సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్రలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న రూ.వందల కోట్ల విలువైన భూములు అవి. టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సభ నిర్వహిస్తున్న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ఉన్న ఈ ఖరీదైన భూములను ఆ పార్టీ నేతలు నకిలీ పత్రాలతో కొట్టేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలిపల్లి కేంద్రంగా సాగించిన భూ దందాలు ఇప్పుడు టీడీపీ నేత నారా లోకేశ్ సభతో మరోసారి వెలుగులోకి వస్తున్నాయి.
నకిలీ పత్రాలతో విక్రయించి.. పరిహారం కాజేసి
విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి రెవెన్యూ గ్రామం, సర్వే నంబరు 27లో 45 ఎకరాలున్న ఆసామి తిరుమారెడ్డి ఆదినారాయణ 1973లోనే మృతి చెందారు. భీమునిపట్నం మండలం అమనాం ఆయన స్వగ్రామం. ఆ భూములను కాజేసేందుకు తిరుమలరెడ్డి ఆదినారాయణ, అతడి కుమారుడు రమేష్ అనే వ్యక్తులను టీడీపీ నేతలకు బినామీగా వ్యవహరించే పులవర్తి సుబ్రహ్మణ్యం నకిలీ ధ్రువపత్రాలతో రంగంలోకి దించాడు.
నకిలీ పత్రాలతో 5.01 ఎకరాలను శ్రీరామినేని శ్రీధర్‌కు, మిగతా ఐదు ఎకరాలను కోనేరు కరుణాకరరావుకు 2000లో విక్రయించారు. అనంతరం దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన ఆర్డీవో నాగేశ్వరరావు ఆ పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్స్ బోగస్ అని తేల్చారు. తహసీల్దారు, ఆర్డీవో సంతకాలను ఫోర్జరీ చేశారని నిర్ధారిస్తూ, దీనిపై చర్యలు తీసుకోవాలని 2005లోనే ఆర్డీవో ఉత్తర్వులు జారీ చేసినా టీడీపీ నేతలు అడ్డుపడ్డారు.
మరోవైపు జాతీయ రహదారి విస్తరణ సమయంలో తిరుమారెడ్డి ఆదినారాయణకు చెందిన సుమారు 1.74 ఎకరాల భూమి పోయింది. దీనికి జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) చెల్లించిన పరిహారాన్ని ఆయన వారసులకు తెలియకుండా టీడీపీ భోగాపురం మండల అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ కాజేసిన వైనాన్ని ‘సాక్షి’ జిల్లా ప్రతినిధి ఇప్పటికే బట్టబయలు చేశారు.
బినామీ బాగోతం ఇలా...
విలువైన భూములను కాజేసేందుకు పులవర్తి సుబ్రహ్మణ్యం అనే బినామీని తెరపైకి తెచ్చిన టీడీపీ నాయకులు తిరుమలరెడ్డి ఆదినారాయణ అనే పేరుతో బోగస్ గుర్తింపు కార్డులను సృష్టించారు. అయితే ఇంటి పేరు తిరుమారెడ్డి బదులు తిరుమలరెడ్డి అని రాయడంతో పప్పులో కాలేశారు! పులవర్తి సుబ్రహ్మణ్యం సాక్షి సంతకంతో భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 1.2.2000వ తేదీన రిజిస్ట్రేషన్ చేశారు. పట్టాదారు పాసు పుస్తకం లేకపోవడంతో సబ్‌రిజిస్ట్రార్ దస్తావేజులను పెండింగ్‌లో పెట్టారు. దీంతో నకిలీ పాసుపుస్తకం, టైటిల్ డీడ్‌లను టీడీపీ నాయకులు సృష్టించారు. వాటిని సమర్పించడంతో 31.3.2000న సబ్‌రిజిస్ట్రార్ డాక్యుమెంట్లను రిలీజ్ చేశారు.
చుట్టూ తిరిగి పులవర్తికే..
పట్టాదారు పుస్తకం, టైటిల్ డీడ్స్‌పై అనుమానం కలగడంతో కొనుగోలుదారులైన శ్రీరామినేని శ్రీధర్, కోనేరు కరుణాకరరావు ఆర్డీవోను ఆశ్రయించారు. దీన్ని పసిగట్టిన టీడీపీ నేతలు నాడు అధికారం అండతో విచారణను అడ్డుకుని కొనుగోలుదారులతో బేరసారాలకు దిగారు.
శ్రీరామినేని శ్రీధర్ అప్పటి ఆనందపురం ఎంపీపీగా ఉన్న టీడీపీ నాయకుడు కోరాడ రాజబాబుకు విక్రయించినట్లుగా రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తరువాత పులవర్తి సుబ్రహ్మణ్యం బావ లక్ష్మణరావు పేరుతో బదలాయించారు. కోనేరు కరుణాకరరావు నుంచి నాలుగు ఎకరాలను సుబ్రహ్మణ్యమే స్వయంగా తన పేరున, మరో ఎకరం తన స్నేహితుడి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అలా చుట్టూ తిరిగి మొత్తం పది ఎకరాల భూమి పులవర్తి సుబ్రహ్మణ్యం చేతిలో పడింది!
మారణాయుధాలతో దాడులు..
2004 ఎన్నికల్లో టీడీపీ ఓటమి అనంతరం పోలిపల్లి పరిధిలో సర్వే నంబర్ 27లోని భూములకు సంబంధించి తిరుమలరెడ్డి ఆదినారాయణ పట్టాదారు పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్స్‌పై విచారణ మొదలైంది. అవేవీ భోగాపురం తహసీల్దారు కార్యాలయం నుంచి జారీ కాలేదని గుర్తించారు. ఆర్డీవో, తహసీల్దారు సంతకాలను ఫోర్జరీ చేయడంపై చర్యలకు ఆదేశించినా టీడీపీ నాయకులు అడ్డుపడ్డారు.
కబ్జాపై ప్రశ్నించిన తిరుమారెడ్డి ఆదినారాయణ బంధువులు, అమనాం, రావాడ గ్రామస్తులపై 2004 జనవరి 1న రౌడీమూకలు మారణాయుధాలతో దాడులకు పాల్పడ్డాయి. ఆ భూమి వద్దకు వచ్చిన వారిని దారుణమైన చిత్ర హింసలకు గురి చేసిన వైనాన్ని స్థానికులు ఇప్పటికీ మరచిపోలేకపోతున్నారు. బాధితులు భోగాపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. నెలల పాటు కిరాయి మూకలు మారణాయుధాలతో ఆ భూమిలోనే తిష్ట వేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అప్పట్లో ఉత్తరాంధ్రలోని ఓ జిల్లాకు ఎస్పీగా పని చేసిన ఓ పోలీసు అధికారి భార్య పేరిట 2.43 ఎకరాలు, ఆయన బావమరిది పేరుతో 49 సెంట్ల భూమి 2017లో బదిలీ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. సదరు అధికారి ఉద్యోగ విరమణ అనంతరం టీడీపీకి చెందిన ఓ ముఖ్య నాయకుడికి సలహాదారుడిగా వ్యవహరించడం భూముల కబ్జాలో ఆ పార్టీ నేతల ప్రమేయానికి నిదర్శనంగా నిలుస్తోంది.
ఆక్రమణదారుల కోసమేనా యువగళం
టీడీపీకి చెందిన భూ ఆక్రమణదారులు, అక్రమార్కులకు కొమ్ము కాయటానికే లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టినట్లుగా ఉంది. టీడీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు భోగాపురం మండలంలో పలు భూ అక్రమాలకు పాల్పడ్డారు. ఒక్క పోలిపల్లి గ్రామ పరిధిలోనే రూ.వందల కోట్ల విలువైన భూములను రెవెన్యూ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి కాజేసినట్లు బాధితులు ఆక్రోశిస్తున్నారు.
గత ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి బుద్ధి చెప్పినా లోకేష్ నిస్సిగ్గుగా అదే చోట యువగళం ముగింపు సభ నిర్వహిస్తున్నారు. అక్రమార్కులు, పెత్తందారులకు టీడీపీ కొమ్ము కాస్తున్నట్లు దీన్నిబట్టి రుజువవుతోంది. తీరు మారని టీడీపీకి ప్రజలు మరోసారి బుద్ధి చెప్పడం ఖాయం. – మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment