మిస్టర్ ఇండియా
సక్సెస్‌కు దారి
మిస్టర్ ఇండియా విజయం నేను కోరుకుంటున్న కెరీర్‌కు తొలి అడుగు మాత్రమే. నా ఈ విజయం మనదేశంలో మోడలింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి రావాలనుకునే యువతకు స్ఫూర్తినిస్తుందని నమ్ముతున్నాను. అంకితభావంతో హార్డ్‌వర్క్ చేసినప్పుడే విజయం సొంతమవుతుంది. అదే మనల్ని మన లక్ష్యాల దరి చేరుస్తుంది. – ఆదిత్య సుబ్రమణియన్, మిస్టర్ ఇండియా విజేత
ఆదిత్య సుబ్రమణియన్... ఆరడుగుల ఎత్తున్న 27 ఏళ్ల కుర్రాడు. చెన్నైలోని పల్లవరానికి చెందిన ఈ యువకుడు ఎస్‌ఆర్‌ఎమ్ కాలేజ్ ఇంజినీరింగ్ స్టూడెంట్. చదువు పూర్తి చేసి కార్పొరేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడితో సంతృప్తి చెందలేదతడు. సమున్నత లక్ష్యాలను నిర్దేశించుకున్నాడు. కెరీర్ దృష్టిని విస్తృతం చేసుకున్నాడు. తనకిష్టమైన ఫ్యాషన్, ఫిల్మ్ ఇండస్ట్రీ, మోడలింగ్‌లో అదృష్టాన్ని, అవకాశాలనూ పరీక్షించుకోవాలనుకున్నాడు. అందుకోసం ముందుగా ఏదైనా ఒక వేదిక మీద విజేతగా నిలవడం తొలి మెట్టు అనుకున్నాడు. ఏకకాలంలో పలువురి దృష్టిని ఆకర్షించడానికి మిస్టర్ ఇండియా పోటీలను ఎంచుకున్నాడు, విజేతగా నిలిచాడు.
కలసాధనకు కాలపరీక్ష!
సాహిత్యాభిలాషి అయిన ఆదిత్య తాను కలలు కన్న లక్ష్యాన్ని చేరడానికి ఆరేళ్లుగా కఠోరంగా శ్రమించాడు. పుస్తకాలు చదువుతూ, సినిమాలు చూస్తూ తనను తాను మలుచుకుంటూ దేహాకృతి కోసం క్రమం తప్పకుండా జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌లు చేశాడు. మిస్టర్ మదరాసీ, ఐరిస్ గ్లామ్ మిస్టర్ సూపరామ్ప్, ఎస్టిలో మిస్టర్ సదరన్ క్రౌన్ టైటిల్స్ గెలుచుకున్నాడు. మోడలింగ్‌లో నిరూపించుకున్నాడు. ఇదంతా చెప్పుకున్నంత సులువుగా జరగలేదు.
ఒక్కో విజయాన్ని అందుకుంటూ తాను ఎంచుకున్న శిఖరం వైపు ప్రయాణం సాగిస్తున్న సమయంలో కాలం పెద్ద పరీక్ష పెట్టింది. మిస్టర్ ఇండియా పోటీల కోసం జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్నప్పుడు వెన్నెముకకు గాయమైంది. ప్రాక్టీస్ మానేయాల్సి వచ్చింది. గాయం మానే వరకు విశ్రాంతి తప్పదు. ఈ లోపు బాడీ షేపవుట్ కాకుండా, బరువు పెరగకుండా చూసుకోవడం కూడా పెద్ద చాలెంజ్ అనే చె΄్పాలి. తేలికపాటి వ్యాయామాలు చేస్తూ ఫిట్‌నెస్‌ని కాపాడుకున్నాడు. ఆ సమయంలో మొదలైన అంతర్మథనం తనలో ప్రశాంతతను అలవరిచిందని, ఆత్మస్థయిర్యాన్ని పెంచి వ్యక్తిగా పరిణతి చెందడానికి దోహదం చేసిందని చె΄్పాడు ఆదిత్య.
వెండితెర మీద వెలగాలి..
ఆదిత్య గెలిచిన మిస్టర్ ఇండియా కిరీటం పేరు ‘రుబారు మిస్టర్ ఇండియా 2024 కాబల్లెరో యూనివర్సల్’. ఈ టైటిల్ విజేతలు వెనిజులాలో అంతర్జాతీయ స్థాయిలో జరిగే కాబల్లెరో యూనివర్సల్ పోటీల్లో ప్రపంచదేశాలతో పోటీ పడతారు. ఆ పోటీల్లో మనదేశానికిప్రాతినిధ్యం వహించనున్నాడు ఆదిత్య. ఫ్యాషన్, ఫిల్మ్ ఇండస్ట్రీ, మోడలింగ్, యాక్టింగ్ పట్ల తన ఇష్టాన్ని తెలియచేస్తూ నటుడిగా స్థిరపడాలనేది తన అంతిమ లక్ష్యమని చె΄్పాడు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment