matrimonial websites
-
యువతితో పరిచయం.. వాట్సాప్ చాటింగ్‌తో నమ్మించి..
సాక్షి, హైదరాబాద్: ఓ మాట్రిమోనియల్ సైట్ ద్వారా నగర యువతికి పరిచయమై తాను లండన్‌లో ఉంటున్నానని నమ్మించి రూ.10.65 లక్షలు కాజేసిన నేరగాడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆఫ్రికాకు చెందిన కాబ్రెల్ ఎడ్మాండో కొన్నేళ్ల క్రితం జాబ్ వీసాపై ఢిల్లీకి వచ్చాడు. అక్కడి ద్వారక ప్రాంతంలో నివసిస్తూ పుణేకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. ఓ సెలూన్లో బార్బర్‌గా పని చేస్తున్న ఇతగాడు ప్రత్యేకించి ఆఫ్రికన్లు, నైజీరియన్లకు మాత్రమే క్షవరం చేసేవాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించిన ఇతగాడు సైబర్ నేరాలకు తెరలేపాడు. మాట్రిమోనియల్ సైట్లో నకిలీ వివరాలు, ఫొటోతో రిజిస్టర్ చేసుకున్నాడు. అదే సైట్లో రిజిస్టరై ఉన్న ఓల్డ్ బోయిన్పల్లి యువతికి లండన్‌లో ఉంటున్న కృష్ణకుమార్‌గా పరిచయమయ్యాడు. ఈమె వితంతువు కావడంతో తాను వివాహం చేసుకుంటానని అన్నాడు. కొన్నాళ్లు వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసుకున్నాక కలవడానికి వస్తున్నట్లు చెప్పాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులుగా కొందరి నుంచి యువతికి ఫోన్లు వచ్చాయి. కృష్ణకుమార్ అనే వ్యక్తి భారీగా పౌండ్లు తీసుకుని లండన్ నుంచి వచ్చాడని, అలా తీసుకురావడం నిబంధనలకు విరుద్ధం కావడంతో అదుపులోకి తీసుకున్నామని నమ్మించారు. కృష్ణకుమార్‌ను వదలాలంటే పన్నులు కట్టాలని రూ.10.65 లక్షలు కాజేసి మోసం చేశారు. బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ సీహెచ్ గంగాధర్, ఎస్సై శాంతరావులతో కూడిన బృందం నిందితుడిని గుర్తించి ఢిల్లీలో అరెస్టు చేసింది. పీటీ వారెంట్‌పై శుక్రవారం నగరానికి తీసుకువచ్చి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. చదవండి: బాబాయ్ అంటే భయం.. అదే అలుసుగా తీసుకుని మూడు రోజులుగా.. -
తండ్రి కూతురికి సరిపోయే మ్యాచ్ తీసుకువస్తే...ఆమె ఏం చేసిందో తెలుసా?
Matrimonial sites are platforms designed to match: ఇటీవల కాలంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా తమ పిల్లలకు తగిన సంబంధాలను వెతుకుతున్నారు. ఈ మధ్య కాలంలో అలా ఒకటైన జంటలు కోకొల్లలు. అదేవిధంగా మ్యాటిమోని సైట్ల ద్వారా మోసపోయిన ఉదంతాలు ఉన్నాయి. ఏంటి ఇదంతా అనుకోకండి ఇక్కడొక తండ్రి ఎంతో ఆశతో తన కూతురుకి సరిపోయే వరుడి వివరాలు పంపిస్తే ఆమె ఏం చేసిందో తెలుసా? వివరాల్లోకెళ్తే....ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తగిన మంచి సంబంధాలను వెతికి తీసుకువ్చి మరీ పెళ్లిళ్లు చేస్తుంటారు. తమ పిల్లలు మంచి వ్యక్తులను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనే తల్లిదండ్రులు కోరుకుంటుంటారు. ఇది సర్వసాధారణం. పాపం బెంగుళూరులోని ఓ తండ్రి అలానే భావిస్తాడు. ఈ మేరకు అతను తన కూతురుకి తగిన వరుడుని మాట్రిమోనియల్ సైట్లలో వెతికి మరీ అతని వివరాలను వాట్సాప్ ద్వారా పంపించాడు. ఐతే ఆమె తన తండ్రికి ఊహించని షాక్ ఇచ్చింది. మాట్రిమోనియల్ సైట్లలో ప్రోఫెల్లో సదరు వ్యక్తుల పూర్తి సమాచారం ఉండటం సహజం. ఆమె అతని ప్రోఫెల్ చూసి ముచ్చటపడి ఉద్యోగం ఇచ్చింది. ఇంతకీ ఆమె బెంగళూరులోని స్టార్ట్ అప్ కంపెనీ సహ వ్యవస్థాపకురాలు ఉదితా పాల్. అంతేకాకుండా తన తండ్రికి ఆ వ్యక్తికి లావదేవీలను సులభతరం చేసే ఫిన్టెక్లో ఏడేళ్ల అనుభవం ఉండటం వల్ల తన స్టార్టప్ కంపెనీలో ఉద్యోగం ఇచ్చానని అందువల్ల తనను క్షమించమని తండ్రికి సందేశం పంపింది. వాస్తవానికి చూసిన ప్రతీ సంబంధం కుదరకపోవచ్చు గానీ ఇలా ఆమె ఆ వ్యక్తికి ఉద్యోగం ఆఫర్ ఇచ్చిన తీరు ఆమెకు తన కెరీయర్ పట్ల ఉన్న నిబద్ధత తెలియజేస్తోంది. ఈ మేరకు ఉదితా పాల్ తనకు తన తండ్రికి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణను స్క్రీన్ షాట్ తీసి మరీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వాట్సాప్ సంభాషణ ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. What getting disowned from father looks like. pic.twitter.com/nZLOslDUjq — Udita Pal 🧂 (@i_Udita) April 29, 2022 (చదవండి: పెళ్లి తంతులో దంపతులు రచ్చ... షాక్‌లో బంధువులు) -
న్యూయార్క్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని.. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నానని చెప్పి..
ఒంగోలు: పెళ్లి సంబంధం పేరుతో యువతి, ఆమె తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి రూ.17 లక్షలకు పైగా గుంజేసిన వ్యక్తిని ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను జిల్లా ఎస్పీ మలికాగర్గ్ శనివారం మీడియాకు చె ప్పారు. తూర్పుగోదావరి జిల్లాకి చెందిన పొట్లూరి శ్రీబాలవంశీకృష్ణ అలియాస్ ప్రతాపనేని రాజేష్ కుమార్ (35) తెలంగాణలోని ఖమ్మం జిల్లా బుర్హాంపురం మండలం వెంకటేశ్వర నగర్లో ఉంటున్నాడు. ఇతనికి విజయవాడలో కూడా నివాసముం ది. 2008లో కాకినాడలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో రాజేష్ బీ ఫార్మశీ పూర్తి చేశాడు. 2011లో వి వాహం చేసుకుని భార్యతో కలిసి బెంగళూరులో నివాసమున్నాడు. అక్కడ వ్యసనాలకు బానిసై అప్పులు చేయడంతో భార్య విడాకులిచ్చింది. కొంతకాలం ఏటీఎం నేరాలకు పాల్పడి డబ్బులు సంపాదించిన రాజేష్ బ్యాంకర్లు వన్‌టైం పాస్వర్ట్ సిస్టం ప్రారంభించడంతో ఆ నేరాలు చేయడం కుదరక మేట్రిమోనియల్ చీటింగ్‌కు తెరలేపాడు. మోసం చేసిన తీరు ఇదీ... 2021 ఆగస్ట్‌లో ఓ మేట్రిమోనియల్ వెబ్సైట్లో ప్రతాపనేని రాజేష్‌కుమార్ పేరుతో అకౌంట్ ఓపెన్ చేశాడు. ఓ యువతి తల్లిదండ్రులు రాజేష్ వివరా లను అందులో పరిశీలించి అతడిని ఫోన్లో సంప్రదించారు. తాను న్యూయార్క్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగినని, కరోనా పరిస్థితుల కారణంగా హైదరాబాద్‌కు బదిలీ అయి వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నట్లు రాజేష్ వారిని నమ్మించాడు. తాను మళ్లీ ఈ ఏడాది మే లో న్యూయార్క్ వెళ్లాల్సి ఉంటుందని, ఈ లోగా ఆమె సిబిల్ స్కోర్ పెరగాలని వారిని నమ్మించాడు. అనంతరం యువతి క్రెడిట్ కార్డు, వివిధ మార్గాల ద్వారా రూ.17.49 లక్షలను రాజేష్ తన బ్యాంక్ ఖాతాలో జమ చేసుకున్నాడు. స్పందన ఫిర్యాదుతో రంగంలోకి... తన క్రెడిట్ కార్డుల ద్వారా ఇష్టం వచ్చినట్లుగా రాజేష్ రుణాలు తీసుకుంటుండటంతో యువతికి అనుమానం వచ్చింది.దీంతో ఆమె తన రుణాల ప్రాసెస్ మొత్తం రద్దు చేయాలని అడగ్గా అందుకు వారం రోజులు గడువు పడుతుందంటూ రాజేష్ చెప్పాడు. దీంతో ఆమె స్పందనలో ఫిర్యాదు చేసింది. ఎస్పీ మలికాగర్గ్ ఆదేశాల మేరకు రూరల్ సీఐ రాంబాబు, మద్దిపాడు ఎస్ఐ శ్రీరాం విచారించి నిందితుడిని సీతారామపురం కొష్టాలు వద్ద అరెస్ట్ చేశారు. విచారణలో అతనిపై తెలుగు రాష్ట్రాల్లో 16 కేసులు నమోదైనట్లు గుర్తించారు. అతడి నుంచి రూ.8 లక్షలు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. స్వల్ప కాలంలోనే నిందితుడిని అరెస్ట్ చేసినందుకుగాను పోలీసులను ఎస్పీ మలికాగర్గ్ అభినందించి నగదు రివార్డులను అందజేశారు. -
పెళ్లికొడుకు కదా అని ‘చెప్పినట్టు’ చేస్తే... అశ్లీల వీడియోలతో..
సౌజన్య (పేరు మార్చడమైనది)కు మాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా పెళ్లి సంబంధం వచ్చింది. విదేశాలలో ఉన్న పెళ్లికొడుకు స్వదేశానికి త్వరలో వస్తున్నానని చెప్పాడు. సౌజన్య చాలా సంతోషించింది. నెల రోజులుగా వాట్సప్ చాట్ల ద్వారా ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆధునిక దుస్తుల్లో కనిపించాలని కోరాడు పెళ్లికొడుకు. నమ్మిన సౌజన్య అతను ‘చెప్పినట్టు’ చేసింది. దానిని రికార్డ్ చేసిన పెళ్లికొడుకు ఆ వీడియోను అశ్లీల వెబ్సైట్లో పెట్టాడు. ఆ తర్వాత అతను తన ఆన్లైన్ అకౌంట్స్ అన్నీ బ్లాక్ చేశాడు. మోసపోయిన విషయం అర్ధమైన సౌజన్య ఆత్మహత్యే శరణ్యం అనుకుంది. ∙∙ కీర్తన (పేరు మార్చడమైనది) పేరుతో ఫేస్బుక్లో ఫేక్ ఐడీ సృష్టించబడినట్టు తెలిసింది. దాని ద్వారా తనను వేధిస్తున్నవారి ఆటకట్టించాలనుకుంది. కానీ, ఎలాగో తెలియలేదు. ∙∙ సుందర్ (పేరు మార్చడమైనది) ఏడాది క్రితం సేంద్రీయ ఆహార ఉత్పత్తుల సంస్థకు యజమాని అయ్యాడు. చిన్న సంస్థే అయినా ఇప్పుడిప్పుడే లాభాలు అందుతున్నాయి. తన సంస్థ ఉత్పత్తులు మంచివి కావని, తనకు నష్టం కలిగించే ప్రకటనలు ఆన్లైన్లో చూసి షాకయ్యాడు. ∙∙ ఈ డిజిటల్ కాలంలో అపరిచత వ్యక్తుల నుంచి రకరకాల మోసాలకు లోనయ్యేవారి శాతం రోజు రోజుకూ పెరుగుతోంది. కరోనా కాలాన్ని ఉపయోగించుకొని మరింతగా సైబర్ నేరాలు పెరిగాయి. ఈ నేరాలలో పిల్లలు, మహిళలు ఎక్కువశాతం మోసానికి గురవుతున్నారు. అదేవిధంగా రకరకాల యాప్‌లు వచ్చి, డబ్బు దోపిడీ కూడా జరుగుతోంది. మోసం జరగకుండానే ముందస్తు జాగ్రత్తపడటం ఒక ఎత్తయితే, మోసపోయామని తెలిసినా తమని తాము రక్షించుకోవడం ఎలాగో ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం అవసరం. ఫిర్యాదు చేయడం ఎలా? మొబైల్ లేదా కెమెరా వాడకంతో పిల్లలను, స్త్రీలను వారి వ్యక్తిగత, అశ్లీల చిత్రాలు, వీడియోలను తీసి, ఆన్ లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా చూపినా, డిజిటల్ టెక్నాలజీ ద్వారా బాధితులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నా, ఒక వ్యక్తి లేదా సంస్థ యొక్క డేటా, ఆర్థిక సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం ద్వారా దొంగిలించినా, వ్యక్తిగత సమాచారం లేదా డేటాను పొందడానికి, డబ్బు లేదా పరువును కోల్పోయేవిధంగా మోసపూరిత ప్రయత్నం చేసినా, నెట్‌వర్క్‌ను దోపిడీ చేసే హ్యాకింగ్ ప్రక్రియకు పూనుకున్నా.. ఇలా ఏ డిజిటల్ మోసానికైనా సరైన ముందు https://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయడం. ఆన్లైన్ మార్గాలలో ఆర్థిక నష్టం జరిగితే https://cyberpolice.nic.in లో ఫిర్యాదు చేయాలి. దీనినే సిటిజన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. పై రెండు పోర్టల్స్‌కి 15526 హెల్ప్‌లైన్ నెంబర్ అనుసంధానమై ఉంటుంది. దీనికి ఆర్బిఐ ఆమోదించిన అన్ని బ్యాంకులు అనుసంధానమై ఉంటాయి కాబట్టి ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అకౌంట్ల తక్షణ నగదు లావాదేవీలను నిలిపి వేసి, మీ డబ్బును సురక్షితం చేస్తాయి. ఈ హెల్ప్‌లైన్ నెంబర్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. మీ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫోన్ నెంబర్‌ను నమోదు చేసి, వచ్చిన ఓటీపీ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. అందులో.. (1) చైల్డ్ పోర్నోగ్రఫీ (2) పిల్లల లైంగిక వేధింపులు (3) అసభ్యకరమైనవి, లైంగికపరమైనవి (జీజీ) ఇతర సైబర్ నేరాలు (1) మొబైల్ నేరాలు (2) సోషల్ మీడియా నేరాలు (3) ఆన్ లైన్ ఆర్థిక మోసాలు (4) సైబర్ ట్రాఫికింగ్ (5) హ్యాకింగ్... కి సంబంధించిన అంశాలు ఉంటాయి. ఫిర్యాదు చేసే ప్రక్రియ ఆఫ్‌లైన్ – ఆన్ లైన్ రెండు విధానాల్లో ఉంటుంది. సంఘటన ఏవిధంగా జరిగిందో తెలియజేయడానికి: (ఎ) కమ్యూనికేషన్ మోడ్ అంటే ఇంటర్నెట్, వాట్సాప్ .. ఏ విధానంలో అనేది తెలియజేయాలి. (బి) తేదీ – సమయం (సి) ప్లాట్‌ఫారమ్ (ఇంటర్నెట్, వాట్సాప్ మొదలైనవి) . (డి) ఆర్థిక మోసాలకు సంబంధించిన ఆధారాలు అప్లోడ్, పేమెంట్లు / బ్యాంక్ స్టేట్మెంట్ల స్క్రీన్షాట్లు. వేధింపులకు గురిచేసేవారి సంబంధిత స్క్రీన్ షాట్లు, ఫొటో, ఆడియో, వీడియో మొదలైనవి జత చేయాలి. అనుమానితుల వివరాలు (అందుబాటులో ఉంటే): (ఎ) అనుమానితుని పేరు (బి) గుర్తింపు (మొబైల్, ఇమెయిల్) (సి) ప్రదేశం.. మొదలైనవి) ఫిర్యాదుదారుల వివరాలు: (ఎ) పూర్తి పేరు – సహాయక వివరాలు (తండ్రి, జీవిత భాగస్వామి, గార్డియన్ మొదలైనవి) (బి) ఇమెయిల్ / ఫోన్ నంబర్ (సి) చిరునామా – ఐడీ ప్రూఫ్ (ఆధార్ మొదలైనవి) ఫిర్యాదును దాఖలు చేయడానికి దశల వారీ ప్రక్రియ ద్వారా వివరంగా తెలియజేయాలి. సత్వర స్పందన కోసం సమీప సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. డిజిటల్‌గా మోసం ఎలా జరిగినా పోలీసులు, పోర్టల్, హెల్స్‌లైన్.. ఆపద్భాంధువుల్లా ఉన్నారనే విషయాన్ని విస్మరించరాదు. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
హనీట్రాప్ కిలాడీ లేడీ అరెస్ట్
