గుంటూరు జిల్లా రాజుపాలెం క్రాస్ వద్ద హోదా ప్లకార్డు పట్టుకొని చిన్నారులతో నడుస్తున్న వైఎస్ జగన్
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : నడి నెత్తిన సూర్యుడు సుర్రుమనిపిస్తున్నా ఏమాత్రం లెక్క చేయకుండా అశేష ప్రజానీకం జననేత జగన్ అడుగులో అడుగులేసింది. పసి పిల్లలను చంకనెత్తుకుని వచ్చిన మహిళలు.. ‘అన్నొస్తున్నాడు..’ అంటూ పొలాల్లోంచి పరుగెత్తుకొచ్చారు. రాజన్న బిడ్డను చూద్దామని అవ్వాతాతలు రోడ్డుపక్కన గంటల తరబడి వేచి చూశారు. తమ బాధలు వినే నాయకుడు వచ్చారంటూ ప్రజలు ఊరూరా స్వాగతం పలికారు..తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో మోసపోయిన బాధితులు.. కష్టాలు అనుభవించే బడుగు, బలహీనులు అనేక మంది జగన్ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 116వ రోజు మంగళవారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కొనసాగింది. పెదనందిపాడు శివారు మొదలు అన్నారం క్రాస్‌రోడ్డు, పాలపర్రు, రాజుపాలెం క్రాస్ మీదుగా ఉప్పలపాడు వరకూ సాగింది.
కష్టమొచ్చిందన్నా... : కర్నూలు నుంచి వచ్చిన వలస కూలీలు.. కళ్లల్లో పుట్టెడు దుఃఖం దాచుకుంటూనే తమ గోడు చెప్పుకున్నారు. ‘పనులు దొరకడం లేదు.. బతకలేకపోతున్నాం.. కూలీ కూడా సరిగా వచ్చేట్టు లేదు.. మంచి రోజులు వస్తాయనే గంపెడాశతో బతుకీడుస్తున్నాం’ అని మల్లేష్ అనే వ్యక్తి అన్నాడు. యాదమ్మ, ఈశ్వరి, ప్రభావతి... ఇలా దాదాపు 15 మంది కూలీలు పొలాల్లోంచి పరుగెత్తుకొచ్చారు. రెక్కలు ముక్కలు చేసుకున్నా పిల్లలను చదివించలేకపోతున్నాం.. చూడయ్యా మట్టి పనికి పంపుతున్నాం.. అంటూ బొబ్బలెక్కిన తమ చిన్నారుల చేతులు చూపించారు. ఆనంద్‌పేట, అల్లీనగర్ తదితర ప్రాంతాల్లో అతిసారతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులు జగన్‌ను కలిశారు. చనిపోయిన వాళ్లకు నిజాయితీగా పరిహారం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. ప్రజల ప్రాణాలు పోతున్నా దిద్దుబాటు చర్యలు చేపట్టని మొద్దు నిద్రలో ఈ ప్రభుత్వం ఉందని దుమ్మెత్తిపోశారు. అందరి సమస్యలనూ జగన్ శ్రద్ధగా విన్నారు. మనందరి ప్రభుత్వం రాగానే అన్ని వర్గాల వారినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment