Surveyor
-
భిన్న ఉపాధి...తొలి మహిళా షిప్ సర్వేయర్
స్త్రీలు సముద్రయానంలో పని చేయడానికి వెనుకాడతారు.సముద్రం మీదకు వెళ్లడానికి ధైర్యమున్నా కుటుంబాలు అంగీకరించవు. కాని పూజా ఛతోత్ దేశంలో మొదటి మహిళా షిప్ సర్వేయర్ కాగలిగింది.ఒక షిప్ తయారీ మొదలైనప్పటి నుంచీ అది సముద్రం మీద చేసే ప్రయాణం వరకూ అన్ని ప్రమాణాలు పాటించేలా చూసే ఉద్యోగమే షిప్ సర్వేయర్. పూజా ఛతోత్ పరిచయం. భారీ నౌక ప్రయాణిస్తూ ఉంటుంది. కనుచూపు మేరా నీలి రంగు సముద్రం తప్ప వేరే ఏమీ ఉండదు. ఉప్పునీటి గాలులు ముఖాన తాకుతుంటాయి. ఆ నౌక సముద్రయానానికి సురక్షితం అనే ఆమోదం తెలిపిన షిప్ సర్వేయర్ డెక్ మీద నిలబడి డ్యూటీ సమర్థంగా చేస్తున్నాననే తృప్తితో చిరునవ్వు చిందిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? పూజా ఛతోత్ను అడగాలి. ఆమె ఇప్పుడు బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత సముద్రయాన సంస్థ ‘లాయెడ్స్ రిజిస్టర్’లో షిప్ సర్వేయర్‌గా పని చేస్తోంది. ఇతర దేశాలలో షిప్ సర్వేయర్లుగా మహిళలు ఇదివరకే పని చేస్తున్నా మన దేశంలో పూజా ఛతోత్ మాత్రమే తొలి మహిళా సర్వేయర్ కాగలిగింది. చిన్నప్పటి ప్రభావం పూజా ఛతోత్ది కేరళలోని కన్నూర్ జిల్లా. అక్కడి ‘ఎజిమల’ అనే చోట ఆసియాలోనే అతి పెద్దదైన భారత నావెల్ అకాడెమీ ఉంది. నావెల్ కేడెట్ల శిక్షణ అక్కడే జరుగుతుంది. బాల్యంలో తల్లిదండ్రులతో కలిసి అకాడెమీని సందర్శించిన పూజా శిక్షణలో ఉన్న నావెల్ కేడెట్లను చూసి స్ఫూర్తి పొందింది. ముఖ్యంగా చాలామంది పురుష కేడెట్ల మధ్య ఒకే ఒక మహిళా ఆఫీసర్‌ను చూసింది పూజ. అప్పుడే ఆ ఆఫీసర్లాగానే తానూ సముద్రం మీద పని చేసే ఉద్యోగం చేయాలని అనుకుంది. ‘నేను హైస్కూల్ చదువుతున్నప్పుడే అనుకున్నాను ఆఫీసులో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు పని చేసే ఉద్యోగం చేయకూడదని’ అంది పూజ. నావెల్ ఆర్కిటెక్చర్ చదివి... సముద్రయాన రంగంలో పని చేయాలనుకున్నది పూజ. కొచ్చిలో నావెల్ ఆర్కిటెక్చర్‌ను 2020లో పూర్తి చేసింది. ఆ తర్వాత ఒక మెరైన్ కంపెనీలో ట్రయినీ నావెల్ ఆర్కిటెక్ట్‌గా చేరింది కాని ఆ పని రుచించలేదు. సముద్రపుగాలి తగలాలి అనుకుంది. ఆ సమయంలోనే తండ్రి స్నేహితుడొకడు షిప్ సర్వేయర్ ఉద్యోగం గురించి తెలిపాడు. అయితే ఆ రంగంలో స్త్రీలు ఇప్పటి దాకా లేరు. ‘నువ్వు మొదటిదానివి ఎందుకు కాకూడదు’ అన్నాడు తండ్రి. ఆ ్రపోత్సాహంతో లాయెడ్స్ రిజిస్టర్లో షిప్ సర్వేయర్‌గా ఉద్యోగం సంపాదించింది పూజ. రెండేళ్ల శిక్షణ షిప్ సర్వేయర్ మానసిక బలం, శారీరక సామర్థ్యం అవసరమయ్యే ఉద్యోగం. నౌక తయారవుతున్నప్పటి నుంచి సముద్రం మీదకు చేరే వరకూ చేరాక కూడా అన్ని నిర్మాణ, సాంకేతిక విభాగాలూ నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నాయా లేదా చూడటమే ఈ ఉద్యోగం. నేల మీదా, సముద్రం మీదా పని ఉంటుంది. ఇందుకు కఠినమైన శిక్షణ అవసరం. లాయెడ్స్ రిజిస్టర్ సంస్థ ఆమెకు రెండేళ్లు శిక్షణ ఇచ్చింది. నౌకను తయారు చేసే మెటీరియల్ సర్వే శిక్షణ ముంబైలో తీసుకుంటే తయారీ విధానం సర్వే శిక్షణ కొచ్చిలో, గోవాలో తీసుకుంది. టెక్నికల్ శిక్షణ అంతా వైజాగ్, సింగపూర్లలో జరిగింది. రెండేళ్ల మొత్తం శిక్షణను సమర్థతతో పూర్తి చేయడం వల్ల ఇటీవల ఆమె షిప్ సర్వేయర్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకుంది. పూజను చూసి మరెందరో యువతులు ఈ రంగంలోకి వస్తారు. ఏ రంగమూ మగవారి స్వీయసామ్రాజ్యం కాదని నిరూపిస్తారు. -
సర్వే బాధ్యతలు గ్రామ సర్వేయర్లకు..
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సర్వేయర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. భూముల సర్వే సహా ఇతర ముఖ్యమైన మండల సర్వేయర్ల బాధ్యతలను వీరికి బదలాయించింది. సర్వేను వేగంగా నిర్వహించి దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మండల సర్వేయర్లు మండలానికి ఒక్కరే ఉండడంతో సర్వే వ్యవహారాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. సర్వే కోసం భూయజమానులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది. దీనిపై ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులొస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్వే పనులు వేగంగా పూర్తి చేసేందుకు మండల సర్వేయర్ల బాధ్యతలను గ్రామ, వార్డు సర్వేయర్లకు అప్పగించింది. 1983 తర్వాత.. గ్రామ స్థాయికి సర్వే సర్వీసు ప్రధానంగా రికార్డుల ప్రకారం భూముల సరిహద్దుల్ని నిర్ధారించే ఎఫ్.లైన్ సర్వీసును గ్రామ సర్వేయర్లకు బదలాయించారు. ఎఫ్ఎంబీ (ఫీల్డ్ మెజర్మెంట్ బుక్), ఎల్పీఎం (ల్యాండ్ పార్సిల్ మ్యాప్), పీపీఎం (ప్రోపర్టీ పార్సిల్ మ్యాప్) ప్రకారం భౌతికంగా క్షేత్రస్థాయిలో హద్దుల్ని తెలిపేదాన్ని ఎఫ్ లైన్ సర్వీసుగా చెబుతారు. ఎవరైనా తమ భూములు, స్థలాల్ని విక్రయించినప్పుడు, భూమి హద్దుల్ని తనిఖీ చేసుకోవాలనుకున్నప్పుడు సర్వే కోసం రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకుంటారు. 1983కి ముందు సర్వే శాఖలో కింది స్థాయిలో ఉన్న తాలూకా సర్వేయర్ ఈ పని చేసేవారు. ఆ తర్వాత మండల వ్యవస్థ రావడంతో మండల సర్వేయర్లు ఆ బాధ్యత నిర్వహిస్తున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనను గ్రామ స్థాయికి తీసుకువచ్చి గ్రామ, వార్డు సచివాలయాలు నెలకొల్పారు. సచివాలయాల్లో ప్రత్యేకంగా 11 వేల మంది సర్వేయర్లను ప్రభుత్వం నియమించింది. ఇప్పుడు మండల సర్వేయర్ల బాధ్యతల్ని వాళ్లకి అప్పగించి సర్వే సర్వీసుల్ని ప్రజలకు మరింత దగ్గరకు చేర్చింది. ఇందుకనుగుణంగా సర్వే ప్రక్రియలో మార్పులు చేసింది. 15 రోజుల్లో సర్వే దరఖాస్తును పరిష్కరించాలని నిర్దేశించింది. గ్రామ సర్వేయర్ సర్వే నిర్వహించాల్సిన విధానం, అభ్యంతరాల పరిశీలన, దరఖాస్తును తిరస్కరిస్తే ఏ కారణాలతో తిరస్కరించాలో మార్గదర్శకాలు ఇచ్చింది. సాధారణంగా నిర్వహించే భూముల రికార్డుల నిర్వహణను కూడా వారికే అప్పగించింది. (క్లిక్: సంక్షేమాభివృద్ధి పథకాలు ఆపేయాలట!) 27 రోజుల్లో సబ్ డివిజన్ పూర్తి చేయాలి భూముల సబ్ డివిజన్ బాధ్యతను కూడా మండల సర్వేయర్ నుంచి గ్రామ సర్వేయర్లకు బదలాయించింది. భూముల రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యుటేషన్, సబ్ డివిజన్ చేసుకోవాలని ఇటీవల ప్రభుత్వం నిర్దేశించింది. ఈ క్రమంలో సబ్ డివిజన్ కేసుల్ని వేగంగా పూర్తి చేసేందుకు ఆ బాధ్యతలు గ్రామ సర్వేయర్లకు అప్పగించింది. స్క్రుటినీ బాధ్యతల్ని మాత్రం మండల సర్వేయర్లు చేస్తారు. 27 రోజుల్లో సర్వే సబ్ డివిజన్ పూర్తి చేయాలని నిర్దేశించింది. సర్వే దరఖాస్తుల తిరస్కరణ ఆర్డీవో, సబ్ కలెక్టర్ స్థాయిలోనే చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి రెండు వేర్వేరు సర్క్యులర్లను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూపరిపాలనా ప్రధాన కమిషనర్ సాయి ప్రసాద్ విడుదల చేశారు. (క్లిక్: ఏపీలో 4 వేల ‘ఈవీ’ చార్జింగ్ స్టేషన్లు) -
అంత లంచం ఇచ్చుకోలేనయ్యా..
మల్దకల్: తమ పేరుపై ఉన్న పట్టాభూమిని సర్వే చేసి రిపోర్టు ఇచ్చేందుకు సర్వేయర్ ఏకంగా రూ.60 వేలు డిమాండ్ చేయడంతో, మనస్తాపంతో ఓ రైతు తహసీల్దార్ కార్యాలయం ఎదుటే పురుగుల మందు తాగాడు. ఈ ఘటన శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్లో చోటు చేసుకుంది. మద్దెలబండ గ్రామానికి చెందిన బుడ్డ వీరన్న, నర్సింహులు, భీమేష్‌లు అన్నదమ్ములు. వీరికి గ్రామ శివారులో సర్వే నంబర్ 64లో 3.16 ఎకరాల పొలం ఉంది. 2015లో ఉపాధి నిమిత్తం ముగ్గురూ వలస వెళ్లి.. తిరిగి 2018లో స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ సమయంలోనే వీరి పొలంలో 1.10 ఎకరాలను రాములు నాయక్ ఆక్రమించుకున్నాడు. దీనిపై జిల్లా రెవెన్యూ, పోలీసులకు సదరు రైతులు ఫిర్యాదు చేశారు. న్యాయం కోసం కోర్టును ఆశ్ర యించగా.. వీరికి అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని అధికారుల ను వేడుకోగా, సర్వే చేసి రిపోర్టు అందజేస్తే, న్యా యంచేస్తామని చెప్పారని ఆ రైతులు తెలిపారు. రూ. 60 వేలు ఇస్తేనే.. కొత్త పట్టాదారు పాసుపుస్తకం ఉన్న తన భూమిని సర్వే చేసి, రిపోర్టు ఇవ్వా లని సర్వేయర్ బ్రహ్మయ్యను వారు సంప్రదించా రు. భూ ఆక్రమణదారుడు తనకు రూ.50 వేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని, మీరు రూ.60 వేలు ఇస్తే రిపోర్టు అనుకూలంగా ఇస్తానని సర్వేయర్ చెప్పినట్లు బాధితులు తెలిపారు. అంత డబ్బు ఇవ్వలేమని బతిమాలుకున్నా సర్వేయర్ కనికరించలే దన్నారు. దీంతో మనస్తాపం చెందిన బుడ్డ వీరన్న శుక్రవారం సాయంత్రం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన కార్యాలయ సిబ్బంది, రైతులు వెంటనే ఆయనను గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నా.. మెరుగైన వైద్యం కోసం కర్నూలు తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. ఈ విషయంపై మల్దకల్ తహసీల్దార్ మీర్ అజాం అలీని వివరణ కోరగా, బుడ్డ వీరన్న పేరున పట్టా భూమి ఉన్న విషయం వాస్తవమేనని తెలిపారు. కోర్టులో విచారణ కొనసాగుతున్నట్లు తెలిసిందని, అందుకే రైతుకు న్యాయం చేయలేకపోయామని తప్పించుకునే ప్రయత్నం చేశారు. -
మొన్న నాగరాజు.. నేడు వెంకటేశ్వర్‌రెడ్డి
సాక్షి, రంగారెడ్డి/మేడ్చల్ : కోటి 10 లక్షల లంచం తీసుకొని దొరికిపోయిన కీసర తహసీల్దార్ నాగరాజు ఘటన మరువకముందే మరో రెవెన్యూ అవినీతి అధికారి పట్టుబడ్డాడు. అయితే ఈసారి నాగరాజు తరహాలో కోటి రూపాయలు కాకుండా 5వేల రూపాయలు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి దొరికిపోయాడు. ఈ ఘటనతో తెలంగాణలో రెవెన్యూ అధికారుల తీరు ఏ మాత్రం మారలేదన్న విషయం బయటపడింది.(బయటపడుతున్న కీసర ఎమ్మార్వో అక్రమాలు) వివరాలు.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వెంకటేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి సర్వేయర్ సూపరిండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శంషాబాద్ తొండుపల్లిలోని 20 ఎకరాల స్థల వివాదంపై ఒక వ్యక్తిని 15వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. కాగా బుధవారమే 10వేల రూపాయల లంచం అందుకున్న వెంకటేశ్వర్‌రెడ్డి గురువారం మరో 5వేల రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. వెంకటేశ్వర్‌రెడ్డి పనిచేస్తున్న కార్యాలయంతో పాటు అతని నివాసంలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీశాఖకు లేఖ రాసిన ఏసీబీ మరోవైపు తహసీల్దార్ నాగరాజు లంచం తీసుకున్న కోటి 10 లక్షల రూపాయల పై ఏసీబీ విచారణను వేగవంతం చేసింది. ఈ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. వీరి వెనుక ఉన్న అసలు సూత్ర దారులు ఎవరు అన్న కోణంలో ఏసీబీ కేసును విచారిస్తుంది. ఈ ఘటనపై గురువారం ఏసీబీ ఐటి శాఖకు లేఖ రాసింది. మనీ ట్రాన్స్ సెక్షన్ ఎక్కడి నుంచి జరిగిందో తెలపాలంటూ ఐటిశాఖను లేఖలో కోరింది. నాగరాజుకు సంబంధించిన ఆస్తుల వివరాలపై కూపీ లాగుతున్న ఏసీబీ .. విదేశాల్లో సైతం పెట్టుబడులు పెట్టినట్టు తెలిపింది. (కీసర భూదందాలో రాజకీయ హస్తం!) ఇదే విషయమై ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ లో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ప్రభుత్వ ఉద్యోగులు లంచాలకు మరిగారు. అధికారులు లంచాలు డిమాండ్ చేస్తే ఏసీబీ కి ఫిర్యాదు చేయాలి. గతంలో నాగరాజు పనిచేసిన చోట రికార్డులను ఏసీబీ పరిశీలిస్తోంది. నాగరాజు కు మధ్యవర్తిత్వం వహించిన ఆంజిరెడ్డి ,శ్రీనాథ్ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లను పరీశీలిస్తున్నాం. నిందితులను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నాం. అంటూ తెలిపారు. -
సర్వేయర్ ఆస్తులు రూ.25 కోట్లు!
పెనమలూరు/దేవరాపల్లి(మాడుగుల): ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో కృష్ణా జిల్లా పెనమలూరు మండల సర్వేయర్ కొల్లి హరిబాబు ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు. బుధవారం ఆయన నివాసంలో జరిపిన సోదాల్లో.. రూ.25 కోట్ల విలువ చేసే ఆస్తులతోపాటు నగదు, ఆభరణాలు లభించాయి. దీంతో ఆయన్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని పామర్రు మండలం కనుమూరుకు చెందిన హరిబాబు(52) 1993లో సర్వేయర్‌గా చేరారు. గన్నవరం, విజయవాడ, పెనమలూరు ప్రాంతాల్లో సర్వేయర్‌గా విధులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని ఫిర్యాదులు రావడంతో ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ ఆదేశాల మేరకు అధికారులు బుధవారం తెల్లవారుజామున విజయవాడ రామచంద్రనగర్ ప్రాంతం మహాలక్ష్మీ నిలయం అపార్టుమెంట్లో ఉంటున్న హరిబాబు ఇంట్లో, ఇంకా రామచంద్రపురం, పెనమలూరుతోపాటు మరో ఐదుచోట్ల సోదాలు చేశారు. తనిఖీల్లో హరిబాబు పెద్ద ఎత్తున ఆస్తులు కూడపెట్టినట్లు గుర్తించారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హరిబాబు భార్య పద్మజ పేరున విజయవాడ రామచంద్రనగర్‌లో 1,450 చదరపు అడుగుల విస్తీర్ణంతో విలువైన అపార్టుమెంట్ ఉన్నట్టు గుర్తించారు. అలాగే విజయవాడ కార్మెల్నగర్లో 243 చదరపు గజాలు, నాగార్జుననగర్‌లో 206 చదరపు గజాలు, గన్నవరం బహుబలేంద్రునిగూడెంలో 822.6 చదరపు అడుగుల స్థలం, నూజివీడు గొల్లపల్లెలో 375 చదరపు గజాల స్థలం, విజయవాడ క్రీస్తురాజపురంలో 135 చదరపు గజాల స్థలం ఉన్నట్లు గుర్తించారు. అలాగే కుమార్తె హారిక పేరున పోరంకిలో 252 చదరపు గజాల స్థలం, మరో కుమార్తె హర్షిత పేరున 252 చదరపు గజాల స్థలాన్ని సైతం గుర్తించారు. ఇవిగాక బ్యాంకు బ్యాలెన్స్ రూ.11 లక్షలు, ఇంట్లో 49 వేల నగదు, మూడు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో ఏసీబీకి చిక్కిన మరో సర్వేయర్ ఇదిలా ఉండగా విశాఖ జిల్లా దేవరాపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ ఎల్.శామ్యూల్ లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. భూమి సర్వే రిపోర్టుకోసం రూ.ఆరు వేలు లంచం డిమాండ్ చేసి చివరకు రూ.3వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. పెదనందిపల్లికి చెందిన రైతు నుంచి ఆ సొమ్ము తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణ ప్రసాద్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
గనుల శాఖలో అవినీతి చేప
విశాఖ క్రైం: సర్వేయర్ డి.మురళీకృష్ణ అంబేడ్కర్ లంచావతారమెత్తాడు. క్వారీ లీజు అనుమతి కోసం రూ.50 లంచం డిమాండ్ చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. నగరంలో ఉషోదయ జంక్షన్ సమీపంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గనులు, భూగర్భశాఖ సంచాలకుని కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు వలపన్ని ఆయనను పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్ తెలిపిన వివరాలిలా.. పరవాడ మండలం రావాడ గ్రామానికి చెందిన డి.నీలకంఠం 2011లో రావాడ గ్రామంలోని సర్వే నంబర్ 418లోని రెండు హెక్టార్లలో క్వారీ లీజు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అనుమతుల కోసం అప్పటి నుంచి కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. ఈ నెల 28న సర్వే చేయడానికి వస్తానని సర్వేయర్ మురళీకృష్ణ చెప్పాడు. అయితే సర్వే అనుకూలంగా చేసి క్వారీ మంజూరయ్యేలా చేయడానికి రూ.50 వేలు అవుతుందని చెప్పాడు. అంత ఇచ్చుకోలేనని నీలకంఠం చెప్పినా ఆయన వినిపించుకోలేదు. చేసేదిలేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో గనులు, భూగర్భశాఖ కార్యాలయంలో మురళీకృష్ణ అంబేడ్కర్‌కు దరఖాస్తుదారుడు రూ. 50 వేలు లంచం ఇచ్చాడు. మురళీకృష్ణ ఆ డబ్బులు తీసుకొని టేబుల్ డెస్క్‌లో పెడుతుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకున్న రూ.50 వేలు(500 నోట్లు) నగదును సీజ్ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. 2008లో టెక్కలిలో ఉద్యోగం 2008లో శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఏపీ గనులు, భూగర్భ శాఖ సంచాలకుని కార్యాలయంలో సర్వేయర్‌గా పనిచేశారు. అక్కడి నుంచి 2012లో అనకాపల్లికి బదిలీ అయ్యారు. అక్కడ 2015 జూలై వరకు పని చేసి, ఆగస్టులో విశాఖలోని భూగర్భశాఖ సంచాలకుని కార్యాలయానికి సర్వేయర్‌గా బదిలీపై వచ్చాడు. అప్పటి నుంచి ఉన్నతాధికారికి దగ్గరై కార్యాలయంలో మురళీకృష్ణ అన్నీతానై చక్రం తిప్పుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. క్వారీలకు సంబంధించిన సర్వే చేయాలంటే ఆయనదే కీలకపాత్ర అని కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. విలువైన డ్యాక్యుమెంట్లు లభ్యం అనకాపల్లి: అనకాపల్లిలోని సర్వేయర్ డి.మురళీకృష్ణ అంబేడ్కర్ ఇంట్లో ఏసీబీ అధికారులు చేసిన తనిఖీల్లో పలు డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సోదాలు జరిగాయి. అచ్యుతాపురంలో ఓ ఆస్తికి సంబంధించిన రూ.16 లక్ష ల విలువ చేసే పత్రాలు, అనకాపల్లిలో ఇంటి పత్రాలు లభించినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగి నాగరాజు ఇంట్లో రూ.60 లక్షల విలువ గల పత్రాలు దొరికినట్టు చెప్పారు. పత్రాలను పరిశీలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. విస్తృతంగా సోదాలు విశాఖలోని మూడు చోట్ల ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు చేశారు. అనకాపల్లిలోని ఆర్టీసీ కాలనీ గిరిజా టవర్స్‌లోని ఫ్లాట్ నంబర్–309లో నివాసం ఉంటున్న సర్వేయర్ డి.మురళీకృష్ణ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కార్యాలయంలో డాక్యుమెంట్లు పరిశీలించారు. క్వారీలకు సంబంధించిన ప్లాన్లు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలో తోటి ఉద్యోగులను విచారించారు. అలాగే విశాఖలో ఉంటున్న మురళీకృష్ణ స్నేహితుడు, విశ్రాంత ఉద్యోగి నాగరాజు ఇంట్లో కూడా తనిఖీలు చేశారు. ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్ నేతృత్వంలో సీఐలు గణేష్, రమేష్, మూర్తి, సిబ్బంది ఈ దాడులు చేశారు. -
లంచం కేసులో సర్వేయర్ అరెస్ట్
అన్నానగర్: శ్రీరంగంలో రైతు వద్ద రూ.50 వేలు లంచం తీసుకున్న సర్వేయర్‌ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన బుధవారం శ్రీరంగంలో చోటుచేసుకుంది. తిరుచ్చి సోమరసమ్‌పేట పొన్ నగరానికి చెందిన అరుళానందరాజ్ (40) రైతు. ఇతనికి సొంత స్థలం పుంగనూర్‌లో ఉంది. ఈ స్థలాన్ని సర్వే చేయడానికి ఆన్లైన్లో శ్రీరంగం తాలూకా కార్యాలయంలో ఉన్న సర్వేయర్ విభాగ కార్యాలయంలో నమోదు చేశాడు. నమోదు చేసి 9 నెలలు అయినా స్థలాన్ని సర్వే చేయలేదు. ఈ క్రమంలో తన స్థలాన్ని సర్వే చేసి ఇవ్వాలని శ్రీరంగం తాలుకా కార్యాలయంలో ఉన్న సర్వేయర్ గణేషన్‌ని అరుళానందరాజ్ అడిగాడు. ఇందుకు, అతను రూ. 80 వేలు లంచం అడిగాడు. కానీ లంచం ఇవ్వడానికి ఇష్టపడని అతను తిరుచ్చి ఏసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు రసాయనం పూసిన రూ.50 వేల నగదుని అరుళానందరాజ వచ్చి ఇచ్చి పంపారు. బుధవారం సాయంత్రం రూ. 50 వేల నగదు కార్యాలయంలో ఉన్న సర్వేయర్ గణేషన్ వద్ద అరుళానందరాజ ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న జాయింట్ సూపరింటెండెంట్ రామచంద్రన్, సీఐలు శక్తివేల్, నవనీతకృష్ణన్, దేవిరాణి వెంటనే వచ్చి గణేషన్‌ని ఆధారాలతో పట్టుకొని అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరు చేసి సెంట్రల్ జైల్లో ఉంచారు. -
ఏసీబీ వలలో సర్వేయర్
గోపాలపురం: గోపాలపురం తహసీల్దార్ కార్యాలయంలో మండల సర్వేయర్‌గా పనిచేస్తున్న పి.జాగారాలపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. బుధవారం రాత్రి ఏసీడీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొవ్వూరుపాడుకి చెందిన బసవ మంగరాజుకు భార్యకు చెందిన ఆరెకరాల పొలం ఉంది. కొంత కాలంగా పక్క రైతులతో విభేదాలు ఉండటంతో తన పొలాన్ని సర్వే చేయాలంటూ సర్వేయర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దీనిని సర్వేయర్ పి.జాగారాల రెండుసార్లు తిరస్కరించడంతో మరోసారి దరఖాస్తు చేసి రూ.585 చలానా తీశారు. సర్వేయర్ జాగారాల మాత్రం పొలం సర్వే చేయాలంటే రూ.20 వేలు కావాలని డిమాండ్ చేశారు. అంత నగదు ఇవ్వలేనంటే రూ.18 వేలకు ఒప్పుకున్నారు. మొదటి దఫాగా రూ.9 వేలు .. సర్వే జరిగిన రోజున మిగిలిన సొమ్ము పొలం వద్దే ఇవ్వాలని సర్వేయర్ జాగారాల చెప్పడంతో బాధిత రైతు మంగరాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అ«ధికారులు వ్యూహం ప్రకారం గోపాలపురం మీ సేవ కేంద్రం వద్ద రైతు మంగరాజు నుంచి రూ.9 వేలు తీసుకుంటుండగా సర్వేయర్ జాగారాలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువెళ్లి విచారించారు. ఏసీబీ సీఐ వీజే విల్సన్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో కర్నూల్ జిల్లా సర్వేయర్
-
ఏసీబీ వలలో సర్వేయర్
- సర్వే చేయడానికి లంచం డిమాండ్ - ఏసీబీని ఆశ్రయించిన రైతు - రూ. 4000తో పట్టు పడ్డ ఉపేంద్ర చాగలమర్రి: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్‌గా పని చేస్తున్న ఉపేంద్ర.. ఆదివారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. స్థానిక మంగలి వీధికి చెందిన రైతు జిగ్గిగారి షరీఫ్.. భూ వివాదానికి సంబంధించి సమస్య పరిష్కరించాలని కలెక్టరేట్లో దరఖాస్తు చేసుకొన్నాడు. ఈ దరఖాస్తును ఆర్డీఓ ద్వారా స్ధానిక తహసీల్దార్‌కు పరిష్కారానికి పంపారు. ఈ పొలానికి సంబంధించి కొలతలు వేయాలని తహసీల్దార్... సర్వేయర్ ఉపేంద్రను ఆదేశించారు. అయితే సర్వేయర్.. మార్చి 15న కొలతలు వేస్తానని చెప్పి మాట తప్పారు. అదీగాక రైతును లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి వేసారిన రైతు జగ్గిగారి షరీఫ్..రూ 4500 ఇస్తానని ఒప్పంద కుదుర్చుకుని మొదట రూ. 500 ఇచ్చి.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఆదివారం చాగలమర్రిలోని మల్లెవేమల బస్టాండ్ వద్ద రైతు నుంచి సర్వేయర్ రూ. 4000 లంచం తీసుకుంటుండగా.. అక్కడే పొంచి ఉన్న ఏసీబి అధికారులు దాడులు చేశారు. సర్వేయర్ ఉపేంద్రను అదుపులోకి తీసుకొని..తహసీల్దార్ కార్యాలయంలో విచారణ జరిపారు. పూర్తిస్థాయిలో విచారించి అతని ఆస్తుల వివరాలపై తనిఖీలు చేసి కోర్టులో హజరు పరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. దాడిలో సీఐలు సీతారామరావు, కృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
సిపార్సుల.. ‘సర్వే’శుడు
పైసలివ్వండి.. ప్రభుత్వ భూమి కలిపేసుకోండి బిల్డర్లకు జీవీఎంసీ సర్వేయర్ బంపర్ ఆఫర్ డబ్బులిస్తే చాలు.. సర్కారీ స్థలాల్లోనూ నిర్మాణాలకు అనుమతులిచ్చేస్తారు పీఎం పాలెంలో ఇదే బాపతు వ్యవహారంలో అడ్డంగా దొరికినా చర్యల్లేవ్ అతనో అధికారి.. సర్కారు భూములకు హద్దులు నిర్థారించి.. కాపాడాల్సిన బాధ్యత ఆయనది.. కానీ ఆయన చేసేదంతా... దానికి పూర్తి విరుద్ధం.. పైసలిస్తే చాలు.. ఎలాంటి అక్రమాన్నయినా సక్రమం చేసేస్తాడు.. ఇతగాడి అక్రమాలు బట్టబయలు కావడంతో తొమ్మిది నెలల క్రితం ఉన్నతాధికారులు మెమో ఇచ్చారు. తప్పయ్యిందని క్షమాపణ వేడుకున్న అతన్ని అంతటితో వదిలేశారు.. ఎటువంటి శాఖాపరమైన చర్యలూ చేపట్టలేదు.. ఇంకేముందు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఇంకా చెప్పాలంటే.. పెచ్చుమీరింది.. సదరు సర్వేయర్ లక్షల్లో వసూళ్లు చేస్తూ.. అడ్డగోలుగా ప్లాన్లు ఇచ్చేస్తున్నాడు.. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘కంచే చేను మేస్తే’.. ఈ సామెత పాతదే కావొచ్చు గానీ.. మహావిశాఖ నగరపాలకసంస్థ(జీవీఎంసీ)లో సర్వేయర్‌గా పనిచేస్తున్న ఓ అధికారికి మాత్రం సరిగ్గా వర్తిస్తుంది. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన సదరు సర్వేయర్ డబ్బులిస్తే చాలు.. సర్కారీ భూములను జిరాయితీ భూములతో కలిపి బిల్డింగ్ ప్లాన్లు ఇచ్చేస్తుంటాడు. ఇప్పటికే ఇతగాడు చేసిన ఓ అక్రమ వ్యవహారాన్ని విశాఖపట్నం రూరల్ తహసీల్దార్ గుర్తించి ఆ స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు నిలిపివేయమని లేఖ రాశారు. అయినా సరే లెక్క లేని ఆ సర్వేయర్ అడ్డూఅదుపు లేకుండా ప్రభుత్వ భూములను ప్రైవేటు స్థలాలతో కలిపి భవన నిర్మాణాలకు సిఫార్సు చేస్తున్నాడు. జీవీఎంసీ పరిధిలో అపార్టుమెంట్లు, బహళ అంతస్తుల భవన నిర్మాణాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో సర్వేయర్ వసూళ్ల పర్వం పరాకాష్టకు చేరుతోంది. భవన నిర్మాణాలకు అనుమతులిచ్చేందుకు భారీగా ఇండెంట్లు పెట్టి వసూలు చేసే ఆ అధికారి ఇప్పుడు రూ.లక్షలిస్తే ప్రభుత్వ స్థలాలను కూడా కలిపేసి అనుమతులకు సిఫార్సు చేస్తున్నాడు. చర్యలు లేకపోవడంతోనే.. పోతిన మల్లయ్యపాలెంలోని సర్వే నెంబర్ 26లో గెడ్డను కలిపి ఓ అపార్ట్మెంట్ నిర్మాణానికి గతంలో ఈ సర్వేయర్ సిఫార్సు చేశారు. ఈ అక్రమాన్ని పక్కా ఆధారాలతో తొమ్మిది నెలల కిందట ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. ఆ కథనంతో స్పందించిన అప్పటి జీవీఎంసీ కమిషనర్, ప్రస్తుత కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ విచారణకు ఆదేశించి సదరు సర్వేయర్‌కు మెమో కూడా జారీ చేశారు. ఆయన సిఫర్సు మేరకు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ రీజనల్ డిఫ్యూటీ డైరెక్టర్ విచారణ చేపట్టారు. ఆ విచారణలో సదరు సర్వేయర్ తాను పొరపాటు చేసిన మాట వాస్తవేమని అంగీకరించారు. వాగు, గెడ్డ పోరంబోకు స్థలాన్ని గమనించకుండా పొరపాటున నిర్మాణాలకు అనుమతునివ్వడం తప్పిదమేనని లిఖితపూర్వకంగా అంగీకరించారు. అయినా సరే ఆ సర్వేయర్‌పై కనీసం శాఖాపరమైన చర్యలైనా ఉన్నతాధికారులు తీసుకోలేదు. దీంతో మరింత రెచ్చిపోయిన సర్వేయర్ అడ్డదిడ్డంగా అనుమతులిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. విజయనగరం జిల్లా కొత్తవలస నుంచి నాలుగేళ్ల కితం జీవీఎంసీకి బదలీపై వచ్చి ఇక్కడే పాతుకుపోయిన ఆ అధికారి అవినీతి పాత్రపై రెవెన్యూ అధికారులు, సర్వే అధికారులు బట్టబయలు చేసినా కార్పొరేషన్ ఉన్నతాధికారులు మిన్నకుండిపోవడం జీవీఎంసీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బాలకృష్ణ
అవినీతి నిరోధక శాఖ వలలో మరో చేప చిక్కింది. విశాఖపట్నం కలెక్టరేట్లోని అర్బన్ లాండ్ సీలింగ్ విభాగంలో స్పెషల్ సర్వేయర్ గా పనిచేస్తున్న బాలకృష్ణ రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు మంగళవారం పట్టుబడ్డాడు. మర్రిపాలెంలోని హుస్సేన్ నగర్‌కు చెందిన షేక్‌హుస్సేన్ భవన నిర్మాణానికి ఎన్ ఓసీ సర్టిఫికేట్ ఇచ్చేందుకు లక్షన్నర డిమాండ్ చేయగా, రూ. 50వేలకు బేరం కుదుర్చుకున్నారు. హుస్సేన్ ఇచ్చిన ముందస్తు సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వలపన్ని బాలకృష్ణను పట్టుకున్నారు. -
సమర్పిస్తేనే సర్వే..
ప్రైవేటు వ్యక్తులతో దందా రైతులను పీక్కుతింటున్న వైనం సర్వేయర్ల వ్యవహారంతో వేలాది మంది ఇక్కట్లు అద్దెయ్య ఓ సన్నకారు రైతు. తన పొలం పక్కనే ఇటీవల ఓ గ్రానైట్ ఫ్యాక్టరీ వెలిసింది. అద్దెయ్యకు చెందిన కొంత భూమిని ఫ్యాక్టరీ యాజమాన్యం ఆక్రమించింది. పొలాన్ని సర్వే చేసి న్యాయం చేయాలని ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే ఆరు నెలలు గడిచింది. కొలతలు వేసి హద్దులు నిర్ణయించాల్సిన సర్వేయర్ ఇంతవరకూ పొలం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మరో వైపు ఫ్యాక్టరీ యాజమాన్యం అంతకంతకూ అద్దెయ్య పొలాన్ని ఆక్రమిస్తూ వ స్తోంది. ఫ్యాక్టరీ యాజమాన్యంతో సర్వేయర్ కుమ్మక్కై తనకు అన్యాయం చేస్తున్నారని అద్దెయ్య ఆరోపిస్తున్నారు. ఇది ఒక్క అద్దెయ్య సమస్యే కాదు. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రైతులు సర్వేయర్ల వ్యవహారంతో మానసిక క్షోభకు గురవుతున్నారు. ఎంతోకొంత సమర్పిస్తేనే తప్పా సర్వేయర్లు సీటు కదిలి రాని పరిస్థితి నెలకొంది.. నాదెండ్ల: చిలకలూరిపేట మండలానికి చెందిన ఓ సర్వేయర్ అయితే రాజదర్పం ప్రదర్శిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులను తనకు సహాయకులుగా నియమించుకుని వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఇటీవల జరిగిన ఆయన పుట్టిన రోజు వేడుకలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ రాజకీయవేత్త మాదిరి పట్టణమంతా ఫ్లెక్సీలు వెలిశాయి. నాదెండ్ల మండలంలో కొద్ది రోజుల కిందట వరకూ పనిచేసిన ఓ సర్వేయర్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల రెవెన్యూ అధికారులు గ్రామాల్లో నిర్వహించిన మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంలో రైతులు సంబంధిత సర్వేయర్‌పై ఫిర్యాదులు చేశారు. అతని అనుయాయులే ఒక్కో పనికి ఇంత అని నిర్ణయించి రైతుల నుంచి వసూలు చేసేవారు. ఆయనపై తీవ్ర అవినీతి ఆరోపణలు రావటంతో వేరే మండలానికి బదిలీ చేశారు. సర్వే చేసేందుకంటూ డబ్బులు సమర్పించుకున్న రైతులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఒక సర్వేయర్ రైతుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాళ్ళరిగేలా తిరిగినా కనీసం మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వడని అంటున్నారు.రేపల్లె నియోజకవర్గంలో వందలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే ముందు వారి దరఖాస్తులను పరిష్కరిస్తున్నారు. మంగళగిరి, అమరావతి, తుళ్లూరు, తాడికొండ లాంటి సీఆర్డీఏ పరిధిలోని మండలాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడి రైతుల అగచాట్లు ఏ రోజు ఆయా తహశీల్దార్ కార్యాలయాలకు వెళ్లినా దర్శనమిస్తూనే ఉంటాయి. మాచర్ల నియోజకవర్గానికి చెందిన ఓ మండల కార్యాలయంలో ఓ రైతు అక్కడి సర్వేయర్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఆరు నెలలుగా సర్వేయర్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా.. తన పొలం కొలిచిన పాపానపోవడం లేదని తీవ్రంగా మండిపడ్డాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలను పీక్కుతింటున్నారు... సర్వేయర్లు లంచాల ఊబిలో కూరుకుపోయారనడానికి జిల్లాలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. పరిస్థితి పూర్తిగా చేయిదాటి పోతున్నా.. ఏ ఒక్క ఉన్నతాధికారీ వీరి గురించి పట్టించుకోవడం లేదు. జిల్లాలో ఎందరో సర్వేయర్లు అనతి కాలంలోనే సంపన్నులుగా మారిపోతున్నా.. ఏసీబీ అధికారులకూ కన్పించడం లేదు. రైతులకు న్యాయం చేయాల్సిన సర్వేయర్లు లంచాలతో పీక్కుతింటున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఒక్కో సర్వేయర్ నలుగురుకి మించి ప్రైవేటు వ్యక్తులను నియమించుకొని దందా చేస్తున్నారు. ఎకరా పొలం కొలత వేయాలంటే రూ.5 వేలు లంచం ఇస్తేనే స్పందిస్తారు. -
ఏసీబీకి చిక్కిన సర్వేయర్
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పొందూరు మండల సర్వేయర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. రాపాక గ్రామానికి చెందిన చేపల అప్పలనాయుడు తన భూమి సర్వే కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. సర్వేయర్ రాజశేఖర్ సర్వే చేసినప్పటికీ నివేదిక ఇవ్వడానికి డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో బుధవారం తహశీల్దార్ కార్యాలయంలో అప్పల నాయుడు నుంచి సర్వేయర్ రాజశేఖర్ రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాజశేఖర్ ప్రైవేటు సహాయకుడు శ్రీనివాసరావును కూడా అదుపులోకి తీసుకున్నారు. -
ఏసీబీకి చిక్కిన సర్వేయర్
అనంతపురం: పొలానికి సరిహద్దు రాయి వేయడానికి రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసిన సర్వేయర్ ఏసీబీకి చిక్కాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా నల్లమాడ మండలంలో మంగళవారం జరిగింది. మండల కేంద్రానికి చెందిన రామచంద్ర అనే రైతు తన భూమికి సంబంధించిన హద్దు రాళ్లు పాతాల్సి ఉందని మండల సర్వేయర్ జి. లక్ష్మినారాయణను సంప్రదించాడు. సర్వేయర్ అందుకోసం రూ. 20 వేలు అవుతుందని, ముందు పదివేలు ఇస్తే పని మొదలు పెడతానని అనడంతో రైతు రామచంద్ర ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రెడ్డి సర్వేయర్ మంగళవారం లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదనపు సమాచారం కోసం సర్వేయర్ ను విచారణ చేస్తున్నారు. -
