ఏసీబీ వలలో సర్వేయర్
రూ. 3 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
వెలుగోడు: సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖలో మండల సర్వేయర్‌గా పనిచేస్తున్న నాగన్న ఏసీబీ వలలో చిక్కుకున్నారు. వెలుగోడు మండల కేంద్రానికి చెందిన రైతు గునిపాటి రామిరెడ్డి తన పొలాన్ని సర్వే చేయించడానికి గాను ఏడాదిన్నర క్రితం ప్రభుత్వానికి చలానా చెల్లించారు. గ్రామ పొలిమేరలోని సర్వే నెంబర్ 1075లో తన భూమి ఆక్రమణకు గురైందని.. కొలతలు వేసి భూమి చూపాలని అప్పటి నుంచి ఆయన సర్వేయర్‌ను కలిసి విన్నవించుకుంటున్నారు.
అయితే రూ.3 వేలు ఇస్తే కొలతల వివరాలు చూపే ఎఫ్‌ఎంబీ ఇస్తానని సర్వేయర్ డిమాండ్ చేశారు. అంత డబ్బు ఇచ్చుకోలేనని రైతు పలుమార్లు చెప్పినా సర్వేయర్ వినలేదు. వ్యవసాయంలో తీవ్ర కష్టనష్టాలను ఎదుర్కొన్న ఆయన చివరికి అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. రైతు ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ మహబూబ్‌బాషా సోమవారం సర్వేయర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు వల పన్నారు. రూ.3 వేలను రామిరెడ్డి ద్వారా నాగన్నకు పంపారు.
తహశీల్దార్ కార్యాలయంలోని సర్వేయర్ బయటకు వచ్చి రైతు నుంచి నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఆ మేరకు సర్వేయర్‌పై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మహబూబ్‌బాషా మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగులు లంచం తీసుకుంటే జైలుకు వెళ్లక తప్పదన్నారు. అవినీతి రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. లంచావతారుల సమాచారాన్ని డీఎస్పీ సెల్ నెం.9440446178, సీఐలకు 9440446129, 9490611022, 9490611024 నెంబర్లలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. వివరాలు అందజేసిన వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామన్నారు. దాడుల్లో సీఐలు కృష్ణారెడ్డి, సీతారామశాస్త్రి్త, ప్రసాదరావు సిబ్బంది పాల్గొన్నారు.