జన ప్రభంజనం | Pulivendula People Meet YS Jagan After Praja Sankalpa Yatra | Sakshi
Sakshi News home page

జన ప్రభంజనం

Published Mon, Jan 14 2019 2:33 PM | Last Updated on Mon, Jan 14 2019 2:33 PM

Pulivendula People Meet YS Jagan After Praja Sankalpa Yatra - Sakshi

వైఎస్‌ జగన్‌మోహన్‌తో వైఎస్సార్‌సీపీ మహిళా నేత అల్లె ప్రభావతి అనుచరులు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేతవైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు వచ్చినజనంతో పులివెందుల కిక్కిరిసింది. మూడు రోజులుగాప్రతిపక్షనేత స్వస్థలంలో ఉన్నారన్న విషయం తెలుసుకున్న ప్రజలు భారీగా తరలివచ్చారు. దారులన్నీ అటువైపే మళ్లాయి.దీంతో స్థానిక కార్యాలయం లోపల, బయట ఎక్కడ చూసినా జనమే జనం.. వైఎస్‌ జగన్‌ సీఎం అంటూ చేస్తున్ననినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది.

సాక్షి కడప/పులివెందుల : పులివెందులలోని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి క్యాంపు కార్యాలయం జనసంద్రంగా మారింది. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కడప మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డితో కలిసి సామాన్యుల కష్టాలను, సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి చొరవ చూపారు.

జగన్‌ను కలిసిన ఆరోగ్య మిత్ర,ఏపీ వీవీపీ సిబ్బంది, జియాలజిస్ట్‌లుఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని వివిధ ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న ఆరోగ్యమిత్రలు కలిశారు. పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ను మిత్రల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌ నాయుడుతోపాటు ఇతర సిబ్బంది కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. పదేళ్లకుపైగా ఈ పథకం విజయవంతానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని వారు తెలియజేశారు. అనేక రకాల పరీక్షల పేరుతో ఇబ్బందులు సృష్టించినా ఎదుర్కొనిముందుకు వెళుతున్న తమకు ఉద్యోగ భద్రత లేదని వివరించారు. అధికారంలోకి వస్తే అండగా ఉంటామని వారికి జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని 11రక్త నిధుల, 51రక్త నిల్వల కేంద్రాల సిబ్బంది వచ్చి ప్రతిపక్షనేతను కలిశారు. వైఎస్సార్‌ చొరవతో రూరల్, చైల్డ్‌ హెల్త్‌ మిషన్‌ ప్రాజెక్టు కింద రెడ్‌క్రాస్‌ వారి నిర్వహణలో ఉన్న తమకు తక్కువ జీతం వచ్చేదని.. వైఎస్సార్‌ హయాంలో మరింత పెంచడంతో రూ.5,500ల వరకు వచ్చేదన్నారు. అంతేకాకుండా ఒక్క ఏడాదిలోనే రెగ్యులర్‌ చేస్తామని కూడా హామీ ఇచ్చారని తెలిపారు. అయితే తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదని వివరించారు. అధికారంలోకి రాగానే తమ డిమాండ్లను పరిష్కరించి ఉద్యోగాలను రెగ్యులైజ్‌ చేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. దేవుడి ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిస్కరిస్తామని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్, రూరల్‌ డెవెలప్‌మెంట్‌ శాఖ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అమలు చేస్తున్న ఇందిర జలప్రభ కార్యక్రమం, ఎన్‌టీఆర్‌ జలసిరి పథకాల కింద 2011 నుంచి ఇప్పటివరకు పనిచేస్తున్న జియాలజిస్ట్‌లు జీతంతోపాటు ఎఫ్‌టీఈ కోర్సు, ఉద్యోగాలను రెగ్యులైజ్‌ చేయాలని జగన్‌ను కలిశారు. ఎన్నో సమస్యలు ఎదుర్కొని పనిచేస్తున్న ఆశించిన మేర అవకాశాలు కల్పించడంలేదని.. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడురోజుల పర్యటన విజయవంతంగా ముగి సింది. దీంతో పార్టీశ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

వైఎస్సార్‌సీపీలోకి భారీగా వలసలు..
వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలోకి రోజురోజుకు వలసలు పెరిగిపోతున్నాయి. పులివెందుల మున్సిపాలిటీలోని చెన్నారెడ్డి కాలనీకి చెందిన టీడీపీ టి.రఘునాథరెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆదివారం పులివెందులలోని పార్టీ కార్యాలయంలో ఆయనకు వైఎస్‌ జగన్‌ కండువా కప్పి ఆహ్వానించారు. రఘునాథరెడ్డితోపాటు మరో 20కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలోని హనుమగుత్తి ఎంపీటీసీ సత్యనారాయణరెడ్డి, పోట్లదుర్తి వైఎస్సార్‌సీపీ నాయకుడు సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో.. జమ్మలమడుగు ఇన్‌చార్జి డాక్టర్‌ సుధీకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోట్లదుర్తికి చెందిన టీడీపీ నాయకులు టి.వెంకటశివారెడ్డితోపాటు మరో 20కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న వెంకటశివారెడ్డి చేరడంతో వైఎస్సార్‌సీపీ పోట్లదుర్తిలో బలంగా మారింది. రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకులు చొప్పా యల్లారెడ్డి ఆధ్వర్యంలో ఖాజీపేట మున్సిపాలిటీ పరిధిలోని బోయినపల్లెకు చెందిన పలువురు నాయకులు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పులివెందులలో వారికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీలో చిన్న పెంచలయ్య, శేఖర్, శివయ్య, రామకృష్ణ, రాజులతోపాటు మరికొన్ని కుటుంబాలు పార్టీలో చేరాయి.

మీ నాయకుడు సుధీర్‌రెడ్డే.. గెలిపించుకోండి..
వైఎస్‌ జగన్‌జమ్మలమడుగుతోపాటు ఎర్రగుంట్ల నుంచి పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీ నేతలు వచ్చి ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పులివెందులలో కలిశా రు. ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలు కేరింతలు కొడుతుండగా ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ డాక్టర్‌ సుధీర్‌రెడ్డి చేయిని పట్టుకొని పైకి ఎత్తి మీ నాయకుడు సుధీర్‌రెడ్డే.. గెలిపించుకొని రండి అంటూ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు కష్టపడి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన సూచించారు. సుధీర్‌రెడ్డే మీ నాయకుడు గెలిపించుకోండని ప్రతిపక్షనేత అనగానే పెద్ద ఎత్తున జనాలు నినాదాలతో హోరెత్తించారు.

జగన్‌ను కలిసిన అల్లె ప్రభావతి
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని జమ్మలమడుగు వైఎస్సార్‌సీపీ నాయకురాలు అల్లె ప్రభావతి కలిశారు. ప్రత్యేకంగా సుమారు 50వాహనాలలో అనుచరులతో కలిసి వచ్చిన ఆమె పులివెందులలో వైఎస్‌ జగన్‌ను కలిసి చర్చించారు. ఈ సందర్భంగా ఎలాంటి చిన్న, చిన్న సంఘటనలు ఉన్నా.. అన్ని మరిచిపోయి పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని ఆయన సూచించారు.

వైఎస్‌ జగన్‌ను కలిసిన పలువురు నేతలు :
ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కడప మాజీ ఎంపీ వైఎస్‌అవినాష్‌రెడ్డిలను పలువురు నేతలు కలిశారు. హిందూపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు నదీమ్‌ అహమ్మద్‌ సుమారు 70వాహనాలలో తరలి వచ్చి వైఎస్‌ జగన్‌ను కలిశారు. పెద్ద ఎత్తున ముస్లిం సోదరులందరూ వైఎస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ నదీమ్‌తో మాట్లాడారు. అలాగే మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, అంజాద్‌ బాష, రవీంద్రనాథరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు, ఆకేపాటి అమరనాథరెడ్డి, వైఎస్‌ అభిషేక్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, తదితర నేతలు కలిసి మాట్లాడారు.

వైఎస్‌ భాస్కర్‌రెడ్డి ఇంట్లో కాసేపు
పులివెందులలోని భాకరాపురంలో ఉన్న పులివెం దుల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులు వైఎస్‌ భాస్కర్‌రెడ్డి ఇంటికి వెళ్లి ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాసేపు గడిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్‌ భాస్కర్‌రెడ్డితోపాటు మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ముచ్చటించారు.

రోజంతా ప్రజలతోనే..
ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఉదయం 9గంటలనుంచి రాత్రి 9గంటల వరకు ప్రజలతోనే మమేకమయ్యారు. పార్టీ కార్యాలయంలో వివిధ ప్రాంతాలనుంచి ప్రజల కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు. యువకులు ఎక్కువగా సెల్ఫీలు దిగుతూ కనిపించారు. ఎక్కడ చూసినా సెల్‌ఫోన్లతోనే యువత ఫొటోలు తీసుకునేందుకు ప్రయత్నించారు. వచ్చిన ఏ ఒక్కరిని నిరాశపర్చకుండా అందరితో మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌  సెల్ఫీలకు అవకాశం ఇచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం భోజన విరామం అనంతరం, రాత్రి వరకు అనుక్షణం ప్రజలతోనే వైఎస్‌ జగన్‌ బిజీబిజీగా గడిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement