నిందితుడు కాబ్రెల్ ఎడ్మాండో
సాక్షి, హైదరాబాద్: ఓ మాట్రిమోనియల్ సైట్ ద్వారా నగర యువతికి పరిచయమై తాను లండన్‌లో ఉంటున్నానని నమ్మించి రూ.10.65 లక్షలు కాజేసిన నేరగాడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆఫ్రికాకు చెందిన కాబ్రెల్ ఎడ్మాండో కొన్నేళ్ల క్రితం జాబ్ వీసాపై ఢిల్లీకి వచ్చాడు. అక్కడి ద్వారక ప్రాంతంలో నివసిస్తూ పుణేకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. ఓ సెలూన్‌లో బార్బర్‌గా పని చేస్తున్న ఇతగాడు ప్రత్యేకించి ఆఫ్రికన్లు, నైజీరియన్లకు మాత్రమే క్షవరం చేసేవాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించిన ఇతగాడు సైబర్ నేరాలకు తెరలేపాడు.
మాట్రిమోనియల్ సైట్‌లో నకిలీ వివరాలు, ఫొటోతో రిజిస్టర్ చేసుకున్నాడు. అదే సైట్‌లో రిజిస్టరై ఉన్న ఓల్డ్ బోయిన్‌పల్లి యువతికి లండన్‌లో ఉంటున్న కృష్ణకుమార్‌గా పరిచయమయ్యాడు. ఈమె వితంతువు కావడంతో తాను వివాహం చేసుకుంటానని అన్నాడు. కొన్నాళ్లు వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసుకున్నాక కలవడానికి వస్తున్నట్లు చెప్పాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారులుగా కొందరి నుంచి యువతికి ఫోన్లు వచ్చాయి. కృష్ణకుమార్ అనే వ్యక్తి భారీగా పౌండ్లు తీసుకుని లండన్ నుంచి వచ్చాడని, అలా తీసుకురావడం నిబంధనలకు విరుద్ధం కావడంతో అదుపులోకి తీసుకున్నామని నమ్మించారు. కృష్ణకుమార్‌ను వదలాలంటే పన్నులు కట్టాలని రూ.10.65 లక్షలు కాజేసి మోసం చేశారు. బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్ సీహెచ్ గంగాధర్, ఎస్సై శాంతరావులతో కూడిన బృందం నిందితుడిని గుర్తించి ఢిల్లీలో అరెస్టు చేసింది. పీటీ వారెంట్‌పై శుక్రవారం నగరానికి తీసుకువచ్చి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది.
చదవండి: బాబాయ్ అంటే భయం.. అదే అలుసుగా తీసుకుని మూడు రోజులుగా..
Comments
Please login to add a commentAdd a comment