ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడు సమీపంలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామానికి చెందిన జొన్నలగడ్డ రమేష్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.
వృత్తిరీత్యా భార్య నీలిమతో కలిసి సింగపూర్‌లో ఉంటున్నాడు. కుమార్తె అశ్విత (15) చెన్నైలో హాస్టల్‌లో ఉంటూ పదోతరగతి చదువుకుంటోంది. రమేష్కు చెన్నై బదిలీ అవడంతో ఎనిమిది రోజుల కిందట భార్యాభర్తలిద్దరూ చెన్నైలోని సొంతింటికి చేరుకున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో రమేష్, నీలిమ దంపతులు కుమార్తె అశ్వితతో సహా బుధవారం కారులో చెన్నై నుంచి కొవ్వూరుకు బయలుదేరారు. మార్గంమధ్యలో 16వ నంబరు జాతీయ రహదారిపై చినకోండ్రుపాడు సమీపాన వీరి వాహనం ముందు వెళుతున్న గుర్తుతెలియని వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమేష్ అక్కడిక్కడే మృతిచెందాడు. నుజ్జునుజ్జయిన కారులోంచి అతికష్టం మీద నీలిమ, అశ్వితలను స్థానికులు, పోలీసులు బయటకుతీసి 108 అంబులెన్సులో సమీపంలోని కాటూరి వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నీలిమ మృతిచెందింది. అశ్విత అపస్మారకస్థితిలోకి వెళ్లిందని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ప్రమాదస్థలాన్ని ఎస్సై అశోక్ పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment