పోలీసు శాఖలో అత్యంత అవినీతిపరుడిగా ముద్ర వేసుకున్న చిన్న గౌస్
పైస్థాయి అధికారులను మేనేజ్ చేయడంలో దిట్ట
ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడే సమయంలో పరార్
నేడు సస్పెన్షన్ ఎత్తివేసి పోస్టింగ్ ఇచ్చేందుకు అమాత్యుల యత్నం
ఉరవకొండకు పోస్టింగ్ ఇచ్చేందుకు సన్నాహాలు
ఆయనెక్కడ పనిచేసినా అవినీతిలో మునిగితేలుతారు. ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తారు. స్టేషన్‌కొచ్చే బాధితుల బాధలు విని సాంత్వన చేకూర్చడం మాని, ఆ సమస్య పరిష్కరిస్తే తనకెంత ముట్టజెబుతారో అడుగుతారు. విసుగెత్తిన ఓ బాధితుడు గతంలో ఏసీబీ అధికారులకు సమాచారమిస్తే.. చివరి నిమిషంలో వారికి చిక్కకుండా ఉడాయించారు. పోలీసు వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చి సస్పెన్షన్‌కు గురయ్యారు. అవినీతికి కేరాఫ్‌గా చెప్పుకునే అలాంటి వ్యక్తి నేడు కూటమి ప్రభుత్వంలో ఓ ప్రజాప్రతినిధిని ప్రసన్నం చేసుకుని పోస్టింగ్ తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఖాకీ వనంలో కలుపు మొక్కగా పేరుగాంచిన పోలీసు అధికారి చిన్నగౌస్‌కు మళ్లీ పోస్టింగ్ ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో అత్యంత అవినీతిపరుడిగా ముద్రవేసుకున్న చిన్న గౌస్.. అధికారులను మేనేజ్ చేయడంలోనూ, ప్రజాప్రతినిధుల అవసరాలకు అనుగుణంగా లోపాయికారీగా వ్యవహరించడంలోనూ అత్యంత నేర్పరి అని పేరుంది. ఎమ్మెల్యే, మంత్రుల అండతో పోలీసు డిపార్ట్‌మెంట్‌లోని పెద్దలను కూడా లెక్కచేయరనే విమర్శలున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఏ స్టేషన్‌లో పనిచేసినా వివాదాస్పద పోలీసుగా, అవినీతిపరుడిగా ముద్రపడటం గమనార్హం. గతంలో సస్పెండ్ అయిన ఆయనకు మళ్లీ పోస్టింగ్ ఇచ్చి తమకు అనుకూలంగా పనిచేయించుకోవాలని నేడు అమాత్యులు, టీడీపీ నాయకులు భావిస్తున్నారు.
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే సమయంలో..
గతంలో రామగిరి పోలీస్ స్టేషన్‌లో సీఐగా పనిచేసిన చిన్నగౌస్.. ఓ కేసులో అవినీతికి సంబంధించి ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటారనే సమయంలో జంప్ అయ్యారు. వరకట్న వేధింపుల కేసులో వ్యక్తి నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేసి చివరకు రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో రామగిరి ఎస్‌ఐ, సీఐ చిన్నగౌస్ ప్రధాన నిందితులు. ఈ క్రమంలోనే బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఎస్‌ఐ పట్టుబడ్డారు గానీ చిన్నగౌస్ అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత ఆయన్ను అప్పటి ఎస్పీ సస్పెండ్ చేశారు. ఇప్పటివరకూ సస్పెన్షన్ ఎత్తేయలేదు. నేడు ప్రభుత్వం మారడంతో మళ్లీ పోస్టింగ్ తెచ్చుకునేందుకు ఆయన పావులు కదుపుతున్నట్లు తెలిసింది. ఉరవకొండ సీఐగా వచ్చేందుకు టీడీపీ నేతలను ఆశ్రయించినట్టు సమాచారం.
ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా వచ్చి..
వాస్తవానికి చిన్నగౌస్ సివిల్ పోలీస్ విభాగానికి చెందిన వారు కాదు. ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత మినిస్టీరియల్ కోటాలో భాగంగా సివిల్ పోలీస్ విభాగంలోకి చేరారు. కంబదూరు మొదలుకొని పలు స్టేషన్లలో ఎస్‌ఐగా పనిచేశారు. ఎక్కడ పనిచేసినా వివాదం సృష్టించడం, సెటిల్ మెంట్లు చేయడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య అని పోలీసు విభాగంలో చెప్పుకుంటారు. రాజకీయ నేతలకు వంతపాడి, వారితో అంటకాగుతూ వారి ప్రత్యర్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడంలో గౌస్‌కు మించిన వారు మరొకరు లేరనే పేరుంది. అలాంటి వ్యక్తికి నేడు సస్పెన్షన్ ఎత్తేసి తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని చూస్తుండటం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment