![YS Jagan Visit Tirupati Special Story - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/11/ys.jpg.webp?itok=0yOJBThl)
అలిపిరి మార్గంలో అభిమాన జన సందోహం
చారిత్రాత్మక పాదయాత్రను పూర్తిచేసుకుని అడుగుపెట్టిన జననేతకు గురువారం అపూర్వ స్వాగతం లభించింది. రేణిగుంట మొదలు తిరుమల వరకూ దారిపొడవునా జనజాతర తలపించింది. తిరుపతి రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. జై జగన్ నినాదాలతో హోరెత్తిపోయాయి. ఆత్మీయ స్వాగతం పలికిన ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. జనసందోహం మధ్య ఆయన వాహనం కదలడానికి చాలా సమయం పట్టింది. అలిపిరి నుంచి తిరుమలకు సాగించిన కాలినడకనూ వేలాదిగా అభిమానులు అనుసరించారు. సాధారణ భక్తునిలా జగన్ శ్రీవారిని దర్శించుకున్నారు.
చిత్తూరు, తిరుపతి తుడా/ తిరుమల : జననేతకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. రేణిగుంట రైల్వే స్టేషన్ వద్ద వైఎస్సార్ సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బియ్యపు మధుసూదన్‌రెడ్డి స్వాగతం పలికారు. ఏర్పేడు, శ్రీకాళహస్తి నుంచి వచ్చిన వేలాది మంది కార్యకర్తలతో రైల్వేస్టేషన్ నిండిపోయింది. జగన్ని నాదాలతో మార్మోగింది. తనకోసం వచ్చిన అభిమానులకు అభివాదం చేసి చంద్రగిరి–రేణిగుంట బైపాస్ రోడ్డు మార్గం ద్వారా తిరుపతికి బయలుదేరారు. చంద్రగిరి నియోజకవర్గం తుమ్మలగుంట వద్ద నగరంలోకి ప్రవేశించిన జగన్‌కు ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వినూత్నంగా స్వాగతం పలికారు. రోడ్డుకి రువైపులా మామిడి, అరటి తోరణాలు, బెలూన్లు ఏర్పాటు చేశారు. మహిళలు గుమ్మడికాయలు కొట్టి దిష్టితీశారు. పద్మావతి గెస్ట్‌హౌస్‌లో కొంతసేపు సేదదీరారు. అనంతరం ఎమ్మెల్యేలు, కార్యకర్తలను పలకరించారు. జననేత కాన్వాయ్ తిరుపతి బాలాజీకాలనీలోని జ్యోతిరావ్ పూలే సర్కిల్‌కు చేరుకోగానే కార్యకర్తలు ప్లకార్డులతో ఘన స్వాగతం పలికారు. దీనికి భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యం వహించారు.
మార్మోగిన గోవింద నామస్మరణ..
అలిపిరి మెట్ల మార్గంలో గోవింద నామస్మరణ మార్మోగింది. జగన్‌తో పాటు వేలాది మంది కార్యకర్తలు కాలినడకన నడిచారు. అలిపిరి పాదాల మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మెట్లకు నమస్కరించా రు. సామాన్య భక్తుని వలే కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తూ శ్రీవారిపై అపారమైన భక్తిని చాటుకున్నారు. మార్గ మధ్యంలో ఆంజనేయస్వామిని దర్శించుకుని కొబ్బరికాయ కొట్టారు. వడివడిగా మెట్లు ఎక్కిన వైఎస్.జగన్ ఎక్కడా ఆగకుండా ముందుకు కదిలారు. అలుపు లేకుండా పాదయాత్ర నిర్వహించిన జననేత తిరుమల మెట్లు ఎక్కడంలోనూ అదే ఉత్సాహాన్ని ప్రదర్శించారు. మెట్ల దారిలో సాటి భక్తులను పలకరిస్తూ ఆత్మీయ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. మార్గ మధ్యంలో నరసింహస్వామి ఆలయం మీదుగా మోకాళ్ల పర్వతం నుంచి తిరుమల చేరుకున్నారు. సామాన్య భక్తునిలా తిరుమలకు కాలినడకన వస్తున్న జననేతను పలకరించడానికి భక్తులు ఆసక్తి కనబరిచా రు. అలిపిరి నుంచి తిరుమల చేరేవరకు జగన్ అభిమానులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గోవింద నామస్మరణ చేస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం 1.35 గంటలకు అలిపిరి వద్ద మొదలైన నడక 4.30గంటలకు తిరుమలకు చేరుకుంది. పద్మావతి గెస్ట్‌హౌస్‌లో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. 6 గంటల సమయంలో స్వామి దర్శనానికి వెళ్లారు. రైల్వేస్టేషన్‌లో మాజీ ఎంపీలు మిథున్ రెడ్డి, వరప్రసాద్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కరుణాకర రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, వెంకటేగౌడ తదితరులు స్వాగతం పలికారు.
టౌన్‌క్లబ్ వద్ద భారీగా అభిమానులు
టౌన్‌క్లబ్ సర్కిల్‌కు రాగానే అక్కడ వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, దివ్యాంగులు చేరుకుని అపూర్వ స్వాగతం పలికారు. మహతి ఆడిటోరియం వద్ద వైస్సార్‌సీపీ మైనారిటీ నాయకులు ఖాద్రీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముస్లిం మహిళలు ప్లకార్డులతో రోడ్డుకిరువైపులా నిల్చొని జైజగన్ అంటూ అభిమానాన్ని చాటారు. అనంతరం జ్యోతి థియేటర్ సర్కిల్ వద్ద వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. ఎస్వీ మెడికల్ కళాశాల చేరుకోగానే అక్కడ అభిమానులు రంగురంగుల కాగితాలను వెదజల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment