సర్వేయర్ మురళీకృష్ణ నుంచి వివరాలు సేకరిస్తున్న ఏసీబీ అధికారి
విశాఖ క్రైం: సర్వేయర్ డి.మురళీకృష్ణ అంబేడ్కర్ లంచావతారమెత్తాడు. క్వారీ లీజు అనుమతి కోసం రూ.50 లంచం డిమాండ్ చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. నగరంలో ఉషోదయ జంక్షన్ సమీపంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గనులు, భూగర్భశాఖ సంచాలకుని కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు వలపన్ని ఆయనను పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్ తెలిపిన వివరాలిలా.. పరవాడ మండలం రావాడ గ్రామానికి చెందిన డి.నీలకంఠం 2011లో రావాడ గ్రామంలోని సర్వే నంబర్ 418లోని రెండు హెక్టార్లలో క్వారీ లీజు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అనుమతుల కోసం అప్పటి నుంచి కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. ఈ నెల 28న సర్వే చేయడానికి వస్తానని సర్వేయర్ మురళీకృష్ణ చెప్పాడు.
అయితే సర్వే అనుకూలంగా చేసి క్వారీ మంజూరయ్యేలా చేయడానికి రూ.50 వేలు అవుతుందని చెప్పాడు. అంత ఇచ్చుకోలేనని నీలకంఠం చెప్పినా ఆయన వినిపించుకోలేదు. చేసేదిలేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో గనులు, భూగర్భశాఖ కార్యాలయంలో మురళీకృష్ణ అంబేడ్కర్‌కు దరఖాస్తుదారుడు రూ. 50 వేలు లంచం ఇచ్చాడు. మురళీకృష్ణ ఆ డబ్బులు తీసుకొని టేబుల్ డెస్క్‌లో పెడుతుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకున్న రూ.50 వేలు(500 నోట్లు) నగదును సీజ్ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
2008లో టెక్కలిలో ఉద్యోగం
2008లో శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఏపీ గనులు, భూగర్భ శాఖ సంచాలకుని కార్యాలయంలో సర్వేయర్‌గా పనిచేశారు. అక్కడి నుంచి 2012లో అనకాపల్లికి బదిలీ అయ్యారు. అక్కడ 2015 జూలై వరకు పని చేసి, ఆగస్టులో విశాఖలోని భూగర్భశాఖ సంచాలకుని కార్యాలయానికి సర్వేయర్‌గా బదిలీపై వచ్చాడు. అప్పటి నుంచి ఉన్నతాధికారికి దగ్గరై కార్యాలయంలో మురళీకృష్ణ అన్నీతానై చక్రం తిప్పుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. క్వారీలకు సంబంధించిన సర్వే చేయాలంటే ఆయనదే కీలకపాత్ర అని కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
విలువైన డ్యాక్యుమెంట్లు లభ్యం
అనకాపల్లి: అనకాపల్లిలోని సర్వేయర్ డి.మురళీకృష్ణ అంబేడ్కర్ ఇంట్లో ఏసీబీ అధికారులు చేసిన తనిఖీల్లో పలు డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సోదాలు జరిగాయి. అచ్యుతాపురంలో ఓ ఆస్తికి సంబంధించిన రూ.16 లక్ష ల విలువ చేసే పత్రాలు, అనకాపల్లిలో ఇంటి పత్రాలు లభించినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగి నాగరాజు ఇంట్లో రూ.60 లక్షల విలువ గల పత్రాలు దొరికినట్టు చెప్పారు. పత్రాలను పరిశీలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు.
విస్తృతంగా సోదాలు
విశాఖలోని మూడు చోట్ల ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు చేశారు. అనకాపల్లిలోని ఆర్టీసీ కాలనీ గిరిజా టవర్స్‌లోని ఫ్లాట్ నంబర్–309లో నివాసం ఉంటున్న సర్వేయర్ డి.మురళీకృష్ణ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కార్యాలయంలో డాక్యుమెంట్లు పరిశీలించారు. క్వారీలకు సంబంధించిన ప్లాన్‌లు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలో తోటి ఉద్యోగులను విచారించారు. అలాగే విశాఖలో ఉంటున్న మురళీకృష్ణ స్నేహితుడు, విశ్రాంత ఉద్యోగి నాగరాజు ఇంట్లో కూడా తనిఖీలు చేశారు. ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్ నేతృత్వంలో సీఐలు గణేష్, రమేష్, మూర్తి, సిబ్బంది ఈ దాడులు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment