స్త్రీలు సముద్రయానంలో పని చేయడానికి వెనుకాడతారు.సముద్రం మీదకు వెళ్లడానికి ధైర్యమున్నా కుటుంబాలు అంగీకరించవు. కాని పూజా ఛతోత్ దేశంలో మొదటి మహిళా షిప్ సర్వేయర్ కాగలిగింది.ఒక షిప్ తయారీ మొదలైనప్పటి నుంచీ అది సముద్రం మీద చేసే ప్రయాణం వరకూ అన్ని ప్రమాణాలు పాటించేలా చూసే ఉద్యోగమే షిప్ సర్వేయర్. పూజా ఛతోత్ పరిచయం.
భారీ నౌక ప్రయాణిస్తూ ఉంటుంది. కనుచూపు మేరా నీలి రంగు సముద్రం తప్ప వేరే ఏమీ ఉండదు. ఉప్పునీటి గాలులు ముఖాన తాకుతుంటాయి. ఆ నౌక సముద్రయానానికి సురక్షితం అనే ఆమోదం తెలిపిన షిప్ సర్వేయర్ డెక్ మీద నిలబడి డ్యూటీ సమర్థంగా చేస్తున్నాననే తృప్తితో చిరునవ్వు చిందిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? పూజా ఛతోత్‌ను అడగాలి.
ఆమె ఇప్పుడు బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత సముద్రయాన సంస్థ ‘లాయెడ్స్ రిజిస్టర్’లో షిప్ సర్వేయర్‌గా పని చేస్తోంది. ఇతర దేశాలలో షిప్ సర్వేయర్లుగా మహిళలు ఇదివరకే పని చేస్తున్నా మన దేశంలో పూజా ఛతోత్ మాత్రమే తొలి మహిళా సర్వేయర్ కాగలిగింది.
చిన్నప్పటి ప్రభావం
పూజా ఛతోత్‌ది కేరళలోని కన్నూర్ జిల్లా. అక్కడి ‘ఎజిమల’ అనే చోట ఆసియాలోనే అతి పెద్దదైన భారత నావెల్ అకాడెమీ ఉంది. నావెల్ కేడెట్‌ల శిక్షణ అక్కడే జరుగుతుంది. బాల్యంలో తల్లిదండ్రులతో కలిసి అకాడెమీని సందర్శించిన పూజా శిక్షణలో ఉన్న నావెల్ కేడెట్‌లను చూసి స్ఫూర్తి పొందింది. ముఖ్యంగా చాలామంది పురుష కేడెట్‌ల మధ్య ఒకే ఒక మహిళా ఆఫీసర్‌ను చూసింది పూజ. అప్పుడే ఆ ఆఫీసర్‌లాగానే తానూ సముద్రం మీద పని చేసే ఉద్యోగం చేయాలని అనుకుంది. ‘నేను హైస్కూల్ చదువుతున్నప్పుడే అనుకున్నాను ఆఫీసులో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు పని చేసే ఉద్యోగం చేయకూడదని’ అంది పూజ.
నావెల్ ఆర్కిటెక్చర్ చదివి...
సముద్రయాన రంగంలో పని చేయాలనుకున్నది పూజ. కొచ్చిలో నావెల్ ఆర్కిటెక్చర్‌ను 2020లో పూర్తి చేసింది. ఆ తర్వాత ఒక మెరైన్ కంపెనీలో ట్రయినీ నావెల్ ఆర్కిటెక్ట్‌గా చేరింది కాని ఆ పని రుచించలేదు. సముద్రపుగాలి తగలాలి అనుకుంది. ఆ సమయంలోనే తండ్రి స్నేహితుడొకడు షిప్ సర్వేయర్ ఉద్యోగం గురించి తెలిపాడు. అయితే ఆ రంగంలో స్త్రీలు ఇప్పటి దాకా లేరు. ‘నువ్వు మొదటిదానివి ఎందుకు కాకూడదు’ అన్నాడు తండ్రి. ఆ ్రపోత్సాహంతో లాయెడ్స్ రిజిస్టర్‌లో షిప్ సర్వేయర్‌గా ఉద్యోగం సంపాదించింది పూజ.
రెండేళ్ల శిక్షణ
షిప్ సర్వేయర్ మానసిక బలం, శారీరక సామర్థ్యం అవసరమయ్యే ఉద్యోగం. నౌక తయారవుతున్నప్పటి నుంచి సముద్రం మీదకు చేరే వరకూ చేరాక కూడా అన్ని నిర్మాణ, సాంకేతిక విభాగాలూ నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నాయా లేదా చూడటమే ఈ ఉద్యోగం. నేల మీదా, సముద్రం మీదా పని ఉంటుంది. ఇందుకు కఠినమైన శిక్షణ అవసరం. లాయెడ్స్ రిజిస్టర్ సంస్థ ఆమెకు రెండేళ్లు శిక్షణ ఇచ్చింది. నౌకను తయారు చేసే మెటీరియల్ సర్వే శిక్షణ ముంబైలో తీసుకుంటే తయారీ విధానం సర్వే శిక్షణ కొచ్చిలో, గోవాలో తీసుకుంది. టెక్నికల్ శిక్షణ అంతా వైజాగ్, సింగపూర్‌లలో జరిగింది. రెండేళ్ల మొత్తం శిక్షణను సమర్థతతో పూర్తి చేయడం వల్ల ఇటీవల ఆమె షిప్ సర్వేయర్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకుంది. పూజను చూసి మరెందరో యువతులు ఈ రంగంలోకి వస్తారు. ఏ రంగమూ మగవారి స్వీయసామ్రాజ్యం కాదని నిరూపిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment