
మనోజ్ పాటిల్ కల కన్నాడు. 24 సంవత్సరాల వయసులో ‘మిస్టర్ ఇండియా మెన్స్’ టైటిల్ గెల్చుకొని తన కలను నిజం చేసుకున్నాడు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బాడీ బిల్డింగ్ (ఐఎఫ్‌బిబి)లోనూ తన సత్తా చాటాడు. భవిష్యత్‌కు బంగారుబాట పడింది. బాడీ బిల్డర్, అథ్లెట్, మోడల్, ట్రైనర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ముంబైలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మనోజ్ 13 సంవత్సరాల వయసు నుంచే సొంతకాళ్ల మీద నిలబడడం నేర్చుకున్నాడు. పేపర్‌బాయ్‌గా చేశాడు. కార్లు శుభ్రం చేశాడు. పాలపాకెట్లు అమ్మాడు. 16 సంవత్సరాల వయసులో జిమ్ మీద ప్రేమ పెంచుకున్నాడు. కండలు పెంచాడు. 18 సంవత్సరాల వయసులో బాడీ బిల్డింగ్ బరిలోకి దిగాడు. ఒక్కటీ గెలవలేదు. అయినా నిరాశపడలేదు. ఆ తరువాత మాత్రం విజయాలు వరుస కట్టాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు విజయాలు సొంతం చేసుకున్నాడు. ‘బాడీబిల్డింగ్‌ను కెరీర్‌గా మలుచుకోవాలనుకునేవారికి కావలిసింది బోలెడు డబ్బు కాదు బోలెడు ఓపిక’ అంటున్న మనోజ్ పాటిల్, ఆరోగ్యస్పృహ విషయంలో యువతకు విలువైన సలహాలు ఇస్తున్నాడు.