సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీకి ‘పెళ్లి’ సెలవులు ప్రకటించారు. గురువారం నుంచి శనివారం వరకు వరుసగా ముహూర్తాలున్నాయని, బంధువుల ఇళ్లలో శుభకార్యాలకు హాజరుకావాల్సి ఉన్నందున సెలవులు ప్రకటించాలని బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్‌రాజుతో పాటు పలువురు టీడీపీ సభ్యులు బుధవారం అసెంబ్లీ జీరో అవర్‌లో డిమాండ్ చేశారు. 23, 24, 25 తేదీల్లో వరుసగా పలు పెళ్లిళ్లకు హాజరుకావాల్సి ఉన్నందున అసెంబ్లీ సమావేశాలకు విరామం ప్రకటించాలని విష్ణుకుమార్ రాజు కోరారు. దీనికి అధికార పక్ష సభ్యులంతా బల్లలు చరుస్తూ మద్దతు తెలిపారు.
అనంతరం అధికార పార్టీ సభ్యులు వరదాపురం సూర్యనారాయణ, డి.నరేంద్ర, శ్యామ్ సుందర్ శివాజీ, గద్దె రామ్మెహన్‌రావు కూడా అసెంబ్లీకి మూడు రోజులు సెలవులివ్వాలని డిమాండ్ చేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు స్పందిస్తూ.. సభ్యుల మనోభావాలను అర్థం చేసుకున్నామని చెప్పారు. ప్రధానంగా విష్ణుకుమార్ రాజు సెలవు ఇవ్వాలని కోరినప్పుడే మంత్రులు తప్ప మిగతా సభ్యులందరూ బల్లలు చరిచి మద్దతు తెలిపారన్నారు. 23, 24, 25 తేదీల్లో సమావేశాలకు విరామం ప్రకటించేందుకు ప్రభుత్వానికి అభ్యంతరం లేదన్నారు. అనంతరం పోలవరంపై సీఎం సమాధానం పూర్తయిన తర్వాత స్పీకర్ కోడెల శివప్రసాదరావు మూడు రోజులు విరామం ప్రకటిస్తూ సభను 27వ తేదీకి వాయిదా వేశారు. 27 నుంచి మరో వారం రోజుల పాటు సమావేశాలు కొనసాగుతాయని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment