excise constable
-
పేరులో చిన్న.. అవినీతి మిన్న
ఆయనెక్కడ పనిచేసినా అవినీతిలో మునిగితేలుతారు. ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తారు. స్టేషన్‌కొచ్చే బాధితుల బాధలు విని సాంత్వన చేకూర్చడం మాని, ఆ సమస్య పరిష్కరిస్తే తనకెంత ముట్టజెబుతారో అడుగుతారు. విసుగెత్తిన ఓ బాధితుడు గతంలో ఏసీబీ అధికారులకు సమాచారమిస్తే.. చివరి నిమిషంలో వారికి చిక్కకుండా ఉడాయించారు. పోలీసు వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చి సస్పెన్షన్‌కు గురయ్యారు. అవినీతికి కేరాఫ్‌గా చెప్పుకునే అలాంటి వ్యక్తి నేడు కూటమి ప్రభుత్వంలో ఓ ప్రజాప్రతినిధిని ప్రసన్నం చేసుకుని పోస్టింగ్ తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఖాకీ వనంలో కలుపు మొక్కగా పేరుగాంచిన పోలీసు అధికారి చిన్నగౌస్కు మళ్లీ పోస్టింగ్ ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో అత్యంత అవినీతిపరుడిగా ముద్రవేసుకున్న చిన్న గౌస్.. అధికారులను మేనేజ్ చేయడంలోనూ, ప్రజాప్రతినిధుల అవసరాలకు అనుగుణంగా లోపాయికారీగా వ్యవహరించడంలోనూ అత్యంత నేర్పరి అని పేరుంది. ఎమ్మెల్యే, మంత్రుల అండతో పోలీసు డిపార్ట్మెంట్లోని పెద్దలను కూడా లెక్కచేయరనే విమర్శలున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఏ స్టేషన్లో పనిచేసినా వివాదాస్పద పోలీసుగా, అవినీతిపరుడిగా ముద్రపడటం గమనార్హం. గతంలో సస్పెండ్ అయిన ఆయనకు మళ్లీ పోస్టింగ్ ఇచ్చి తమకు అనుకూలంగా పనిచేయించుకోవాలని నేడు అమాత్యులు, టీడీపీ నాయకులు భావిస్తున్నారు.రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే సమయంలో.. గతంలో రామగిరి పోలీస్ స్టేషన్లో సీఐగా పనిచేసిన చిన్నగౌస్.. ఓ కేసులో అవినీతికి సంబంధించి ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటారనే సమయంలో జంప్ అయ్యారు. వరకట్న వేధింపుల కేసులో వ్యక్తి నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేసి చివరకు రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో రామగిరి ఎస్ఐ, సీఐ చిన్నగౌస్ ప్రధాన నిందితులు. ఈ క్రమంలోనే బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఎస్ఐ పట్టుబడ్డారు గానీ చిన్నగౌస్ అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత ఆయన్ను అప్పటి ఎస్పీ సస్పెండ్ చేశారు. ఇప్పటివరకూ సస్పెన్షన్ ఎత్తేయలేదు. నేడు ప్రభుత్వం మారడంతో మళ్లీ పోస్టింగ్ తెచ్చుకునేందుకు ఆయన పావులు కదుపుతున్నట్లు తెలిసింది. ఉరవకొండ సీఐగా వచ్చేందుకు టీడీపీ నేతలను ఆశ్రయించినట్టు సమాచారం. ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా వచ్చి.. వాస్తవానికి చిన్నగౌస్ సివిల్ పోలీస్ విభాగానికి చెందిన వారు కాదు. ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత మినిస్టీరియల్ కోటాలో భాగంగా సివిల్ పోలీస్ విభాగంలోకి చేరారు. కంబదూరు మొదలుకొని పలు స్టేషన్లలో ఎస్ఐగా పనిచేశారు. ఎక్కడ పనిచేసినా వివాదం సృష్టించడం, సెటిల్ మెంట్లు చేయడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య అని పోలీసు విభాగంలో చెప్పుకుంటారు. రాజకీయ నేతలకు వంతపాడి, వారితో అంటకాగుతూ వారి ప్రత్యర్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడంలో గౌస్‌కు మించిన వారు మరొకరు లేరనే పేరుంది. అలాంటి వ్యక్తికి నేడు సస్పెన్షన్ ఎత్తేసి తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని చూస్తుండటం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
ఎక్సైజ్ కానిస్టేబుల్ బలవన్మరణం.. కారణం అదేనా?
శంషాబాద్(హైదరాబాద్): రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్, ప్రొహిబిషన్ కార్యాలయంలో రాత్రి పూట రక్షణగా విధులు నిర్వర్తించడానికి వచ్చిన కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ.. వికారాబాద్ జిల్లా ఎన్కతల గ్రామానికి చెందిన ఆశయ్య(48) చేవెళ్ల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. శంషాబాద్ పట్టణంలోని జిల్లా ఎక్సైజ్, ప్రొహిబిషన్ కార్యాలయంలో సెంట్రీ విధులు నిర్వర్తించడానికి ఆయా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు చెందిన కానిస్టేబుళ్లకు రోజువారీగా కేటాయిస్తారు. ఈ క్రమంలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు డ్యూటీ నిమిత్తం ఆశయ్య శంషాబాద్ ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చాడు. సాయంత్రం ఉద్యోగులంతా వెళ్లిన తర్వాత ఒక్కడే ఉన్నాడు. ఆదివారం ఉదయం మరో ఎక్సైజ్ కానిస్టేబుల్ కార్యాలయానికి వచ్చే సరికి ఓ గదిలో ఆశయ్య ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆశయ్యకు అతిగా మద్యం తాగే అలవాటున్నట్లు గుర్తించారు. ఆదివారం రాత్రి కూడా మద్యం తాగిన తర్వాతే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు అతడికి ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉండడంతో బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా గుండె ఆపరేషన్ చేసుకున్న తనకి సెంట్రీ విధులు వేయడంపై కూడా మనస్తాపంతో ఉన్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కత్తులు పట్టుకొని బాలీవుడ్ డైలాగులు.. వాట్సాప్ స్టేటస్ -
ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, కృష్ణా : మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా కంచికచర్లలో చోటుచేసుకుంది. వివరాలు.. నీలవేణి అనే మహిళ కంచికచర్ల ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. అదే డిపార్ట్మెంట్లో నీలవేణి భర్త కూడా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా నీలవేణి శనివారం తన నివాసంలో అనుమానాస్పద స్థతిలో ఉరివేసుకొని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కాగా నీలవేణి భర్త పోలీసుల అదుపులో ఉన్నాడు. -
ఎక్సైజ్ హెచ్‌సీపై ఎమ్మెల్యే రజని ఆగ్రహం
సాక్షి, చిలకలూరిపేట: ‘మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వ సంకల్పాన్ని దెబ్బతీయాలని చూస్తారా?’ అంటూ ఎమ్మెల్యే విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మద్యం విక్రయాలను ప్రోత్సహిస్తూ లంచాలు అడుగుతున్న ఎక్సైజ్ హెడ్‌కానిస్టేబుల్ డి.రామ్‌ప్రసాద్ మాట్లాడిన కాల్ రికార్డింగులు ఎమ్మెల్యే దృష్టికి రావటంతో ఆమె చిలకలూరిపేట ఎక్సైజ్ స్టేషన్‌ను మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అధికారులను ప్రశ్నించగా ఎక్సైజ్ ఎస్ఐ ఆర్.వి.వి.ప్రసాద్ రికార్డింగ్లోని వాయిస్ హెడ్‌కానిస్టేబుల్ రామ్‌ప్రసాద్‌దని తెలపగా తనదేనని అతను కూడా అంగీకరించారు. ప్రభుత్వ స్ఫూర్తిని కాపాడాల్సిన వారే ఇలాంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడటం తగదని హితవు పలికారు. అనంతరం ఎక్సైజ్ ఉన్నతాధికారులకు హెడ్‌కానిస్టేబుల్ తీరుపై చర్యలు తీసుకోవాలని ఫోన్ చేసి చెప్పారు మద్యం నిల్వలు మాయం! నరసరావుపేట టౌన్: మద్యం దుకాణాల్లో తనిఖీలు చేసే కొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. అక్కడ పనిచేసే వర్కర్లు, పోలీస్ సిబ్బంది కుమ్మక్కై లక్షల రూపాయల విలువైన మద్యం నిల్వలను దారిమళ్లించారు. ఎక్సైజ్ అధికారులు మంగళవారం సీల్ వేసి ఉన్న నాలుగు మద్యం దుకాణాలను పరిశీలించగా అందులో సుమారు రూ.13 లక్షల రూపాయల మద్యం బాటిళ్లు అపహరణకు గురైనట్లు గుర్తించారు. వివరాల్లొ కెళితే.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మద్యం దుకాణాలను ప్రభుత్వం గత నెల 22వ తేదీన సీల్ వేసింది. అయితే నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ మద్యం దుకాణం, రొంపిచర్లలోని దుకాణంలో ఇటీవల మద్యం నిల్వలు చోరీ జరిగిన విషయం విదితమే. రెండు సంఘటనలతో ఎక్సైజ్ అధికారులు అప్రమత్తమై మిగిలిన మద్యం దుకాణాలను మంగళవారం పరిశీలించారు. రైల్వేస్టేషన్ రోడ్డులోని మద్యం దుకాణంలో రూ.6.80 లక్షల మద్యం నిల్వలు కనిపించలేదు. గుంటూరు రోడ్డులోని మద్యం దుకాణంలో తనిఖీ చేయగా రూ.4.92 లక్షల మద్యం బాటిళ్లు అపహరణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ములకలూరు, రావిపాడు గ్రామాల పరిధిలో ఉన్న రెండు మద్యం దుకాణాలను పరిశీలించగా రూ.64 వేల రూపాయల మద్యం బాటిళ్లు చోరీకి గురైనట్లు తేల్చారు. నాలుగు మద్యం దుకాణాల్లో సుమారు రూ.13 లక్షల విలువైన మద్యం నిల్వలు మాయమైనట్లు ప్రాథమికంగా తేల్చారు. ఆయా దుకాణాల్లో పనిచేసే సూపర్వైజర్లను బాధ్యులను చేసి వారి నుంచి నగదు రాబట్టి, క్రిమినల్ కేసులు నమోదుకు చర్యలు తీసుకుంటామని ఈఎస్ మహేష్‌కుమార్ తెలిపారు. దాడుల్లో ఎక్సైజ్ సీఐలు కర్ణబాబు, మారయ్యబాబు, ఎస్ఐ ప్రసాద్, టూటౌన్ ఎస్ఐ నాగరాజు పాల్గొన్నారు. ఇద్దరు ఎక్సైజ్ కానిస్టేబుళ్లు సస్పెన్షన్ సాక్షి, గుంటూరు: అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో స్టాక్ దొంగిలించిన వారికి సహకరించిన కారణాలతో ఇద్దరు ఎక్సైజ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ డీసీ (ఎఫ్ఏసీ) శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. ఇటీవల నరసరావుపేటలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో కొందరు స్టాక్‌ను దొంగిలించారు. ఈవ్యవహారానికి సహకరించిన సత్యనారాయణ, చిలకలూరిపేటలో బెల్టుషాపుల నుంచి డబ్బు వసూలు చేస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డి.రామ్‌ప్రసాద్‌పై నేరం నిర్ధారణ కావడంతో సస్పెన్షన్ వేటు వేశారు. -
మత్తెక్కించే అవినీతి
చిత్తూరు అర్బన్: ప్రభుత్వ ఉద్యోగంలో ఓ సాధారణ కానిస్టేబుల్‌గా చేరిన వ్యక్తి 26 ఏళ్ల సర్వీసులో ఏం సాధించావని ఎవరైనా అడిగితే మంచి పేరు అనో, నిజాయితీ ఉన్న వ్యక్తనో, ఎవ్వరికీ తలవంచడనో సమాధానాలు రావాలి. కానీ చిత్తూరుకు చెందిన విజయ్‌కుమార్ మాత్రం ఈ 26 ఏళ్ల సర్వీసులో దాదాపు రూ.35 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టాడు. కల్తీ మద్యం తయారు చేసిన కేసులో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. సీఐడీ పోలీసుల చేత అరెస్టయి జైల్లో ఉన్నాడు. అయినా మార్పు రాలేదు. ఈసారి ఏకంగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడి జైలుకు వెళ్లాడు. ఇప్పటికీ ట్రాక్టర్ నడుపుతూ.. చిత్తూరు నగరంలోని కాజూరుకు చెందిన విజయ్ కుమార్‌ను చూస్తే ఎవరైనా ఇన్ని రూ.కోట్ల విలు వైన ఆస్తులున్నాయంటే నమ్మరు. ఎందుకంటే ఆబ్కారీ శాఖలో ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నాఓ సాధారణ వ్యక్తిలానే ఇతని దినచర్య ఉంటుంది. కర్నూలు నుంచి చిత్తూరులోని తన ఇంటికి వచ్చినప్పుడు ఉదయాన్నే నీటి ట్యాంకరున్న ట్రాక్టర్ నడుపుతూ వీధుల్లో తాగునీరుఅమ్ముతుంటాడు. ఇక్కడున్న పెట్రోలు బంకు వద్ద తనకు చెందిన శుద్ధినీటి ప్లాంటులో కూర్చుని నీళ్ల క్యాన్లు విక్రయిస్తుంటాడు. ఇలాంటి వ్యక్తి ఇన్ని రూ.కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నాడంటే స్థానికులు ఆశ్యర్యంగా చూస్తున్నారు. పాఠం నేర్పని గతం.. జిల్లాలోని తిరుపతిలో ప్రభుత్వ మద్యం బాటిళ్ల సరఫరా డిపోలో పనిచేస్తున్నప్పుడే విజయ్‌కుమార్‌పై పలు ఆరోపణలు వచ్చాయి. అప్పటి ఎన్నికల్లో కల్తీ మద్యం జిల్లాలోకి తీసుకొచ్చారనే ఆరోపణలతో సీఐడీ పోలీసులు 2014లో విజయ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. బెయిల్ రాకపోవడంతో ఆరు నెలల వరకు జైల్లో ఉన్నాడు. అప్పటికీ ఆయనలో మార్పు రాలేదు. జిల్లా నుంచి కర్నూలుకు బదిలీ అయినప్పటికీ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డట్లు ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. దీంతో అన్ని ఆధారాలతో అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. వామ్మో ఇన్ని ఆస్తులా.. విజయ్‌కుమార్ అక్రమ సంపాదన, ఆస్తుల గురించి సొంత శాఖలోని ఓ వ్యక్తి నుంచి ఆధారాలతో కూడిన పక్కా సమాచారం ఏసీబీకి వెళ్లినట్లు తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి పొద్దుపోయే వరకు తిరుపతి ఏసీబీ అదనపు ఎస్పీ తిరుమలేష్, సీఐలు చంద్రశేఖర్, విష్ణువర్దన్, ప్రసాద్‌రెడ్డి, గిరిధర్, విజయశేఖర్, రమేష్, శివకుమార్, ఎస్ఐ విష్ణువర్దన్, కడప, కర్నూలుకు చెందిన ఏసీబీ అధికారులు చిత్తూరు, యాదమరి, తమిళనాడులోని కాట్పాడి, తిరుపతి ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇందులో విజయ్‌కుమార్ భార్య మీన పేరిట మూడంతస్తుల భవనం, రెండంతస్తుల భవనం, మరో రెండు భవనాలకు సంబంధించి పత్రాలు దొరికాయి. ఇరువారం, కాజూరు ప్రాంతాల్లో ఎనిమిది ప్లాట్లు, కాజూరులో ఓ ఇల్లు, తమిళనాడులోని కాట్పాడిలో ఓ ఇల్లుకు సంబంధించిన పత్రాలు, విజయ్‌కుమార్ పేరిట కాజూరులో ఓ శుద్ధినీటి ప్లాంటుకు చెందిన ఖాళీ స్థలం, ఇరువారం వద్ద ఓ స్థలాన్ని, ఇతని కొడుకు పేరిట ఉన్న ఆస్తుల పత్రాలను అధికారులు సీజ్ చేశారు. ఇక బంగారు ఆభరణాల్లో ఆడవాళ్లు పెట్టుకునే చెవి కమ్మల్లో 10 రకాలు, చేతి కడియాలు, ఐదు రకాల గొలుసులు, పదికి పైగా ఉంగరాలు, రాళ్ల హారాలు, వెండి ఆభరణాలు చూసిన అధికారులే ఆశ్చర్యానికి గురయ్యారు. టీడీపీ నేతల భరోసా... విజయ్‌కుమార్‌ను సీఐడీ అధికారులు అరెస్టు చేసినప్పుడు చిత్తూరు నగరానికి చెందిన ఓ టీడీపీ నేత అండగా నిలిచినట్లు బహిరంగంగా చెబుతున్నారు. జైల్లో ఉన్న విజయ్‌కుమార్‌ను బయటకు తీసుకురావడంతో పాటు మళ్లీ పోస్టింగ్ ఇప్పించడం, పదోన్నతి కల్పించడంలో టీడీపీ నేత చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. ఇందుకు ఎక్సైజ్ స్థాయిలో పనిచేసిన ఓ మంత్రి అండదండలు కూడా ఉన్నట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. మరోవైపు విజయ్‌కుమార్ ఆస్తులపై జరిగిన ఏసీబీ దాడులు జిల్లాలోని ఎక్సైజ్ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. తిరుపతిలోనూ తనిఖీలు తిరుపతి క్రైం: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని చిత్తూరు ఎక్సైజ్ శాఖ ఎస్ఐ విజయ్‌కుమార్ ఇంటిపై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు చేసిన విషయం తెలిసిందే. తిరుపతి వివేకానందనగర్‌లో ఎస్ఐ చెల్లెలు విశాలాక్షి ఇంట్లో కూడా అధికారులు తనిఖీ చేశారు. ఏసీబీ డీఎస్పీ మల్లేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీ చేయగా ఎలాంటి ఆస్తులూ పట్టుబడలేదు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఆయనకు సంబంధించిన ఆస్తుల కోసం ఆరా తీస్తున్నారు. -
ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు 8న పీఈటీ టెస్టు
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా ఆగస్టు 8వ తేదీన ఉదయం 5 గంటలకు పీఈటీ, ఈవెంట్స్ టెస్టు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమీలో ఈ పరీక్షలు ఉంటాయని పేర్కొంది. టెస్టులకు ఎంపికైన వారి జాబితాను వెబ్సైట్లో పొందవచ్చని సూచించింది. -
మెల్లమెల్లగా నల్లబెల్లం
ఎక్సైజ్ కానిస్టేబుల్ పరిశీలిస్తున్న గోనె సంచుల మూటలు పద్మావతి ఎక్స్‌ప్రెస్ లోనివి. కేసముద్రం వద్ద రైల్లోనే పట్టుబడ్డాయి. వీటిని గుంటూరు జిల్లా బాపట్ల రైల్వే స్టేషన్లో రైలెక్కించారు. పక్కా సమాచారంతో ఎక్సైజ్, సివిల్, రైల్వే పోలీసులు సంయుక్తంగా వలపన్ని పట్టుకున్నారు. ఈ చిత్రంలో కనిపిస్తున్నవి కేసముద్రం–నెక్కొండ మార్గమధ్యలో కదులుతున్న రైలులోంచి బయటకు విసిరేసిన బస్తాలు. అందులో గుడుంబా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం ముద్దలు ఉన్నాయి. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న కొందరు వ్యక్తులు మెరుపు వేగంతో ఆ బస్తాలను తీసుకుని మాయమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బెల్లాన్ని నిషేధించింది. సాక్షి, హైదరాబాద్: 100 శాతం గుడుంబా రహిత రాష్ట్రంగా ప్రకటించిన తెలంగాణలోని పల్లెలకు నిత్యం నిషేధిత నల్లబెల్లం దిగుమతి అవుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వైపు వస్తున్న రైళ్లలో రోజుకు కనీసం 50 నుంచి 75 టన్నుల నల్లబెల్లం అక్రమ రవాణా కొనసాగుతోంది. దీని నుంచే గుడుంబాను కాస్తున్నారు. పక్క రాష్ట్రంలో తక్కువ ధరకే కావాల్సినంత బెల్లం అందుబాటులో ఉండటం, రోడ్డు మార్గంతో పోల్చితే రైలు ద్వారా అక్రమ రవాణా సులువుగా ఉండటంతో మాఫియా ఇటు మళ్లింది. తొలుత ఒక్కో వ్యక్తి గుట్టుచప్పుడు కాకుండా 30 నుంచి 50 కిలోల బెల్లం అక్రమ రవాణా చేయాగా.. తాజాగా ముగ్గురు నలుగురు వ్యక్తులు ఒక గ్రూప్‌గా ఏర్పడి ట్రిప్పునకు 4 క్వింటాళ్ల వరకు బెల్లం దిగుమతి చేస్తున్నారు. మళ్లీ రెచ్చిపోతున్న గుడుంబా మాఫియా గుడుంబాతో ప్రాణాపాయం ఎక్కువగా ఉండటం, తెలంగాణ పల్లెలు నాటు సారా మత్తులో జోగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం నాటు సారాను నిర్మూలించాలని సంకల్పించింది. ఈ మేరకు నల్లబెల్లాన్ని నిషేధించి, నాటు సారా కాయటం మానేసిన కుటుంబాలకు పునరావాసం కల్పించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరోవైపు గుడుంబా తయారీకి వినియో గించే బెల్లం, పట్టిక అమ్మకాలు సాగిస్తే ఎక్సైజ్ అధికారులు పీడీ యాక్టును ప్రయోగించారు. బెల్లం సరఫరా మూలాలను మూసేశారు. బెల్లం అమ్మకాలపై నిఘా పెట్టారు. అయితే పునరావాస ప్యాకేజీ అందరికీ అందకపోవటం, ఏడాదిపాటు గుడుంబా నిర్మూలన కోసం శ్రమ పడ్డ ఎక్సైజ్ అధికారులు విశ్రాంతి ధోరణితో కనిపించడంతో నాటు సారా కాసే కుటుంబాలు మళ్లీ రెచ్చిపోతున్నాయి. గుడుంబా దందా ఇప్పుడు గ్రామాల వైపు చొచ్చుకొని వస్తోంది. అక్కడ కిలో రూ.35.. ఇక్కడ రూ.90 ఏపీలో కిలో రూ.35 ఉన్న నల్లబెల్లం రాష్ట్రంలో రహస్య మార్కెట్లోకి వచ్చే సరికి కిలో రూ.75 నుంచి రూ.90 వరకు పలుకుతోంది. దీంతో బెల్లం అక్రమ రవాణా చేయడానికి గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు ముఠాగా ఏర్పడుతున్నారు. విశాఖపట్నం, విజయవాడ, ఒంగోలు, నాగ్‌పూర్, మన్మాడ్, అకోలా వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బెల్లం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వస్తోంది. రైలులో ఖమ్మం జిల్లా మీదుగా సికింద్రాబాద్ సమీప గ్రామాల వరకు చేరవేస్తున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య దందా సాగిస్తున్నారు. విశాఖ, తుని, అనకాపల్లి, నెల్లూరు తదితర ప్రాంతాల్లో 50 కిలోల నుంచి క్వింటాల్ వరకు బెల్లం కొనుగోలు చేసి బస్తాల్లో తీసుకుని సాధారణ ప్రయాణికుల్లా రైలు ఎక్కుతున్నారు. జనరల్ బోగీల్లో సీట్ల కింద, టాయిలెట్ల వద్ద దాచి ఉంచుతున్నారు. తమ గమ్యానికి రాగానే బస్తాలను కదులుతున్న రైలు లోంచి విసిరేస్తున్నారు. ముఠా సభ్యులు బస్తాలను సేకరించి ఆటోల ద్వారా రాత్రికి రాత్రే గ్రామాలకు తరలించి విక్రయిస్తున్నారు. -
ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
పూతలపట్టు: అనారోగ్యంతో ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరు జిల్లా పూతలపట్టు పల్లె వీధిలో శనివారం జరిగింది. పల్లె వీధికి చెందిన ఎ.రవికుమార్(45) పుంగనూరులో ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అనారోగ్యం కారణంగా కొంతకాలంగా విధులకు వెళ్లడం లేదు. శక్రవారం కడుపు నొప్పి తీవ్రంగా రావడంతో ఎలుకల మందు తాగాడు. అస్వస్థతకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పూతలపట్టు ఎస్ఐ మురళీమోహన్ దర్యాప్తు చేస్తున్నారు. -
ఎక్సైజ్’ దేహదారుఢ్య పరీక్షల్లో 177 మంది అర్హత
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ కానిస్టేబుళ్ల రెండో దఫా దేహదారుఢ్య పరీక్షల్లో 177 మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. వీరిలో 124 మంది పురుషులు కాగా, 53 మంది మహిళలు ఉన్నారు. 2016 జూలై 31న 340 పోస్టుల కోసం టీఎస్పీఎస్సీ అర్హత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో అర్హుత సాధించిన 1,171 మందికి ఈ ఏడాది ఏప్రిల్‌లో దేహదారుఢ్య పరీక్ష నిర్వహించగా కేవలం 341 మంది మాత్రమే అర్హత సాధించారు. దీంతో మరో 443 మందికి ఈ నెల 5, 6 తేదీల్లో రెండవ దఫా దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. కాగా, అర్హత సాధించిన పురుష అభ్యర్థులకు ఈ నెల 12 నుంచి 15 వరకు, మహిళా అభ్యర్థులకు ఈ నెల 16న కంటిచూపు పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఉదయం 9 గంటల కల్లా మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రిలోని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో హాజరుకావాలని టీఎస్పీఎస్సీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు తమ వెంట హాల్ టికెట్, 2 పాస్‌పోర్టు సైజ్ ఫోటోలు, ఫోటో గుర్తింపు కార్డుతో పాటు రూ.300 ఫీజు తీసుకురావాలని పేర్కొంది. -
ఎక్సైజ్ కానిస్టేబుల్‌పై వేటు?
విశాఖపట్నం: గంజాయి అక్రమ రవాణాలో భాగస్వామ్యం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనకాపల్లి ఎక్సైజ్ కానిస్టేబుల్ నాయుడుపై వేటుకు రంగం సిద్ధమవుతోంది. విజయవాడలో గంజాయితో పట్టుబడ్డ నిందితులిచ్చిన సమాచారంతో కానిస్టేబుల్ నాయుడు పేరు బయటకొచ్చింది. ఈ వ్యవహారంపై ‘ఎక్సైజ్, స్మగ్లర్ భాయిభాయి.. ఎంచక్కా గంజాయ్’ శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. దీనిపై ఎక్సైజ్ ఉన్నతాధికారులు స్పందించారు. నాయుడుపై కేసు నమోదుకు సంబంధించి విజయవాడ పోలీసుల నుంచి ఎక్సైజ్ అధికారులకు అధికారిక సమాచారం ఇంకా అందలేదు. నేడో, రేపో సమాచారం రాగానే ఆయనపై చర్యలు (సస్పెన్షన్) తీసుకోనున్నారు. ఇదే విషయాన్ని శనివారం విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు చెప్పారు. ఈ వ్యవహారం వెలుగు చూడడంతో నాయుడు పరారీలో ఉన్నారు. ఈ గండం నుంచి తనను గట్టెక్కించాలని జిల్లాకు చెందిన ఓ మంత్రిని కానిస్టేబుల్ నాయుడు ఆశ్రయించినట్టు తెలిసింది. మరోవైపు గంజాయి అక్రమ రవాణాలో పాడేరు మొబైల్ టీమ్ సీఐ పెదకాపుపై కేసు నమోదయింది. దీంతో ఆయనను గతంలోనే సస్పెండ్ చేశారు. దాదాపు ఆరు నెలల నుంచి ఆయన పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో ఎక్సైజ్ సోమవారం స్టాట్యుటరీ నోటీస్ జారీ చేయనున్నారు. అనంతరం నిబంధనల ప్రకారం శ్రీనివాస్‌ను ఉద్యోగం నుంచి తొలగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. -
ఎక్సైజ్ కానిస్టేబుల్ సస్పెన్షన్
- రూ.3 లక్షల డీడీ భాగోతంపై స్పందించిన ఉన్నతాధికారులు అనంతపురం సెంట్రల్ : రూ.3 లక్షల డీడీ దొంగలించిన భాగోతంలో అభియోగాలు ఎదుర్కొంటున్న అనంతపురం ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ రమణను సస్పెండ్ చేస్తూ సూపరింటెండెంట్ అనిల్‌కుమార్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 18(ఆదివారం)న ‘ఎక్సైజ్‌లో డీడీ కుంభకోణం’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఆ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. ప్రధాన సూత్రధారి అయిన కానిస్టేబుల్ రమణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. గత నెలలో మద్యం దుకాణాలకు నిర్వహించిన టెండర్లలో సదరు కానిస్టేబుల్ కాసులకు కక్కుర్తిపడి ప్రభుత్వం పేరుతో ఒకరు కట్టిన డీడీని తస్కరించి దానిని మరొకరికి ఇచ్చి సొమ్ము చేసుకున్నాడు. లోగుట్టు బయటపడదులే అనుకున్నాడు. కానీ బాధితుడు ఈ విషయాన్ని పసిగట్టడంతో కొందరు అధికారులు రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనను సాక్షి వెలుగులోకి తీసుకురావడంతో కలవరపాటుకు గురై కానిస్టేబుల్ రమణపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఎక్సైజ్ కానిస్టేబుల్ ఇంట్లో చోరీ
► రూ.4 లక్షల నగదు మాయం ► 13 సవర్ల బంగారం కూడా.. ఒంగోలు : నగరంలోని తాలూకా పోలీసుస్టేషన్ పరిధి సుందర్ నగర్లో శనివారం తెల్లవారు జామున చోరీ జరిగింది. ఎక్సైజ్‌శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న డీఎంసీ రంగన్న ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు ఇంట్లోని హాల్లో నిద్రిస్తుండగా ఇంటి వెనుక నుంచి లోనికి ప్రవేశించిన దొంగ బీరువాలోని రూ.4 లక్షల నగదును అపహరించుకెళ్లాడు. రంగన్న దంపతులు ముందు హాలులో నిద్రిస్తున్నారు. బాత్ రూమ్‌కు వెళ్లినప్పుడు వెనుక తలుపులు వేయటం మరిచిపోయారో ఏమోగానీ వెనుక నుంచి సులభంగా లోనికి ప్రవేశించిన దుండగుడు బెడ్రూమ్లోని దిండు కింద ఉన్న తాళాలు తీసుకొని బీరువా తెరిచాడు. బీరువాలోని బ్యాగులో కుటుంబ అవసరాలకు తెచ్చి పెట్టుకున్న నగదును అపహరించుకెళ్లాడు. నగదుతో పాటు బీరువాలోనే ఉన్న 13 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.25 వేల విలువైన వెండి వస్తువులు కూడా పట్టుకెళ్లాడు. తెల్లవారి లేచి చూసుకునే సరికి వెనుక తలుపులు తీసి ఉన్నాయి. బీరువా కూడా తెరిచి ఉండటాన్ని గమనించారు. బీరువాలోని నగదు, బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని గుర్తించి ఆ సమాచారాన్ని ఒంగోలు తాలూకా పోలీసులకు ఇచ్చారు. దొంగతనం చేసేందుకు వచ్చిన దుండగుడు అతను తెచ్చుకున్న తాళాలను కూడా అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఎస్సైలు నాగేశ్వరరావు, సురేష్‌లు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దొంగతనం జరిగిన తీరును ఇంటి యజమానిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకొని బీరువాపై వేలిముద్రలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డుప్రమాదంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ మృతి
ములకలచెరువు (చిత్తూరు) : చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. ములకలచెరువు మండలం వేపురికోట పంచాయతీ బత్తలాపురంలో ఉండే రవిచంద్ర(45) తిరుపతిలో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం అతడు మదనపల్లి వైపు తన బైక్‌పై వెళ్తుండగా గ్రామ సమీపంలోనే బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో రవిచంద్ర అక్కడికక్కడే చనిపోయాడు. -
ఎక్సైజ్ కానిస్టేబుల్ అసోసియేషన్ ఎన్నిక
గుంటూరు (పట్నంబజారు): ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. లక్ష్మీపురంలోని సహజ ఫంక్షన్ హాలులో ఆదివారం ఎన్నుకున్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఎం కోటయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎస్వీ సుబ్బారావు, కోశాధికారిగా బీఎస్ఎన్ రాజు, అసోసియేషన్ అధ్యక్షుడిగా కే నాంచారయ్య, ఉపాధ్యక్షులుగా శివనాగేశ్వరరావు, శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా శ్రీమన్నారాయణ, సహాయ కార్యదర్శులుగా నాగభూషణం, శంకరరావు, వెంకటస్వామి, రవిశంకర్ ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎస్ పెద్దయ్య, ఆర్.కోటేశ్వరరావు, ఎం.కోటేశ్వరరావు, వీ జ్యోతి, సీహెచ్.సాంబశివరావు, సుందరయ్య రాజులు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా ఎకై ్సజ్ అధికారులు శౌరి, ఆవులయ్య వ్యవహరించారు. అనంతరం ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులను పూలమాలతో ఘనంగా సత్కరించారు. -
ప్రశాంతంగా జరిగిన ఎక్సైంజ్ కానిస్టేబుల్ పరీక్షలు
పటాన్చెరు టౌన్ : మండలంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్షలు ప్రశాతంగా జరిగాయి. మొత్తం ఏడు కేంద్రాల్లో ఈ పరీక్షలను అధికారులు సమర్థవంతంగా నిర్వహించారు. మండలంలో మొత్తం 4,704 మంది ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా, 3, 671 మంది రాశారు. మొత్తం 1,033 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. మండలంలోని గీతం1, 2 కళాశాలల్లో 784 మంది , 782 మంది, సెయింట్‌జోసఫ్ హైస్కూల్ 393 మంది, మంజీరా డిగ్రీ కళాశాలలో 256మంది, ఎల్లంకి ఇంజనీరింగ్ కళాశాలలో 433 మంది, టర్భో మిషనరీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో 461 మంది, టీఆర్ఆర్ కళాశాలలో 562 మంది పరీక్ష రాశారు. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఆలస్యంగా పరీక్షకు వచ్చిన వారిని అనుమతించలేదు. అభ్యర్థులు హాల్‌టిక్కెట్లను చెక్ చేసిన తరువాతే వారిని పరీక్షకు అనుమతించారు. మొత్తం మీద మండలంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్షలు ఎటువంటి అవకతవకలు లేకుండా ప్రశాతంగా ముగిశాయి. -
ప్రేమ మాయం.. నరకం ఆరంభం
సాక్షి ప్రతినిధి, కడప: ఆమె ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్. సహచర హోంగార్డు సోదరుడితో పరిచయం పెంచుకుంది. మాటలు కలిసి ప్రేమికులుగా మారారు. వివాహం చేసుకుందామనుకున్నారు. కులాలు అడ్డు కానున్నాయని యువతి అభ్యంతరం పెట్టింది. ‘కులాలతో నిమిత్తం లేదు, అండగా ఉంటా, జీవితాంతం తోడు నీడగా ఉంటాన’ని అతడు భరోసా ఇచ్చాడు. కుటుంబ పెద్దలను కాదని వివాహం చేసుకుంది. నాలుగు నెలలు తిరక్కమునుపే భర్త నుంచి వేధింపులు తీవ్రమయ్యాయి. అనుమానపు అలోచనలు అధికమయ్యాయి. భర్త చిత్రహింసలకు గురిచేస్తున్నా చూ స్తుండడం మినహా అత్తమామ జోక్యం చేసుకోలేదు. ప్రేమ పేరుతో మోసపోయిన ఓ యువతి దీన గాథ ఇది. పోరుమామిళ్లకు చెందిన డి.శిల్ప ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా మైదుకూరులో విధులు నిర్వహిస్తోంది. మైదుకూరులో పని చేస్తోన్న ఓ హోంగార్డు సోదరుడు ఆమెకు పరిచయం అయ్యాడు. తన అన్న వద్దకు వస్తూ వెళ్తూ శిల్ప పట్ల ఆ యువకుడు ఆకర్షితుడయ్యాడు. శిల్పకు ఇష్టమైతే వివాహం చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. కులాలు అడ్డుకానున్నాయి.. ఇరువర్గాలు పట్టింపులకు పోయే అస్కారం ఉందని శిల్ప వివరించింది. తుదకు ఇద్దరూ ఇష్టపడి గత అక్టోబర్‌లో వివాహం చేసుకున్నారు. కొద్ది రోజులు వీరి దాంపత్య జీవితం సవ్వంగా సాగింది. తర్వాత జీతం మొ త్తం ఇవ్వాల్సిందిగా భర్త అజామాయిషీ చేశాడు. నెల జీతం ఇస్తున్నా.. పైమామూళ్లు ఇవ్వలేదేమిటని ప్రశ్నించాడు. పురుష హోం గార్డులకు మామాళ్లు వస్తున్నప్పుడు నీ కెందుకు రావంటూ నిలదీశాడు. విధుల్లో ఉందా? డ్యూటీకి ఎన్ని గంటలకు వచ్చింది? ఎక్కడికెళ్లింది? ఇలాంటి వాటిపై ఆరా మొదలైంది. ప్రత్యక్షంగా వాకబు చేయడం, ఫలానా వారితో మాట్లాడుతున్నావేమిటని ప్రశ్నిస్తూ వేధించడం పరిపాటిగా మారింది. తల్లిదండ్రులను కాదని కులాంతర వివాహం చేసుకున్నందుకు వారికి చెప్పుకోలేని దీన స్థితిలో శిల్ప కొట్టుమిట్టాడుతోంది. సర్వీసు రిజిస్టర్లో నామినీ పేరు తండ్రి కాకుండా భర్త పేరు చేర్చాలని తీవ్రమైన ఒత్తిడి ఆరంభమైంది. ఇంతటి క్షోభ అనుభవిస్తూ.. మరోవైపు డ్యూటీకీ సక్రమంగా హాజరు కావడం లేదని పై అధికారుల నుంచి చీవాట్లు, మందలింపులు షరామామూలయ్యాయి. అటు భర్త చిత్రహింసలు, డ్యూటీ పరంగా ఉన్న ఒత్తిడి భరించలేక మానసిక వేదనకు గురవుతోంది. ఈక్రమంలో గురువారం పోలీసు అధికారులను కలిసి తన వేదనను విన్నవించుకునేందుకు ఆమె సిద్ధమైంది. అండగా నిలవాలని ప్రజా సంఘాలు, మహిళ సంఘాలను అభ్యర్థిస్తోంది. ఆ మేరకు తన ఆవేదనను ఆమె ‘సాక్షి’కి వివరించింది. -
ఎక్సైజ్ కానిస్టేబుల్: కనీస విద్యార్హత ఇంటర్
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత కనీస విద్యార్హతగా ప్రభుత్వం మార్పులు చేసింది. పోలీస్‌శాఖలోని కానిస్టేబుల్ పోస్టుల కనీస విద్యార్హతను ఉమ్మడి రాష్ట్రంలోనే ఎస్ఎస్సీ నుంచి ఇంటర్‌కు పెంచారు. కానీ ఎక్సైజ్ శాఖలో మాత్రం కానిస్టేబుళ్ల నియామకానికి ఎస్‌ఎస్‌సీనే అర్హతగా కొనసాగుతూ వచ్చింది. దీంతో ఎక్సైజ్ కానిస్టేబుళ్ల జీతభత్యాలు మొదలు పీఆర్సీ వరకు పోలీస్ కానిస్టేబుళ్ల కన్నా తక్కువగా ఉంది. ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ‘ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష’ పాసైనవారే ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ఉద్యోగానికి అర్హులని పేర్కొంటూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రొహిబిషన్, ఎక్సైజ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్, 1998ను తెలంగాణకు అన్వయించుకొని మార్పులు చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా (రెవెన్యూ) ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్సైజ్ కానిస్టేబుళ్ల విద్యార్హతను మార్చిన నేపథ్యంలో కొత్త నియామకాలకు సర్కార్ పచ్చజెండా ఊపినట్టేనని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. 1,000కి పైగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఎక్సైజ్ కమిషనర్ ఆర్వీ చంద్రవదన్, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ అకున్ సబర్వాల్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. -
మామూళ్ల కిక్
ఎక్సైజ్ శాఖలో లంచాల ప్రహసనం మద్యం వ్యాపారుల నుంచి క్రమం తప్పకుండా నెలవారీ మామూళ్లు టాస్క్‌ఫోర్స్ అధికారులకు సైతం ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయూలు విజయవాడ : ఎక్సైజ్ శాఖలో మామూళ్ల ప్రహసనం యథేచ్ఛగా సాగుతోంది. ఎక్సైజ్ కానిస్టేబుల్ నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు అందరికీ నెలవారీ మామూళ్లు భారీగానే అందుతున్నారుు. దీంతో జిల్లాలో ఎమ్మార్పీ నిబంధనను గాలికొదిలేసిన వ్యాపారులు ఇష్టానుసారంగా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. జిల్లాలో నెలకు సగటున రూ.100 కోట్లపైనే మద్యం విక్రయాలు జరుగుతున్నా.. నామమాత్రంగా కూడా నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదు కావడంలేదు. జిల్లాలో 301 వైన్షాఫులు, 156 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వైన్‌షాపుల్లో తప్పనిసరిగా ఎమ్మార్పీకే విక్రయించాలని నిబంధన అమలులో ఉంది. ఇక బార్లలో ఎలాంటి నిబంధనలు లేకపోవటంతో 365 రోజులూ అధిక ధరలకే విక్రరుుస్తున్నారు. ఎమ్మార్పీతో నిమిత్తం లేకుండా 30 శాతం అధిక ధరలకు ఇక్కడ విక్రయూలు జరుగుతున్నారుు. పెరుగుతున్న మద్యం విక్రయలు జిల్లాలో గత మూడు నెలలుగా మద్యం విక్రయాలు పెరిగాయి. సాధారణంగా డిసెంబర్, జనవరి నెలల్లో మద్యం విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. నవంబర్‌లో కొంత తక్కువగా ఉంటాయి. కానీ, గత నవంబర్‌లో కూడా భారీ విక్రయూలు జరిగారుు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే సగటున పదిశాతం అధిక విక్రయాలు జరిగాయి. ఇక డిసెంబర్ 31 అర్ధరాత్రి పార్టీల్లో మద్యం కొనుగోళ్లు రికార్డు స్థారుుకి చేరింది. ఒక్క డిసెంబర్ 31నే జిల్లాలో రూ.7కోట్ల విలువైన 17,800 కేసుల మద్యం విక్రయాలు జరిగాయి. 2013, డిసెంబర్ 31న రూ.5కోట్ల వ్యాపారం జరిగింది. ఇలా.. జిల్లాలో రికార్డుస్థాయిలో విక్రయాలు జరుగుతుండటంతో అధిక ధరలకు అమ్మకాలు జరుపుతున్న వ్యాపారులు పండగ చేసుకుంటున్నారు. అధికారులకు క్రమం తప్పకుండా నెలవారీ మామూళ్లు జిల్లాలో మద్యం వ్యాపారులు సిండికేట్ అయ్యారు. రెండు, మూడు ప్రధాన సిండికేట్లుగా మారి పోలీస్స్టేషన్లకు మామూళ్లు మొదలుకుని ఎక్సైజ్ శాఖలోని స్టేట్ టాస్క్‌ఫోర్స్ టీమ్ వరకు నెలవారీ మామూళ్లు క్రమం తప్పకుండా పంపిస్తున్నారు. జిల్లాలో 20 ఎక్సైజ్ సర్కిళ్లు ఉన్నాయి. వీటి పరిధిలో 301 మద్యం షాపులు, 156 బార్లు ఉన్నాయి. ఒక్కో వైన్‌షాపు నిర్వాహకుడు నెలకు రూ.25వేల వరకు ఎక్సైజ్ శాఖ అధికారులకే చెల్లిస్తున్నారు. రేట్లు ఫిక్స్ : వ్యాపారులు, ఎక్సైజ్ అధికారులు ముందుగానే మాట్లాడుకుని మామూళ్ల రేట్లు ఫిక్స్ చేసుకుంటున్నారు. ఐదు నెలలుగా జిల్లాలో ఈ రేట్లు అమలులో ఉన్నాయి. స్టేషన్‌కు నెలకు రూ.13వేల వరకు మామూళ్లు అందుతున్నారుు. కానిస్టేబుల్ మొదలుకుని సీఐ వరకు అందరికీ వాటానే. అలాగే, సర్కిల్ ఉన్నతాధికారికి, కార్యాలయానికి నెలకు రూ.3వేలు, జిల్లాస్థాయి అధికారి, ఆయన కార్యాలయానికి రూ.3వేలు, ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో కిందిస్థాయి నుంచి జిల్లా అధికారి వరకు అందరికీ కలిపి నెలకు రూ.6వేలు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఈఎస్) నేతృత్వంలో ఉండే టాస్క్‌ఫోర్స్‌కు నెలకు రూ.6వేలు, రాష్ట్రస్థాయిలో దాడులు నిర్వహించే స్టేట్ టాస్క్‌ఫోర్స్‌కు ఆరు నెలలకు రూ.6వేలు మామూళ్లు అందుతున్నారుు. మామూళ్ల భారం మందుబాబులపైనే.. మామూళ్ల నేపథ్యంలో వ్యాపారులు క్వార్టర్ మద్యం రూ.10 నుంచి రూ.15 ఎక్కువగా అమ్ముతున్నారు. ఎక్సైజ్ అధికారులు నెల మొదటి వారంలో బెల్ట్‌షాపులపై హడావుడి దాడులు చేసి.. తర్వాత వాటిని కూడా వదిలేస్తున్నారు. గడిచిన రెండు నెలల కాలంలో స్టేట్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) కూడా జిల్లాలో దాడులు చేసిన సందర్భాలు లేవు. తిరువూరు, నూజివీడు, నందిగామల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది. నిబంధనలు ఉల్లఘించి.. అధిక ధరలకు విక్రయూలు జరపడం వల్ల జిల్లాలోని వ్యాపారులకు నెలకు సగటున రూ.12కోట్ల అదనపు లాభం వస్తోంది -
ఎక్సైజ్ కానిస్టేబుల్ బలవన్మరణం
కోడుమూరు: కర్నూలు జిల్లా కోడుమూరు ఎక్సైజ్ కానిస్టేబుల్ వెంకటరత్నం(27) ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నూలులోని క్రిష్ణానగర్‌కు చెందిన దాసు, సరోజమ్మ దంపతుల రెండో కుమారుడైన వెంకటరత్నం రెండు నెలల క్రితం ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. కోడుమూరు ఎక్సైజ్ కార్యాలయంలో సెంట్రీ డ్యూటీలో ఉన్న అతను శనివారంరాత్రి 11.30 గంటల సమయంలో తోటి కానిస్టేబుళ్లతో ఎప్పటిలానే మాట్లాడాడు. ఉదయం శవమై కనిపించాడు. కాగా, తమ కుమారుడు చాలా ధైర్యవంతుడని.. ఆత్మహత్యకు పాల్పడేంత సమస్యలు లేవని వెంకటరత్నం తల్లి సరోజమ్మ తెలిపారు. అయితే సీఐ హిమబిందు తరచూ వేధిస్తున్నట్లు చెప్పేవాడని.. బయట చంపేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు సృష్టించినట్లు ఆమె ఆరోపించారు. ఘటనస్థలంలో మరొకరి సెల్‌ఫోన్ ఉం డటం.. ఎడమవైపు గడ్డం వద్ద రక్తపు మరకలు ఉండ టం హత్య చేశారనేందుకు బలం చేకూరుస్తోందన్నా రు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కలిసొచ్చిన కొడుకు.. నడిచొచ్చిన ఉద్యోగం
సీతానగరం, న్యూస్‌లైన్ :గూడ్స్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వ్యక్తి.. తన కుమారుడు ఉన్నత చదువులతో మంచిస్థాయికి చేరుకోవాలనే కల నిజమైంది. ఆర్థిక పరిస్థితులు సహకరించకున్నా, కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలవాలనే తపనతో తండ్రి ఆశయానికి అనుగుణంగా కుమారుడు ఎక్సైజ్ కానిస్టేబుల్ రాత పరీక్షలకు హాజరై జిల్లాలో ఆరవ స్థానం సాధించాడు. సీతానగరానికి చెందిన సత్యం సుబ్రహ్మణ్యంకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు తనలా కష్టపడకూడదనే ఉద్దేశంతో ఇద్దరు కుమారుల చదువులను ప్రోత్సహించాడు. పెద్ద కుమారుడు వెంకటేష్ బీఎస్సీ చేయగా రెండవ కుమారుడు సురేష్ సీతానగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2013న బీఏ పరీక్షలు రాశాడు. అనంతరం మార్చి నెలలో జరిగిన ఎక్సైజ్ కానిస్టేబుల్ రాత పరీక్షలు రాశాడు. డిగ్రీలో 65 శాతం మార్కులు సాధించాడు. ఎక్సైజ్ కానిస్టేబుల్ రాత పరీక్షలో నూరుకు 81 మార్కులు సాధించి, జిల్లాలో ఆరవ స్థానంలో నిలిచాడు. ఈనెల 18న అపాయింట్మెంట్ లెటర్ రావడంతో గృహిణి అయిన తల్లి సత్యవతి ఆనందానికి అవధులు లేవు. సురేష్ విలేకర్లతో మాట్లాడుతూ తల్లిదండ్రుల కోరికను నెరవేర్చాలనే పట్టుదలతోను, వారి సహకారంతోను రాత పరీక్ష రాశానని, జిల్లాలో ఆరవ స్థానం సాధించడంతో మెరిట్‌పై ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగం దక్కిందని అన్నాడు. గ్రూప్- 2కు ప్రిపేర్ అవుతున్నానని సురేష్ తెలిపాడు. -
ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ఫలితాలు విడుదల
కడప అర్బన్, న్యూస్‌లైన్ :ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు ఎంపికైన 78 మంది అభ్యర్థుల జాబితాను ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి.నాగలక్ష్మి సోమవారం సాయంత్రం కడప ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ప్రకటించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఎక్సైజ్ కానిస్టేబుళ్ల నోటిఫికేషన్‌ను 2012 అక్టోబరు 30న విడుదల చేశారన్నారు. 2012 డిసెంబరు 1 నుంచి 19వ తేది వరకు దాదాపు 15 వేల మందికి నాలుగు కిలోమీటర్ల పరుగుపందెన్ని నిర్వహించామన్నారు. 2013 జనవరి 17 నుంచి ఫిబ్రవరి 5 వరకు దేహదారుడ్య పరీక్షలు, సర్టిఫికెట్ల పరిశీలన చేశామన్నారు. ఈ పరీక్షల్లో ఎంపికైన 2005 మంది అదే సంవత్సరం మార్చి 31న రాత పరీక్ష రాశారన్నారు. రాత పరీక్షలో ఎంపికైన 1:2 అభ్యర్థుల జాబితాను డిస్ట్రిక్ సెలెక్షన్ కమిటీ ఆద్వర్యంలో ఎంపిక చేశామన్నారు. జిల్లాలో 80 పోస్టులకుగాను అర్హత పొందిన 78 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ శంభుప్రసాద్, కడప ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్, జమ్మలమడుగు ఎక్సైజ్ సీఐ పీరుసాహెబ్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. మెరిట్ అభ్యర్థుల వివరాలు ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ఉద్యోగాల కోసం బరిలో దిగిన అభ్యర్థులలో మొదటి ర్యాంకును మడితాటి పద్మాకర్‌రెడ్డి (86 మార్కులు), ద్వితీయ ర్యాంకును జి.ఈశ్వరయ్య (85 మార్కులు), తృతీయ ర్యాంకును జి.శంకరయ్య (83 మార్కులు), బి.శ్రీనివాసులురెడ్డి (83 మార్కులు), సి.విష్ణువర్దన్‌రెడ్డి (83 మార్కులు) ఉన్నారు.