Case against
-
Supreme Court of India: ఇవేం బెయిల్ షరతులు!
న్యూఢిల్లీ: వైవాహిక విభేదాల కేసుల్లో ముందస్తు బెయిల్ షరతుల విషయంలో కోర్టులు అసాధ్యమైన షరతులు విధిస్తున్నాయంటూ సుప్రీంకోర్టు ఆవేదన వెలిబుచ్చింది. వరకట్న నిషేధ తదితర చట్టాల కింద ఆరోపణలెదుర్కొంటున్న ఓ వ్యక్తికి పట్నా హైకోర్టు విధించిన ముందస్తు బెయిల్ షరతులపై ధర్మాసనం శుక్రవారం విస్మయం వెలిబుచ్చింది. దంపతులు కలిసుండేందుకు ఒప్పుకోవడంతో దిగువ కోర్టు వారిని ఉమ్మడి అఫిడవిట్ వేయాలని ఆదేశించింది. విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకునే షరతుపై పిటిషనర్‌కు బెయిలిచ్చేందుకు అంగీకరించింది. అయితే, ‘గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు, ఆమె శారీరక, ఆర్థిక అవసరాలన్నిటినీ తీర్చుతానని హామీ ఇవ్వండి’ అని షరతు పెట్టింది. దీన్ని సవాల్ చేస్తూ పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ షరతును తొలగిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ఆచరణ సాధ్యం కాని షరతులను ఇవ్వొద్దని కోర్టులకు సూచించింది. గౌరవంగా జీవించే హక్కును గుర్తించాలని, విచారణ న్యాయబద్ధంగా సాగేలా చూడాలని కోరింది. -
సహజీవనం చేసి పెళ్లాడకుంటే...మోసగించినట్టు కాదు
బెంగళూరు: సహజీవనం చేసి పెళ్లాడకపోతే అది మోసగించడం కిందకు రాదని కర్నాటక హైకోర్టు పేర్కొంది. సదరు వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు పెట్టలేమని న్యాయమూర్తి జస్టిస్ కె.నటరాజన్ స్పష్టం చేశారు. తన బోయ్‌ఫ్రెండ్ ఎనిమిదేళ్లు సహజీవనం చేసి చివరికి పెళ్లికి నిరాకరించాడంటూ ఓ మహిళ చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ ఆయన తీర్పు వెలువరించారు. ఇద్దరి మధ్య ఉన్న సహజీవన ఒప్పందాన్ని అతను మోసపూరిత ఉద్దేశంతో ఉల్లంఘించాడని చెప్పలేమని ఈ సందర్భంగా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఇంట్లోవాళ్లు ఇంకో అమ్మాయితో పెళ్లి కుదిర్చిన కారణంగా సహజీవనాన్ని వైవాహిక బంధంగా మార్చుకునేందుకు సదరు అబ్బాయి నిరాకరించాడు. -
పప్పు సేన నన్ను మిస్ అవుతోంది : కంగన
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు వరుస కేసుల షాక్ తగులుతోంది. ఇప్పటికే కర్నాటక కోర్టు ఆదేశాలకు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు కాగా తాజాగా బాంద్రా కోర్ట్ కంగనాకు మరో ఝలక్ ఇచ్చింది. అంతేకాదు కంగనాతోపాటు ఆమె సోదరి రంగోలి చందేల్‌కి ఇబ్బందులు తప్పలేదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే పై అవమానకరమైన వ్యాఖ్యలు,సోషల్ మీడియాలో మతవిద్వేషాన్ని రెచ్చగొడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు నమోదైంది. దీన్ని విచారించిన బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు కంగనా, ఆమె సోదరి రంగోలి చందేల్ పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఇద్దరు సోదరీమణులు బాలీవుడ్, ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే గురించి అవమానకరమైన వ్యాఖ్యలను ట్వీట్ చేస్తున్నారని ఆరోపించిన మున్నవారాలి అకాసాహిల్ అహస్రఫాలి సయ్యద్ ఈ ఫిర్యాదును నమోదు చేశారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వారి ట్వీట్లు మత విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపించారు. ఈమేరకు బాంద్రా పోలీస్‌స్టేషన్‌లో దీనిపై ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించానని, కాని వారు దానిని నమోదు చేయలేదని ఆయన ఆరోపించారు. దీంతో బాంద్రా కోర్టును ఆశ్రయించానన్నారు. మరోవైపు దీనిపై స్పందించిన కంగనా మహారాష్ట్రలోని పప్పు సేనకు తనపై మక్కువ ఎక్కువై పోయిందంటూ వ్యంగ్యంగా కమెంట్ చేశారు. అంత మిస్ అవ్వద్దు.. త్వరలోనే అక్కడకు వస్తాను అంటూ ట్వీట్ చేశారు. తన నవరాత్రి ఉపవాస ఫోటోలను షేర్ చేశారు. కాగా వ్యవసాయ చట్టాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తుమకూరు కోర్టు ఆదేశాల మేరకు క్యతాసంద్ర పోలీస్ స్టేషన్లో కంగనాపై ఎఫ్ఐఆర్ దాఖలైన సంగతి తెలిసిందే. Who all are fasting on Navratris? Pictures clicked from today’s celebrations as I am also fasting, meanwhile another FIR filed against me, Pappu sena in Maharashtra seems to be obsessing over me, don’t miss me so much I will be there soon ❤️#Navratri pic.twitter.com/qRW8HVNf0F — Kangana Ranaut (@KanganaTeam) October 17, 2020 -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌పై అమెరికాలో దావా?
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించిందంటూ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌పై అమెరికాలో దావాకు రంగం సిద్ధమవుతోంది. ఇన్వెస్టర్ల హక్కుల సాధనకు సంబంధించి న్యాయ సేవలు అందించే రోజెన్ లా ఫర్మ్ ఈ అంశం వెల్లడించింది. ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించే వ్యాపారపరమైన సమాచారాన్ని ఇచ్చి ఉండవచ్చన్న ఆరోపణలపై విచారణ జరపాలంటూ తాము దావా వేయనున్నట్లు రోజెన్ తమ వెబ్సైట్లో తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తోందన్న ఆరోపణలకు సంబంధించిన వార్తలు, ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో లాభాల అంచనాలను అందుకోలేకపోవడం తదితర అంశాలను ఇందులో ప్రస్తావించింది. మదుపుదారుల తరఫున వేసే ఈ కేసుకు సంబంధించి ‘హెచ్డీఎఫ్సీ షేర్లు కొన్నవారు మా వెబ్సైట్లో పేరు నమోదు చేసుకోవడం ద్వారా ఈ దావాలో భాగం కావచ్చు‘ అని పేర్కొంది. అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ (ఏడీఆర్) రూపంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు అమెరికాలోని ఎన్వైఎస్ఈ స్టాక్ ఎక్సే్చంజీలో ట్రేడవుతుంటాయి. మరోవైపు, దావా విషయం తమ దాకా రాలేదని, మీడియా ద్వారానే తెలిసిందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెల్లడించింది. వివరాల వెల్లడిలో తాము పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేసింది. దావాకు సంబంధించిన వివరాలు అందిన తర్వాత పరిశీలించి, తగు విధంగా స్పందిస్తామని బ్యాంకు తెలిపింది. వాహన రుణాల విభాగంలో ఒక కీలక అధికారి తీరుపై ఆరోపణలు రావడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జూలైలో అంతర్గతంగా విచారణ ప్రారంభించడం దావా వార్తలకు ఊతమిచ్చింది. రోజెన్ లా సంస్థ గతేడాది కూడా ఇదే తరహాలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌పై క్లాస్ యాక్షన్ దావా వేస్తున్నామంటూ హడావుడి చేసింది. కంపెనీలోని ఉన్నత స్థాయి అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారంటూ ఓ ప్రజావేగు చేసిన ఆరోపణల ఆధారంగా దీన్ని సిద్ధం చేసింది. -
ఇళయరాజాపై హైకోర్టులో కేసు
పెరంబూరు(చెన్నై): సంగీత జ్ఞాని ఇళయరాజాకు వ్యతిరేకంగా చిత్ర నిర్మాతలు చెన్నై హైకోర్టులో పిటిషన్ వేశారు. సంగీత దర్శకుడు ఇళయరాజా తన పాటలను అనుమతి లేకుండా ఏ వేదికపైనా పాడరాదని ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అంతేకాదు, గత ఐదేళ్లుగా తన పాటలకు రాయల్టీని వసూలు చేస్తున్నారు. ఈ విధానానికి చెక్‌పెట్టేలా ‘పులి’ చిత్ర నిర్మాత పీటీ సెల్వకుమార్, అన్బుసెల్వన్, జపజోన్స్, మీరాకధిరవన్, మణికంఠన్, చంద్రశేఖర్ తదితర నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పీటీ సెల్వకుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తాను సంగీతాన్ని అందించిన పాటలపై తనకే హక్కంటూ వాటిపై ఇళయరాజానే రాయల్టీ పొందడం చట్ట విరుద్ధమన్నారు. పాటల రాయల్టీలో చిత్ర నిర్మాతకు కనీసం 50 శాతం చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ పిటిషన్ వేశామన్నారు. -
శశి మెడకు ఉచ్చు
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే ఎంపీ శశికళ పుష్ప మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఈ సారి ఆమెను అరెస్టు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగా కోర్టునే బురిడీ కొట్టించే యత్నం చేశారంటూ కేసు నమోదు కావడం గమనార్హం. అమ్మ జయలలిత ఆజ్ఞల్ని ధిక్కరించి రాజ్యసభ పదవిలో శశికళ పుష్ప కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. అమ్మకు వ్యతిరేకంగా వ్యవహరించే పనిలో పడ్డ శశికళ పుష్ప కుటుంబానికి ముచ్చెమటలు పట్టించే విధంగా పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. ఆ కుటుంబం చేత మోసపోయామంటూ ఒక్కొక్కరుగా పోలీసుల్ని ఆశ్రయించే పనిలో పడ్డారు. ఇలా ఫిర్యాదులు హోరెత్తుతుండడంతో శశికళ పుష్ప ముందస్తు జాగ్రత్తలో పడ్డారు. ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తూ, ఢిల్లీలో మకాం వేశారు. రెండు సార్లు సుప్రీంకోర్టు ద్వారా అరెస్టు గండం నుంచి బయట పడ్డ శశికళ పుష్ప, ఈ సారి పోలీసుల చేతికి చిక్కినట్టే . ఇందుకు కారణం ముందస్తు బెయిల్ కోసం మదురై ధర్మాసనంలో ఆమె దాఖలు చేసిన పిటిషన్‌లోని సంతకాలు, ఇతర డాక్యుమెంట్లు నకిలీవిగా తేలడమే. ఇక, తూత్తుకుడిలో ఎంపీ ఇంట్లో పనిచేస్తున్న భానుమతి, ఝాన్సీరాణి ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదు శశికళ, ఆమె భర్త, కుమారుడి మెడకు చుట్టుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు నుంచి బయట పడేందుకు ముందస్తు బెయిల్ ప్రయత్నాలు చేసి మదురై ధర్మాసనంకు ఎంపీ అండ్ ఫ్యామిలీ రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాయి. దీంతో వారు దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించి కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీన్ని తీవ్రంగానే పరిశీలించిన పోలీసులు కోర్టునే బురిడి కొట్టించే యత్నం, మోసగించే విధంగా వ్యవహరించడం వంటి సెక్షన్ల కింద ఆదివారం కేసులు నమోదు చేశారు. వ్యవహారం కోర్టుకు సంబంధించిన దృష్ట్యా, కేసులో ఎంపీ శశికళను అరెస్టు చేయడానికి తగ్గట్టుగా పోలీసులు తీవ్రంగానే ప్రయత్నాల్లో ఉండడం ఆలోచించాల్సిందే. -
రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేరళ పోలీసులకు ఎన్సీపీ నేత ముజిబ్ రెహమాన్ ఫిర్యాదు చేశారు. కేరళ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ నిన్న పోలీసు వాహనంపై ఎక్కి ప్రజలకు అభివాదం చేసుకుంటు ఊరేగింపుగా వెళ్లారు. ఆ ఘటనపై కేరళ ఎన్సీపీ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన అళప్పుజా జిల్లాలోని నూరానాద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మోటార్ వెహికిల్ యాక్ట్‌లోని సెక్షన్ 123ని ఉల్లంఘించారని, పోలీసు వాహనాన్ని దుర్వినియోగం చేయడమేకాక ట్రాఫిక్ జామ్‌కు కారణమై ప్రజలకు ఇబ్బందులు కలిగించారని ఫిర్యాదు చేశారు. అయితే రాహుల్ గాంధీపై చేసిన ఫిర్యాదును స్వీకరించేందుకు కేరళ పోలీసులు నిరాకరించారు. రాహుల్ పర్యటన సందర్బంగా ప్రాధమిక అంశాలను పరిశీలించామని, ఆయన భద్రతా నిబంధనలను ఎక్కడ ఉల్లంఘించలేదని తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ యువ యాత్రను నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులను ఉత్సాహపరిచేందుకు ఆయన పోలీస్ వాహనం ఎక్కిన సంగతి తెలిసిందే.