సాక్షి, అమరావతి: గతంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెనుకాడేవారు. ఎవరైనా ధైర్యం చేసి ఫిర్యాదు చేద్దామన్నా పెద్ద తతంగమే ఉండేది. కాల్ సెంటర్‌కు ఫోన్ చేయాలన్నా సమయం పడుతుంది. దీనికి పరిష్కారంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొబైల్ యాప్‌ను రూపొందించమని ఏసీబీని ఆదేశించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏసీబీ 14400 యాప్‌ను రూపొందించింది. లిఖితపూర్వక ఫిర్యాదు, డాక్యుమెంట్లే కాదు... తక్షణం ఆడియో, వీడియో క్లిప్‌లతోసహా ఫిర్యాదు చేసే అవకాశం ఇందులో కల్పించింది.
ఆ ఫిర్యాదులపై తక్షణం స్పందించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను, కాల్‌సెంటర్‌ను పటిష్టపరిచింది. దాంతో అవినీతిపై బాధితులు తక్షణమే ఫిర్యాదు చేస్తున్నారు. ఏసీబీ అధికారులు కూడా వెంటనే స్పందిస్తూ వివిధ రీతుల్లో పరిష్కరిస్తున్నారు. చాలావరకు ఫిర్యాదుదారులు కేసులు పెట్టకుండా సమస్య పరిష్కారాన్ని కోరుతున్నారు. దాంతో సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తున్నారు.
ఫిర్యాదుదారులు ఫిర్యాదు చేసిన తరువాత వెనక్కి తగ్గడం, తప్పుడు ఫిర్యాదులు కూడా నమోదవుతున్నాయి. వీటన్నింటినీ పరిశీలించి ఏసీబీ అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అవినీతి అధికారులను ట్రాప్ చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం, ఆకస్మిక తనిఖీలు, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులు మొదలైనవి నమోదు చేస్తున్నారు.
ఈ ఏడాది జూన్ 1 నుంచి ప్రారంభించిన ఈ మొబైల్ యాప్ ద్వారా ఇప్పటివరకు 2,402 ఫిర్యాదులు అందాయి. వాటిలో 2,127.. అంటే 88 శాతం ఫిర్యాదులను ఏసీబీ పరిష్కరించింది. మరో 275 ఫిర్యాదులపై చర్యలు పరిశీలనలో ఉన్నాయి. యాప్‌కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ ముగ్గురు అధికారులను అరెస్టు చేసింది. 8 సాధారణ తనిఖీలు, రెండు ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.
14400 కాల్‌సెంటర్‌కు ఈ ఏడాది మార్చి 1 నుంచి ఇప్పటివరకు 4,363 ఫిర్యాదులు రాగా వాటిలో 4,132 సమస్యలను పరిష్కరించడం విశేషం. మరో 231 ఫిర్యాదులపై చర్యలు పరిశీలనలో ఉన్నాయి. అంటే ఏకంగా 94 శాతం సమస్యలను పరిష్కరించింది. కాల్ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ 13 మంది అధికారులను ట్రాప్ చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఒకటి నమోదు చేసింది. 14 సాధారణ విచారణలు చేపట్టగా 20 ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.
అవినీతి అంతమే లక్ష్యం: డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి
అవినీతిపై సులభంగా ఫిర్యాదు చేసేందుకు రూపొందించిన 14400 మొబైల్ యాప్ విజయవంతమైంది. మొబైల్ యాప్, కాల్‌సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరిస్తున్నారు. ఫిర్యాదుదారుల వివరాలు కూడా గోప్యంగా ఉంచుతున్నాం. 100 శాతం కేసులు పరిష్కరించి బాధితులకు అండగా నిలవడమే ధ్యేయంగా ఏసీబీ పనిచేస్తోంది.
► తిరుపతిలో ఓ మందుల దుకాణం యజమాని నుంచి లంచం తీసుకుంటుండగా డ్రగ్ కంట్రోల్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ డి.బాలమురళీ కల్యాణ్ చక్రవర్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన నివాసాల్లో తనిఖీలు చేసి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులు కూడా నమోదు చేశారు.
► కాకినాడలో ఓ డెయిరీ ఫాం యజమాని నుంచి లంచం తీసుకుంటున్న తూర్పు డిస్కం ఏఈ మడికి చంటి బాబు, లైన్‌మేన్ ఎం.సిద్ధార్థ కుమార్‌లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
► కర్నూలు జిల్లాలో లంచం తీసుకుంటున్న ఏఎస్సై షేక్ ఖాదర్ వలీని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
► ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా ఎస్‌ఆర్ పురం తహశీల్దార్ కె.సతీశ్ ఓ రైతుకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేసేందుకు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఓ వ్యాపార సంస్థకు విద్యుత్ సర్వీస్ లైన్ వేసి మీటర్ పెట్టేందుకు అనకాపల్లి జిల్లాలో తూర్పు డిస్కం ఏఈ ఎం.వెంకటరమణ రూ.లక్ష లంచం డిమాండ్ చేశారు. దాంతో బాధితుడు తమ మొబైల్ ఫోన్లో డౌన్‌లోడ్ చేసుకున్న 14400 యాప్ ద్వారా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఏసీబీ అధికారులు బాధితునితో మాట్లాడి రంగంలోకి దిగారు. ఆ ఏఈ ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా రూ.లక్ష లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఒక్క రోజులోనే అవినీతి అధికారి ఆటకట్టించడంలో ఏసీబీ మొబైల్ యాప్ కీలక పాత్ర పోషించింది.
14400.. ఈ నంబర్ వింటేనే రాష్ట్రంలో అవినీతి అధికారుల గుండెల్లో దడ మొదలవుతుంది. ఈ యాప్‌లో ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు రంగంలోకి దిగి, అవినీతి అధికారుల ఆట కట్టిస్టున్నారు. ఇందుకు పై సంఘటనే తాజా ఉదాహరణ.
అవినీతిపరుల గుండెల్లో 14400
Published Wed, Oct 12 2022 3:03 AM | Last Updated on Wed, Oct 12 2022 4:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment