శ్రావణం వరకు ఆగాల్సిందే..
గురు, శుక్ర మూఢాలతో వివాహాలకు బ్రేక్
మళ్లీ ఆగస్టులోనే శుభ ముహూర్తాలు
సెప్టెంబర్ 4 నుంచి అక్టోబర్ 3 వరకూ శూన్యమాసం
మహారాణిపేట: పెళ్లిబాజా మోగాలంటే శ్రావణం వరకూ ఆగాల్సిందే. ఏప్రిల్ 28 నుంచి వరసగా మూఢమి రావడంతో శుభకార్యాలకు ఆటంకం కలిగింది. అప్పటి నుంచి వివాహాలు, ఉపనయనాలు, గృహ ప్రవేశాల వంటివన్నీ నిలిచిపోయాయి. మళ్లీ ఆగస్టులో వచ్చే శ్రావణంలో మూడుముళ్లకు మంచి ముహూర్తాలు ఉన్నాయి.
క్రోధి నామ సంవత్సరంలో ఏప్రిల్ 9 తేదీ నుంచి ముహూర్తాలు ప్రారంభమయ్యాయి. 26వ తేదీ(చైత్ర మాసం) వరకూ మంచి ముహూర్తాలు ఉండటంతో జిల్లా వ్యాప్తంగా వేలాది శుభకార్యాలు జరిగాయి. ఆ తర్వాత ఏప్రిల్ 28వ తేదీ (చైత్ర చవితి) నుంచి జూలై 8వ తేదీ (ఆషాఢ శుద్ధ తదియ) వరకూ శుక్ర మౌఢ్యమి (మూఢం) నడుస్తోంది. దీంతో ఆయా రోజుల్లో ముహూర్తాలు లేక శుభకార్యాలు ఆగిపోయాయి. అలాగే మే 7వ తేదీ (చైత్ర బహుళ చతుర్దశి) నుంచి జూన్ 7వ తేదీ వరకూ గురు మౌఢ్యమి నడిచింది. వరుసగా గురు, శుక్ర మౌఢ్యములు రావడంతో రెండు నెలలుగా శుభ కార్యాలకు ఆటంకం ఏర్పడింది.
ఆషాఢంలో కూడా ముహూర్తాల్లేవ్..
జూలై 6వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు ఆషాఢమాసం ఉంటుంది. ఇది శూన్యమాసం. మొత్తం మీద ఏప్రిల్ 28 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు పెళ్లి బాజాలు మోగే అవకాశం లేదని పురోహితులు చెబుతున్నారు. మూఢంలోని మంచిరోజుల్లో అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణం, నూతన వ్యాపారాల ప్రారంభోత్సవాలు, సీమంతాలు, రిజిస్ట్రేషన్ల వంటి పనులు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 4వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకూ భాద్రపదం కూడా శూన్యమాసం కావడంతో ఆ నెలలోనూ వివాహాల ముహూర్తాలు ఉండవు. దీంతో శుభముహూర్తాలకు ఆగస్టు వేదిక కాబోతోంది. ఆగస్టులో వచ్చే శ్రావణమాసంలో దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి.
ఉపాధికి గండి..
కొన్ని రోజులుగా వివాహ ముహూర్తాలకు మూఢాలు అడ్డంకి మారాయి. దీంతో వందలాది మంది ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. కేవలం శుభకార్యాలపైనే ఆధారపడి ఎన్నో వృత్తులవారు జీవనం సాగిస్తున్నారు. కల్యాణ మండపాలు, కేటరింగ్, వంటవాళ్లు, పురోహితులు, ఫొటో, వీడియో గ్రాఫర్లు, ట్రావెల్స్, అద్దె కార్లు, బస్సులు, మినరల్ వాటర్, ఈవెంట్ మేనేజ్‌మెంట్లు, పూలు, డెకరేషన్స్, లైటింగ్, కూరగాయలు, కిరాణ, వస్త్రదుకాణాలు, బంగారు, వెండి వ్యాపారాలు, టెంట్ హౌస్‌లు, మాంసపు దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జీలు, సాంస్కృతిక కళాకారులు తదితర వారికి పనిలేకుండా పోయింది. మరెంతో మంది రోజువారీ కూలీలకూ ఉపాధి కొరవడింది. అడపాదడపా చిన్న చిన్న ఫంక్షన్లు వస్తున్నా... పెళ్లిళ్లు అయితేనే తమకు గిట్టుబాటు అవుతుందని ఆయా వర్గాల వారు చెబుతున్నారు. శ్రావణం వరకు ఎదురు చూడాల్సిందేనని పేర్కొంటున్నారు.
శ్రావణంలో దివ్యమైన ముహూర్తాలు
వరసగా ముఢాలు రావడంతో శుభకార్యక్రమాలకు బ్రేక్ పడింది. ఆగస్టు 5వ తేదీ నుంచి మంచి రోజులు వస్తున్నాయి. 8వ తేదీ నుంచి ముహూర్తాలు ఉన్నాయి. మళ్లీ భాద్రపద మాసం శూన్య మాసం కావడంతో ఎలాంటి ముహూర్తాలు లేవు. మళ్లీ అక్టోబర్ 3వ తేదీ తర్వాత ముహూర్తాలు ఉన్నాయి.
– వెలవలపల్లి కోటేశ్వర శర్మ, వేదపండితులు, యజ్ఞశ్రీ జోతిష్యాలయం, మునగపాక
Comments
Please login to add a commentAdd a comment