కలిసొచ్చిన కొడుకు.. నడిచొచ్చిన ఉద్యోగం
కలిసొచ్చిన కొడుకు.. నడిచొచ్చిన ఉద్యోగం
Published Tue, Feb 25 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 4:03 AM
సీతానగరం, న్యూస్‌లైన్ :గూడ్స్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వ్యక్తి.. తన కుమారుడు ఉన్నత చదువులతో మంచిస్థాయికి చేరుకోవాలనే కల నిజమైంది. ఆర్థిక పరిస్థితులు సహకరించకున్నా, కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలవాలనే తపనతో తండ్రి ఆశయానికి అనుగుణంగా కుమారుడు ఎక్సైజ్ కానిస్టేబుల్ రాత పరీక్షలకు హాజరై జిల్లాలో ఆరవ స్థానం సాధించాడు. సీతానగరానికి చెందిన సత్యం సుబ్రహ్మణ్యంకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు తనలా కష్టపడకూడదనే ఉద్దేశంతో ఇద్దరు కుమారుల చదువులను ప్రోత్సహించాడు.
పెద్ద కుమారుడు వెంకటేష్ బీఎస్సీ చేయగా రెండవ కుమారుడు సురేష్ సీతానగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2013న బీఏ పరీక్షలు రాశాడు. అనంతరం మార్చి నెలలో జరిగిన ఎక్సైజ్ కానిస్టేబుల్ రాత పరీక్షలు రాశాడు. డిగ్రీలో 65 శాతం మార్కులు సాధించాడు. ఎక్సైజ్ కానిస్టేబుల్ రాత పరీక్షలో నూరుకు 81 మార్కులు సాధించి, జిల్లాలో ఆరవ స్థానంలో నిలిచాడు. ఈనెల 18న అపాయింట్‌మెంట్ లెటర్ రావడంతో గృహిణి అయిన తల్లి సత్యవతి ఆనందానికి అవధులు లేవు. సురేష్ విలేకర్లతో మాట్లాడుతూ తల్లిదండ్రుల కోరికను నెరవేర్చాలనే పట్టుదలతోను, వారి సహకారంతోను రాత పరీక్ష రాశానని, జిల్లాలో ఆరవ స్థానం సాధించడంతో మెరిట్‌పై ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగం దక్కిందని అన్నాడు. గ్రూప్- 2కు ప్రిపేర్ అవుతున్నానని సురేష్ తెలిపాడు.
Advertisement
Advertisement