marrages
-
శ్రావణం వరకు ఆగాల్సిందే..
మహారాణిపేట: పెళ్లిబాజా మోగాలంటే శ్రావణం వరకూ ఆగాల్సిందే. ఏప్రిల్ 28 నుంచి వరసగా మూఢమి రావడంతో శుభకార్యాలకు ఆటంకం కలిగింది. అప్పటి నుంచి వివాహాలు, ఉపనయనాలు, గృహ ప్రవేశాల వంటివన్నీ నిలిచిపోయాయి. మళ్లీ ఆగస్టులో వచ్చే శ్రావణంలో మూడుముళ్లకు మంచి ముహూర్తాలు ఉన్నాయి.క్రోధి నామ సంవత్సరంలో ఏప్రిల్ 9 తేదీ నుంచి ముహూర్తాలు ప్రారంభమయ్యాయి. 26వ తేదీ(చైత్ర మాసం) వరకూ మంచి ముహూర్తాలు ఉండటంతో జిల్లా వ్యాప్తంగా వేలాది శుభకార్యాలు జరిగాయి. ఆ తర్వాత ఏప్రిల్ 28వ తేదీ (చైత్ర చవితి) నుంచి జూలై 8వ తేదీ (ఆషాఢ శుద్ధ తదియ) వరకూ శుక్ర మౌఢ్యమి (మూఢం) నడుస్తోంది. దీంతో ఆయా రోజుల్లో ముహూర్తాలు లేక శుభకార్యాలు ఆగిపోయాయి. అలాగే మే 7వ తేదీ (చైత్ర బహుళ చతుర్దశి) నుంచి జూన్ 7వ తేదీ వరకూ గురు మౌఢ్యమి నడిచింది. వరుసగా గురు, శుక్ర మౌఢ్యములు రావడంతో రెండు నెలలుగా శుభ కార్యాలకు ఆటంకం ఏర్పడింది.ఆషాఢంలో కూడా ముహూర్తాల్లేవ్..జూలై 6వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు ఆషాఢమాసం ఉంటుంది. ఇది శూన్యమాసం. మొత్తం మీద ఏప్రిల్ 28 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు పెళ్లి బాజాలు మోగే అవకాశం లేదని పురోహితులు చెబుతున్నారు. మూఢంలోని మంచిరోజుల్లో అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణం, నూతన వ్యాపారాల ప్రారంభోత్సవాలు, సీమంతాలు, రిజిస్ట్రేషన్ల వంటి పనులు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 4వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకూ భాద్రపదం కూడా శూన్యమాసం కావడంతో ఆ నెలలోనూ వివాహాల ముహూర్తాలు ఉండవు. దీంతో శుభముహూర్తాలకు ఆగస్టు వేదిక కాబోతోంది. ఆగస్టులో వచ్చే శ్రావణమాసంలో దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి.ఉపాధికి గండి..కొన్ని రోజులుగా వివాహ ముహూర్తాలకు మూఢాలు అడ్డంకి మారాయి. దీంతో వందలాది మంది ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. కేవలం శుభకార్యాలపైనే ఆధారపడి ఎన్నో వృత్తులవారు జీవనం సాగిస్తున్నారు. కల్యాణ మండపాలు, కేటరింగ్, వంటవాళ్లు, పురోహితులు, ఫొటో, వీడియో గ్రాఫర్లు, ట్రావెల్స్, అద్దె కార్లు, బస్సులు, మినరల్ వాటర్, ఈవెంట్ మేనేజ్మెంట్లు, పూలు, డెకరేషన్స్, లైటింగ్, కూరగాయలు, కిరాణ, వస్త్రదుకాణాలు, బంగారు, వెండి వ్యాపారాలు, టెంట్ హౌస్‌లు, మాంసపు దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జీలు, సాంస్కృతిక కళాకారులు తదితర వారికి పనిలేకుండా పోయింది. మరెంతో మంది రోజువారీ కూలీలకూ ఉపాధి కొరవడింది. అడపాదడపా చిన్న చిన్న ఫంక్షన్లు వస్తున్నా... పెళ్లిళ్లు అయితేనే తమకు గిట్టుబాటు అవుతుందని ఆయా వర్గాల వారు చెబుతున్నారు. శ్రావణం వరకు ఎదురు చూడాల్సిందేనని పేర్కొంటున్నారు.శ్రావణంలో దివ్యమైన ముహూర్తాలువరసగా ముఢాలు రావడంతో శుభకార్యక్రమాలకు బ్రేక్ పడింది. ఆగస్టు 5వ తేదీ నుంచి మంచి రోజులు వస్తున్నాయి. 8వ తేదీ నుంచి ముహూర్తాలు ఉన్నాయి. మళ్లీ భాద్రపద మాసం శూన్య మాసం కావడంతో ఎలాంటి ముహూర్తాలు లేవు. మళ్లీ అక్టోబర్ 3వ తేదీ తర్వాత ముహూర్తాలు ఉన్నాయి.– వెలవలపల్లి కోటేశ్వర శర్మ, వేదపండితులు, యజ్ఞశ్రీ జోతిష్యాలయం, మునగపాక -
Cover Story: వెడ్డింగ్ విడ్డూరాలు
మాఘం వచ్చేసింది.. మనువాడాలనుకునే జంటలు మంచి రోజుకోసం ఎదురుచూస్తున్నాయి! జీలకర్ర – బెల్లం.. మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. అప్పగింతలు.. హిందూ సంప్రదాయంలోని ఈ తంతు దాదాపు దేశమంతా ఒకేలా ఉంటుంది.. పెళ్లికి ముందు.. తర్వాత ఉండే ఆచారవ్యవహారాలు.. వాటిల్లోని కొన్ని వ్యత్యాసాలు తప్ప! మన దగ్గర పెళ్లి.. కుటుంబ సంబరంగా కన్నా సామాజిక ఆడంబరంగానే అలరారుతోంది. ఖర్చు మోయలేని భారమైనా ప్రతి తంతునూ ఆనందంగా.. బంధుమిత్ర సమేతంగా ఆస్వాదిస్తున్నారు. ఈ దేశంలో హిందూ మెజారిటీ, ముస్లిమ్, క్రిస్టియన్ మైనారిటీల తర్వాత సిక్కు, జైన్, పార్సీ, బౌద్ధ మతాలూ ఉన్నాయి. సీరియళ్లు, సిరీస్‌లు, భారతీయ చిత్ర పరిశ్రమ.. ఇవన్నీ హిందూ పెళ్లికి ఎంత గ్లామర్‌ని పెంచాయో ముస్లిం, క్రిస్టియన్ పెళ్లిళ్లకూ తెర మీద అంతే స్పెస్నిచ్చాయి. కాబట్టి వాటి ప్రస్తావన లేకుండా మిగిలిన మైనారిటీ మతాల్లోని పెళ్లితంతు, దాని ఆచార వ్యవహరాలతోపాటు పలు దేశాల్లోని పెళ్లి పద్ధతులు, సంప్రదాయాలు ఎలా ఉన్నాయి? అన్నిట్లో.. అన్ని చోట్లా పెళ్లి ఇంతే ఘనమైన వేడుకగా ఉందా? చూద్దాం.. ఆనంద్ కారజ్ సిక్కు మతంలో పెళ్లి తంతును ఆనంద్ కారజ్ అంటారు. అంటే ఆనందమయమైన జీవితం వైపు అడుగులు అని తెలుగు అర్థం ఇచ్చుకోవచ్చు. ఈ తంతును గురు అమర్ దాస్ మొదలుపెట్టారు. దీన్ని సిక్కులు చాలా పవిత్రంగా భావిస్తారు. గురుద్వారాలో గురు రామ్‌దాస్ స్వరపరచిన నాలుగు లావాల (శ్లోకాలు లేదా భజనలు)ను చదువుతూ లేదా పాడుతూ ఆనంద్ కార్జ్ను నిర్వహిస్తారు. వరకట్నం నిషిద్ధం. అంతేకాదు పెళ్లికి ముందు జాతకాలు చూసుకోవడాలు.. ఆ జాతకాల ప్రకారం పెళ్లి ముహూర్తం నిర్ణయించడం కూడా నిషిద్ధమే. హిందూ పెళ్లిలో ఉన్నట్లే సిక్కు వివాహ వేడుకలోనూ పెళ్లికి ముందూ తర్వాతా రోజుకో తంతు ఉంటుంది. లగన్ పార్సీ పెళ్లిని లగన్ అంటారు. పార్సీలకూ వారం రోజుల పాటు ఈ లగన్ వేడుక ఉంటుంది.. రకరకాల తంతులతో. అయితే అన్నీ కూడా సింపుల్‌గా.. సరదాగా ఉంటాయి. సాధారణంగా.. పార్సీలు పూజించే ఫైర్ టెంపుల్ (అగ్ని దేవాలయం)లోనే లగన్ ఉంటుంది. గుడిలో ఏర్పాటు చేసిన పెళ్లి మంటపానికి ముందు వరుడు వస్తాడు. వధువు తల్లి ఒక ట్రేలో పచ్చి కోడిగుడ్లు, వక్క, బియ్యం, కొబ్బరికాయ, ఖర్జూరాలు, నీళ్లతో మంటపానికి వస్తుంది. నీటిని తప్ప మిగిలిన అన్నిటితో వరుడి తల చుట్టూ ఏడుసార్లు దిష్టి తీసినట్టుగా తిప్పి వరుడి తల మీంచి విసిరేస్తుంది. ఆ తర్వాత నీళ్లను వరుడి కుడి ఎడమల వైపు చల్లేస్తుంది.అనంతరం పెళ్లి కూతురు వస్తుంది. పెళ్లి ఎంత సింపుల్‌గా జరుగుతుందో రిసెప్షన్ అంత గ్రాండ్‌గా ఉంటుంది. అసలు పార్సీల లగన్ ఈ రిసెప్షన్తోనే ఫేమస్. చక్కటి సంగీతం.. సూపర్ డాన్స్‌లు.. నోరూరించే వంటకాలతో అద్భుతంగా ఉంటుంది. ఒకరకంగా దాన్ని పార్సీ కల్చరల్ పరేడ్ అనొచ్చు. మంగళ్ ఫేరా జైన్స్‌లో కూడా హిందువులకున్నట్లే లగ్న లేఖన్ (పెళ్లి పత్రిక రాసుకోవడం) దగ్గర్నుంచి సగాయి (నిశ్చితార్థం), మంగళ్ ఫేరా (పెళ్లి), స్వగృహ ఆగమన (అత్తారింటికి వెళ్లడం) వరకు ముఖ్యమైన ఘట్టాలన్నీ ఉంటాయి. అయితే సగాయిలో ఉంగరాలు మార్చుకోవడం వంటివి ఉండవు. ఈ వేడుక పెళ్లికొడుకు ఇంట్లో జరుగుతుంది. పెళ్లికూతురి సోదరుడు వెళ్లి పెళ్లికొడుకు నుదుట తిలకం దిద్ది, కట్నకానుకలు అందజేస్తాడు. పెళ్లికి ముందు వధూవరులిద్దరి ఇళ్లల్లో మండప్ పూజ జరుగుతుంది. దీని తర్వాతే హారతితో పెళ్లి కొడుకు బారాత్‌ను పెళ్లి మంటపానికి ఆహ్వానిస్తారు. అక్కడ ముత్తయిదువల మంగళ గీతాల మధ్య పెళ్లికొడుకు, పెళ్లికూతురి సోదరుడు ఇద్దరూ ఒకరికొకరు తిలకం దిద్దుతారు. అనంతరం పెళ్లికొడుకు తాను తెచ్చిన కానుకలను ఇస్తాడు. దీని తర్వాతే పెళ్లికొడుకు పెళ్లి వేదిక మీదకు వెళ్తాడు. అప్పుడు కన్యాదానం తంతు మొదలవుతుంది. పెళ్లికూతురి తండ్రి పెళ్లికొడుకు చేతిలో రూపాయి పావలాతోపాటు పెళ్లికూతురి చేతిని ఉంచుతూ వరుడికి పిల్లను అప్పగిస్తాడు. దాని తర్వాత వధూవరులిద్దరూ కలసి అగ్ని చుట్టూ తిరుగుతారు. పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకుని అమ్మాయిని అత్తారింటికి తీసుకెళ్తారు. నిజానికి జైన్స్ సింప్లిసిటీకి మారుపేరు అని చెప్తారు. ఇదివరకైతే వాళ్ల పెళ్లిళ్లు చాలా సింపుల్‌గా జరిగేవట. కాని కొత్త తరం హంగు, ఆర్భాటాలనే ఇష్టపడుతున్నట్టుంది ఇక్కడ కూడా! అసోంలో.. ఒక గమ్మత్తయిన పెళ్లి ఆచారం ఉంది. వధువు తరఫు బంధుమిత్రులు వరుడికి రకరకాల పొడుపు కథలు చెప్పి సమాధానమివ్వమంటారు. జవాబు చెప్పలేకపోతే డబ్బు డిమాండ్ చేస్తారు. ఆ సవాళ్లన్నింటినీ ఛేదించుకుంటూ వధువును చేరుకోవాలి వరుడు. తన ప్రేమను చాటుకోవాలి. చెసియన్ పెళ్లిని బౌద్ధం ఒక కుటుంబ వ్యవహారంగానే చూస్తుంది. మతానికి సంబంధించిన విషయంగానో.. సామాజిక అంశంగానో చూడదు. స్త్రీ, పురుషుల ఎంపికలాగే పరిగణిస్తుంది. అందుకే పెళ్లి వేడుక కూడా చాలా నిరాడంబరంగా ఉంటుంది. పెళ్లికి ముందు జరిగే నిశ్చితార్థాన్ని చెసియన్ అంటారు. నిశ్చితార్థానికి వరుడి తల్లిదండ్రులు వధువు కుటుంబాన్ని తమ ఇంటికి ఆహ్వానిస్తారు. బౌద్ధ సన్యాసుల ప్రార్థనల మధ్య నిశ్చితార్థం జరుగుతుంది. ఆ రోజే పెళ్లి తేదీని నిర్ణయిస్తారు. పెళ్లి వధువు ఇంటి దగ్గరైనా లేదా బౌద్ధాలయంలోనైనా జరుగుతుంది. ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన బౌద్ధ సన్యాసులు, సన్యాసినులు వధూవరులిద్దరినీ ఆశీర్వదిస్తారు. వివాహం ఒకవేళ వధువు ఇంట్లో జరిగితే పెళ్లి తర్వాత వధూవరులిద్దరూ బౌద్ధాలయానికి వెళ్లి అక్కడా ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఆసియా దేశాలకు వెళితే.. ములుకు లేని బాణాలు.. అదృష్టజాతకురాలు చైనాలో.. కాబోయే వరుడు ములుకు తీసేసిన బాణాలతో గురి చూసి వధువు మీదకు వేయాలి. తర్వాత వాటన్నిటినీ పోగు చేసి.. పెళ్లి రోజున విరిచేయాలి. ఇలా చేస్తేనే వారి మధ్య ప్రేమానురాగాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయని, ఆ బంధం బలపడుతుందని చైనీయుల విశ్వాసం. ఇంకో విషయం ఏంటంటే.. పెళ్లికూతురి తరఫువారు.. ఊళ్లోని ఒక అదృష్టజాతకురాలిని అద్దెకు తీసుకొచ్చి పెళ్లికూతురి వెంట ఆమెకు తోడుగా అత్తారింటికి పంపిస్తారు. అలా పంపిస్తే ఆమె అదృష్టం పెళ్లికూతురికీ వస్తుందని చైనీయుల నమ్మకమట! సింహాసనంలా అలంకరించిన కుర్చీలో పెళ్లికూతురు ఊరేగింపుగా అత్తారింటికి వెళ్తుంది. అలా వెళ్లేప్పుడు దారంతటా పెళ్లికూతురి తరఫు బంధువులు వధువుకి గొడుగు పడుతూ అక్షింతలు జల్లుతూ ఉంటారు. తల మీద కొంగుతో.. జపాన్‌లో.. పెళ్లి సమయంలో షింటో మత సంప్రదాయం ప్రకారం నిర్వహించే వేడుకలో వధువుపై నుంచి కింది దాకా తెల్లటి దుస్తులను ధరించాలి. తల మీద నుంచి మెడ వరకు ‘సునోకకుషి’ అనే వస్త్రాన్నీ వేసుకోవాలి. తెలుపు వర్ణం ఆమె కన్యాత్వాన్ని సూచిస్తే.. తల మీది వస్త్రం ఆమెకు తన అత్తగారి పట్ల ఉన్న అసూయను దాస్తుందట. పెళ్లిళ్లు సాధారణంగా షింటో ఆలయాల్లో జరుగుతాయి. ఆలయంలో కాకుండా ఇళ్లల్లో జరిగినా, వధూవరులు తప్పనిసరిగా ఆలయానికి వెళ్లి అక్కడి ‘కామి’లకు (దేవీదేవతలు) తమ పెళ్లిని తెలిపి ఆశీస్సులు తీసుకుంటారు. తర్వాత వధూవరులిద్దరూ బియ్యం నుంచి తయారు చేసే ‘సకీ’ అనే మద్యాన్ని మూడేసి గుటకల చొప్పున తాగుతారు. తర్వాత బంధుమిత్రులతో కలసి విందు చేసుకుంటారు. ఎండు చేపతో.. దక్షిణ కొరియాలో పెళ్లి వేడుకలో ఒక వింతయిన ఆచారం ఉంది. పెళ్లి కొడుకు కుటుంబం, అతని స్నేహితులు పెళ్లికొడుకును బోర్లా పడుకోబెట్టి అతని అరికాళ్లపై కర్రతో కానీ.. ఎండు చేపతో కానీ కొడుతూ గమ్మత్తయిన ప్రశ్నలు వేస్తుంటారట. వరుడు ఆ దెబ్బలను తింటూ వాళ్లడిగే ప్రశ్నలకు సమాధానమిస్తుంటాడు. పెళ్లి కొడుకు జ్ఞాపకశక్తి చురుగ్గా ఉండటానికి ఇలా చేస్తారట. మ్యారేజ్ డే.. భార్య బర్త్ డే.. వంటివన్నీ గుర్తుంచుకోవడానికేనేమో! పావురాలు ప్రేమ ప్రతీకలు ఫిలప్పీన్స్‌లో పెళ్లయిన వెంటనే వధూ వరులిద్దరూ తెల్ల పావురాల జంటను గాల్లోకి ఎగరేస్తారట. ఆ దేశంలో తెల్ల పావురాలను సఖ్యత, ప్రేమానుబంధాలకు ప్రతీకలుగా భావిస్తారు. అప్పుడే పెళ్లయిన జంట అలా ఆ పావురాలను గాల్లోకి వదిలేస్తే ఆ జంట కూడా పదికాలాలపాటు ప్రేమానుబంధంలో బందీగా ఉంటుందని ఆ దేశస్తుల నమ్మకమట. అందుకే అలా పావురాలను ఎగరేస్తారు. జెండా ఎగరేసి.. టర్కీలోని కొన్ని ప్రాంతాల్లో పెళ్లికి సంబంధించి గమ్మత్తయిన ఆనవాయితీ ఉంది. పెళ్లి ముహూర్తాన.. వరుడి స్నేహితులు వరుడి ఇంటి ఆవరణ లేదా ఇంటి మీద టర్కీ జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఆ జెండాకు ఆ ప్రాంతంలో దొరికే పళ్లు, కూరగాయలతోపాటు అద్దాలనూ వేలాడదీస్తారట. పెళ్లి వేడుక మొదలైందని అలా జెండా ఎగరేసి మరీ ఊళ్లో్లవాళ్లకు చాటుతారన్నమాట! యూరప్‌లో వెడింగ్ కస్టమ్స్... పెళ్లి కూతురిని దాచేసి.. రూమేనియాలో.. వధువు తరఫు బంధువులు.. పెళ్లి ముహూర్తానికి కొన్ని నిమిషాల ముందు వధువును దాచేస్తారు. వరుడొచ్చి తనకు కాబోయే భార్య ఎక్కడుందో చెప్పమని రిక్వెస్ట్ చేస్తాడు. ‘చెబుతాం కానీ ఖర్చు అవుతుంది’ అంటారు. గిఫ్ట్స్ కావాలని డిమాండ్ చేస్తారు. అలా వరుడిని ముహూర్తం వేళ వరకూ ఆటపట్టించి.. చివరకు ఒక మంచి పాట పాడాలని పట్టబట్టి వరుడి చేత ఓ లవ్ సాంగ్ పాడించి..పెళ్లికూతురిని అప్పజెప్తారు. ఆఫ్రికా, దక్షిణ ఆఫ్రికా దేశాల్లో మ్యారేజ్ సెలబ్రేషన్ ఎలా ఉంటుందంటే.. ఉమ్మేస్తేనే అదృష్టం ఆఫ్రికాలోని కెన్యాలో ఉన్న ఈ పెళ్లి ఆచారం వింటే విస్తుపోతారు. పెళ్లి రోజున వధువు తండ్రి ఆమె వేసుకున్న వెడింగ్ డ్రెస్ మీద ఉమ్మేస్తాడు. కోపంతో కాదు.. ప్రేమతో! బిడ్డ వైవాహిక జీవితం బాగుండాలి.. ఆమె అదృష్టవంతురాలు కావాలనే ఆశతో! అవును అది వాళ్ల ఆచారం. అలా చేయని తండ్రి బిడ్డ క్షేమాన్ని కోరనట్టే అట. ఒంటె నాట్యం దక్షాణ ఆఫ్రికా దేశం నైజర్‌లో పెళ్లయిపోయాక ఎడారిలో రిసెప్షన్ పార్టీ పెడతారు. ఆ పార్టీలో అతిథుల మధ్య.. డ్రమ్ బీట్‌కి అనుగుణంగా ఒంటె డాన్స్ చేస్తుంది. రిసెప్షన్‌కి ఒంటె డాన్స్ వినోదమే కాదు అక్కడి పెళ్లి ఆనవాయితీ కూడా! ఆస్ట్రేలియా దేశాల్లోని పెళ్లి ఆచారాలు చూస్తే.. రంగు రాళ్లు రిటర్న్ గిఫ్ట్స్ కావు ఆస్ట్రేలియాలో పెళ్లికి వచ్చిన అతిథులు అందరికీ రంగు రాళ్లు ఇస్తారు. ఓ టేబుల్ మీద ఒక బౌల్ పెడతారు. పెళ్లయి.. విందు ఆరగించి ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయే ముందు ఈ అతిథులు అంతా తమ దగ్గరున్న రంగురాళ్లను ఆ బౌల్లో వేసి వెళ్లిపోతారు. కొత్త పెళ్లి జంట ఆ బౌల్‌ని తీసుకుని తమ ఇంటికి వెళ్లి దాన్ని డ్రాయింగ్ రూమ్‌లోనో.. బెడ్ రూమ్‌లోనో డెకరేటివ్ పీస్‌గా పెట్టుకుంటుంది. తమ పెళ్లికి హాజరైన అతిథులకు గుర్తుగా! ఇది అక్కడి ఆచారం! పన్ను పీకి చేతిలో పెట్టాలి ఫిజీ ద్వీపంలో.. ఏ కుర్రాడైనా ఏ పిల్ల మీదైనా మనసు పారేసుకుని.. ఆమె తండ్రి దగ్గరకు వెళ్లి ‘మీ అమ్మాయిని ఇష్టపడుతు న్నాను.. పెళ్లి చేసుకుంటాను’ అని అడిగితే.. ఆ పిల్ల తండ్రి వెంటనే ‘కడలి ఈద గలవా ఓ వరుడా.. అడుగుకు డైవ్ చేయగలవా? డైవ్ చేసి తిమింగలం నోటిలోని పన్ను పీక గలవా?’ అని సవాలు విసురుతాడు. ఆ అమ్మాయి మీద తన ప్రేమను నిరూపించుకోవాలంటే అబ్బాయి ఆ చాలెంజ్‌ను స్వీకరించాల్సిందే.. సముద్రంలోకి దూకి తిమింగలం పన్ను పీకి కాబోయే మామగారి చేతిలో పెట్టాల్సిందే! జంకినా.. వెనకడుగు వేసినా.. అమ్మాయి మీద ప్రేమలేనట్టే! అది అక్కడి తీరు మరి! దక్షిణ అమెరికాలో.. బద్దలు కొట్టాల్సిందే! గ్వాటెమాలలో కొత్తపెళ్లి జంటను ‘వందేళ్లు కలసి జీవించండి’ అని దీవిస్తే సరిపోదు.. గంటను బద్దలు కొట్టాల్సిందే! బియ్యం, పిండి వంటివన్నీ వేసిన గంట లాంటి పింగాణీ పాత్రను పెళ్లి కొడుకు తల్లి.. నేలకేసి కొడుతుంది. దీనివల్ల కొత్త పెళ్లి జంట మీది చెడు దృష్టి పోయి.. ఆ వధూవరులు సుఖశాంతులు, అషై్టశ్వర్యాలతో తులతూగుతారని నమ్మకమట. అందుకే వరుడి తల్లి.. కొడుకు, కోడలిని నోటిమాటతో ఆశీర్వదిస్తే సరిపోదు, పింగాణి గంటను పగలకొట్టాలి. ఉత్తర అమెరికాలో.. ఎనిమిదిలా.. మెక్సికోలో.. పెళ్లి ప్రమాణాలు పూర్తయిన వెంటనే రోజా పూలదండను ఎనిమిది అంకెలా మలచి దాంతో వధూవరులిద్దరినీ బంధిస్తారు. అలా చేయడాన్ని ఐక్యతకు చిహ్నంగా భావిస్తారట. మిగిలిన కార్యక్రమాలు అయిపోయేంత వరకు ఆ ఇద్దరూ అలా దండఖానాలో బందీలుగా ఉండాల్సిందే. పెళ్లి తంతు మొత్తం పూర్తయ్యాక ఆ జంటను విముక్తం చేసి ఆ దండను వధువు చేతికిస్తారట వాళ్ల కమిట్మెంట్కి గుర్తుగా. ఇవన్నీ చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ! ఇలా చెప్పుకుంటూ పోతే ఆచారవ్యవహారాలుగా కొనసాగుతున్న పెళ్లి చిత్రాలెన్నో ఈ ప్రపంచంలో!! -
ఇదే నాకు మొదటి పెళ్లి... నాకు మందు, సిగరేట్లు కావాలి
పెద్దపల్లి: రామగుండం ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీకి చెందిన పాన్‌షాప్ నిర్వాహకుడు వరంగల్ జిల్లాకు చెందిన ఓ యువతి మాయలో పడి మోసపోయాడు. అప్పటికే మూడు పెళ్లిల్లు చేసుకున్న మాయ లేడీ ఇక్కడి యువకున్ని మోసం చేసి డబ్బు, బంగారంతో పరారైంది. దీంతో బాధితుడు ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల వివరాలు.. ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీకి చెందిన రేవంత్‌కు అప్పటికే పెళ్లి జరిగి విడాకులయ్యాయి. అయితే ఓ షాదీ డాట్ కామ్ ద్వారా యువతి పరిచయమైంది. ఆ పరిచయం సెల్ ఫోన్లలో ముచ్చట్లు.. తర్వాత పెళ్లి వరకు వచ్చింది. ఇదే మొదటి పెళ్లి అంటూ సదరు యువతి నమ్మించింది. దీంతో రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు పెళ్లి కుదిర్చారు. వెంటనే ఎన్టీపీసీలోని చిలుకలయ్య ఆలయంలో సాదాసీదాగా వివాహం చేసుకుని కొత్త కాపురం ప్రారంభించారు. ఇక లేడీ తన కిలాడీల ప్రదర్శన ప్రారంభించింది. తనకు మందు, సిగరేట్లు కావాలంటూ యువకున్ని నిత్యం వేధింపులకు గురిచేసింది. ఇద్దరి మధ్య గొడవలు మొదలై రెండు నెలలు గడిచాయి. ఈక్రమంలో యువతి తన అక్క వద్దకు వెళ్తున్నానని ఇంట్లో ఉన్న రూ.70వేల నగదు, 4 తులాల బంగారు ఆభరణాలతో బిచానా ఎత్తేసింది. రోజులు గడుస్తున్నా తిరిగి రాకపోవడంతో యువకుడు ఆమె బంధువులు, మిత్రుల వద్ద ఆరా తీయడంతో అసలు విషయాలు బయటపడ్డాయి. అప్పటికే మూడు పెళ్లిలు అయ్యాయని, చాలా మందితో పరిచయాలు ఉన్నాయని తెలుసుకున్నాడు. చివరకు చిరునామా తెలుసుకుని వెళ్లడంతో సదరు యువతి తన మిత్రులతో విందు విలాసాలతో కనిపించింది. ఏకంగా వారందరూ పాన్‌షాప్ యువకుడిపై దాడి చేసి, వాటిని వీడియో తీశారు. ఈ వీడియోలు సదరు యువతి మిత్రులు సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు గురిచేశారు. అంతేగాకుండా యువకుడి కుటుంబసభ్యులను సైతం డబ్బుల కోసం డిమాండ్ చేశారు. దీంతో యువకుడు ఎన్టీపీసీ పోలీసులను ఆశ్రయించి గోడు వెల్లబోసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. యువతి కోసం గాలిస్తున్నాం పెండ్లి చేసుకుని నగదు, బంగారు ఆభరణాలతో వెళ్లి ఫోన్ స్విచాఫ్ చేసిందని బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఆమె కోసం గాలిస్తున్నాం. చీటింగ్ కేసు నమోదు చేశాం. ఇటీవల హైదరాబాద్‌లో ఉందన్న సమాచారంతో వెళ్లినా ఆచూకీ దొరకలేదు. ఆమె పట్టుబడితే పూర్తి విషయాలు తెలిసే అవకాశాలున్నాయి. – బి.జీవన్, ఎస్సై, ఎన్టీపీసీ న్యాయం చేయండి.. పెండ్లి పేరుతో నన్ను ఆమె మోసం చేసింది. మా ఇంటి నుంచి నగదుతో పాటు బంగారం తీసుకెళ్లింది. ఆమెతో పాటు ఆమె స్నేహితుల నుంచి నాకు ప్రాణ భయం ఉంది. నాకు న్యాయం చేయాలి. – రేవంత్, ఎన్టీపీసీ రామగుండం -
Generation-Z: వీకెండ్ కాపురాలు..రెండు రోజులు మాత్రమే ఒకరికొకరు
పెళ్లంటే రెండు జీవితాల కలయిక. నిండు నూరేళ్ల సావాసం. ఎన్ని కష్టనష్టాలెదురైనా జీవితాంతం ఒకరి చేయి మరొకరు విడిచిపెట్టకూడదు. ఒకేచోట కలిసుంటేనే బంధం బలపడుతుంది... ఇన్నాళ్లూ పెళ్లికి మనకి ఈ అర్థాలే తెలుసు... కానీ... నేటి జనరేషన్ జెడ్ పెళ్లికి కొత్త భాష్యాలు చెబుతోంది. ‘ఎవరి జీవితం వారిది. ఎవరి ఆర్థిక స్వాతంత్య్రం వారిది. ఎవరి వ్యక్తిత్వం వారిది. ఒకరి కోసం మరొకరు వాటిని వదులుకోనక్కర్లేదు. అందమైన జీవితాన్ని మూడు ముళ్లతో బంధించి జీవితాంతం రాజీ పడనక్కర్లేదు’ వంటి ఆలోచనల నుంచి వీకెండ్ మ్యారేజెస్ కాన్సెప్టు పుట్టుకొచ్చింది. జపాన్లోనైతే ఇవి ట్రెండుగా మారాయి. భారత్‌లోనూ మెల్లిగా తెరపైకి వస్తున్నాయి... వీకెండ్ మ్యారేజెస్ అంటే..? ఇవాళ రేపు ఆడ, మగ ఇద్దరూ సమానమే. ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ అని లేదు. భర్త బయట పని చేసి డబ్బు సంపాదిస్తే, భార్య ఇంటిని చక్కదిద్దుకుంటూ గృహిణి జీవితం గడిపే రోజులు పోయాయి. మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లూ సంపాదిస్తున్నారు. తమ వ్యక్తిత్వాన్ని వదులుకోవడానికి, జీవితంలో సర్దుకుపోవడానికి ససేమిరా అంటున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీల్లేని బిజీ లైఫ్‌లో గడిపేస్తున్నారు. అందుకే పెళ్లి చేసుకొని ఒకే చోట ఉండడం కంటే వీకెండ్స్‌లో కలిసి ఉండాలని ముందే ఒక అవగాహన కుదుర్చుకుంటున్నారు. వారంలో అయిదు రోజులు ఎవరి జీవితం వారిది, మిగిలిన రెండు రోజులు ఒకరికొకరుగా కలిసి జీవిస్తారు. కష్టసుఖాలు కలబోసుకుంటారు. గుండెల నిండా గూడు కట్టుకున్న ప్రేమని పంచుకుంటూ రెండు రోజులు రెండు క్షణాల్లా గడిపేస్తారు. వీకెండ్ కాపురాలకు కారణాలు ► ఆఫీసులో పని ఒత్తిడితో ఆడ, మగ లైఫ్‌స్టైల్ వేర్వేరుగా ఉంటున్నాయి. ఒకరికి ఉదయం షిఫ్ట్ అయితే మరొకరికి రాత్రి షిఫ్ట్ ఉంటుంది. ఒకరి ఆఫీసు ఊరికి ఒక మూల ఉంటే, మరొకరిది మరో మూల ఉంటుంది. దీంతో ఒకేచోట కలిసుండే పరిస్థితి ఉండడం లేదు ► పెళ్లి చేసుకున్నా ఇద్దరిలో ఎవరికి వారే తాము పుట్టి పెరిగిన వాతావరణాన్ని వదులుకోవడానికి సిద్ధపడడం లేదు. ► ముఖపరిచయం కూడా లేకుండా పెళ్లి చూపుల్లోనే ఒకరినొకరు చూసుకునే జంటలు ఒకరితో ఒకరు ఎంతవరకు జెల్ అవగలరో తెలుసుకోలేకపోతున్నారు. అందుకే ముందుగా వీకెండ్స్‌లో కలిసుంటే ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చునని భావిస్తున్నారు. ► భార్యాభర్తలకి ఒకరి నుంచి మరొకరికి ఎక్స్పెక్టేషన్లు ఉంటాయి. ఆఫీసు నుంచి అలిసిపోయి ఇంటికి వచ్చిన వారికి భాగస్వామి తమకి అనుకూలంగా లేకపోతే చిర్రెత్తుకొచ్చి దెబ్బలాటలకి దారి తీస్తాయి. అదే వీకెండ్స్‌లో మాత్రమే కలిస్తే, కలిసుండేది కాస్త సమయమైనా హాయిగా గడుపుదామని అనిపిస్తుంది. మళ్లీ వారం వరకు చూడలేమన్న ఫీల్‌తో ఒకరిపై మరొకరికి ప్రేమ పొంగుకొస్తుంది. సర్ప్రైజ్లు, రొమాన్స్‌లు కొత్తగా వింతగా అనిపించి మానసికంగా ఎనలేని సంతృప్తి ఉంటుంది. ► ఆర్థికంగా ఎవరి స్వాతంత్య్రం వారికుంటుంది. ఎవరికి వారు వాళ్ల ఇళ్లల్లో ఉంటారు కాబట్టి డబ్బుల్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ► అబ్బాయిలు, అమ్మాయిలు అన్న తేడా లేకుండా ఈ మధ్య అందరూ తమకి మాత్రమే సొంతమైన ఒక స్పేస్ కావాలని బలంగా కోరుకుంటున్నారు. వీకెండ్ కాపురాల్లో ఎవరికి కావల్సినంత స్పేస్ వారికి దొరుకుతుంది. భారత్‌లో కుదిరే పనేనా..? వీకెండ్ పెళ్లి పేరుతో వారానికోసారి కలుస్తామంటే అంగీకరించే సామాజిక పరిస్థితులు భారత్‌లో లేవు. ముంబైలాంటి నగరాల్లో కొందరు ప్రయోగాత్మకంగా వీకెండ్ కాపురాలు మొదలు పెట్టారు. ఆఫీసులు చెరో మూల ఉన్నప్పుడు ఇలా వీకెండ్స్‌లో కలవడమే బెటర్ అని నిర్ణయించుకునే జంటలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. రోజంతా ట్రాఫిక్ జామ్‌లో పడి ఏ రాత్రికో ఉసూరంటూ ఇంటికి చేరడానికి బదులుగా ఎవరిళ్లలో వారుంటూ వీకెండ్ వరకు ఎదురు చూడడమే మంచిదన్న అభిప్రాయానికి నేటితరం వస్తున్నా కుటుంబాలైతే అంగీకరించడం లేదు. మన దేశంలో పెళ్లంటే రెండు కుటుంబాల కలయిక. వడం. కనుక öన్ని కట్టుబాట్లు, సంప్రదాయాలు తప్పనిసరి. పెళ్లి చేసుకుంటే ఒక కమిట్మెంట్తో ఉండాలి. జపాన్, చైనా వంటి దేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడానికి, పిల్లలు కనడానికి యువతరం విముఖంగా ఉంటోంది. ఏళ్ల తరబడి పిల్లల్ని కనొద్దని ప్రభుత్వం పెట్టిన ఆంక్షలే శాపంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో పసిపాపల బోసినవ్వులు కనిపించి ఏళ్లవుతున్నాయి. అందుకే పెళ్లి చేసుకొని వారంలో రెండు రోజులైనా కలిసుంటే చాలన్న స్థితి వచ్చింది. మన దగ్గర ఆలా కాదు. ముఖ్యంగా పిల్లలు పుడితే ఏం చేస్తారు ? తల్లి తండ్రి ఇద్దరి ప్రేమ మధ్య పెరగాల్సిన పిల్లల్ని కూడా వారానికొకరని పంచుకోవడం అసాధ్యం. వ్యక్తిత్వం, ఆర్థిక స్వాతంత్య్రం పేరుతో వీకెండ్ కాపురాలు చేయాలని యువతరం భావించినా పెద్దలు వారిని అడ్డుకుంటున్నారు. అందుకే భారత దేశంలోని కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటోంది. ‘‘భారత్‌లో పెళ్లికి ఒక పవిత్రత ఉంది. దాన్నో ప్రయోగంగా మార్చాలని ఎవరూ అనుకోరు. ఇద్దరూ వారంలో రెండు రోజులు మాత్రమే కలిసుంటే వారిద్దరి మధ్య పరస్పర నమ్మకం, అవగాహన ఏర్పడడం కష్టం. భాగస్వామిలోనున్న లోపాలను కూడా ప్రేమించగలిగినప్పుడే ఆ వివాహం పదికాలాలు పచ్చగా ఉంటుంది. కానీ లోపాలను కప్పిపుచ్చుకుంటూ మనలో ఉన్న మంచిని మాత్రమే అవతలి వ్యక్తికి చూపించాలనుకున్నప్పుడు పెళ్లి అన్న పదానికే అర్థం లేకుండా పోతుంది’’ – శ్రేయా కౌలమ్, సైకాలజిస్ట్ –సాక్షి, నేషనల్ డెస్క్ -
శ్రీరస్తు.. కల్యాణమస్తు
భీమవరం (ప్రకాశం చౌక్): ఈ ఏడాది శుభాకార్యాలకు మంచి తరుణం. ప్రస్తుతం తెలుగు సంవత్సరాది శుభకృత్ నామ సంవత్సరం నడుస్తోంది. మార్చి నుంచి శోభకృత్ నామ సంవత్సరం ప్రారంభమవుతుండడంతో అంతా శుభం కలగనుంది. అధిక సంఖ్యలో పెళ్లి ముహూర్తాలు ఉండడంతో కల్యాణ నామ సంవత్సరంగా ఈ ఏడాదిని చెప్పవచ్చు. ఏప్రిల్ నెలలో గురుమూఢమి, జూలై నెలలో ఆషాఢం, అధిక శ్రావణం కావడంతో ఈ ఏడాది ఈ రెండు నెలల మినహా మిగిలిన 10 నెల ల్లో 104 పెళ్లి ముహూర్తులు ఉండడం విశేషం. గడిచిన మూడేళ్లతో పోల్చితే ఈ ఏడాది పెళ్లి ముహూర్తాలు అధికంగా ఉన్నాయి. ఏడాదంతా భాజాభంత్రిల మోత మోగనున్నాయి. పెళ్లిళ్లతోపాటు గృహప్రవేశాలు తదితర శుభకార్యలకూ మూహూర్తులు ఉన్నాయి. 25 నుంచి ముహూర్తాలు ప్రారంభం ఈనెల 25 తేదీ నుంచి పెళ్లిళ్ల ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. ఈనెలలో 4, ఫిబ్రవరి 12, మార్చి 13, మే 16, జూన్ 7, ఆగస్టు 8, సెప్టెంబర్ 6, అక్టోబర్ 10, నవంబరు 14, డిసెంబర్లో 14 ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్, జూలై నెలల్లో ముహూర్తాలు లేవు. జోరుగా వ్యాపారాలు జిల్లాలోని కల్యాణ మండపాలు, పంక్షన్ హాల్స్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. వీటిని పెళ్లిళ్లకు నెల నుంచి రెండు నెలల బుక్ చేసుకుంటున్నారు. దీంతో వ్యాపారం జోరుగా సాగుతోంది. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నర్సాపురం పట్టణాల్లోని సంపన్నులు తమ ఇంట పెళ్లిళ్లకు ఖరీధైన పంక్షన్ హాల్స్‌ను బుక్ చేసుకుంటున్నారు. దుస్తులు, బంగారం, కిరణా వ్యాపారాలకు మూడు పువ్వులు, ఆరుకాయలు అన్నట్లుగా వ్యాపారం సాగుతోంది. లైటింగ్, డైకరేషన్, షామియన, టైలర్స్, వాయిద్యా కళాకారులు, బ్రహ్మణులు, రజకులు, నాయీబ్రహ్మణులు, వంట మేస్త్రీలు, పువ్వులు, పెయింటర్స్, ఫొటోగ్రాఫర్స్, ట్రావెల్స్ తదితరులు అందరికీ మంచి ఉపాధి లభించనుంది. పుణ్య క్షేత్రాల్లో ముందస్తు రిజర్వేషన్లు జిల్లాలోని పలు పుణ్య క్షేత్రాల్లో వివాహాల నిర్వహణకు ముందుగా ఆలయ ప్రదేశాలను రిజర్వేషన్ చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ద్వారాకతిరుమల, పశి్చమగోదావరి జిల్లాలోని భీమవరం, పాలకొల్లు పంచారామక్షేత్రాలు, భీమవరం, కాళ్లకూరు, తణుకు వెంకటేశ్వరస్వామి దేవస్థానాలు, భీమవరం భీమేశ్వరస్వామి, నర్సాపురం, ఆచంట, తాడేపల్లిగూడెం, యలమంచిలి, పెనుగొండ తదితర ప్రాంతాల్లో ప్రముఖ దేవస్థానాల్లో పెళ్లిళ్లు ఎక్కువగా నిర్వహిస్తుంటారు. మొక్కుబడి ఉన్నవారంతా ఆలయాల్లోనే పెళ్లిళ్లు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది ముహూర్తాలు ఎక్కువే గడిచిన మూడేళ్లతో పోల్చితే ఈఏడాది పెళ్లిళ్ల ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది రెండు నెలల మినహా మిగిలిన 10 నెలల్లో ప్రతి నెలా ముహూర్తాలు ఉన్నాయి. పెళ్లిళ్లూ, ఇతర శుభకార్యాలకు ఈ ఏడాదంతా శుభపరిణామమే. ప్రస్తుతం తెలుగు సంవత్సరాది శుభకృత్ నామ సంవత్సరం నడుస్తోంది. మార్చి నుంచి శోభకృత్ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ తెలుగు ఏడాది కూడా అన్ని శుభకార్యాలకూ అనువైనది. – లింగాల సూర్యప్రసాద్, ఘనపాఠి, భీమవరం పంచారామక్షేత్రం అస్థాన వేదపండితులు -
ఒకరిద్దరిని కాదు ఏడుగురిని పెళ్లి చేసుకున్న మహిళ..
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): ఒకరిద్దరిని కాదు ఏడుగురిని పెళ్లి చేసుకుంది ఆ కిలాడీ లేడీ. డబ్బున్న వారిని గుర్తించడం. వారి చెంత చేరడం. మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకోవడం ఆమెకు అలవాటు. గుంటూరు, భీమవరం, శారదానగర్, విజయవాడ ప్రాంతాలకు చెందిన వ్యక్తులను మోసం చేసినట్టు బాధితుడు కొత్తకోట నాగేశ్వరరావు (శివ) తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం పేకేరు గ్రామానికి చెందిన రోకళ్ల వెంకటలక్షి్మ(అలియాస్ గుంటూరు కందుకూరి నాగలక్షి్మ) అతని వద్ద పనికి చేరింది. అతనికి దగ్గరవ్వడమే గాక 2021 మార్చి 13న గుంటూరులో వివాహం చేసుకుంది. ఇద్దరూ విశాఖపట్నం చేరుకొని.. జగదాంబ జంక్షన్ సమీపంలో ఓ ఇంట్లో అద్దెకు ఉన్నారు. అతను ఓ కంపెనీలో ఆడిటర్‌గా పనిచేసేవాడు. వెంకటలక్ష్మి మాయ మాటలు చెప్పి ప్రతీ నెలా జీతాన్ని తన అకౌంట్ నుంచి ఆమె అకౌంట్‌కు బదిలీ చేసుకునేది. పిత్రార్జితంగా వచ్చిన గుంటూరు జిల్లాలోని గోరింట్ల వద్ద డాబా ఇల్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలోని 12 సెంట్ల ఖాళీ స్థలం ఆమె పేరిట మారి్పంచుకుంది. ఆరు నెలల గర్భంతో ఉన్న సమయంలో 3 తులాల బంగారం, బ్యాంకు అకౌంట్లో ఉన్న సొమ్ము తీసుకొని అతనిని వదిలి వెళ్లిపోయింది. ఈ విషయమై గుంటూరు, భీమవరం పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాను. అనంతరం ఆమె గురించి అనేక వివరాలు వెలుగులోకి వచ్చాయి. భీమవరంలో ఇద్దరు, పాత గుంటూరులో ఒకరు, గుంటూరు శారదానగర్‌లో ఒకరు, విజయవాడ రాజరాజేశ్వరిపేటలో ఒకరు, గుంటూరు డొంకరోడ్డులో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిని మోసగించినట్లు తేలింది. -
పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా?.. ఆలస్యం వద్దు.. మంచి ముహూర్తాలు ఇవే
ఖమ్మం (భద్రాచలం అర్బన్) : వివాహం జరిపించాలన్నా.. నూతన గృహప్రవేశం చేయాలన్నా.. ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలన్నా.. శుభ ముహూర్తం కోసం వెతికి మరీ అదే రోజు, అదే సమయానికి సంప్రదాయంగా ప్రారంభించి మొదలుపెడతాం. ముఖ్యంగా వివాహాలకు అయితే కచ్చితంగా పాటించాల్సిందే. కోవిడ్ తర్వాత రెండేళ్లకు పెళ్లి మంత్రాలు మోగుతున్నాయి. ఎవరి స్థోమతకు తగ్గట్టు వారు తమ పిల్లల వివాహాలను ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ, ఈ ఏడాది సుముహూర్తాలు తక్కువగా ఉండటంతో ఉరుకులు, పరుగులతో పెళ్లిళ్లు కానిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ వరకు మాత్రమే సుముహూర్తాలు ఉండడంతో అందరూ బిజీబిజీగా గడిపారు. కరోనాతో మోగని పెళ్లి బాజా.. రెండేళ్ల కరోనా కాలంలో చాలా మంది పెళ్లి మాట ఎత్తనేలేదు. కొంతమంది పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నప్పటికీ కోవిడ్ నిబంధనల కారణంగా వాయిదా వేశారు. కానీ, ఈ ఏడాది కరోనా ప్రభావం తగ్గడంతో కొత్త సంవత్సరం మొదలు జూన్ వరకు వేలాది పెళ్లిళ్లు జరిగాయి. జూలైలో ఆషాఢంతో బ్రేక్ పడిన ముహూర్తాలకు ఆగస్టులో కేవలం 10 రోజులు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత డిసెంబర్ వరకు వేచి చూడాల్సిందే. అప్పటి వరకు ఆగడం ఎందుకని పెళ్లి చేసేందుకు రెండు కుటుంబాల వారు తొందరపడుతూ పెళ్లిళ్లు చేస్తున్నారు. కోలుకుంటున్న వ్యాపారాలు .. కోవిడ్ కారణంగా వరుసగా రెండేళ్లు దెబ్బతిన్న వ్యాపారాలు ఈ ఏడాది జరిగిన వివాహాలతో కాస్త కోలుకున్నాయి. జనవరి నుంచి జూన్ వరకు వివాహాలు వేల సంఖ్యలో జరగడంతో శుభలేఖలు, దుస్తులు, ఫొటోలు, వీడియో, ట్రావెల్స్, పెళ్లి మండపాలు, పూలు, పురోహితులు, సాంస్కృతిక కళాకారులు, ఎలక్ట్రీషియన్లు, బ్యాండ్ మేళాలు, కూరగాయల నుంచి కిరాణా సరుకుల వరకు అన్ని వ్యాపారాలు ఊపందుకున్నాయి. బంగారం కొనుగోళ్లు పెరగడంతో అన్నిరకాల షాపులు కళకళలాడుతున్నాయి. మిగిలిన ముహూర్తాలు ఇవే.. జనవరి నుంచి జూన్ వరకు వేలాది పెళ్లిళ్లు జరిగినా.. జూలై ఆషాఢ మాసంతో మాత్రం బ్రేక్ పడింది. ఆగస్టు శ్రావణ మాసంలో 3, 4, 5, 6, 10, 11, 13, 17, 20, 21 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. సెప్టెంబర్‌లో బాద్రపద మాసం, శుక్ర మౌఢ్యమి ప్రారంభంలో, అక్టోబర్, నవంబర్‌లో శుక్ర మౌఢ్యమితో మంచి రోజులు లేవు. మళ్లీ డిసెంబర్లో 2, 3, 7, 8, 9, 10, 11, 14, 16, 17, 18 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. మూడు నెలలు ఆగాల్సిందే.. ఆషాఢ మాసం కారణంగా నెల రోజులు పెళ్లిళ్లకు ముహూర్తాలు లేవు. శ్రావణ మాసంలో కేవలం 10 రోజులు మాత్రమే ము హూర్తాలు ఉండగా.. మళ్లీ డిసెంబర్లో మా త్రమే మంచి రోజులు ఉన్నాయి. దీనికోసం మూడునెలలు ఆగాలి్సందే. ఆపై ఉగాది వరకు కూడా ముహూర్తాలు లేనందున వీలైనంత తొందరగా తమ పిల్లల పెళ్లిళ్లు చేయాలని తల్లిదండ్రులు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. – విశ్వనాథ్‌శర్మ, అర్చకులు, భద్రాచలం -
ఒకేరోజు ఒక్కటైన 111 జంటలు
పెంచికల్పేట్(ఆదిలాబాద్): మూడు ముళ్లు.. ఏడడుగులతో అగ్ని సాక్షిగా 111 జంటలు ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలంలో ఆదివారం ఏకమయ్యాయి. నిరుపేద కుటుంబాలకు చెందిన జంటలకు కోనేరు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప–రమాదేవి దంపతులు సామూహిక వివాహాలు జరిపించారు. జయమంగళ నది (పెద్దవాగు) తీరాన శ్రీభద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకకు కోనేరు కోనప్ప దంపతులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. వధూవరులకు తాళి బొట్టు, మెట్టెలు, పట్టు వస్త్రాలు, వంట సామగ్రి అందజేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ సురేశ్‌కుమార్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. -
పెళ్లికొడుకు కదా అని ‘చెప్పినట్టు’ చేస్తే... అశ్లీల వీడియోలతో..
సౌజన్య (పేరు మార్చడమైనది)కు మాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా పెళ్లి సంబంధం వచ్చింది. విదేశాలలో ఉన్న పెళ్లికొడుకు స్వదేశానికి త్వరలో వస్తున్నానని చెప్పాడు. సౌజన్య చాలా సంతోషించింది. నెల రోజులుగా వాట్సప్ చాట్ల ద్వారా ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆధునిక దుస్తుల్లో కనిపించాలని కోరాడు పెళ్లికొడుకు. నమ్మిన సౌజన్య అతను ‘చెప్పినట్టు’ చేసింది. దానిని రికార్డ్ చేసిన పెళ్లికొడుకు ఆ వీడియోను అశ్లీల వెబ్సైట్లో పెట్టాడు. ఆ తర్వాత అతను తన ఆన్లైన్ అకౌంట్స్ అన్నీ బ్లాక్ చేశాడు. మోసపోయిన విషయం అర్ధమైన సౌజన్య ఆత్మహత్యే శరణ్యం అనుకుంది. ∙∙ కీర్తన (పేరు మార్చడమైనది) పేరుతో ఫేస్బుక్లో ఫేక్ ఐడీ సృష్టించబడినట్టు తెలిసింది. దాని ద్వారా తనను వేధిస్తున్నవారి ఆటకట్టించాలనుకుంది. కానీ, ఎలాగో తెలియలేదు. ∙∙ సుందర్ (పేరు మార్చడమైనది) ఏడాది క్రితం సేంద్రీయ ఆహార ఉత్పత్తుల సంస్థకు యజమాని అయ్యాడు. చిన్న సంస్థే అయినా ఇప్పుడిప్పుడే లాభాలు అందుతున్నాయి. తన సంస్థ ఉత్పత్తులు మంచివి కావని, తనకు నష్టం కలిగించే ప్రకటనలు ఆన్లైన్లో చూసి షాకయ్యాడు. ∙∙ ఈ డిజిటల్ కాలంలో అపరిచత వ్యక్తుల నుంచి రకరకాల మోసాలకు లోనయ్యేవారి శాతం రోజు రోజుకూ పెరుగుతోంది. కరోనా కాలాన్ని ఉపయోగించుకొని మరింతగా సైబర్ నేరాలు పెరిగాయి. ఈ నేరాలలో పిల్లలు, మహిళలు ఎక్కువశాతం మోసానికి గురవుతున్నారు. అదేవిధంగా రకరకాల యాప్‌లు వచ్చి, డబ్బు దోపిడీ కూడా జరుగుతోంది. మోసం జరగకుండానే ముందస్తు జాగ్రత్తపడటం ఒక ఎత్తయితే, మోసపోయామని తెలిసినా తమని తాము రక్షించుకోవడం ఎలాగో ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం అవసరం. ఫిర్యాదు చేయడం ఎలా? మొబైల్ లేదా కెమెరా వాడకంతో పిల్లలను, స్త్రీలను వారి వ్యక్తిగత, అశ్లీల చిత్రాలు, వీడియోలను తీసి, ఆన్ లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా చూపినా, డిజిటల్ టెక్నాలజీ ద్వారా బాధితులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నా, ఒక వ్యక్తి లేదా సంస్థ యొక్క డేటా, ఆర్థిక సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం ద్వారా దొంగిలించినా, వ్యక్తిగత సమాచారం లేదా డేటాను పొందడానికి, డబ్బు లేదా పరువును కోల్పోయేవిధంగా మోసపూరిత ప్రయత్నం చేసినా, నెట్‌వర్క్‌ను దోపిడీ చేసే హ్యాకింగ్ ప్రక్రియకు పూనుకున్నా.. ఇలా ఏ డిజిటల్ మోసానికైనా సరైన ముందు https://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయడం. ఆన్లైన్ మార్గాలలో ఆర్థిక నష్టం జరిగితే https://cyberpolice.nic.in లో ఫిర్యాదు చేయాలి. దీనినే సిటిజన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. పై రెండు పోర్టల్స్‌కి 15526 హెల్ప్‌లైన్ నెంబర్ అనుసంధానమై ఉంటుంది. దీనికి ఆర్బిఐ ఆమోదించిన అన్ని బ్యాంకులు అనుసంధానమై ఉంటాయి కాబట్టి ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అకౌంట్ల తక్షణ నగదు లావాదేవీలను నిలిపి వేసి, మీ డబ్బును సురక్షితం చేస్తాయి. ఈ హెల్ప్‌లైన్ నెంబర్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. మీ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫోన్ నెంబర్‌ను నమోదు చేసి, వచ్చిన ఓటీపీ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. అందులో.. (1) చైల్డ్ పోర్నోగ్రఫీ (2) పిల్లల లైంగిక వేధింపులు (3) అసభ్యకరమైనవి, లైంగికపరమైనవి (జీజీ) ఇతర సైబర్ నేరాలు (1) మొబైల్ నేరాలు (2) సోషల్ మీడియా నేరాలు (3) ఆన్ లైన్ ఆర్థిక మోసాలు (4) సైబర్ ట్రాఫికింగ్ (5) హ్యాకింగ్... కి సంబంధించిన అంశాలు ఉంటాయి. ఫిర్యాదు చేసే ప్రక్రియ ఆఫ్‌లైన్ – ఆన్ లైన్ రెండు విధానాల్లో ఉంటుంది. సంఘటన ఏవిధంగా జరిగిందో తెలియజేయడానికి: (ఎ) కమ్యూనికేషన్ మోడ్ అంటే ఇంటర్నెట్, వాట్సాప్ .. ఏ విధానంలో అనేది తెలియజేయాలి. (బి) తేదీ – సమయం (సి) ప్లాట్‌ఫారమ్ (ఇంటర్నెట్, వాట్సాప్ మొదలైనవి) . (డి) ఆర్థిక మోసాలకు సంబంధించిన ఆధారాలు అప్లోడ్, పేమెంట్లు / బ్యాంక్ స్టేట్మెంట్ల స్క్రీన్షాట్లు. వేధింపులకు గురిచేసేవారి సంబంధిత స్క్రీన్ షాట్లు, ఫొటో, ఆడియో, వీడియో మొదలైనవి జత చేయాలి. అనుమానితుల వివరాలు (అందుబాటులో ఉంటే): (ఎ) అనుమానితుని పేరు (బి) గుర్తింపు (మొబైల్, ఇమెయిల్) (సి) ప్రదేశం.. మొదలైనవి) ఫిర్యాదుదారుల వివరాలు: (ఎ) పూర్తి పేరు – సహాయక వివరాలు (తండ్రి, జీవిత భాగస్వామి, గార్డియన్ మొదలైనవి) (బి) ఇమెయిల్ / ఫోన్ నంబర్ (సి) చిరునామా – ఐడీ ప్రూఫ్ (ఆధార్ మొదలైనవి) ఫిర్యాదును దాఖలు చేయడానికి దశల వారీ ప్రక్రియ ద్వారా వివరంగా తెలియజేయాలి. సత్వర స్పందన కోసం సమీప సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. డిజిటల్‌గా మోసం ఎలా జరిగినా పోలీసులు, పోర్టల్, హెల్స్‌లైన్.. ఆపద్భాంధువుల్లా ఉన్నారనే విషయాన్ని విస్మరించరాదు. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
మే'నరకం'
వాళ్లు మద్యం ముట్టరు, మాంసం తినరు, ఎన్నో ఏళ్లుగా ఇదే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. బయటి కులానికి చెందిన వారిని పెళ్లి చేసుకుంటే ఈ కట్టుబాట్లు పాటిస్తారో లేదోనన్న భయంతో మేనరికపు పెళ్లిళ్లతో తమ పిల్లల జీవితాల్లో చీకట్లు నింపుతున్నారు. మేనరికపు పెళ్లిళ్లు పిల్లల బంగారు భవిష్యత్తును చిదిమేస్తున్నా.. వైఎస్సార్ కడప జిల్లా తొండూరు మండలం మడూరుకు చెందిన ‘సాతాను’ కులస్తులు మాత్రం కట్టుబాట్లను వీడడం లేదు. పిల్లల్లో బుద్ధిమాంద్యం, అంధత్వం, వైకల్యాలకు మేనరికపు వివాహాలే కారణమని వైద్య ఆరోగ్య శాఖ ఎంత అవగాహన కల్పించినా మార్పు శూన్యం. ఇటీవల చదువుకున్న యువత కులాంతర వివాహాలు చేసుకుంటూ మార్పు దిశగా పయనిస్తోంది. మడూరు గ్రామంలోని ‘సాతానుల’ బతుకు చిత్రంపై సాక్షి ప్రత్యేక కథనం. –సాక్షి ప్రతినిధి, కడప ఈ చిన్నారి పేరు ఐశ్వర్య, వయసు ఐదు సంవత్సరాలు. తన తోటి పిల్లలతో ఆడుకునే, బడికెళ్లే వయసు.. ముద్దులొలికించే ఐశ్వర్య పుట్టుకతోనే మంచానికి పరిమితమైంది. లేవలేదు, కూర్చోలేదు. ఎవరో ఒకరు పక్కనుండి అన్నీ చూసుకోవాల్సిందే. వైద్యం కోసం ఆస్పత్రులకు తిరిగినా చిన్న మార్పు కూడా లేదు. తల్లి శోభారాణి, తండ్రి నరేష్లది మేనరికపు పెళ్లి. మేనరికం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిసినా.. ఎందుకు చేసుకున్నారని శోభారాణిని సాక్షి ప్రశ్నిస్తే.. ‘ ఆ సమయంలో నాకంత అవగాహన లేదు. తల్లిదండ్రులు పెళ్లి చేసేశారు. ఇలాంటి జీవితం ఎవరికీ రాకూడదు. మేనరికం పెళ్లిళ్లు ఎంత ప్రమాదమో ఇప్పుడు తెలిసొచ్చింది. అయినా ఏం లాభం’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ పల్లెలో ఏ ఇంటిని పలకరించినా ఇలాంటి కన్నీటి గాథలెన్నో మనసును చివుక్కుమనేలా చేస్తాయి. 22 ఏళ్ల వయసులో నిర్జీవంగా పడిఉన్న ప్రశాంత్, పుట్టుకతోనే చూపు కోల్పోయిన స్వర్ణలత, వరలక్ష్మి, వెంకటశేషయ్యలు.. బధిరులుగా బతుకీడుస్తున్న సంతోష్, కళ్యాణిలు.. అంగవైకల్యంతో బాధపడుతున్న బీటెక్ స్టూడెంట్ అరుణ్.. ఇలా ఎందరో... ఎన్నో తరాలుగా కట్టుబాటు వైఎస్సార్ కడప జిల్లా తొండూరు మండలం మడూరు గ్రామంలో మొత్తం 200 గడపలు ఉంటాయి. జనాభా 1200 మందికి మించదు. అయితే ప్రతి ఇంట్లో శారీరక, మానసిన లోపాలతో పుట్టే పిల్లలు కన్పిస్తారు. మద్యం, మాంసం ముట్టకపోవడం తమ పూర్వీకుల నుంచి వస్తుందని సాతానులు చెబుతున్నారు. తరాలుగా వస్తున్న కట్టుబాటు తప్పితే కీడు జరుగుతుందని, వారి నమ్మకం. మాంసం తినే ఇతర సామాజిక వర్గాలవారు గ్రామంలోకి వచ్చినా వారిని మంచాలమీద కూర్చోనివ్వరు. బయటనుంచే మాట్లాడి పంపేస్తారు. తమ పిల్లలను ఇతర ప్రాంతాల్లో అక్కడక్కడ ఉన్న తమ కులస్తులకు కూడా ఇచ్చేందుకు అంగీకరించరు. దీంతో ప్రతి ఇంట్లో మేనరికపు వివాహాలే. 200 కుటుంబాల్లో 90 శాతం ఇదే గ్రామంలోనే వివాహం చేసుకున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇది పూడ్చలేని నష్టం... తాము చేస్తున్న పనివల్ల పిల్లల భవిష్యత్తు బుగ్గిపాలవుతుందని తెలిసినా.. వారిలో మార్పు లేదు. పిల్లల ఆరోగ్యం కోసం ఎన్నో ఆస్పత్రులు తిరిగి ఆర్థికంగా చితికిపోయారు. కొందరు మేనరికం పెళ్లిళ్లు చేసుకోకపోయినా వారి పిల్లలకు అంగవైకల్యం వచ్చిందని.. మేనరికం కొంత కారణమైనా.. పూర్తిగా అదే కాదనేది మండూరు గ్రామస్తుల వాదన. మాజీ సర్పంచ్ ప్రకాశరావు మాట్లాడుతూ.. ‘ మా ఆచారం ఎవరికీ నష్టం కలిగించదు. ఇప్పటికీ మా గ్రామంలో ఏ ఇంటిలోనూ మాంసం వండరు. బయట మా సామాజిక వర్గం తక్కువగా ఉండడంతో అందరూ ఈ గ్రామంలోనే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే ఈ మేనరికం వివాహాలవల్లే వందలాది మంది భవిష్యత్తు నాశనమైంది. ఇది పూడ్చలేని నష్టం. ఇప్పుడు మేం ఎవరిపైనా ఆంక్షలు పెట్టడంలేదు. కులాంతర వివాహాలు అనుమతిస్తున్నాం. ఇప్పుడిప్పుడు చదువుకున్న పిల్లల్లో మార్పు వచ్చింది. కొన్ని కులాంతర వివాహాలు జరుగుతున్నాయి’ అని చెప్పుకొచ్చారు. మాటలు రాని సంతోష్‌తో అంధురాలైన తల్లి స్వర్ణలత అధికారులు, వైద్యసిబ్బంది ప్రయత్నాలు వృథా ఈ గ్రామస్తుల నమ్మకాన్ని మార్చేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కడప జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన చంద్రమౌళి, జాయింట్ కలెక్టర్ విజయలక్ష్మి లాంటి అధికారులు చైతన్య కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించేందుకు కృషి చేశారు. మేనరికపు పెళ్లిళ్లు వద్దనే విషయాన్ని అధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, జనవిజ్ఞాన వేదిక సభ్యులు పలుమార్లు వివరించారు. ఈ గ్రామంలో సుదీర్ఘ కాలంగా అవగాహన కల్పిస్తున్న హెల్త్ ఎడ్యుకేటర్ దేవిరెడ్డి రమణమ్మ పలు విషయాలు సాక్షితో పంచుకుంది. ‘అంగవైకల్యంతో పిల్లల జీవితాలు నాశనమవుతున్నా.. ఆచారానికే వారు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ఎంత అవగాహన కల్పించినా మడూరులో ఇప్పటికీ పెద్దగా మార్పు లేదు’ అని చెప్పుకొచ్చింది. బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న ప్రశాంత్ ఆ భయంతోనే మేనరికం మా సాతాను కులపోళ్లు చాలా తక్కువగా ఉంటారు. బయట మా కులపోళ్లు అందుబాటులో ఉండకపోవడంతో ఈ గ్రామంలోనే పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తోంది. పైగా బయట ఉన్న వారు మాంసం, మద్యం ముట్టుకుంటారనే భయం. దీంతో మా పిల్లలకు ఈ గ్రామంలోనే పెళ్లిళ్లు చేస్తున్నాం. మేనరికం పెళ్లిళ్ల వల్లే అంగవైకల్యం, బుద్ధిమాంద్యం అని డాక్టర్లు చెబుతున్నారు. దాంతో మావారిలోనూ మార్పు వస్తోంది –పి.రామానాయుడు, మడూరు మార్పు కోసం ప్రయత్నిస్తున్నాం మడూరులో చాలా కుటుంబాల్లో మేనరికపు పెళ్లిళ్లే.. దీనివల్లే పిల్లల్లో అనారోగ్యమని చెబుతూనే ఉన్నాం. ప్రస్తుతం కొంతమార్పు వచ్చి ంది. నాలుగైదేళ్లుగా గ్రామస్తులు బయట వివాహాలు చేసుకుంటున్నారు. – ఎం.రాజేశ్వరి, ఆశా వర్కర్ ఇటీవలి కాలంలో యువతలో మార్పు నాలుగైదేళ్లుగా గ్రామంలో కొంత మార్పు చోటుచేసుకుంది. యువతరంలో వస్తున్న అవగాహన వల్ల చదువుకున్న యువత కులాంతర వివాహాలకు మొగ్గు చూపుతున్నారు. గ్రామానికి చెందిన వెంకట నారాయణ, పల్లె ఎద్దుల కొండయ్య, పల్లె సూర్యనారాయణ, జి.రామానాయుడు, ఎ.రమేష్, పల్లె నవీన్, పల్లె శ్రేష్ఠ, ఎం.నాగలక్ష్మి తదితరులు ఉన్నత చదువులు చదివి డాక్టర్లయ్యారు. వీరు బయటి వారిని పెళ్లిళ్లు చేసుకున్నారు. చదువుకున్న యువత కులాంతర వివాహాలు చేసుకోవడంతో మేనరికపు పెళ్లిళ్లు తగ్గాయని గ్రామస్తులు చెబుతున్నారు. -
అందని పెళ్లి కానుక ..
సాక్షి, వరంగల్ రూరల్: ప్రతి ఆడపిల్లకు ఆసరాగా నిలుస్తామని, శుభలేకతోనే కల్యాణలక్ష్మి డబ్బులు అందజేస్తామని ప్రజాప్రతినిధులు చెప్పిన మాట నీటిమూటగానే మిగిలిపోతోంది. కల్యాణలక్ష్మి , షాదీ ముబారక్ పథకాలు లబ్ధిదారులకు అందడం లేదు. ఆడపిల్ల పెళ్లికి ప్రభుత్వం తరఫున రూ 1,00, 116 ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ఈ పథకాల కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలో సంబంధిత ఆర్డీఓలు ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్‌లను అందించాలి. నిధులు కేటాయింపులు లేకపోవడంతో గత కొన్ని రోజులుగా పంపిణీ జరగడంలేదు. దీనితో పాటు రెవెన్యూ యంత్రాంగం ఎన్నికల్లో బిజీగా ఉండడంతో జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఉన్నత స్థాయి అధికారులు శ్రద్ధ చూపితేనే పెండింగ్‌లో పథకాలకు మోక్షం కలుగనుంది. సకాలంలో అందని ఆర్థిక సాయం ఆడపిల్లల తల్లితండ్రులకు బాసటగా నిలువాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారు. ఈ పథకాల కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సకాలంలో డబ్బులు అందక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆన్లైన్లో దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా ఆర్థిక సహాయం రాకపోవడంతో ఎదురుచూపులు చూస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ మూబారక్కు పెళ్లికి ముందే దరఖాస్తు చేస్తే పెళ్లి నాటికి అందించాలని ప్రభుత్వ ఉద్దేశం. కానీ దాదాపు ఎక్కడ పెళ్లి నాటికి ఆర్థిక సాయం అందిన దాఖలాలు లేవు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం వస్తుంది కదా అని పెళ్లి కోసం అప్పులు చేస్తున్నారు. పెండింగ్‌లో 1720 దరఖాస్తులు కల్యాణలక్ష్మి, షాదీమూబారక్ దరఖాస్తులు జిల్లా వ్యాప్తంగా 1720 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కల్యాణలక్ష్మివి 1601, షాదీమూబారక్వి 119 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. నర్సంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో 567 కల్యాణలక్ష్మి, 18 షాదీమూబారక్, వరంగల్ రూరల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో కల్యాణలక్ష్మి 495, షాదీ ముబారక్ 64, పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలలో 539 కల్యాణలక్ష్మి, షాదీమూబారక్ 37 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. నిధుల కేటా యింపు లేకపోవడంతో సాయం అందడం లేదు. ఈ ఫొటోలో కనబడుతున్న మహిళది దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామం. అత్యంత నిరుపేద. కూలీకి పోతేగాని పూటగడవదు. ఈమెకు ఒక్కగానొక్క కూతురు శ్రీలత. కష్టపడి కూతురును డిగ్రీ చదివించింది. 21 సంవత్సరాలు పూర్తి కాగానే గత సంవత్సరం ఏప్రిల్ 27న పెళ్లి చేసింది. కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసింది. పలుమార్లు అధికారులు అడిగిన కాగితాలు అన్నీ ఇచ్చింది. ఏడాది గడిచింది. నేటికి ఒక్క పైసా రాలేదు. కళ్యాణలక్ష్మి డబ్బులు వస్తాయి కదా అని తెలిసిన వాళ్లను బతిమిలాడి అప్పు తెచ్చి బిడ్డకు వస్తువులు కొనిపెట్టింది. తెచ్చిన అప్పుపై ఇప్పటికే 20 వేల వడీ ్డకట్టింది. ఇప్పుడు కూతురు గర్భిణీ.. చేతిలో చిల్లిగవ్వ లేదు. పాలకులు, అధికారులు కనికరించి కల్యాణలక్ష్మి డబ్బు వచ్చేలా చూడాలని వేడుకుంటోంది. బడ్జెట్ రాగానే చెక్కులు అందిస్తున్నాం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కోసం వచ్చిన దరఖాస్తులన్ని పరిశీలిస్తున్నాం. బడ్జెట్ కేటాయించగానే వారికి వారికి ట్రెజరీ నుంచి చెక్కులను అందిస్తున్నాం. వెంటనే వెంటనే దరఖాస్తులను పరిశీలిస్తున్నాం. –రవి, ఆర్డీఓ, నర్సంపేట -
ఈడొచ్చిన కొడుకే ‘గుండెల మీద కుంపటి’!
ఈడొచ్చిన ఆడపిల్లను అమ్మానాన్నలు ‘గుండెల మీద కుంపటి’లా భావించే వారు. పెళ్లి చేసి, ఓ అయ్య చేతిలో పెట్టడం పెనుభారంగా పరిగణించే వారు. ఆడబిడ్డను కన్నవారికి అలాంటి గడ్డు రోజులకు కాలం చెల్లుతోంది. మగపెళ్లి వారి కోర్కెల కొండవీటి చేంతాడు జాబితాను చూసి జడుసుకునే అగత్యం గతంగా మారుతోంది. పెళ్లిళ్ల పేరయ్యలకు, మ్యారేజ్ బ్యూరోలకు వధువులకు వరులను వెతకడం సునాయాసం కాగా.. వరులకు వధువులను వెతకడానికి ప్రయాస పడాల్సి వస్తోంది. కారణం యువతుల సంఖ్య తగ్గిపోవడమే. వరకట్న దురాచారం దూరమై.. కన్యాశుల్కపు కాలం మళ్లీ వచ్చేలా ఉందన్న భావనా వ్యక్తమవుతోంది. రాయవరం (మండపేట): మ్యారేజ్ బ్యూరోలు, పెళ్లిళ్ల పేరయ్యల వద్ద ‘వధువు కావలెను’ అని వివరా లిచ్చే యువకుల జాబితా పెరిగిపోతోంది. కొడుకే పుట్టాలని ఇష్టదైవాలను కోరుకు న్న తల్లిదండ్రులు ఇప్పుడు వారిని ఓ ఇంటివారిని చేయడానికి మొక్కుకోవలసి వ స్తోంది. లింగ వివక్ష అయితేనేమి, ఇతర కారణాలైతేనేమి.. యువకుల సంఖ్యకు తగ్గ ట్టు యువతుల సంఖ్య పెరగక పోవడమే ఈ పరిణామానికి మూలం. ఒకప్పుడు త ల్లిదండ్రులు చూసిన వరుడితో తలవంచుకుని తాళి కట్టించుకునే అమ్మాయిలు ఇప్పు డు లేరు. అబ్బాయిలు రాజీ పడినా..చదువుకున్న అమ్మాయిలు నో అంటున్నారు. అమ్మాయి అభిప్రాయం కనుక్కుందురూ.. ఒకప్పుడు పెళ్లి చూపుల్లో మగపెళ్లివారు రకరకాల యక్షప్రశ్నలు వేసి అమ్మాయి సహనాన్ని పరీక్షించేవారు. ఇప్పుడు రోజులు మారాయి. అమ్మాయి, ఆమె కుటుంబం బాగుంటే చాలు. ఆస్తిపాస్తులు ఇవ్వనవసరం లేదంటున్నారు. అమ్మాయికి ‘నేను నచ్చానో లేదో.. ఒకసారి అడగండి’ అంటున్నాడు వరుడు. అవసరమైతే కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటామని, లాంఛనాలు అడగబోమని అంటున్నారు అధిక శాతం అబ్బాయిల తల్లిదండ్రులు. లింగ వివక్షతో అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడం, వారిలో చాలా మంది విద్యావంతులు కావడం సమస్యకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. గతంలో వైద్యవృత్తి, ఫార్మసీ, డెంటల్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీఎస్సీ అగ్రికల్చర్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, ఇంజనీరింగ్ వంటి కోర్సులను కేవలం కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే చదివేవారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ వృత్తి విద్యా కోర్సులు చదువుతున్నారు. ఇందుకు అనుగుణంగా కళాశాలల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. బాలికల తల్లిదండ్రులు కూడా విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. యూకేజీ నుంచి డిగ్రీ వరకూ వేల నుంచి లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా విద్య, ఉద్యోగాల్లో అమ్మాయిలే రాణిస్తున్నారు. పెరిగిన వివాహ వయస్సు.. ఒకప్పుడు అమ్మాయికి 16 వచ్చీ రాగానే పెళ్లి చేసేవారు. ఇప్పుడు 25 సంవత్సరాల వరకూ ఆ ప్రస్తావన ఎత్తడం లేదు. చదువుకున్న కుటుంబాల్లో ఇది ఎక్కువగా ఉంది. అమ్మాయిలు తగిన ఉద్యోగాల్లో స్థిరపడే వరకూ ఆగడం, వారికి, వారి ఆకాంక్షలకు తగ్గ అబ్బాయి లభించక పోవడం ఇందుకు కారణంగా పలువురు తల్లిదండ్రులు చెబుతున్నారు. అబ్బాయిలు సైతం ఒకప్పుడు 20 ఏళ్లు వచ్చే లోపు పెళ్లి చేసుకునే వారు. కానీ వారు కూడా ఇప్పుడు 30 ఏళ్ల దాకా పెళ్లి మాట ఎత్త వద్దంటున్నారు. బాగా వెనుకబడిన ప్రాంతాలు, గ్రామాల్లో కొన్ని కుటుంబాల్లో మాత్రమే చిన్న వయస్సులో వివాహాలు జరుగుతున్నాయి. పట్టణాలు, చదువుకున్న కుటుంబాల్లో మాత్రం అధిక శాతం వివాహాలు ఆలస్యంగా జరుగుతున్నట్లు మ్యారేజ్ బ్యూరోల వారు చెబుతున్నారు. డిమాండ్ చేసే స్థితిలో యువతులు ఉన్నత చదువులు చదివిన; ప్రొఫెషనల్ కోర్సులు చేసిన అమ్మాయిలు సాదాసీదాగా డిగ్రీ, ఇంటర్ చదివిన అబ్బాయిలను ఇష్టపడడం లేదు. అబ్బాయి ఎంతగా ఆస్తిపరుడైనా ప్రొఫెషనల్ కోర్సు చేసి ఉండాలని కోరుకుంటున్నారు. తమ డిమాండ్లను, కోరికలను మ్యారేజ్ బ్యూరోల ముందు ఉంచుతున్నారు. మరో వైపు అబ్బాయిలకు చదువుకు తగ్గ ఉద్యోగాలు లభించక పోవడంతో పలువురు వ్యాపారాల వైపు, వృత్తి విద్యా కోర్సుల వైపు దృష్టి మళ్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మాయిల కోరికలకు తగ్గట్టు అబ్బాయిలు లభించడం లేదని మ్యారేజ్ బ్యూరో నిర్వాహకుడు కె.శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. ఉన్నత విద్యనభ్యసించి, కొలువులు చేస్తున్న అమ్మాయిలు.. జీవిత భాగస్వామిగా ప్రభుత్వోద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వైద్యులు కావాలని అమ్మాయిలు కోతున్నారు. ఒక్కడే కుమారుడై ఉండాలని, అత్తామామలు లేకుంటే మరీ మేలని అనే వారూ ఉంటున్నారని మరో మ్యారేజ్ బ్యూరో నిర్వాహకుడు నాగేశ్వరరావు తెలిపారు. దీంతో అబ్బాయిలు తమ కోర్కెల చిట్టా విప్పడం అటుంచి, చేసుకోవడానికి అమ్మాయి దొరికితే అదే పదివేలనే స్థితికి వస్తున్నారు. లింగ వివక్షతో తగ్గిన ఆడబిడ్డలు! ఆడపిల్లను కంటే చదివించడం, పెద్ద చేయడం, సంరక్షించడం, పెళ్లి చేయడం భారంగా కొంతమంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీంతో చట్టవిరుద్ధమైనా గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయించి, ఆడబిడ్డయితే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. యువతీ, యువకుల నిష్పత్తిలో తేడా పెరగడానికి ఇదో ప్రధాన కార ణం. సమాజానికి భావితరాన్ని అందించే బృహత్తర భారాన్ని మోసే స్త్రీ విలువను గు ర్తించని సంస్కార రాహిత్యం, యువతులకు భద్రత లేని వాతావరణం కూడా ఆడపిల్లలు వద్దనుకోవడానికి కారణాలు. ఆడబిడ్డలు ఎంత అపురూపమో, ఎంత అమూల్య మో చాటుతూ ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నా; భ్రూణహత్యల నిరోధానికి కఠిన చ ట్టాలు చేస్తున్నా.. సమాజంలో అత్యధికుల దృక్పథంలో మార్పు రావాలి. అప్పుడే పు ట్టబోయే బిడ్డ ఆడైనా, మగైనా.. తమ బతుకుతోటకు వసంతం వచ్చినట్టేననుకుంటారు. -
ఏపీ అసెంబ్లీకి ‘పెళ్లి’ సెలవులు
సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీకి ‘పెళ్లి’ సెలవులు ప్రకటించారు. గురువారం నుంచి శనివారం వరకు వరుసగా ముహూర్తాలున్నాయని, బంధువుల ఇళ్లలో శుభకార్యాలకు హాజరుకావాల్సి ఉన్నందున సెలవులు ప్రకటించాలని బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్‌రాజుతో పాటు పలువురు టీడీపీ సభ్యులు బుధవారం అసెంబ్లీ జీరో అవర్‌లో డిమాండ్ చేశారు. 23, 24, 25 తేదీల్లో వరుసగా పలు పెళ్లిళ్లకు హాజరుకావాల్సి ఉన్నందున అసెంబ్లీ సమావేశాలకు విరామం ప్రకటించాలని విష్ణుకుమార్ రాజు కోరారు. దీనికి అధికార పక్ష సభ్యులంతా బల్లలు చరుస్తూ మద్దతు తెలిపారు. అనంతరం అధికార పార్టీ సభ్యులు వరదాపురం సూర్యనారాయణ, డి.నరేంద్ర, శ్యామ్ సుందర్ శివాజీ, గద్దె రామ్మెహన్‌రావు కూడా అసెంబ్లీకి మూడు రోజులు సెలవులివ్వాలని డిమాండ్ చేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు స్పందిస్తూ.. సభ్యుల మనోభావాలను అర్థం చేసుకున్నామని చెప్పారు. ప్రధానంగా విష్ణుకుమార్ రాజు సెలవు ఇవ్వాలని కోరినప్పుడే మంత్రులు తప్ప మిగతా సభ్యులందరూ బల్లలు చరిచి మద్దతు తెలిపారన్నారు. 23, 24, 25 తేదీల్లో సమావేశాలకు విరామం ప్రకటించేందుకు ప్రభుత్వానికి అభ్యంతరం లేదన్నారు. అనంతరం పోలవరంపై సీఎం సమాధానం పూర్తయిన తర్వాత స్పీకర్ కోడెల శివప్రసాదరావు మూడు రోజులు విరామం ప్రకటిస్తూ సభను 27వ తేదీకి వాయిదా వేశారు. 27 నుంచి మరో వారం రోజుల పాటు సమావేశాలు కొనసాగుతాయని ప్రకటించారు. -
ఆ వివాహాలపై అనుసరిస్తున్న విధానమేంటి?
సాక్షి, హైదరాబాద్: పేద ముస్లిం యువతుల ఆర్థిక నేపథ్యాన్ని ఆసరాగా తీసుకుని వృద్ధ అరబ్ షేక్‌లు వారిని వివాహం చేసుకుంటున్న ఘటనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో హైకోర్టు ఈ విషయంపై దృష్టి సారించింది. విదేశీయులతో ముఖ్యంగా అరబ్ షేక్‌లతో జరిగే వివాహాల విషయంలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం ఏమిటో తెలపాలని కేంద్రప్రభుత్వంతోపాటు ఇరు రాష్ట్రాల మైనారిటీ సంక్షేమ శాఖలు, వక్ఫ్‌బోర్డ్‌లను ఆదేశించింది. చట్టంలో ఉన్న లోపాల్ని అడ్డంపెట్టుకుని వివాహాలు జరిపించే సమయంలో జరుగుతున్న దుర్వినియోగం, దోపిడీని అడ్డుకునేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో కూడా తెలపాలని కోరింది. ఇందులో భాగంగా కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖతోపాటు తెలంగాణ మైనారిటీ సంక్షేమశాఖ, తెలంగాణ వక్ఫ్‌బోర్డులను ప్రతివాదులుగా చేర్చింది. ప్రస్తుతమున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని యాప్‌ల ద్వారా వివాహాల్ని రిజిస్టర్ చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వక్ఫ్‌బోర్డులు వాటి రికార్డులను నిర్వహించవచ్చునంటూ.. తద్వారా వివాహాల రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని సమర్థంగా ఉపయోగించుకునే వీలుంటుందని అభిప్రాయపడింది. తాము కోరిన వివరాల్ని తదుపరి విచారణ నాటికి తమ ముందుంచాలని కేంద్రం, ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు, వక్ఫ్‌బోర్డులను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. -
వివాహలకు బియ్యం పంపిణీ
చందుపట్ల(భువనగిరి అర్బన్) : పలు గ్రామాల్లోని పేద రైతుల కుమార్తెల వివాహాలకు చందుపట్ల పీఏసీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. మండలంలోని చీమలకొండూరు గ్రామానికి చెందిన మొలుగు రాములు కుమార్తె, ముస్త్యాలపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ వహిద్‌అలీ కుమార్తె, వీరవెల్లి గ్రామానికి చెందిన ఆముదాల నరేందర్‌రెడ్డి కుమార్తె, చందుపట్ల గ్రామానికి చెందిన దరకంటి చంద్రయ్య కుమార్తెల వివాహలకు ఒక్కొక్క రైతు కుటుంబానికి 100 కేజీల బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు బల్గూరి మధుసూదన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ఆర్. భిక్షపతి, సీఈఓ దంతూరి నర్సింహ, డైరెక్టర్లు నీల పార్వతమ్మ, బిజ్జాల వెంకటే శ్వర్లు, అంగడి బుచ్చయ్య, నల్ల ఎల్లయ్య, లక్ష్మారెడ్డి, చిన్నం రాములు, పాపిరెడ్డి, సిబ్బంది నర్సింహ, రాములు ఉన్నారు.