mister india
-
Aditya Subramanian: ఫిట్‌గా ఒక్కో మెట్టెక్కి...
మిస్టర్ ఇండియా విజయం నేను కోరుకుంటున్న కెరీర్‌కు తొలి అడుగు మాత్రమే. నా ఈ విజయం మనదేశంలో మోడలింగ్, ఎంటర్టైన్మెంట్ రంగంలోకి రావాలనుకునే యువతకు స్ఫూర్తినిస్తుందని నమ్ముతున్నాను. అంకితభావంతో హార్డ్‌వర్క్ చేసినప్పుడే విజయం సొంతమవుతుంది. అదే మనల్ని మన లక్ష్యాల దరి చేరుస్తుంది. – ఆదిత్య సుబ్రమణియన్, మిస్టర్ ఇండియా విజేతఆదిత్య సుబ్రమణియన్... ఆరడుగుల ఎత్తున్న 27 ఏళ్ల కుర్రాడు. చెన్నైలోని పల్లవరానికి చెందిన ఈ యువకుడు ఎస్ఆర్ఎమ్ కాలేజ్ ఇంజినీరింగ్ స్టూడెంట్. చదువు పూర్తి చేసి కార్పొరేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడితో సంతృప్తి చెందలేదతడు. సమున్నత లక్ష్యాలను నిర్దేశించుకున్నాడు. కెరీర్ దృష్టిని విస్తృతం చేసుకున్నాడు. తనకిష్టమైన ఫ్యాషన్, ఫిల్మ్ ఇండస్ట్రీ, మోడలింగ్‌లో అదృష్టాన్ని, అవకాశాలనూ పరీక్షించుకోవాలనుకున్నాడు. అందుకోసం ముందుగా ఏదైనా ఒక వేదిక మీద విజేతగా నిలవడం తొలి మెట్టు అనుకున్నాడు. ఏకకాలంలో పలువురి దృష్టిని ఆకర్షించడానికి మిస్టర్ ఇండియా పోటీలను ఎంచుకున్నాడు, విజేతగా నిలిచాడు. కలసాధనకు కాలపరీక్ష!సాహిత్యాభిలాషి అయిన ఆదిత్య తాను కలలు కన్న లక్ష్యాన్ని చేరడానికి ఆరేళ్లుగా కఠోరంగా శ్రమించాడు. పుస్తకాలు చదువుతూ, సినిమాలు చూస్తూ తనను తాను మలుచుకుంటూ దేహాకృతి కోసం క్రమం తప్పకుండా జిమ్‌లో ఎక్సర్సైజ్లు చేశాడు. మిస్టర్ మదరాసీ, ఐరిస్ గ్లామ్ మిస్టర్ సూపరామ్ప్, ఎస్టిలో మిస్టర్ సదరన్ క్రౌన్ టైటిల్స్ గెలుచుకున్నాడు. మోడలింగ్‌లో నిరూపించుకున్నాడు. ఇదంతా చెప్పుకున్నంత సులువుగా జరగలేదు.ఒక్కో విజయాన్ని అందుకుంటూ తాను ఎంచుకున్న శిఖరం వైపు ప్రయాణం సాగిస్తున్న సమయంలో కాలం పెద్ద పరీక్ష పెట్టింది. మిస్టర్ ఇండియా పోటీల కోసం జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్నప్పుడు వెన్నెముకకు గాయమైంది. ప్రాక్టీస్ మానేయాల్సి వచ్చింది. గాయం మానే వరకు విశ్రాంతి తప్పదు. ఈ లోపు బాడీ షేపవుట్ కాకుండా, బరువు పెరగకుండా చూసుకోవడం కూడా పెద్ద చాలెంజ్ అనే చె΄్పాలి. తేలికపాటి వ్యాయామాలు చేస్తూ ఫిట్‌నెస్‌ని కాపాడుకున్నాడు. ఆ సమయంలో మొదలైన అంతర్మథనం తనలో ప్రశాంతతను అలవరిచిందని, ఆత్మస్థయిర్యాన్ని పెంచి వ్యక్తిగా పరిణతి చెందడానికి దోహదం చేసిందని చె΄్పాడు ఆదిత్య. వెండితెర మీద వెలగాలి..ఆదిత్య గెలిచిన మిస్టర్ ఇండియా కిరీటం పేరు ‘రుబారు మిస్టర్ ఇండియా 2024 కాబల్లెరో యూనివర్సల్’. ఈ టైటిల్ విజేతలు వెనిజులాలో అంతర్జాతీయ స్థాయిలో జరిగే కాబల్లెరో యూనివర్సల్ పోటీల్లో ప్రపంచదేశాలతో పోటీ పడతారు. ఆ పోటీల్లో మనదేశానికిప్రాతినిధ్యం వహించనున్నాడు ఆదిత్య. ఫ్యాషన్, ఫిల్మ్ ఇండస్ట్రీ, మోడలింగ్, యాక్టింగ్ పట్ల తన ఇష్టాన్ని తెలియచేస్తూ నటుడిగా స్థిరపడాలనేది తన అంతిమ లక్ష్యమని చె΄్పాడు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
మార్కాపురం కుర్రాడు.. సాఫ్ట్వేర్ ఉద్యోగి, మిస్టర్ ఇండియా విజేత.. ఇప్పుడేమో ఏకంగా
Bali Mr Universe Tourism 2023- Sai Bharadwaja Reddy: తనుబుద్ధి సాయి భరద్వాజ రెడ్డి... 21 ఏళ్ల కుర్రాడు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఈ నెల ఒకటవ తేదీన ఒడిశా రాష్ట్రం, పూరి పట్టణంలో జరిగిన మిస్టర్ ఇండియా పోటీల్లో విజేత. వచ్చే ఏడాది మార్చి 12 నుంచి 21 వరకు ఇండోనేషియా, ‘బాలి’ దీవిలో జరిగే ‘మిస్టర్ యూనివర్స్ టూరిజమ్ –2023’ పోటీల్లో మనదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ సందర్భంగా భరద్వాజ తన విజయరహస్యాన్ని సాక్షితో పంచుకున్నాడు. ‘‘మాది ప్రకాశం జిల్లా మార్కాపురం. నాన్న వ్యాపార రీత్యా విజయవాడలో పెరిగాను. నాకు ఫ్యాషన్ ప్రపంచం మీద చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉంది. ఫొటోజెనిక్‌గా కనిపించాలనే కోరిక ఉండేది. మంచి దుస్తులు ధరించడం, ఫొటోలు తీసుకోవడం ఇష్టం. బిడియపడకుండా కెమెరాను ఫేస్ చేయడం నన్ను విజేతగా నిలవడానికి కలిసి వచ్చిన ఒక అంశం. ఈ విజయం వెనుక ఐదేళ్ల కఠోరశ్రమ ఉంది. బీటెక్‌లో తొలి ప్రయత్నం మిస్ ఇండియా పోటీలలాగానే మిస్టర్ ఇండియా పోటీలు కూడా ఉంటాయని ఇంటర్లో ఉండగా తెలిసింది. బీటెక్‌లో యూనివర్సిటీ వేడుకల సందర్భంగా ఫ్యాషన్ కాంపిటీషన్ పాల్గొనడం, గెలవకపోవడం జరిగిపోయాయి. అప్పటి వరకు పోటీలను లైట్‌గా తీసుకున్నాను. పోటీని తేలిగ్గా తీసుకోరాదని అవగాహన వచ్చిన సందర్భం అది. డిప్రెషన్‌కి లోనయ్యాను కూడా. ఓటమిని జీర్ణించుకోలేని మానసిక స్థితిలో ఉన్నాననే సంగతిని నేను గ్రహించిన సందర్భం కూడా అదే. ఆ ఓటమి నాకు చాలా మంచి చేసిందనే చెప్పాలి. అప్పటి నుంచి బాడీ లాంగ్వేజ్‌ని కూడా ఈ పోటీలకు అనుగుణంగా మార్చుకున్నాను. నడవడం, నిలబడడం అన్నింటికీ ఓ లాంగ్వేజ్ ఉంటుంది. ప్రాక్టీస్ చేసేకొద్దీ నాలో ఆత్మవిశ్వాసం మెరుగవడం కూడా నాకే స్పష్టంగా తెలిసింది. ఈ పోటీలకు బాడీ బిల్డింగ్ అవసరం లేదు, ఫిట్‌గా ఉండడమే ప్రధానం. బాడీ, మైండ్, స్కిన్ ఆరోగ్యంగా ఉండాలి. ప్రకటన లేని రెండో ప్రయత్నం సెకండ్ అటెంప్ట్‌కి చాలా పక్కాగా సిద్ధమయ్యాను. గెలిచాను కూడా. అయితే కోవిడ్ కారణంగా అకస్మాత్తుగా ఫలితాల ప్రకటన లేకుండా ఆ పోటీలు అర్ధంతరంగా ముగిసిపోయాయి. ఇక మూడవ ప్రయత్నంలో ’మిస్టర్ క్లూ’గా ఎంపికయ్యాను. అయితే అది ఆన్లైన్ పోటీ. నాలుగవ ప్రయత్నంలో ఫైనల్స్‌కి ఎంపికయ్యాను, కానీ ఆర్థికపరమైన అడ్డంకి కారణంగా ఫైనల్స్‌లో పాల్గొనలేకపోయాను. నా ఫ్యాషన్ పోటీల్లో ఐదవ ప్రయత్నం ఈ ‘మిస్టర్ ఇండియా’ పోటీలు’’ అని వివరించాడు భరద్వాజ. విజేత బాధ్యత ఇది ఈ పోటీలను గ్లోబల్ మోడల్ ఇండియా ఆర్గనైజేషన్ నిర్వహించింది. ఇప్పటి వరకు మిస్టర్ ఇండియా టైటిల్ గెలుచుకున్న విజేతల్లో చిన్నవాడు భరద్వాజ. వచ్చే ఏడాది బాలిలో మిస్టర్ యూనివర్స్ టైటిల్ కోసం పోటీ పడుతున్న అనేక దేశాల ‘మిస్టర్’లలో కూడా చిన్నవాడు. మిస్టర్ ఇండియా టూరిజమ్ టైటిల్ విజేతగా... అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ భారతీయ సంస్కృతి, పర్యాటకం పట్ల అవగాహన కల్పించడం అతడి బాధ్యత. ఈ సందర్భంగా దక్షిణాది పట్ల ఉత్తరాది వారికి ఉన్న చిన్నచూపును రూపుమాపడానికి కృషి చేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశాడు. నాకు నేనే అన్నీ! పోటీదారులు ఎప్పుడూ మరొకరిలాగా కనిపించాలని అనుకరించకూడదు. నేను నాలాగే ఉన్నాను కాబట్టి విజేతనయ్యాను. మరో విషయం... నిపుణులైన కోచ్ శిక్షణ, డైటీషియన్ సలహాలు ఏవీ లేవు. ఉద్యోగం చేసుకుంటూనే ప్రాక్టీస్ చేశాను. ఉదయం ఐదింటికి లేచి జిమ్ చేసేవాడిని. ఓట్స్, ఎగ్స్ ప్రధానంగా సొంతవంట. డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత మళ్లీ ఎక్సర్సైజ్. మొత్తానికి నేను అనుకున్నది సాధించాను. ‘మిస్టర్ ఇంటర్నేషనల్’ టైటిల్‌ని మనదేశానికి తీసుకురావాలనేది ప్రస్తుత లక్ష్యం. – టి. సాయిభరద్వాజ రెడ్డి, మిస్టర్ ఇండియా 2022. – వాకా మంజులారెడ్డి చదవండి: Woolen Art: ఊలుతో అల్లిన చిత్రాలు.. మానస చేతిలో దిద్దుకున్న అమ్మ మనసు రూపాలు రేణు ది గ్రేట్ -
కన్న కల నిజం చేసుకున్నాడు
మనోజ్ పాటిల్ కల కన్నాడు. 24 సంవత్సరాల వయసులో ‘మిస్టర్ ఇండియా మెన్స్’ టైటిల్ గెల్చుకొని తన కలను నిజం చేసుకున్నాడు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బాడీ బిల్డింగ్ (ఐఎఫ్‌బిబి)లోనూ తన సత్తా చాటాడు. భవిష్యత్‌కు బంగారుబాట పడింది. బాడీ బిల్డర్, అథ్లెట్, మోడల్, ట్రైనర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ముంబైలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మనోజ్ 13 సంవత్సరాల వయసు నుంచే సొంతకాళ్ల మీద నిలబడడం నేర్చుకున్నాడు. పేపర్‌బాయ్‌గా చేశాడు. కార్లు శుభ్రం చేశాడు. పాలపాకెట్లు అమ్మాడు. 16 సంవత్సరాల వయసులో జిమ్ మీద ప్రేమ పెంచుకున్నాడు. కండలు పెంచాడు. 18 సంవత్సరాల వయసులో బాడీ బిల్డింగ్ బరిలోకి దిగాడు. ఒక్కటీ గెలవలేదు. అయినా నిరాశపడలేదు. ఆ తరువాత మాత్రం విజయాలు వరుస కట్టాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు విజయాలు సొంతం చేసుకున్నాడు. ‘బాడీబిల్డింగ్‌ను కెరీర్‌గా మలుచుకోవాలనుకునేవారికి కావలిసింది బోలెడు డబ్బు కాదు బోలెడు ఓపిక’ అంటున్న మనోజ్ పాటిల్, ఆరోగ్యస్పృహ విషయంలో యువతకు విలువైన సలహాలు ఇస్తున్నాడు. -
‘మిస్టర్ ఇండియా 2’ లేనట్లే!
కొన్ని పాత్రలు కొందరిని వెతుక్కుంటూ వెళతాయని సినీ ప్రముఖులు అంటుంటారు. శ్రీదేవి కెరీర్లో అలాంటి పాత్రలు చాలా ఉన్నాయి. ‘మిస్టర్ ఇండియా’ లో శ్రీదేవి చేసిన ‘సీమా సోనీ’ క్యారెక్టర్ అలాంటిదే. ఈ పాత్రలో ఆమె ఎంత అద్భుతంగా నటించారంటే.. వేరే ఏ నాయికనూ ఊహించుకోలేం. ఈ చిత్రదర్శకుడు శేఖర్ కపూర్ కూడా అదే అంటున్నారు. శ్రీదేవి చనిపోవడంతో ‘మిస్టర్ ఇండియా’కి సీక్వెల్ తీయాలనే తన ఆలోచన చనిపోయిందని శేఖర్ కపూర్ పేర్కొన్నారు. శ్రీదేవి లేకుండా సీక్వెల్ తీస్తే తాజ్‌మహల్ లేని ఆగ్రాలా, నర్గిస్ లేని ‘మదర్ ఇండియా’ సినిమాలా ఉంటుందనీ, ‘మిస్టర్ ఇండియా’కి బలం అనిల్ కపూర్, అమ్రిష్ పురి, శ్రీదేవి అనీ, అమ్రిష్, శ్రీదేవి చనిపోయారు కాబట్టి, వారి ప్లేస్‌లో వేరే ఆర్టిస్టులను తీసుకుని సీక్వెల్ చేస్తే పాత మేజిక్‌ని రీ–క్రియేట్ చేయలేమని చిత్రనిర్మాత–శ్రీదేవి భర్త బోనీ కపూర్ భావించారట. అందుకే సీక్వెల్ తీయాలనే ఆలోచన మానుకున్నారని సమాచారం. ‘‘సీక్వెల్ గురించి బోనీ ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. నేను మాత్రం సీక్వెల్‌ని డైరెక్ట్ చేయలేను. శ్రీదేవి చనిపోవడంతో చాలా కలలు చనిపోయాయి. వాటిలో ‘మిస్టర్ ఇండియా’ సీక్వెల్ ఒకటి’’ అని శేఖర్ కపూర్ పేర్కొన్నారు. సో.. ‘మిస్టర్ ఇండియా 2’ రెండో భాగం లేనట్లే. -
మదర్ రోల్లో డాటర్!
సీమ... జగదేక సుందరి శ్రీదేవి చేసిన మంచి పాత్రల్లో ఇదొకటి. శ్రీదేవి సినిమాలను ఫాలో అయినవాళ్లకు ‘మిస్టర్ ఇండియా’లో ఆమె చేసిన సీమ పాత్ర గుర్తుండే ఉంటుంది. ఇప్పుడా పాత్రను జాన్వీ... డాటరాఫ్ శ్రీదేవి చేయనున్నారట! ఆశ్చర్యంగా ఉందా? శ్రీదేవి భర్త బోనీకపూర్ ‘మిస్టర్ ఇండియా’ను రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే. శ్రీదేవి ‘మామ్’ సినిమాకి దర్శకత్వం వహించిన రవి ఉద్యవర్ ఈ రీమేక్‌ని తెరకెక్కిస్తారట. ఇందులో కథానాయికగా జాన్వీని, గెస్ట్ రోల్లో శ్రీదేవిని అనుకుంటున్నారట. ఈ సినిమా ద్వారానే జాన్వీ హీరోయిన్గా పరిచయమయ్యే అవకాశం ఉందని బాలీవుడ్ టాక్. అప్పట్లో సీమ పాత్రను శ్రీదేవి అద్భుతంగా చేశారు. మరి.. ఇదే పాత్రను జాన్వీ చేస్తే? కచ్చితంగా కంపేర్ చేస్తారు. అయినా పులి కడుపున పులే పుడుతుందన్నట్లు... మంచి నటి కడుపున మంచి నటే పుడుతుందనొచ్చు. సో... సీమగా జాన్వీ అలరిస్తారని ఊహించవచ్చు. -
‘ఇండియానా’లో మిస్టర్ ఇండియా
అనిల్‌కపూర్, శ్రీదేవి నటించిన 1987 నాటి సూపర్‌హిట్ మూవీ‘మిస్టర్ ఇండియా’ను ఇటీవల అమెరికాలోని ఇండియానా వర్సిటీలో ప్రదర్శించారు. ఈ ప్రదర్శన తిలకించేందుకు అనిల్ కపూర్ స్వయంగా ఇండియానా వెళ్లాడు. తన సినిమాను అక్కడ ప్రదర్శించడం చాలా థ్రిల్ ఇచ్చిందంటూ అనిల్ కపూర్ తబ్బిబ్బవుతున్నాడు. ‘మిస్టర్ ఇండియా’ సినిమాను ఇండియానా వర్సిటీ విద్యార్థులు, బోధనా సిబ్బంది కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ప్రదర్శన తర్వాత విద్యార్థులతో ఇష్టాగోష్టి కార్యక్రమంలో కూడా అనిల్ కపూర్ పాల్గొన్నాడు. -
గంగ, జమున...మిస్టర్ ఇండియా!
-
గంగ, జమున...మిస్టర్ ఇండియా!
వారిద్దరూ తమ జీవితంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవిభక్త కవలలు, అసహజ రూపం కావటంతో అనేక అవమానాలు, ఛీత్కారాలు చవిచూశారు. దేవుడి శాపం వల్లే ఇలా నాలుగు చేతులు, మూడు కాళ్లు, ఒకే ఉదరంతో జన్మించారని కన్నవాళ్లు కూడా వదిలేశారు. దీంతో పొట్ట కూటికోసం ఓ ట్రావెలింగ్ సర్కస్‌లో చేరారు. 45 ఏళ్లు వచ్చేవరకు ఏ తోడూ లేకండా ఒంటరిగానే గడిపారు. కానీ, ఏడు నెలల క్రితం ఓ రోజు ఇద్దరూ ప్రేమలో పడ్డారు. స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న జసీముద్దీన్ అహ్మద్ ను చూడగానే ఇద్దరూ మనసు మనసు పారేసుకున్నారు. ఇద్దరి పరిస్థితిని చూసిన అహ్మద్ కూడా చలించిపోయాడు. వారికి అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నాడు. అప్పటి నుంచి ముగ్గురూ కలిసే ఉంటున్నారు. అహ్మద్ కూడా అదే సర్కస్ కంపెనీలో సౌండ్ ఇంజనీర్‌గా పార్ట్‌టైం జాబ్‌లో చేరాడు. గంగ, జమునలు ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉన్నారు. అహ్మద్ చాలా మంచి వ్యక్తి అని, తమను ఎంతో బాగా చూసుకుంటున్నాడని, అతడిని తాము మిస్టర్ ఇండియా అని పిలుస్తామని గంగ వెల్లడించింది. జీవితాంతం అతడి అండ ఉంటే, ఇక తమకు ఏమీ అక్కర్లేదని చెబుతోంది. ప్రస్తుతం తాము చాలా సంతోషంగా ఉన్నామని ఈ అవిభక్త కవలలు చెబుతున్నారు. అహ్మద్ కూడా వారిని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడని చెబుతున్నారు. వారి బాధలు తన బాధలుగా భావిస్తూ అన్నింటా అండగా నిలబడుతున్నాడని గంగ, జమునా మురిసిపోతున్నారు.