పెళ్లి ‍బ్యానర్‌తో పట్టుబడ్డ నిత్యపెళ్లి కూతురు | Woman Married 5 People in Tamil nadu | Sakshi
Sakshi News home page

పెళ్లి ‍బ్యానర్‌తో పట్టుబడ్డ నిత్యపెళ్లి కూతురు

Jan 29 2025 10:15 AM | Updated on Jan 29 2025 11:15 AM

Woman Married 5 People in Tamil nadu

ఐదు పెళ్లిళ్లు చేసుకున్న కల్యాణ రాణి అరెస్టు 

ఆహ్వాన బ్యానర్‌తో గుట్టురట్టు 

డాక్టర్, నర్సు అంటూ మోసం చేసి ప్రేమ వలలో పడవేసిన వైనం

సేలం (తమిళనాడు): ఐదు పెళ్లిళ్లు చేసుకున్న కల్యాణ రాణిని శీర్గాళి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. డాక్టర్‌ అంటూ మోసం చేసి ప్రేమ వలలో పడవేసిన విషయం వివాహ ఆహ్వాన బ్యానర్‌లో ఫొటో వైరల్‌ కావడంతో  గుట్టు రట్టయ్యింది. వివరాలు.. మైలాడుదురై జిల్లా శీర్గాళి సమీపంలో కొడియంపాళయం జాలరి గ్రామంలో నివసిస్తున్న లక్ష్మి (29). పన్నెండో తరగతి వరకు చదువుకుంది. పళయర్‌ గ్రామానికి చెందిన శిలంబరసన్‌ అనే వ్యక్తిని ఈమె తొలి వివాహం చేసుకుంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ స్థితిలో గత పదేళ్ల క్రితం శిలంబరసన్‌ మృతి చెందడంతో పిల్లలను అతని ఇంటి వద్ద వదిలివేసింది. 

తర్వాత 2017లో పుదూర్‌ గ్రామానికి చెందిన పెయింటర్‌ నెపోలియన్‌తో పరిచయం చేసుకున్న లక్ష్మి తన పేరు మీరాగా పరిచయం చేసుకుని ప్రేమ వలలో పడవేసింది. కొన్ని రోజులకు నెపోలియన్‌ను రెండో పెళ్లి చేసుకుంది. తర్వాత కొంత కాలం కాపురం చేసి నెపోలియన్‌ను వదిలించుకుంది. ఈ స్థితిలో 2021 సంవత్సరం చిదంబరం గోల్డన్‌ నగర్‌లో నివసిస్తున్న కోయంబత్తూరు ఐటీ సంస్థలో పని చేసే రాజా అనే వ్యక్తితో సేలం బస్టాండ్‌లో లక్ష్మికి పరిచయం ఏర్పడింది. అయితే అతనికి తన పేరు నిషాంతిని అని తెలిపిన లక్ష్మి , తాను ఎంబీబీఎస్, ఎమ్‌ఎస్‌ చదువుకున్నట్టు తెలిపి అతడిని ప్రేమించి రాజాను మూడో వివాహం చేసుకుంది. అతనితో చిదంబరంలో రెండేళ్లు కాపురం చేసింది. 

గుట్టు రట్టు చేసిన వివాహ బ్యానర్‌.
ఈ స్థితిలో 2024లో శీర్గాళి తిటై్ట గ్రామానికి చెందిన ప్రైవేటు బ్యాంకులో పని చేస్తున్న శివచంద్రన్‌ వద్ద లిఫ్ట్‌ అడిగి బైక్‌లో వెళ్లిన లక్ష్మి తాను డాక్టర్‌ అని పరిచయం చేసుకుని, చిదంబరం ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్నట్టు తెలియజేసి పరిచయం పెంచుకుంది. ఈ స్థితిలో గత 20–1–2025న శివచంద్రన్‌ను శీర్గాళిలో లక్ష్మి వివాహం చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివాహ ఆహా్వన బ్యానర్‌ సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అయ్యింది. దీన్ని చూసిన భర్త నెపోలియన్‌ దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని శివచంద్రన్‌కు ఫోన్‌ చేసి తెలిపాడు.  

పరారీకి ప్లాన్‌  
ఈ స్థితిలో మిత్రులను చూడడానికి వెళ్లి వస్తానని తెలిపిన లక్ష్మీని.. శివచంద్రన్‌ తన కారులో ఎక్కించుకుని నేరుగా శీర్గాళి మహిళా పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి అప్పగించాడు. సమాచారం తెలుసుకున్న వెంటనే నెపోలియన్‌ కూడా అక్కడికి చేరుకున్నాడు. మరో భర్త విదేశాలకు వెళ్లి ఉండడంతో ఆయనకు ఈ సమాచారం తెలియలేదు. దీంతో పోలీసులు లక్ష్మీని అరెస్టు చేసి, విచారణ చేపట్టారు.

విదేశాల్లో పనిచేసి నెలకు రూ. 50 వేలు పంపుతున్న మరో భర్త
కాగా పోలీసుల విచారణలో లక్ష్మీ తాను ఎంబీబీఎస్‌ డాక్టర్‌ అని, తనకు రూ. 50 వేలు జీతం వస్తున్నట్టు తెలుపడంతో, ఆమె మాటలు నమ్మి ఆమె వలలో పడిన కరూర్‌కు చెందిన ఒక వ్యక్తి లక్ష్మి ని వివాహం చేసుకుని విదేశాలలో పని చేస్తూ, ప్రతి నెల కుటుంబ ఖర్చుల కోసం రూ. 50,000 పంపుతున్నట్టు తెలిసింది. ఆ డబ్బునే తన జీతంగా చెప్పుకుని లక్ష్మి ఇతర భర్తలను మోసం చేసినట్టు వెల్లడైంది. ఆమె భర్తల్లో ఒకరు ఇంటిలో ఉన్న పశువులను విక్రయించి లక్ష్మి కోసం అత్యాధునిక సౌకర్యాలతో టాయ్‌లెట్‌ కట్టించినట్టు సమాచారం. లక్ష్మి వివాహం చేసుకున్న ముగ్గురి ప్రేమకు కుటుంబీకులు అంగీకరించని తెలిపి, రహస్యంగా వివాహం చేసుకున్నట్టు తెలిసింది. పోలీసులు లక్ష్మీ వద్ద తీవ్ర విచారణ జరుపుతున్నారు.    

చదవండి: రేఖ.. మామూలు చీటర్‌ కాదు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement