ఆన్ లైన్ పెళ్లి సంబంధాలపై డేగ కన్ను!
మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్లలో ప్రొఫైళ్ల ద్వారా వరుడు లేదా వధువులను బోల్తాకొట్టించి డబ్బు లేదా వేరే విధంగా దోచుకునేవారికి త్వరలో ముకుతాడు పడనుంది. ఇప్పటివరకు కేవలం వధవు లేదా వరుడి వివరాల్లో ఫోన్ నంబర్‌ను మాత్రమే తీసుకుని యూజర్లకు మెసేజ్ ద్వారా వివరాలను పంపుతున్న వెబ్‌సైట్లు.. ఇకపై ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లాంటి లేదా ఏదైనా ప్రభుత్వ ఐడీ ప్రూఫ్ ను తప్పనిసరిగా తమ అకౌంట్‌కు జత చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు నియమ నిబంధనలు మారనున్నాయని ఓ అధికారి తెలిపారు.
దీంతోపాటు మాట్రిమోనియల్ లో అకౌంట్‌ను ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నారనే ప్రశ్నకు కూడా వినియోగదారుడు సమాధానం రాయాల్సి ఉంటుందని, అప్పుడే అకౌంట్ ఓపెన్ అవుతుందని వివరించారు. గత కొద్దికాలంగా ఆన్ లైన్ ద్వారా పెళ్లిళ్లు కుదుర్చుకుని అబ్బాయిలు లేదా అమ్మాయిలు ఫేక్ ప్రొఫైల్స్ తో ఎదుటివారిని బురిడీ కొట్టిస్తున్నారు. దీంతో ప్రభుత్వం మాట్రిమోనియల్ వెబ్ సైట్లను నియంత్రించే పనిలో పడింది. మాట్రిమోనియల్ వెబ్ సైట్ ను నడిపే ప్రతి ఒక్కరూ.. వెబ్ సైట్ లో గ్రీవియన్స్ ఆఫీసర్ పేరుతో ఆప్షన్ అందుబాటులో ఉంచాలని.. వినియోగదారుడి నుంచి ఫిర్యాదు రాగానే స్పందించే మెకానిజాన్ని ఏర్పాటు చేయాలనే సూచనలు వెళ్లినట్లు వివరించారు.
2014లో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ తొలిసారి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. పెళ్లి కోసం ఆన్ లైన్ లో సమాచారాన్ని ఉంచుతున్న అమ్మాయిలను తప్పుడు ప్రొఫైళ్ల ద్వారా అబ్బాయిలు మోసగిస్తున్నారనే ఫిర్యాదులు పెరిగినట్లు ఆమె వెల్లడించారు. భారత్ మ్యాట్రిమోనీ, జీవన్ శాంతి తదితర సంస్థల సీనియర్ ప్రతినిధులను పిలిపించి, తగిన భధ్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. పెళ్లి పేరుతో మోసపోయేవారిలో ఎక్కువగా అమ్మాయిలే ఉంటున్నట్లు ఆమె వివరించారు. తాజా నిబంధనలతో ప్రొఫైళ్లను తయారుచేసినప్పుడు ఐపీ అడ్రసును వెబ్ సైట్లు రికార్డు చేసుకోనున్నాయి. ఒక సంవత్సర కాలంలో అకౌంట్ ను ఎన్ని మార్లు ఎక్కడెక్కడి నుంచి ఉపయోగించారో కూడా ఈ రికార్డుల్లోకి రానుంది.