ప్రతీకాత్మక చిత్రం
సౌజన్య (పేరు మార్చడమైనది)కు మాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా పెళ్లి సంబంధం వచ్చింది. విదేశాలలో ఉన్న పెళ్లికొడుకు స్వదేశానికి త్వరలో వస్తున్నానని చెప్పాడు. సౌజన్య చాలా సంతోషించింది. నెల రోజులుగా వాట్సప్ చాట్‌ల ద్వారా ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆధునిక దుస్తుల్లో కనిపించాలని కోరాడు పెళ్లికొడుకు. నమ్మిన సౌజన్య అతను ‘చెప్పినట్టు’ చేసింది. దానిని రికార్డ్ చేసిన పెళ్లికొడుకు ఆ వీడియోను అశ్లీల వెబ్‌సైట్‌లో పెట్టాడు. ఆ తర్వాత అతను తన ఆన్‌లైన్ అకౌంట్స్ అన్నీ బ్లాక్ చేశాడు. మోసపోయిన విషయం అర్ధమైన సౌజన్య ఆత్మహత్యే శరణ్యం అనుకుంది.
∙∙
కీర్తన (పేరు మార్చడమైనది) పేరుతో ఫేస్‌బుక్‌లో ఫేక్ ఐడీ సృష్టించబడినట్టు తెలిసింది. దాని ద్వారా తనను వేధిస్తున్నవారి ఆటకట్టించాలనుకుంది. కానీ, ఎలాగో తెలియలేదు.
∙∙
సుందర్ (పేరు మార్చడమైనది) ఏడాది క్రితం సేంద్రీయ ఆహార ఉత్పత్తుల సంస్థకు యజమాని అయ్యాడు. చిన్న సంస్థే అయినా ఇప్పుడిప్పుడే లాభాలు అందుతున్నాయి. తన సంస్థ ఉత్పత్తులు మంచివి కావని, తనకు నష్టం కలిగించే ప్రకటనలు ఆన్‌లైన్‌లో చూసి షాకయ్యాడు.
∙∙
ఈ డిజిటల్ కాలంలో అపరిచత వ్యక్తుల నుంచి రకరకాల మోసాలకు లోనయ్యేవారి శాతం రోజు రోజుకూ పెరుగుతోంది. కరోనా కాలాన్ని ఉపయోగించుకొని మరింతగా సైబర్ నేరాలు పెరిగాయి. ఈ నేరాలలో పిల్లలు, మహిళలు ఎక్కువశాతం మోసానికి గురవుతున్నారు. అదేవిధంగా రకరకాల యాప్‌లు వచ్చి, డబ్బు దోపిడీ కూడా జరుగుతోంది. మోసం జరగకుండానే ముందస్తు జాగ్రత్తపడటం ఒక ఎత్తయితే, మోసపోయామని తెలిసినా తమని తాము రక్షించుకోవడం ఎలాగో ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం అవసరం.
ఫిర్యాదు చేయడం ఎలా?
మొబైల్ లేదా కెమెరా వాడకంతో పిల్లలను, స్త్రీలను వారి వ్యక్తిగత, అశ్లీల చిత్రాలు, వీడియోలను తీసి, ఆన్ లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా చూపినా, డిజిటల్ టెక్నాలజీ ద్వారా బాధితులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నా, ఒక వ్యక్తి లేదా సంస్థ యొక్క డేటా, ఆర్థిక సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం ద్వారా దొంగిలించినా, వ్యక్తిగత సమాచారం లేదా డేటాను పొందడానికి, డబ్బు లేదా పరువును కోల్పోయేవిధంగా మోసపూరిత ప్రయత్నం చేసినా, నెట్‌వర్క్‌ను దోపిడీ చేసే హ్యాకింగ్ ప్రక్రియకు పూనుకున్నా.. ఇలా ఏ డిజిటల్ మోసానికైనా సరైన ముందు https://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయడం.
ఆన్‌లైన్ మార్గాలలో ఆర్థిక నష్టం జరిగితే https://cyberpolice.nic.in లో ఫిర్యాదు చేయాలి. దీనినే సిటిజన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అంటారు. పై రెండు పోర్టల్స్‌కి 15526 హెల్ప్‌లైన్ నెంబర్ అనుసంధానమై ఉంటుంది. దీనికి ఆర్‌బిఐ ఆమోదించిన అన్ని బ్యాంకులు అనుసంధానమై ఉంటాయి కాబట్టి ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అకౌంట్ల తక్షణ నగదు లావాదేవీలను నిలిపి వేసి, మీ డబ్బును సురక్షితం చేస్తాయి. ఈ హెల్ప్‌లైన్ నెంబర్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. మీ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫోన్ నెంబర్‌ను నమోదు చేసి, వచ్చిన ఓటీపీ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. అందులో..
(1) చైల్డ్ పోర్నోగ్రఫీ (2) పిల్లల లైంగిక వేధింపులు (3) అసభ్యకరమైనవి, లైంగికపరమైనవి
(జీజీ) ఇతర సైబర్ నేరాలు (1) మొబైల్ నేరాలు (2) సోషల్ మీడియా నేరాలు (3) ఆన్ లైన్ ఆర్థిక మోసాలు (4) సైబర్ ట్రాఫికింగ్ (5) హ్యాకింగ్... కి సంబంధించిన అంశాలు ఉంటాయి.
ఫిర్యాదు చేసే ప్రక్రియ ఆఫ్‌లైన్ – ఆన్ లైన్ రెండు విధానాల్లో ఉంటుంది.
సంఘటన ఏవిధంగా జరిగిందో తెలియజేయడానికి: (ఎ) కమ్యూనికేషన్ మోడ్ అంటే ఇంటర్నెట్, వాట్సాప్ .. ఏ విధానంలో అనేది తెలియజేయాలి.
(బి) తేదీ – సమయం (సి) ప్లాట్‌ఫారమ్ (ఇంటర్నెట్, వాట్సాప్ మొదలైనవి) . (డి) ఆర్థిక మోసాలకు సంబంధించిన ఆధారాలు అప్‌లోడ్, పేమెంట్‌లు / బ్యాంక్ స్టేట్‌మెంట్‌ల స్క్రీన్‌షాట్లు. వేధింపులకు గురిచేసేవారి సంబంధిత స్క్రీన్ షాట్‌లు, ఫొటో, ఆడియో, వీడియో మొదలైనవి జత చేయాలి.
అనుమానితుల వివరాలు (అందుబాటులో ఉంటే): (ఎ) అనుమానితుని పేరు (బి) గుర్తింపు (మొబైల్, ఇమెయిల్) (సి) ప్రదేశం.. మొదలైనవి)
ఫిర్యాదుదారుల వివరాలు:
(ఎ) పూర్తి పేరు – సహాయక వివరాలు (తండ్రి, జీవిత భాగస్వామి, గార్డియన్ మొదలైనవి)
(బి) ఇమెయిల్ / ఫోన్ నంబర్ (సి) చిరునామా – ఐడీ ప్రూఫ్ (ఆధార్ మొదలైనవి)
ఫిర్యాదును దాఖలు చేయడానికి దశల వారీ ప్రక్రియ ద్వారా వివరంగా తెలియజేయాలి.
సత్వర స్పందన కోసం సమీప సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. డిజిటల్‌గా మోసం ఎలా జరిగినా పోలీసులు, పోర్టల్, హెల్స్‌లైన్.. ఆపద్భాంధువుల్లా ఉన్నారనే విషయాన్ని విస్మరించరాదు.
– అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్‌బీయింగ్
ఎక్స్‌పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్
Comments
Please login to add a commentAdd a comment