నగలు పరిశీలిస్తున్న అధికారులు, హరిబాబు
పెనమలూరు/దేవరాపల్లి(మాడుగుల): ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో కృష్ణా జిల్లా పెనమలూరు మండల సర్వేయర్ కొల్లి హరిబాబు ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు. బుధవారం ఆయన నివాసంలో జరిపిన సోదాల్లో.. రూ.25 కోట్ల విలువ చేసే ఆస్తులతోపాటు నగదు, ఆభరణాలు లభించాయి. దీంతో ఆయన్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని పామర్రు మండలం కనుమూరుకు చెందిన హరిబాబు(52) 1993లో సర్వేయర్‌గా చేరారు. గన్నవరం, విజయవాడ, పెనమలూరు ప్రాంతాల్లో సర్వేయర్‌గా విధులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని ఫిర్యాదులు రావడంతో ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ ఆదేశాల మేరకు అధికారులు బుధవారం తెల్లవారుజామున విజయవాడ రామచంద్రనగర్ ప్రాంతం మహాలక్ష్మీ నిలయం అపార్టుమెంట్‌లో ఉంటున్న హరిబాబు ఇంట్లో, ఇంకా రామచంద్రపురం, పెనమలూరుతోపాటు మరో ఐదుచోట్ల సోదాలు చేశారు.
తనిఖీల్లో హరిబాబు పెద్ద ఎత్తున ఆస్తులు కూడపెట్టినట్లు గుర్తించారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హరిబాబు భార్య పద్మజ పేరున విజయవాడ రామచంద్రనగర్‌లో 1,450 చదరపు అడుగుల విస్తీర్ణంతో విలువైన అపార్టుమెంట్ ఉన్నట్టు గుర్తించారు. అలాగే విజయవాడ కార్మెల్‌నగర్‌లో 243 చదరపు గజాలు, నాగార్జుననగర్‌లో 206 చదరపు గజాలు, గన్నవరం బహుబలేంద్రునిగూడెంలో 822.6 చదరపు అడుగుల స్థలం, నూజివీడు గొల్లపల్లెలో 375 చదరపు గజాల స్థలం, విజయవాడ క్రీస్తురాజపురంలో 135 చదరపు గజాల స్థలం ఉన్నట్లు గుర్తించారు. అలాగే కుమార్తె హారిక పేరున పోరంకిలో 252 చదరపు గజాల స్థలం, మరో కుమార్తె హర్షిత పేరున 252 చదరపు గజాల స్థలాన్ని సైతం గుర్తించారు. ఇవిగాక బ్యాంకు బ్యాలెన్స్ రూ.11 లక్షలు, ఇంట్లో 49 వేల నగదు, మూడు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
విశాఖలో ఏసీబీకి చిక్కిన మరో సర్వేయర్
ఇదిలా ఉండగా విశాఖ జిల్లా దేవరాపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ ఎల్.శామ్యూల్ లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. భూమి సర్వే రిపోర్టుకోసం రూ.ఆరు వేలు లంచం డిమాండ్ చేసి చివరకు రూ.3వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. పెదనందిపల్లికి చెందిన రైతు నుంచి ఆ సొమ్ము తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణ ప్రసాద్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment