పెద్దపల్లి: రామగుండం ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీకి చెందిన పాన్‌షాప్ నిర్వాహకుడు వరంగల్ జిల్లాకు చెందిన ఓ యువతి మాయలో పడి మోసపోయాడు. అప్పటికే మూడు పెళ్లిల్లు చేసుకున్న మాయ లేడీ ఇక్కడి యువకున్ని మోసం చేసి డబ్బు, బంగారంతో పరారైంది. దీంతో బాధితుడు ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల వివరాలు.. ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీకి చెందిన రేవంత్‌కు అప్పటికే పెళ్లి జరిగి విడాకులయ్యాయి. అయితే ఓ షాదీ డాట్ కామ్ ద్వారా యువతి పరిచయమైంది.
ఆ పరిచయం సెల్ ఫోన్లలో ముచ్చట్లు.. తర్వాత పెళ్లి వరకు వచ్చింది. ఇదే మొదటి పెళ్లి అంటూ సదరు యువతి నమ్మించింది. దీంతో రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు పెళ్లి కుదిర్చారు. వెంటనే ఎన్టీపీసీలోని చిలుకలయ్య ఆలయంలో సాదాసీదాగా వివాహం చేసుకుని కొత్త కాపురం ప్రారంభించారు. ఇక లేడీ తన కిలాడీల ప్రదర్శన ప్రారంభించింది. తనకు మందు, సిగరేట్లు కావాలంటూ యువకున్ని నిత్యం వేధింపులకు గురిచేసింది. ఇద్దరి మధ్య గొడవలు మొదలై రెండు నెలలు గడిచాయి.
ఈక్రమంలో యువతి తన అక్క వద్దకు వెళ్తున్నానని ఇంట్లో ఉన్న రూ.70వేల నగదు, 4 తులాల బంగారు ఆభరణాలతో బిచానా ఎత్తేసింది. రోజులు గడుస్తున్నా తిరిగి రాకపోవడంతో యువకుడు ఆమె బంధువులు, మిత్రుల వద్ద ఆరా తీయడంతో అసలు విషయాలు బయటపడ్డాయి. అప్పటికే మూడు పెళ్లిలు అయ్యాయని, చాలా మందితో పరిచయాలు ఉన్నాయని తెలుసుకున్నాడు. చివరకు చిరునామా తెలుసుకుని వెళ్లడంతో సదరు యువతి తన మిత్రులతో విందు విలాసాలతో కనిపించింది. ఏకంగా వారందరూ పాన్‌షాప్ యువకుడిపై దాడి చేసి, వాటిని వీడియో తీశారు.
ఈ వీడియోలు సదరు యువతి మిత్రులు సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు గురిచేశారు. అంతేగాకుండా యువకుడి కుటుంబసభ్యులను సైతం డబ్బుల కోసం డిమాండ్ చేశారు. దీంతో యువకుడు ఎన్టీపీసీ పోలీసులను ఆశ్రయించి గోడు వెల్లబోసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
యువతి కోసం గాలిస్తున్నాం
పెండ్లి చేసుకుని నగదు, బంగారు ఆభరణాలతో వెళ్లి ఫోన్ స్విచాఫ్ చేసిందని బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఆమె కోసం గాలిస్తున్నాం. చీటింగ్ కేసు నమోదు చేశాం. ఇటీవల హైదరాబాద్‌లో ఉందన్న సమాచారంతో వెళ్లినా ఆచూకీ దొరకలేదు. ఆమె పట్టుబడితే పూర్తి విషయాలు తెలిసే అవకాశాలున్నాయి.
– బి.జీవన్, ఎస్సై, ఎన్టీపీసీ
న్యాయం చేయండి..
పెండ్లి పేరుతో నన్ను ఆమె మోసం చేసింది. మా ఇంటి నుంచి నగదుతో పాటు బంగారం తీసుకెళ్లింది. ఆమెతో పాటు ఆమె స్నేహితుల నుంచి నాకు ప్రాణ భయం ఉంది. నాకు న్యాయం చేయాలి. – రేవంత్, ఎన్టీపీసీ రామగుండం
Comments
Please login to add a commentAdd a comment