
దిగువ కోర్టుల తీరుపై సుప్రీం విస్మయం
న్యూఢిల్లీ: వైవాహిక విభేదాల కేసుల్లో ముందస్తు బెయిల్ షరతుల విషయంలో కోర్టులు అసాధ్యమైన షరతులు విధిస్తున్నాయంటూ సుప్రీంకోర్టు ఆవేదన వెలిబుచ్చింది. వరకట్న నిషేధ తదితర చట్టాల కింద ఆరోపణలెదుర్కొంటున్న ఓ వ్యక్తికి పట్నా హైకోర్టు విధించిన ముందస్తు బెయిల్ షరతులపై ధర్మాసనం శుక్రవారం విస్మయం వెలిబుచ్చింది. దంపతులు కలిసుండేందుకు ఒప్పుకోవడంతో దిగువ కోర్టు వారిని ఉమ్మడి అఫిడవిట్ వేయాలని ఆదేశించింది.
విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకునే షరతుపై పిటిషనర్‌కు బెయిలిచ్చేందుకు అంగీకరించింది. అయితే, ‘గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు, ఆమె శారీరక, ఆర్థిక అవసరాలన్నిటినీ తీర్చుతానని హామీ ఇవ్వండి’ అని షరతు పెట్టింది. దీన్ని సవాల్ చేస్తూ పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ షరతును తొలగిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ఆచరణ సాధ్యం కాని షరతులను ఇవ్వొద్దని కోర్టులకు సూచించింది. గౌరవంగా జీవించే హక్కును గుర్తించాలని, విచారణ న్యాయబద్ధంగా సాగేలా చూడాలని కోరింది.