కర్ణాటక,యశవంతపుర : మ్యాట్రిమోనియల్ ద్వారా పరిచయం చేసుకుని హనీట్రాప్ ఊబిలోకి లాగుతున్న మహిళతో పాటు మరో వ్యక్తిని హాసన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వివరాల మేరకు... చిక్కబళ్లాపురకు చెందిన లక్ష్మీ (32), కోలార్‌కు చెందిన శివణ్ణలు ఆన్లైన్ మ్యాట్రిమోనియల్ ద్వారా ప్రజలను మోసగిస్తున్నారు. నిందితురాలు లక్ష్మీ ఆన్లైన్ మ్యాట్రిమోనియల్లో తాను అనాథ అని, తన పిన్ని ఇంటిలో ఉంటున్నట్లు నమ్మించేది. హాసన్‌కు చెందిన పరమేశ్ లక్ష్మీ ప్రొఫైల్‌ను చూసి ఆమెను కాంటాక్ట్ చేశాడు. ఇలా డిసెంబర్ 2019 నుంచి వీరి పరిచయం పెరిగింది. ఈ క్రమంలో ఆమె వివిధ కారణాలతో పరమేశ్ నుంచి రూ. 6 లక్షల వరకు తీసుకుంది. క్రమంగా పరమేశ్‌ను దూరం చేయసాగింది. పరమేశ్ నిలదీయడంతో తనపై అత్యాచారానికి యత్నించాడని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు లక్ష్మీ, శివణ్ణలను అరెస్ట్ చేశారు. నిందితులు ఇద్దరు పథకం ప్రకారం అమాయకులను ట్రాప్‌లోకి లాగి మోసం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. -
సీన్ రివర్స్.. వరుడికి 3కోట్లు టోకరా
సాక్షి, సిటీబ్యూరో: వివిధ మాట్రిమోనియల్ సైట్స్‌లో ఎన్ఆర్ఐ వరుల మాదిరిగా రిజిస్టర్ చేసుకునే సైబర్ నేరగాళ్లు నకిలీ ప్రొఫైల్స్‌తో నగరవాసుల నుంచి అందినకాడికి దండుకొని నిండా ముంచుతున్న కేసుల్ని చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. నగరానికి చెందిన ఓ కుటుంబం ఎన్ఆర్ఐకి పెళ్లి పేరుతో ఎర వేసి.. దఫ దఫాలుగా అతడి నుంచి రూ.3 కోట్ల వరకు వసూలు చేసింది. దీనిపై ఉస్మానియా యూనివర్శిటీ ఠాణాలో నమోదైన కేసు తదుపరి దర్యాప్తు నిమిత్తం నగర నేర పరిశోధన విభాగానికి (సీసీఎస్) బదిలీ అయింది. పోలీసుల కథనం ప్రకారం.. హబ్సిగూడకు చెందిన సత్యనారాయణరావు కుమారుడు సుధీర్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. వివాహం చేసుకునే ఉద్దేశంతో మంచి సంబంధం కోసం ఈయన తెలుగు మాట్రిమోనీ సైట్లో రిజిస్టర్ చేసుకున్నాడు. ఈ ప్రొఫైల్ చూసిన నగరానికి చెందిన ఓ యువతి డాక్టర్ నియతి వర్మగా రిజిస్టర్ చేసుకుంది. సుధీర్ ప్రొఫైల్‌లోని ఫోన్ నంబర్‌కు కాల్ చేసి తాను అతడిని వివాహం చేసుకోవడానికి సిద్ధమని చెప్పింది. ఈ ఫోన్ నంబర్ సత్యనారాయణ వద్ద ఉండటంతో ఆయన విషయాన్ని అమెరికాలోని తన కుమారుడికి తెలిపి యువతి ఫోన్ నంబర్‌ను కూడా అతడికి పంపాడు. ఆ నెంబర్‌కు సుధీర్ కాల్ చేయగా... హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి పల్మనాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసినట్లు నియతి వర్మ చెప్పింది. ఈమె ప్రొఫైల్ నచ్చడంతో సుధీర్ కొన్నాళ్లు మాటలు, చాటింగ్స్ కొనసాగించాడు. ఈ నేపథ్యంలోనే నియతి వర్మగా చెప్పుకున్న యువతి తాను స్థితి మంతురాలినైనా తనకు ఉన్న ఆస్తులు వారసత్వ గొడవల్లో ఉన్నాయని, మనశ్శాంతి కోసం తాను ఓ అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నానని నమ్మబలికింది. దాని నిర్వహణ కోసం నిధులు అవసరమని చెప్పి.. 2016 నుంచి దఫ దఫాలుగా అతడి నుంచి రూ.3 కోట్లు బదిలీ చేయించుకుంది. రెండుమూడు సందర్భాల్లో వివాహం విషయం నియతి వర్మ కుటుంబీకులుగా చెప్పుకున్న వాళ్లూ సత్యనారాయణతో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే దాటవేయడం మొదలెట్టారు. దీంతో ఆయనకు అనుమానం వచ్చి ఆరా తీయగా.. తమతో నియతి వర్మగా మాట్లాడింది దేవతి మాళవిక అనే మహిళగా తేలింది. కుటుంబీకులు దేవతి శ్రీనివాస్, దేవతి ప్రణవం, దేవతి గజలక్షిఓమ నగదు వసూలు చేసేందుకు ఆమెకు సహకరించారని తెలుసుకున్నారు. ఈ విషయం సత్యనారాయణకు తెలిసిందని గుర్తించిన నిందితురాలి సహా వారి కుటుంబీకులు అంతా తమ సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. దీంతో పథకం ప్రకారం అంతా కలిసి తమను మోసం చేశారని గుర్తించిన ఆయన గత నెలలో ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు నిమిత్తం ఈ కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఈ కేసును అధికారులు రీ–రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
కేటుగాడు చినరామయ్య అరెస్టు..
కైకలూరు: పెళ్లి సంబంధాలు, ఉద్యోగాల పేరుతో యువతులు, నిరుద్యోగులను మోసం చేసిన కేటుగాడిని కైకలూరు పోలీసులు అరెస్టు చేశారు. కైకలూరు టౌన్‌స్టేషన్‌లో సీఐ కేఎన్వీ జయకుమార్ శుక్రవారం వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా, వట్టిచెరుకూరు మండలం, చమల్లమూడి గ్రామానికి చెందిన బేతపూడి చినరామయ్య(42)కు భార్య, ఇరువురు సంతానం. విజయవాడలో ఇంటర్నెట్ సెంటర్ పెట్టి నష్టపోయాడు. తరువాత ఇంటి నిర్మాణం చేసి అప్పులపాలయ్యాడు. చివరికి నరసరావుపేటలో అద్దెకు దిగాడు. ఇంటర్నెట్ సెంటర్ అనుభవంతో తెలుగు మ్యాట్రీ మోనిడాట్కామ్లో తనకు వధువు కావాలని తప్పుడు చిరునామా ఇచ్చాడు. లైక్‌లు కొట్టిన మహిళలు, యువతలకు ఫోన్ చేసి తాను యూఎస్ఏ నాసా, న్యూ ఢిల్లీ జవ్సియానా ఎయిర్ క్రాఫ్ట్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌గా ఉద్యోగం చేస్తున్నానని నకిలీ గుర్తింపు కార్డులను సృష్టించాడు. కైకలూరులో ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. ఆమె ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం అరెస్టు చేసినట్లు వివరించారు. అతడి నుంచి రూ.2.50లక్షలు, ల్యాప్‌టాప్, నకిలీ గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. విలేకరుల సమావేశంలో టౌన్ ఎస్ఐ షణ్ముఖసాయి పాల్గొన్నారు. మోసాల తీరిది... సైబర్‌నేరగాడి చినరామయ్య ఫేస్బుక్ ద్వారా రావూరి రాము, లంక ప్రకాష్, భాస్కరరావు, విజయ్ అనే పలు పేర్లుతో మహిళలను వల వేస్తుంటాడు. పరిచయం అయిన తరువాత తన అన్నకుంటుంబం ఆపదలో ఉందని డబ్బు కావాలని, త్వరలోనే మనం వివాహం చేసుకుందామని నమ్మబలుకుతాడు. ఏటీఎంలు తీసుకుంటాడు. కొద్ది రోజులకు మీ బంధువులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని వారి వద్ద డబ్బులు గుంజుతాడు. కైకలూరులో ఉద్యోగం చేసే నాగలక్ష్మిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమె ఏటీఎం తీసుకుని రూ.2లక్షలు డ్రా చేశాడు. ఆమె బంధువు అంబటి శ్యామ్‌కు గన్నవరం ఎయిర్‌పోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.2లక్షలు తీసుకున్నాడు. బాపులపాడు మండలం కొత్తమల్లవల్లి గ్రామానికి చెందిన గజ్జల స్వాతిని పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.లక్షా 60వేలు తీసుకున్నాడు. ఆమె ద్వారా అడపాక పెద్దిరాజుకు ఎయిర్‌పోర్టులో ఉద్యోగం ఇస్తానని రూ.2లక్షల 20వేలు దండుకున్నాడు. పాలకోడూరు మండలం శృంగవృక్షంకు చెందిన ఆకుమర్తి చంద్రశేఖర్‌కు విజయ్ అనే పేరుతో ఫేస్బుక్లో పరిచయం చేసుకుని ఉద్యోగం ఇస్తానని రూ.85,000 తీసుకున్నాడు. ఇలా ఎందరినో మోసం చేశాడు. అతడిపై విజయవాడ, వీరవల్లి పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. -
పెళ్లి కాకపోవడానికి దెయ్యం పట్టడమే..
సాక్షి, సిటీబ్యూరో: ఇదో వెరైటీ ‘మాట్రిమోనియల్’ సైబర్ నేరం. వెబ్‌సైట్స్‌లో పెట్టిన ప్రొఫైల్ నచ్చిందంటూ పెళ్లి ప్రతిపాదన చేసి దండుకున్న కేసులు...విదేశీ వధూవరుల పేరుతో ఆన్లైన్లో పరిచయాలు చేసుకుని, బహుమతులు పంపిస్తానంటూ ఎర వేసి దండుకున్న వ్యవహారాలు... ఇవన్నీ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు సుపరిచితమే. అయితే మంగళవారం వచ్చిన ఓ ఫిర్యాదు చూసి అధికారులే కంగుతిన్నారు. పెళ్లి కాకపోవడానికి దెయ్యం పట్టడమే కారణమంటూ చెప్పిన సైబర్ నేరగాడు..అది వదిలిస్తానంటూ రూ.5 లక్షలు కాజేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నగరానికి చెందిన ఓ యువతికి కొన్నాళ్లుగా వివాహం కావట్లేదు. ఈ విషయాన్ని ఆమె ఇటీవల తనకు పరిచయం ఉన్న వారితో చెప్పి బాధపడింది. దీంతో వారు నీ మీద చేతబడి చేసి ఉంటారని, అది వదిలించుకుంటే తప్ప పెళ్లి కాదంటూ ఓ ‘ఉచిత సలహా’ ఇచ్చారు. ఈ విషయం విని షాక్‌కు గురైన ఆ యువతి ‘గూగుల్ తల్లి’ని ఆశ్రయించింది. చేతబడులకు విరుగుడు చేసే వారి వివరాల కోసం నెట్లో అన్వేషించింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఉత్తరాదికి చెందిన ఓ వ్యక్తి వివరాలు, ఫోన్ నెంబర్ లభించాయి. దానికి కాల్ చేసిన యువతి తన బాధను, పరిచయస్తులు చెప్పిన చేతబడి అంశాన్నీ చెప్పుకుంది. ఇదంతా విన్న అతగాడు ఆమె గతం–వర్తమానం–భవిష్యత్తు అధ్యయనం చేస్తున్నట్లు నటించాడు. ఆపై వివాహం కాకపోవడానికి చేతబడి కారణం కాదని.. మీ కుటుంబంలో ఒకరికి దెయ్యం పట్టిందని భయపెట్టాడు. దాన్ని వదిలిస్తే తప్ప పెళ్లి కాదంటూ చెప్తూ తన మాటలతో మాయ చేశాడు. ఇతడి ట్రాప్‌లో పడిపోయిన నగర యువతి దెయ్యం వదిలించేందుకు ఏం చేయాలంటూ కోరింది. అందుకు ప్రత్యేక పూజలు ఉంటాయని, వాటి నిమిత్తం కొంత ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పిన ఆ మాయగాడు తన బ్యాంకు ఖాతా వివరాలు అందించాడు. ఓ దఫా తన బ్యాంకు ఖాతాలోను, మిగిలిన సార్లు యూపీఐ ద్వారాను మొత్తం రూ.5 లక్షలు యువతి నుంచి కాజేశాడు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో పాటు అతగాడు మరింత మొత్తం కోరుతుండటంతో తాను మోసపోయానని ఆ యువతి భావించింది. దీంతో మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న అధికారులు ప్రాథమిక పరిశీలన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే నేరగాడు వినియోగించిన బ్యాంకు ఖాతా పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు చెందినదిగా గుర్తించారు. యూపీఐ వివరాలు సైతం సేకరించి నిందితుడి ఆచూకీ కనిపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
బిజీ... ప్రమాదం... పెళ్లి...
సాక్షి, సిటీబ్యూరో: ప్రకటనలే పెట్టుబడిగా, రిజిస్ట్రేషన్ పేరుతో వసూళ్లకు పాల్పడుతూ .. తమ ఉద్యోగులనే పెళ్లి వారిగా నమ్మించి కాలయాపన చేసి నిండా ముంచేసే కొత్త తరహా మాట్రిమోనియల్ మోసాలు ఇటీవల నగరంలో వెలుగులోకి వస్తున్నాయి. అయితే వీటిలో బాధితులు నష్టపోతున్నది చిన్న మొత్తాలే కావడంతో లిఖిత పూర్వక ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఫలితంగా ఈ నకిలీ మారేజ్ బ్యూరోల దందాలు యథేచ్ఛగా సాగుతున్నాయని నగర సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొంటున్నారు. ఆన్లైన్ ద్వారా నైజీరియన్లు... మాట్రిమోనియల్ సైట్స్‌లో ఉండే ప్రొఫైల్ ఆధారంగా విదేశాల్లో ఉండే వధూవరుల పేరుతో పరిచయం చేసుకుని మోసం చేసే కేసులు తరచు నమోదవుతూ ఉంటాయి. ఈ కేసుల్లో అత్యధికం ఉత్తరాదిలో స్థిరపడిన నైజీరియన్లే నిందితులుగా ఉంటున్నారు. ఆయా ప్రొఫైల్స్‌ను యాక్సస్ చేసే వీరు వాట్సాప్ ద్వారా కొన్నాళ్లు చాటింగ్ చేసిన తర్వాత పెళ్లి ప్రతిపాదన తెస్తారు. ఆపై కొన్ని బహుమతులు పంపిస్తున్నాని, తీసుకువస్తున్నానంటూ అసలు కథ మొదలెడతారు. తామో, తాము పంపిన బహుమతులో విమానాశ్రయంలో దిగినట్లు, కస్టమ్స్ అధికారుల అడ్డుకున్నట్లు మరొకరితో ఫోన్లు చేయించి పన్నుల పేరుతో డబ్బు డిపాజిట్ చేయించుకుని ముంచేస్తారు. వీటిలో బాధితులు నష్టపోయేది భారీ మొత్తాలు కావడంతో ఈ తరహా ఆన్లైన్ నేరాలు తరచుగా నమోదవుతూనే ఉంటున్నాయి. ఆకర్షణీయమైన ప్రకటనలతో. చిన్న చిన్న మొత్తాలతో ముడిపడి ఉండి, నేరుగా జరిగే మాట్రిమోనియల్ ఫ్రాడ్స్ ఇటీవల కాలంలో పెరుగుతున్నట్లు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. నగరంలోని కొన్ని బోగస్ మ్యారేజ్ బ్యూరోల కేంద్రంగా ఈ తరహా మోసాలు జరుగుతున్నట్లు తెలిపారు. వివిధ పత్రికల్లో క్లాసిఫైడ్స్ రూపంలో ఇచ్చే ప్రకటనలే వీరికి పెట్టుబడి. ‘విదేశంలో ఉండే వధువు/వరుడు... నెలకు రూ.2 లక్షలకు సమానమైన జీతం, రూ.5 కోట్ల ఆస్తి, కుల పట్టింపు లేదు... ఆసక్తి ఉంటే సంప్రదించండి’ ఈ తరహాలో ఆ ప్రకటనలు ఉంటున్నాయి. ఆ ప్రకటనలో ఉన్న నంబర్‌ను ఎవరైనా ఫోన్ చేస్తే నేరుగా వచ్చి కలవమని చెబుతారు. అలా వెళ్లిన వారికి వరుడు/వధువు ప్రొఫైల్, కాంటాక్ట్ నంబర్ ఇవ్వాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆపై వీరికి ఆ వరుడు/వధువు తల్లిదండ్రులదంటూ ఓ సెల్ నంబర్ ఇస్తున్నారు. బిజీ... ప్రమాదం... పెళ్లి... ఈ సెల్ నంబర్లు సదరు మారేజ్బ్యూరో వారే వేరే పేర్లతో తీసుకుంటున్నారు. తమ ఉద్యోగినులకే వీటిని అప్పగించి వచ్చే కాల్స్‌కు స్పందించేలా సూచిస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు కాల్ చేస్తే ఈ ఉద్యోగినులు ఆ వధువు/వరుడు తల్లి లేదా సోదరిగా మాట్లాడతారు. తమకు మ్యారేజ్‌బ్యూరో వారు మీ ప్రొఫైల్ కూడా పంపారని, నచ్చిందంటూ నమ్మబలుకుతారు. అయితే ప్రస్తుతం తమ వరుడు/వధువు విదేశంలో ఉన్నారని, మూడు నెలల తర్వాత తిరిగి వస్తారని చెప్తారు. ఈ గడువు ముగిసిన తర్వాత కాల్ చేస్తే... అక్కడ తమ వారికి యాక్సిడెంట్ అయ్యిందని, ఆరు నెలల తర్వాత వస్తారని చెబుతారు. ఈ కాలం ముగిసిన తర్వాత ఫోన్లు చేసే వారు తక్కువగా ఉంటున్నారని, ఎవరైనా సంప్రదిస్తే అనుకోని పరిస్థితుల్లో తమ వధువు/వరుడుకు విదేశంలోనే వివాహమైందని చెప్పి మోసం చేస్తుంటారు. చాలా మంది బాధితులకు అసలు ఇది మోసంగా తెలియట్లేదు. అనుమానించిన వాళ్లూ కట్టింది చిన్న మొత్తాలే కదా అనే ఉద్దేశంతో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయట్లేదు. ఇటీవల కాలంలో పెరుగుతున్న ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ పేర్కొన్నారు. -
దీప్తి కేసులో పోలీసులకు చుక్కెదురు
సాక్షి, విజయవాడ : పెళ్లి పేరుతో ఘరానా మోసాలకు పాల్పడుతూ, ఎన్నారై పెళ్లి కొడుకుల నుంచి డబ్బు గుంజుకుంటున్న పల్లపూరి దీప్తి కేసులో బెజవాడ పోలీసులకు చుక్కెదురు అయింది. విచారణ పరిధితో సంబంధం లేకుండా కేసు ఎలా నమోదు చేస్తారంటూ పటమట పోలీసుల తీరును న్యాయస్థానం గురువారం తప్పుబట్టింది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టును కోర్టు తిరస్కరించింది. టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఒత్తిడితోనే.. కాగా పల్లపూరి దీప్తి అరెస్ట్ నేపథ్యంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఒత్తిడితోనే పటమట పోలీసులు కేసు పెట్టారని దీప్తి తల్లి పూర్ణవల్లి ఆరోపించారు. సంబంధం లేని కేసును సీఐ దామోదర్‌తో ఎమ్మెల్యే కేసు నమోదు చేయించారని అన్నారు. ఎన్నారై ధరణికుమార్‌ను తన కుమార్తె డబ్బులు అడగలేదన్నారు. రెండు రోజుల పరిచయంతో లక్షా ఎనభై ఆరువేలు ఎవరైనా బ్యాంక్ అకౌంట్లో వేస్తారా? అని పూర్ణవల్లి ప్రశ్నించారు. మూడోరోజే పోలీసులకు ఫిర్యాదు చేస్తారా? అంటూ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఒత్తిడితో పోలీసులు తప్పుడు కేసు పెట్టారని ఆరోపణలు చేశారు. కాగా మ్యాట్రిమోనిలో ఫేక్ ప్రొఫైల్‌ను సృష్టించి ఎన్నారై పెళ్లికొడుకులను మోసం చేస్తున్న పల్లపూరి దీప్తిని నిన్న (బుధవారం) విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న పటమటకు చెందిన ధరణీకుమార్ మూడు నెలల క్రితం భారత్ మ్యాట్రీమోనిలో వధువు కోసం వెతకగా, దీప్తి అనే యువతి పరిచయం అయింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యవసరంగా తనకు కొంత డబ్బు అవసరం అని ధరణీకుమార్ను అడిగింది. ఆమె మాటలు నమ్మిన అతడు రెండు దఫాలుగా రూ.1.86 లక్షలు ఆమె అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేశాడు. అయితే డబ్బు తీసుకున్న నాటి నుంచి దీప్తి ఆచూకీ తెలియకపోవడంతో ధరణీకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరపగా, నిందితురాలు గుంటూరు బ్రాడీపేటకు చెందిన దీప్తిగా గుర్తించారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ఆమెను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. -
పెళ్లి పేరుతో ఎన్నారైకు కుచ్చుటోపి
సాక్షి, విజయవాడ : మ్యాట్రిమోనిలో ఫేక్ ప్రొఫైల్‌ను సృష్టించి ఎన్నారై పెళ్లికొడుకులను మోసం చేస్తున్న నిందితురాలిని గుంటూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గుంటూరు డీసీపీ గజరావు భూపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బ్రాడిపేటలో నివసిస్తున్న దీప్తి విలాసవంతమైన జీవితాలకు అలవాటుపడింది. తేలికగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో మ్యాట్రీమోనిలో నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి వివరాలను పొందుపర్చింది. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ధరణి కుమార్‌ను వివాహం చేసుకుంటానని నమ్మించి రూ. లక్షా 86 వేల తీసుకుంది. తిరిగి డబ్బులు అడిగితే బెదిరింపులకు దిగింది. దాంతో మోసపోయానని గ్రహించిన సాప్ట్ వేర్ ఉద్యోగి ధరణి కుమార్ పోలీసులను ఆశ్రయించినట్లు డీసీపీ వెల్లడించారు. గతంలో దీప్తిపై ఇలాంటి కేసులే ఉన్నట్లు తెలిపారు. కొంతమంది అమ్మాయిలు దుర్బుద్ధితో వేరొకరి ఫొటోలతో మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో నకిలీ అకౌంట్లు తయారే చేసుకుంటున్నారని చెప్పారు. వివాహ సంబంధాల కోసం వెబ్సైట్లలో వెదికే వారు తెలియని వాళ్లకు నగదు పంపడం కరెక్టు కాదని హితవు పలికారు. -
ఆన్ లైన్ పెళ్లి సంబంధాలపై డేగ కన్ను!
మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్లలో ప్రొఫైళ్ల ద్వారా వరుడు లేదా వధువులను బోల్తాకొట్టించి డబ్బు లేదా వేరే విధంగా దోచుకునేవారికి త్వరలో ముకుతాడు పడనుంది. ఇప్పటివరకు కేవలం వధవు లేదా వరుడి వివరాల్లో ఫోన్ నంబర్‌ను మాత్రమే తీసుకుని యూజర్లకు మెసేజ్ ద్వారా వివరాలను పంపుతున్న వెబ్సైట్లు.. ఇకపై ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లాంటి లేదా ఏదైనా ప్రభుత్వ ఐడీ ప్రూఫ్ ను తప్పనిసరిగా తమ అకౌంట్‌కు జత చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు నియమ నిబంధనలు మారనున్నాయని ఓ అధికారి తెలిపారు. దీంతోపాటు మాట్రిమోనియల్ లో అకౌంట్‌ను ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నారనే ప్రశ్నకు కూడా వినియోగదారుడు సమాధానం రాయాల్సి ఉంటుందని, అప్పుడే అకౌంట్ ఓపెన్ అవుతుందని వివరించారు. గత కొద్దికాలంగా ఆన్ లైన్ ద్వారా పెళ్లిళ్లు కుదుర్చుకుని అబ్బాయిలు లేదా అమ్మాయిలు ఫేక్ ప్రొఫైల్స్ తో ఎదుటివారిని బురిడీ కొట్టిస్తున్నారు. దీంతో ప్రభుత్వం మాట్రిమోనియల్ వెబ్ సైట్లను నియంత్రించే పనిలో పడింది. మాట్రిమోనియల్ వెబ్ సైట్ ను నడిపే ప్రతి ఒక్కరూ.. వెబ్ సైట్ లో గ్రీవియన్స్ ఆఫీసర్ పేరుతో ఆప్షన్ అందుబాటులో ఉంచాలని.. వినియోగదారుడి నుంచి ఫిర్యాదు రాగానే స్పందించే మెకానిజాన్ని ఏర్పాటు చేయాలనే సూచనలు వెళ్లినట్లు వివరించారు. 2014లో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ తొలిసారి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. పెళ్లి కోసం ఆన్ లైన్ లో సమాచారాన్ని ఉంచుతున్న అమ్మాయిలను తప్పుడు ప్రొఫైళ్ల ద్వారా అబ్బాయిలు మోసగిస్తున్నారనే ఫిర్యాదులు పెరిగినట్లు ఆమె వెల్లడించారు. భారత్ మ్యాట్రిమోనీ, జీవన్ శాంతి తదితర సంస్థల సీనియర్ ప్రతినిధులను పిలిపించి, తగిన భధ్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. పెళ్లి పేరుతో మోసపోయేవారిలో ఎక్కువగా అమ్మాయిలే ఉంటున్నట్లు ఆమె వివరించారు. తాజా నిబంధనలతో ప్రొఫైళ్లను తయారుచేసినప్పుడు ఐపీ అడ్రసును వెబ్ సైట్లు రికార్డు చేసుకోనున్నాయి. ఒక సంవత్సర కాలంలో అకౌంట్ ను ఎన్ని మార్లు ఎక్కడెక్కడి నుంచి ఉపయోగించారో కూడా ఈ రికార్డుల్లోకి రానుంది. -
వివాహం పేరుతో వలపన్నుతారు
- కొత్త తరహా మోసాలు ప్రారంభించిన నైజీరియన్లు - మాట్రిమోనియల్ సైట్ల వేదికగా మహిళలకు ఎర సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ ద్వారా మోసాలకు పాల్పడే నైజీరియన్లు నానాటికీ కొత్త పంథాలు అనుసరిస్తున్నారు. ఈ కోణంలో వెలుగులోకి వచ్చిన మరో వ్యవహారమే మాట్రిమోనియల్ ఫ్రాడ్స్. ఇటీవల కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్న ఈ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ నిపుణులు సూచిస్తున్నారు. వివిధ రకాలైన వీసాలపై భారత్‌కు వస్తున్న నైజీరియన్లు ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల్లో తిష్ట వేస్తున్నారు. లాటరీలు, బహుమతులు అంటూ ఎస్సెమ్మెస్‌లు, ఈ-మెయిల్స్ ఇస్తూ అనేక రకాలైన ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ఈ నైజీరియన్లు తాజాగా మాట్రిమోనియల్ సైట్స్‌ను ఆధారంగా చేసుకుంటున్నారు. తాము ప్రవాస భారతీయులం అంటూ మారుపేర్లతో ఈ వెబ్‌సైట్స్‌లో రిజిస్టర్ చేసుకుంటున్నారు. తన భార్య చనిపోయిందనో, విడాకులు తీసుకున్నామనో చెప్తూ అదే కోవకు చెందిన పెళ్ళి కుమార్తెల కోసం వెతుకున్నట్లు వల వేస్తున్నారు. ఈ ప్రొఫైల్స్ చూసి ఆకర్షితులవుతున్న మహిళలు ఆసక్తి చూపుతూ పోస్ట్ చేసిన వెంటనే అసలు కథ ప్రారంభిస్తున్నారు. వీరితో చాటింగ్ చూస్తూ వివాహానికి సమ్మతించినట్లు చెప్తూ పరిచయాన్ని కొనసాగిస్తున్నారు. ఇలా కొన్ని రోజులు సాగిన తరవాత భారత్‌కు వచ్చి వివాహం చేసుకుంటానని ఆయా మహిళల్ని నమ్మిస్తున్నారు. వివాహ కానుకలు పంపిస్తున్నాననో, తాను వేరే దేశంలో వెళ్తున్న నేపథ్యంలో తన వద్ద ఉన్న విలువైన వస్తువుల్ని భద్రపరిచేందుకు పంపిస్తున్నానో చెప్పి ఆ మహిళల చిరునామా, ఫోన్ నెంబర్ తదితరాలు సేకరిస్తున్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకు ఢిల్లీ, ముంబైలకు చెందిన నెంబర్ల నుంచి ఆయా మహిళలకు ఫోన్లు వస్తున్నాయి. మీ పేరుతో విదేశాల నుంచి గిఫ్ట్ ప్యాక్ లేదా బంగారం వచ్చిందని, కస్టమ్స్ క్లియరెన్స్‌తో పాటు వివిధ పన్నుల చెల్లింపు జరగని నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌లో ఆగిపోయిందని చెప్తున్నారు. ఆయా పన్నుల నిమిత్తం నిర్ణీత మొత్తాలను తాము చెప్పిన బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయాల్సిందిగా కోరుతున్నారు. సాధారణంగా ఈ మహిళలు ఉద్యోగ, వ్యాపార రంగాలకు చెందిన వారే కావడంతో నైజీరియన్ల మాటలు నమ్మి పలు దఫాలుగా వారి కోరిన మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేస్తున్నారు. బోగస్ పేర్లు, వివరాలను తెరుస్తున్న ఈ ఖాతాల్లో డిపాజిట్ అయిన సొమ్మును ఎప్పటికప్పుడు డ్రా చేసుకుంటున్న నైజీరియన్లు ఆనక ఫోన్ నెంబర్లు మార్చేయడంతో పాటు బ్యాంకు ఖాతాలనూ మూసేస్తున్నారు. చివరకు తాము మోసపోయామని గుర్తిస్తున్న బాధితులు పోలీసుల్ని ఆశ్రయించినా ఫలితం ఉండట్లేదు. మాట్రిమోనియల్ సైట్లో నమోదు నుంచి ప్రతి దశలోనూ నైజీరియన్లు బోగస్ వివరాలే పొందుపరుస్తుండటంతో పట్టుకోవడం కష్టసాధ్యంగా మారింది. గడిచిన ఆరు నెలల వ్యవధిలో హైదరాబాద్‌కు చెందిన పలువురు మహిళలు దాదాపు రూ.2 కోట్ల మేర మోసపోయి సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడల్లోనూ బాధితులు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. కేవలం వెబ్సైట్లు, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ద్వారా అయిన పరిచయాలు నమ్మవద్దని, అవతలి వ్యక్తిని వ్యక్తిగతంగా కలవడమో, పూర్తి వివరాలు సరిచూసుకోవడమో చేయకుండా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నెరపవద్దని సీఐడీ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. అనేక కష్టనష్టాలకు ఓర్చి నిందితుల్ని పట్టుకున్నా వారి నుంచి నగదు రికవరీ అసాధ్యంగా మారిందని వివరిస్తున్నారు. -
పక్కా 420.com!!