
ప్రత్తిపాడు: రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని.. వేగంగా వెళుతున్న కారు వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో నలుగురు స్నేహితులు మృత్యువాత పడిన ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా విజయవాడ వన్‌టౌన్ ఫిష్ మార్కెట్ బురదవారి వీధికి చెందిన చుక్కా గౌతమ్‌రెడ్డి (26), కాకినాడ నగరంలోని జగన్నాథపురం కాలనీకి చెందిన వాడపల్లి అనంత పద్మనాభ చైతన్య పవన్ (25), విశాఖ జిల్లా పెందుర్తి మండలం దేశపాత్రునిపాలెంకు చెందిన పిరిధి సౌమిక (25) విశాఖలోని వరాహ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ కళాశాలలో 2014–19 బ్యాచ్ ఆర్కిటెక్చర్ చదివారు.
వీరు ముగ్గురూ విశాఖకు చెందిన తమ స్నేహితురాలు పావనితో కలిసి సోమవారం మధ్యాహ్నం విజయవాడ నుంచి అరుణాచలంకు కారులో బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు సాయంత్రం 5 గంటల సమయంలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం సమీపంలో టైరు పంక్చర్ కావడంతో జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది.
కారులో ప్రయాణిస్తున్న గౌతమ్‌రెడ్డి, అనంత పద్మనాభ చైతన్య పవన్, సౌమిక అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలై కొనఊపిరితో ఉన్న పావనిని 108లో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. వీరిలో చైతన్య పవన్, సౌమిక వైజాగ్‌లో ఉద్యోగం చేస్తున్నారని, గౌతమ్‌రెడ్డి ఇంటినుంచే ప్రాజెక్టులు చేస్తూ ఉంటారని స్నేహితులు చెబుతున్నారు. పావని వివరాలు తెలియాల్సి ఉంది.