గంపలగూడెం : లంచాలు ఇవ్వాలని ప్రజలను వేధిస్తున్న గంపలగూడెం మండల సర్వేయర్ బాణావతు దుర్గారావు మంగళవారం రాత్రి ఏసీబీ వలలో చిక్కారు. పొలం సర్వే, సబ్ డివిజన్ లేదా ఏపనికైనా రూ.10వేలు ప్లస్ అని కోడ్ చెబుతున్న ఆ ఆధికారి వేధింపులు తాళలేక సహనం కోల్పోయిన బాధితుల్లో ఒకరు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు పకడ్బందీగా వలపన్ని పట్టుకున్నారు.
మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి అధికారులు కార్యాలయం వద్ద నిఘా ఉంచారు. రాత్రి 7 గంటలకు సర్వేయర్ ఏసీబీ వలలో పడ్డారు. వివరాలను ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ విలేకరులకు వెల్లడించారు. గంపలగూడెం మండలం సొబ్బాలకు చెందిన చలచీమల సుమిత్రమ్మ తన ఇంటి స్థలం 6 సెంట్లు సర్వే కోసం యేడాది క్రితం మీసేవ ద్వారా దరఖాస్తు చేసింది.
నాటి నుంచి నేటి వరకు సర్వే పూర్తిచేయని సర్వేయర్ బాణావతు దుర్గారావు వారిని పదివేలు డిమాండ్ చేస్తున్నాడు. ఆమె దరఖాస్తు చేసిన అనంతరం ఆరు నెలలు ఇక్కడ పనిచేసిన సర్వేయర్ ఆ పనిని పూర్తి చేయలేదు. తదుపరి బదిలీపై వచ్చిన దుర్గారావు పని పూర్తి చేసేందుకు పదివేలు ప్లస్ అవుతుందంటూ పలుమార్లు తిప్పుకుంటున్నాడు. సంబంధిత స్థలంపై సుమిత్రమ్మకు, అదే గ్రామానికి చెందిన చింతల వెంకటేశ్వర్లుకు వివాదం నెలకొంది. ఈపరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించగా వారు వివాదం లేకుండా సర్వే చేయించి పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో మీసేవ ద్వారా ఆమె దరఖాస్తు చేసుకొన్నారు. యేడాదికాలంగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సర్వే చేయడం లేదు.
ఏసీబీకి ఫిర్యాదు చేయగా వారి సూచన మేర సోమవారం బాధితురాలి మనువడు ఉన్నం రమేష్, జి.రాజు కలిసి రూ.10 వేలు తీసుకువచ్చి సర్వేయర్‌కు అందజేశారు. అప్పటికే వల పన్ని ఉన్న అధికారులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు.
సర్వేయర్ తమను సైతం అనేక ఇబ్బందుల పెడుతున్నాడని సత్యాలపాడు, పెద్దకొమిర, సొబ్బాల, కనుమూరు తదితర గ్రామాలకు చెందిన పలువురు రాత పూర్వకంగా ఏసీబీ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రతి పనికి వేలాది రూపాయలు లంచం డిమాండ్ చేస్తున్నట్లు వారు ఆరోపించారు. ఏసీబీ అధికారులు గంపలగూడెంలో మరో ప్రధాన కార్యాలయానికి వల పన్నగా వారు తప్పుకున్నట్లు తెలిసింది. దాడిలో ఎస్‌ఐలు శ్రీనివాస్ , వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.