విద్యార్థులే భవిష్యత్‌ హీరోలు!! | Niti Aayog CEO BVR Subrahmanyam in a special interview of Sakshi | Sakshi
Sakshi News home page

విద్యార్థులే భవిష్యత్‌ హీరోలు!!

Published Tue, Aug 20 2024 6:20 AM | Last Updated on Tue, Aug 20 2024 7:27 AM

Niti Aayog CEO BVR Subrahmanyam in a special interview of Sakshi

యువతతోనే వికసిత్‌ భారత్‌ సాధ్యం

ఐఐటీ సరి్టఫికెట్‌ సాధించి వ్యక్తిగత ప్రతిష్టతో ఆగిపోకూడదు 

సామాజిక అభివృద్ధికి కూడా కృషి చేయాలి.. సంకుచిత దృక్పథాన్ని విడనాడాలి 

విశాల పరిధితో ఆలోచనలను విస్తృతం చేసుకోవాలి 

పరిశోధనలు, ఆవిష్కరణల్లో ముందుండాలి 

‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో నీతిఆయోగ్‌ సీఈవో బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం

2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారడంలో విద్యార్థులే భవిష్యత్‌ హీరోలు. తాము నేర్చుకున్న నైపుణ్యాలతో సామాజిక అభివృద్ధికి ఉపయోగపడేలా కృషి చేయాలి. పరిశోధనలు, ఆవిష్కరణల్లో ముందుండాలి. సాంకేతిక నైపుణ్యాలతో చేసే పరిశోధనలు సమాజంలోని అన్ని వర్గాల వారి అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలి. అప్పుడే చదివిన చదువుకు సార్థకత లభిస్తుంది.  – నీతి ఆయోగ్‌ సీఈవో బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం  

అప్పుడే చదివిన చదువుకు సార్థకత..
సాంకేతిక కోర్సులు అభ్యసించాలనుకునే ఔత్సాహిక విద్యా­ర్థులంతా ఐఐటీల్లో సీట్లు సాధించాలని భావిస్తున్నారు. ఆ సర్టిఫికెట్లతో మంచి భవిష్యత్తు ఉంటుందని విశ్వసిస్తున్నారు. అయితే.. ఐఐటీ సర్టిఫికెట్‌ ఉంటే వ్యక్తిగత కీర్తిప్రతిష్టలు, అత్య­ధిక ప్యాకేజీతో ఉద్యోగం లభిస్తాయనే ఆలోచనలకే పరిమితం కాకూడదు. ఐఐటీల్లో తాము నేర్చుకున్న నైపుణ్యాలతో సామాజిక అభివృద్ధికి ఉపయోగపడేలా కృషి చేయాలి. సాంకేతిక నైపుణ్యాలతో చేసే పరిశోధనలు సమాజంలోని అన్ని వర్గాల వారి అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలి. అప్పుడే చదివిన చదువుకు సార్థకత లభిస్తుంది. 

యువత ముందు వరుసలో ఉండాలి..
2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారడంలో విద్యార్థులే భవిష్యత్‌ హీరోలు. ముఖ్యంగా సామాజిక అభివృద్ధికి చేసే పరిశోధనలు, ఆవిష్కరణల్లో యువత ముందు వరుసలో ఉండాలి. ఈ క్రమంలో విద్యార్థులు సంకుచిత లేదా పరిమిత ఆలోచనల చట్రంలోంచి బయటకు రావాలి. విశాల దృక్పథంతో తమ ఆలోచనల పరిధిని విస్తృతం చేసుకోవాలి. దేశ సర్వతోముఖాభివృద్ధికి పాటు పడాలి.

30 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీకి ఈ రెండే కీలకం..
ప్రస్తుతం మనం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. రానున్న రోజుల్లో 30 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ లక్ష్యాలను సాధించడానికి.. అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించడానికి.. విద్య, నైపుణ్యాలే ఎంతో కీలకం. ప్రస్తుతం మనదేశం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి కూడా ఈ రెండు అంశాలే ప్రధాన కారణం. ఈ క్రమంలో చేతివృత్తుల నుంచి ఐటీ రంగం వరకు.. అన్ని రంగాల్లోని వారు నిరంతరం ఆధునిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. ఇప్పుడు చేసే పనిని భవిష్యత్తులో రోబోలు చేయొచ్చు. అప్పుడు అకస్మాత్తుగా ఆ మార్పును అందిపుచ్చుకోలేక వృత్తిలో వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితులను ముందుగానే గుర్తించి ఆధునిక నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. ఇక.. ఐటీ రంగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రంగంలోని విద్యార్థులు, ఉద్యోగులు ఏఐ, ఐవోటీ వంటి ఆధునిక నైపుణ్యాలను నిరంతరం నేర్చుకోవాలి. వాటిలో పట్టు సాధిస్తేనే భవిష్యత్తులో ముందుండటానికి అవకాశం ఉంటుంది.

స్టార్టప్స్‌కు వెన్నుదన్నుగా..
ఇటీవల కాలంలో మన దేశం అన్ని రంగాల్లోనూ ముందంజలో నిలవడానికి మరో ప్రధాన కారణం.. స్టార్టప్స్‌కు వెన్నుదన్నుగా పలు చర్యలు తీసుకోవడం. విద్యా సంస్థల స్థాయిలోనే ఇంక్యుబేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేయడం, ఏంజెల్‌ ఫండింగ్‌ చేసేందుకు పెట్టుబడిదారులు అంగీకరించేలా ప్రణాళికలు రూపొందించడం వంటి చర్యలతో స్టార్టప్స్‌ సంఖ్య పెరుగు తోంది. ముఖ్యంగా ఐఐటీల్లో ఇవి విస్తృతమవుతున్నాయి. దేశంలో 100కు పైగా ఉన్న యూనికార్న్‌ స్టార్టప్స్‌లో 15 శాతం సంస్థలు ఐఐటీ పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసినవే. ఇదే తరహాలో అన్ని ప్రాంతాల స్టార్టప్స్‌కు తోడ్పాటు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ప్రైవేట్‌ విద్యా సంస్థలు కూడా ముందుకు రావాలి..
దేశాభివృద్ధికి తోడ్పడే యువతను తీర్చిదిద్దడంలో ప్రైవేట్‌ విద్యా సంస్థలూ ముందుకు రావాలి. కేవలం లాభాపేక్షతో విద్యా సంస్థలను నిర్వహించే ధోరణి విడనాడాలి. తమ విద్యార్థులు కూడా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగస్వాము లయ్యేలా చర్యలు చేపట్టాలి. ఇందుకోసం పరిశోధన, అభివృద్ధి కేంద్రాల ఏర్పాటుతో పాటు ఇంక్యుబేషన్‌ కేంద్రాలు, స్టార్టప్స్‌కు తోడ్పాటు అందించడం వంటి చర్యలు తీసుకోవాలి.

అందరికీ విద్యను అందుబాటులోకి తేవాలి..
వేల సంవత్సరాల క్రితమే.. భారత్‌ అన్ని రకాలుగా ఎంతో ముందున్న విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు అలాంటి ఉన్నత స్థితికి చేరుకోవాలంటే.. అందరికీ విద్యను అందుబాటులోకి తేవాలి. ఈ క్రమంలో నూతన జాతీయ విద్యా విధానంలోని మార్గదర్శకాలు సత్ఫలితాలను ఇచ్చేలా ఉన్నాయి. పూర్వ ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు సమాజంలోని అన్ని వర్గాల వారికి విద్యా ఫలాలు అందేలా జాతీయ విద్యా విధానం రూపకల్పన జరిగింది.

గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌గా భారత్‌..
విదేశీ విద్యకు వెళుతున్న విద్యార్థుల సంఖ్యలో ప్రపంచంలోనే రెండో స్థానంలో మన దేశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ విషయంలో నీతి ఆయోగ్‌ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో.. అంతర్జాతీయ విద్యార్థులే మన దేశానికి వచ్చేలా, మన దేశాన్ని గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దడాన్ని విజన్‌–2047 లక్ష్యాల్లో ఒకటిగా పెట్టుకున్నాం. ఈ క్రమంలో 2047 నాటికి ఏటా ఐదు లక్షల మంది విదేశీ విద్యార్థులు.. ఉన్నత విద్య కోసం భారత్‌కు వచ్చేలా విద్యా రంగంలో మార్పులు చేయనున్నాం. అదే విధంగా మన విద్యార్థులు కూడా స్వదేశంలోనే చదువుకునేలా ఇక్కడి విద్యా సంస్థలను మెరుగుపరిచే చర్యలకు కూడా సిఫార్సు చేశాం.

పరిశ్రమలు– విద్యా సంస్థల భాగస్వామ్యం
దేశాభివృద్ధిలో యువతది కీలక పాత్ర కానున్న నేపథ్యంలో పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య భాగస్వామ్యం కూడా ఎంతో ప్రధానమని గుర్తించాలి. పరిశ్రమల అవసరాల­కనుగుణంగా కోర్సులు లేకపోతే.. వ్యాపార, వాణిజ్య సంస్థలు ఆశించిన స్థాయిలో వృద్ధి సాధించలేవు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అటు పరిశ్రమలు, ఇటు విద్యా సంస్థలు నిరంతరం సంప్రదింపులు సాగించాలి. పరిశ్రమల అవసరాలను తీర్చే విధంగా విద్యార్థులకు విద్యా సంస్థలు నైపుణ్యాలు అందించాలి.

అప్పుడు విద్యార్థులకు ఉద్యోగాల కల్పన కూడా పెరుగుతుంది. వ్యాపార కార్యకలాపాలు విజయవంతంగా సాగుతాయి. ఇవి ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడతాయి. అందుకే విద్యా సంస్థల కరిక్యులం, ఇతర బోధన వ్యవహారాల్లో పరిశ్రమలను కూడా భాగస్వాములను చేయాలి. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లకు ఈ స్థాయిలో గుర్తింపు రావడా­నికి పరిశ్రమలు–­విద్యా సంస్థల భాగస్వామ్యం కూడా ఒక ప్రధాన కారణం.

బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం ప్రొఫెల్‌
ఛత్తీస్‌గఢ్‌ కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి
జమ్మూకశ్మీర్‌ ప్రధాన కార్యదర్శి, ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)లో సంయుక్త కార్యదర్శి 
వంటి పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
2022లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు.
2023లో నీతి ఆయోగ్‌ సీఈవోగా నియమితులయ్యారు.
విజన్‌–2047 డాక్యుమెంట్‌ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement