సాక్షి, సిటీబ్యూరో: ఇదో వెరైటీ ‘మాట్రిమోనియల్’ సైబర్ నేరం. వెబ్‌సైట్స్‌లో పెట్టిన ప్రొఫైల్ నచ్చిందంటూ పెళ్లి ప్రతిపాదన చేసి దండుకున్న కేసులు...విదేశీ వధూవరుల పేరుతో ఆన్‌లైన్‌లో పరిచయాలు చేసుకుని, బహుమతులు పంపిస్తానంటూ ఎర వేసి దండుకున్న వ్యవహారాలు... ఇవన్నీ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు సుపరిచితమే. అయితే మంగళవారం వచ్చిన ఓ ఫిర్యాదు చూసి అధికారులే కంగుతిన్నారు. పెళ్లి కాకపోవడానికి దెయ్యం పట్టడమే కారణమంటూ చెప్పిన సైబర్ నేరగాడు..అది వదిలిస్తానంటూ రూ.5 లక్షలు కాజేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నగరానికి చెందిన ఓ యువతికి కొన్నాళ్లుగా వివాహం కావట్లేదు. ఈ విషయాన్ని ఆమె ఇటీవల తనకు పరిచయం ఉన్న వారితో చెప్పి బాధపడింది. దీంతో వారు నీ మీద చేతబడి చేసి ఉంటారని, అది వదిలించుకుంటే తప్ప పెళ్లి కాదంటూ ఓ ‘ఉచిత సలహా’ ఇచ్చారు. ఈ విషయం విని షాక్‌కు గురైన ఆ యువతి ‘గూగుల్ తల్లి’ని ఆశ్రయించింది.
చేతబడులకు విరుగుడు చేసే వారి వివరాల కోసం నెట్‌లో అన్వేషించింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఉత్తరాదికి చెందిన ఓ వ్యక్తి వివరాలు, ఫోన్ నెంబర్ లభించాయి. దానికి కాల్ చేసిన యువతి తన బాధను, పరిచయస్తులు చెప్పిన చేతబడి అంశాన్నీ చెప్పుకుంది. ఇదంతా విన్న అతగాడు ఆమె గతం–వర్తమానం–భవిష్యత్తు అధ్యయనం చేస్తున్నట్లు నటించాడు. ఆపై వివాహం కాకపోవడానికి చేతబడి కారణం కాదని.. మీ కుటుంబంలో ఒకరికి దెయ్యం పట్టిందని భయపెట్టాడు. దాన్ని వదిలిస్తే తప్ప పెళ్లి కాదంటూ చెప్తూ తన మాటలతో మాయ చేశాడు. ఇతడి ట్రాప్‌లో పడిపోయిన నగర యువతి దెయ్యం వదిలించేందుకు ఏం చేయాలంటూ కోరింది. అందుకు ప్రత్యేక పూజలు ఉంటాయని, వాటి నిమిత్తం కొంత ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పిన ఆ మాయగాడు తన బ్యాంకు ఖాతా వివరాలు అందించాడు.
ఓ దఫా తన బ్యాంకు ఖాతాలోను, మిగిలిన సార్లు యూపీఐ ద్వారాను మొత్తం రూ.5 లక్షలు యువతి నుంచి కాజేశాడు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో పాటు అతగాడు మరింత మొత్తం కోరుతుండటంతో తాను మోసపోయానని ఆ యువతి భావించింది. దీంతో మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న అధికారులు ప్రాథమిక పరిశీలన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే నేరగాడు వినియోగించిన బ్యాంకు ఖాతా పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు చెందినదిగా గుర్తించారు. యూపీఐ వివరాలు సైతం సేకరించి నిందితుడి ఆచూకీ కనిపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment