
సాక్షి, ఢిల్లీ: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్‌సీపీ నేతలకు ఊరట లభించింది. సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దేవినేని అవినాష్, జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, గవాస్కర్‌లకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తునకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 4కి ధర్మాసనం వాయిదా వేసింది. వైఎస్సార్‌సీపీ తరఫున న్యాయవాదులు కపిల్ సిబల్, నీరజ్ కిషన్ కౌశల్, అల్లంకి రమేష్ తమ వాదనలు వినిపించారు.
కాగా, వైఎస్సార్‌సీపీ నేతలపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. అక్రమ కేసులు బనాయించి కుట్రలకు తెరలేపింది. ‘‘2021లో టీడీపీ కార్యాలయం పై దాడి జరిగిన సమయంలో అక్కడ వైఎస్సార్‌సీపీ నేతలు ఎవరూ లేరు. అయితే, ప్రభుత్వం మారగానే టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. మూడేళ్ల తర్వాత ఈ కేసులో లేనివారిని కొత్తగా నిందితులుగా చేరుస్తోంది. 307 లాంటి హత్యయత్నం కేసులు పెట్టారు. కక్ష సాధింపు చర్యల నుంచి రక్షణ కల్పించాలి’’ అని వైఎస్సార్‌సీపీ తరఫు న్యాయవాదులు కోరారు. వారి వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు.. వైఎస్సార్‌సీపీ నేతలకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి: కాలేజీలపై 'చంద్రబాబు' కత్తి!
Comments
Please login to add a commentAdd a comment