ఏసీబీ వలలో సర్వేయర్
గంపలగూడెం : లంచాలు ఇవ్వాలని ప్రజలను వేధిస్తున్న గంపలగూడెం మండల సర్వేయర్ బాణావతు దుర్గారావు మంగళవారం రాత్రి ఏసీబీ వలలో చిక్కారు. పొలం సర్వే, సబ్ డివిజన్ లేదా ఏపనికైనా రూ.10వేలు ప్లస్ అని కోడ్ చెబుతున్న ఆ ఆధికారి వేధింపులు తాళలేక సహనం కోల్పోయిన బాధితుల్లో ఒకరు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు పకడ్బందీగా వలపన్ని పట్టుకున్నారు. మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి అధికారులు కార్యాలయం వద్ద నిఘా ఉంచారు. రాత్రి 7 గంటలకు సర్వేయర్ ఏసీబీ వలలో పడ్డారు. వివరాలను ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ విలేకరులకు వెల్లడించారు. గంపలగూడెం మండలం సొబ్బాలకు చెందిన చలచీమల సుమిత్రమ్మ తన ఇంటి స్థలం 6 సెంట్లు సర్వే కోసం యేడాది క్రితం మీసేవ ద్వారా దరఖాస్తు చేసింది. నాటి నుంచి నేటి వరకు సర్వే పూర్తిచేయని సర్వేయర్ బాణావతు దుర్గారావు వారిని పదివేలు డిమాండ్ చేస్తున్నాడు. ఆమె దరఖాస్తు చేసిన అనంతరం ఆరు నెలలు ఇక్కడ పనిచేసిన సర్వేయర్ ఆ పనిని పూర్తి చేయలేదు. తదుపరి బదిలీపై వచ్చిన దుర్గారావు పని పూర్తి చేసేందుకు పదివేలు ప్లస్ అవుతుందంటూ పలుమార్లు తిప్పుకుంటున్నాడు. సంబంధిత స్థలంపై సుమిత్రమ్మకు, అదే గ్రామానికి చెందిన చింతల వెంకటేశ్వర్లుకు వివాదం నెలకొంది. ఈపరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించగా వారు వివాదం లేకుండా సర్వే చేయించి పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో మీసేవ ద్వారా ఆమె దరఖాస్తు చేసుకొన్నారు. యేడాదికాలంగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సర్వే చేయడం లేదు. ఏసీబీకి ఫిర్యాదు చేయగా వారి సూచన మేర సోమవారం బాధితురాలి మనువడు ఉన్నం రమేష్, జి.రాజు కలిసి రూ.10 వేలు తీసుకువచ్చి సర్వేయర్‌కు అందజేశారు. అప్పటికే వల పన్ని ఉన్న అధికారులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. సర్వేయర్ తమను సైతం అనేక ఇబ్బందుల పెడుతున్నాడని సత్యాలపాడు, పెద్దకొమిర, సొబ్బాల, కనుమూరు తదితర గ్రామాలకు చెందిన పలువురు రాత పూర్వకంగా ఏసీబీ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రతి పనికి వేలాది రూపాయలు లంచం డిమాండ్ చేస్తున్నట్లు వారు ఆరోపించారు. ఏసీబీ అధికారులు గంపలగూడెంలో మరో ప్రధాన కార్యాలయానికి వల పన్నగా వారు తప్పుకున్నట్లు తెలిసింది. దాడిలో ఎస్ఐలు శ్రీనివాస్ , వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో సర్వేయర్
రూ. 3 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం వెలుగోడు: సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖలో మండల సర్వేయర్‌గా పనిచేస్తున్న నాగన్న ఏసీబీ వలలో చిక్కుకున్నారు. వెలుగోడు మండల కేంద్రానికి చెందిన రైతు గునిపాటి రామిరెడ్డి తన పొలాన్ని సర్వే చేయించడానికి గాను ఏడాదిన్నర క్రితం ప్రభుత్వానికి చలానా చెల్లించారు. గ్రామ పొలిమేరలోని సర్వే నెంబర్ 1075లో తన భూమి ఆక్రమణకు గురైందని.. కొలతలు వేసి భూమి చూపాలని అప్పటి నుంచి ఆయన సర్వేయర్‌ను కలిసి విన్నవించుకుంటున్నారు. అయితే రూ.3 వేలు ఇస్తే కొలతల వివరాలు చూపే ఎఫ్ఎంబీ ఇస్తానని సర్వేయర్ డిమాండ్ చేశారు. అంత డబ్బు ఇచ్చుకోలేనని రైతు పలుమార్లు చెప్పినా సర్వేయర్ వినలేదు. వ్యవసాయంలో తీవ్ర కష్టనష్టాలను ఎదుర్కొన్న ఆయన చివరికి అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. రైతు ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ మహబూబ్‌బాషా సోమవారం సర్వేయర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు వల పన్నారు. రూ.3 వేలను రామిరెడ్డి ద్వారా నాగన్నకు పంపారు. తహశీల్దార్ కార్యాలయంలోని సర్వేయర్ బయటకు వచ్చి రైతు నుంచి నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఆ మేరకు సర్వేయర్‌పై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మహబూబ్‌బాషా మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగులు లంచం తీసుకుంటే జైలుకు వెళ్లక తప్పదన్నారు. అవినీతి రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. లంచావతారుల సమాచారాన్ని డీఎస్పీ సెల్ నెం.9440446178, సీఐలకు 9440446129, 9490611022, 9490611024 నెంబర్లలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. వివరాలు అందజేసిన వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామన్నారు. దాడుల్లో సీఐలు కృష్ణారెడ్డి, సీతారామశాస్త్రి్త, ప్రసాదరావు సిబ్బంది పాల్గొన్నారు.