ఏసీబీ వలలో సర్వేయర్
- సర్వే చేయడానికి లంచం డిమాండ్
- ఏసీబీని ఆశ్రయించిన రైతు
- రూ. 4000తో పట్టు పడ్డ ఉపేంద్ర
చాగలమర్రి: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్‌గా పని చేస్తున్న ఉపేంద్ర.. ఆదివారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. స్థానిక మంగలి వీధికి చెందిన రైతు జిగ్గిగారి షరీఫ్.. భూ వివాదానికి సంబంధించి సమస్య పరిష్కరించాలని కలెక్టరేట్‌లో దరఖాస్తు చేసుకొన్నాడు. ఈ దరఖాస్తును ఆర్‌డీఓ ద్వారా స్ధానిక తహసీల్దార్‌కు పరిష్కారానికి పంపారు. ఈ పొలానికి సంబంధించి కొలతలు వేయాలని తహసీల్దార్... సర్వేయర్ ఉపేంద్రను ఆదేశించారు. అయితే సర్వేయర్.. మార్చి 15న కొలతలు వేస్తానని చెప్పి మాట తప్పారు. అదీగాక రైతును లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి వేసారిన రైతు జగ్గిగారి షరీఫ్..రూ 4500 ఇస్తానని ఒప్పంద కుదుర్చుకుని మొదట రూ. 500 ఇచ్చి.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఆదివారం చాగలమర్రిలోని మల్లెవేమల బస్టాండ్ వద్ద రైతు నుంచి సర్వేయర్ రూ. 4000 లంచం తీసుకుంటుండగా.. అక్కడే పొంచి ఉన్న ఏసీబి అధికారులు దాడులు చేశారు. సర్వేయర్ ఉపేంద్రను అదుపులోకి తీసుకొని..తహసీల్దార్ కార్యాలయంలో విచారణ జరిపారు. పూర్తిస్థాయిలో విచారించి అతని ఆస్తుల వివరాలపై తనిఖీలు చేసి కోర్టులో హజరు పరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. దాడిలో సీఐలు సీతారామరావు, కృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.